Previous Page Next Page 
కావేరి పేజి 3

   
                                                                            2
   
    "అలా వున్నావేమిటి కావేరీ??" అనడిగింది సుబ్బులు.

    "రాత్రి సినిమాకు వెళ్ళివచ్చాం. చదువుకోవటంతో యిట్లే తెల్లవారిపోయింది...అదీగాక బద్దకంగా వుంది!" అంది కావాలని వళ్ళు విరుచుకుంటూ.

    "నడిచి వెళ్ళి వుంటావు?..."

    "అవును...నడిచి కాక అందరూ ఎలా వెళ్ళుతున్నారంటావు?! విమానం మీదా? రైలు మీదా? బస్సు మీదనా??"
    "మేము ఎడ్లబండి కట్టుకుని వెళ్ళాం!....రానూ పోనూ ఆరు కిలోమీటర్లు మా అమ్మ నడవలేనని అంటే మా నాన్న బండికట్టారు??..." ఎంతో గర్వంగా చెప్పింది సుబ్బులు!

    "అవునులే! మీ నాన్నగారు కిరాయికి బండి తోలుతారుగా! మాకు బందీ ఎడ్లూ లేకనా?.....పాలేరు అప్పటికే యింటికి వెళ్ళిపోవటంతో వీలవలేదుగాని! మా నాన్నగారికి బండి కట్టే అలవాటు లేదు!" అంది కావేరి కావాలనే.

    దాంతో సుబ్బులు నోటికి మూతపడింది. కావేరి అలా అనటానికి కారణం వున్నది. సుబ్బులు తండ్రి కిరాయికి బండి కడతాడు! ఆ పనికి ఈ పనికి అనికాదు! అన్ని పనులకీ బండి కడతాడు. కిరాయి మాత్రం ఠంఛనుగా వసూలు చేస్తూ వుంటాడు. "బండి వీరయ్య" అన్న పేరు స్థిరపడిపోయింది. సినిమాకి బండి కట్టినా బండి ఎక్కినా ప్రతీవారి దగ్గిరా పావలా అయినా వసూలు చేసి వుంటాడు గాని వదిలిపెట్టి వుండడు. అలా వసూలు చేసిన డబ్బుతో సినిమా చూసి వచ్చి వుంటారు అనుకుంది!

    ఇంకా ఆ తరువాత యిద్దరూ మాట్లాడుకోలేదు. రోజూకంటే నెమ్మదిగానే నడుస్తున్నారు. సైకిల్ బెల్ వినిపించేసరికి ఉలిక్కిపడి పక్కకు తప్పుకుని ఆగి వెనక్కి చూసేసరికి వినాయకరావు వస్తున్నాడు. కావేరిని చూసి సై'ల్ దిగాడు...సుబ్బులు ముందు బావతో మాట్లాడాలంటే సిగ్గు కలిగింది కావేరికి!....

    "ఏమిటీ? యింత నెమ్మదిగా నడుస్తున్నారు? స్కూలు టైం అవుతోందిగా? యిలా నడిస్తే ఎప్పటికి చేరుకుంటారు?...." అనడిగాడు నవ్వుతూ!

    "టైంకె చేరుకుంటాం గాని నువ్వెక్కడికి బావా బయలుదేరావు??" అనడిగింది కావేరి.

    "నేనా??...ఎరువులు కోసమని బస్తీకి వెళ్తున్నాను. నీకేం తెచ్చిపెట్టమంటావు??" కావేరినే చూస్తూ అడిగాడు.

    కావేరి శరీర ఛాయ పచ్చగా వుండటం, చక్రాల్లాంటి కళ్ళు! నవ్వితే సొట్టలు పడే బుగ్గలు! అన్నింటికంటే మహ చురుకుగా వుండే కావేరీ అంటే ఎంతో యిష్టం వినాయకరావుకి! కావేరిలాంటి అందమయినది తన భార్య కాబోతున్నదన్న సంగతి గుర్తుకు వస్తే పరవశించిపోతాడు. కావేరి మనసు నొప్పించటం యిష్టం వుండదు. ఆమెకి అనుకూలంగా నడవటమే పరమావధిగా పెట్టుకున్నాడు. అందుకే మేనమామని అత్తని వప్పించి కావేరి మరలా హైస్కూలుకి వచ్చేటట్టు చేశాడు.

    "నాకు నాలుగు రకాల సినిమా పత్రికలు తెచ్చిపెట్టు బావా!"

    "అవేమిటో!...."

    చెప్పింది కావేరి!

    "అన్ని పేర్లు నాకెక్కడ గుర్తు వుంటుంది. చిన్న కాగితంమీద వ్రాసి యివ్వు!"

    "తెచ్చిపెడతావుగా!!"

    పుస్తకంలో నుంచి కాహితం చింపి పేర్లు వ్రాసి యిస్తూ అడిగింది.

    "నువ్వు అడగటమూ నేను తెచ్చిపెట్టకపోవటమూనా! భలేదానివే కావేరీ!...." అన్నాడు నొచ్చుకుంటూ!

    "ఎంత గుర్తుపెట్టుకుంటావో చూస్తానుగా!!..."

    "నువ్వు స్కూలునుంచి వచ్చేసరికి తెచ్చి వుంచుతానుగా!..."

    ఎవరో సైడ్ కోసం సైకిల్ బెల్ అంతదూరం నుంచే మ్రోగించుతూ వుంటే సైకిల్ ని పక్కకి తీసి నిలబడ్డాడు వినాయకం!

    సైకిల్ మీద వస్తున్న ఆ గ్రామ వాస్తవ్యుడు కావేరీతో మాట్లాడటం చూసి ఆగి నవ్వుతూ అన్నాడు.

    "మేనమామ మేనత్త బిడ్డలయి వుండి యిలా కాలువగట్ల మీద మాట్లాడుకునే ఖర్మ మీకేమిటి? హాయిగా యింటివద్దే మాట్లాడుకోవచ్చును!"

    "అదికాదు బాబాయ్! కావేరి పుస్తకాలు కావాలంటేను!"

    ఆ పల్లెటూరి వరుసలుపెట్టి పిలుచుకోవటం ఆనవాయితీ! దూరంవెళ్ళి నిలబడిన సుబ్బులుకు అలా కావేరితో నవ్వుతూ మాతాడుతున్న వినాయకరావుని చూస్తే ఎంతో జలసి కలుగుతోంది. స్వంత సైకిల్ వుంది. అందరికంటే నాలుగైదు ఎకరాలు ఎక్కువే వుంది. ముఖ్యంగా మంచి బట్టలు వేసుకుంటాడు! ఎంతో బుద్దిమంతుడు అని పేరూవుంది! ముఖ్యంగా ఎడమచేతికి వాచీ! వేలికి కాసు బంగారంతో ఉంగరం! ఆ వుంగరంలో ఒకే ఒక్క రాయి నీలంరంగుది వుండడం! అది ఎండకి తళుక్ తళుక్ మంటూ మెరవడం!....కావేరి నిజంగా ఎంతో అదృష్టవంతురాలు! లేకపోతే వినాయకరావు లాంటి బుద్దిమంతుడికి భార్య కాబోతున్నది! తనూ వున్నది ఎందుకు! ఒక్క ఎకరం పొలం. వుండటానికి చిన్న తాటియాకుల యిల్లు! కిరాయికి బండి తోలడం తప్ప యింకేమి వున్నది? వినాయకరావు లాంటి ఆస్తిపరుడిని బుద్దిమంతుడిని, సైకిల్ వున్నవాడిని తనకి తేగలరా తన తల్లిదండ్రులు?? అన్న ఆలోచన కలిగింది.

    అలా పలుకరించిన ఆ వ్యక్తి సైకిల్ ని ఆపకుండానే ముందుకి వెళ్ళుతుంటే వినాయకరావు కూడా కావేరీ యిచ్చిన చీటీని జేబులో వుంచుకుని ముందు వెళుతున్న సైకిల్ ని కలుసుకునేటందుకు స్పీడుగా తొక్కుతూ ముందుకి వెళ్ళుతూ చెట్టుక్రింద పుస్తకాలు పట్టుకుని నిలబడిన సుబ్బులుని చూశాడు.

    సుబ్బులు కూడా అతడిని చూసింది. అప్రయత్నంగా నవ్వింది.

    వినాయకరావు నవ్వలేదు! చూస్తూనే ముందుకి సాగిపోయాడు.

    అవును! తననుచూసి ఎందుకు నవ్వుతాడు? కావేరి అయితే నవ్వుతూ వగలుపోతూ కబుర్లు చెప్పుతాడు...సినిమా స్టారులాగా వుంటుంది కదూ? అందుకే ఆకర్షణ!....యిలా వీళ్ళిద్దరూ కాలువగట్లన మాట్లాడుకున్నారని, చీటీ యిచ్చింది కావేరీ అని సుభద్రమ్మగారికి చెప్పితే యిద్దరినీ చీవాట్లు వేస్తుంది...అప్పుడుగాని తన కోపం తీరదు. అనుకుంది సుబ్బులు! యింతలో కావేరి వచ్చి కలిసింది.

    "ఏమిటే ఇంతసేపు పట్టింది మీ యిద్దరి కబుర్లూను!..." నడుస్తూ అడిగింది సుబ్బులు!

    "ఏముంటాయి??....నేను బస్తీకి వెళుతున్నాను...నీకేం కావాలి? అని అడిగాడు మా బావ! సినిమా పుస్తకాలు తెచ్చిపెట్టమన్నాను. అంతే!...యింకేమీ మాట్లాడుకోలేదే??...." అంది కావేరి.

    "కాబోయే మొగుడూ పెళ్ళాలయ్యే! ఏం మాట్లాడుకున్నదీ చెప్పుతారేమిటి??....అయినా అడగడం నాది బుద్ది తక్కువ!....అన్నట్టు చేతిన వున్న వాచీ కొత్తది అనుకుంటాను...ఎక్కడ కొన్నాడే మీ బావ??"

    "మా శంకరం బావ పట్నంలో చదువుతున్నాడుగా! ఆ బావ ఈ బావకి కొనిపెట్టినట్టున్నాడు. బట్టలు కూడా సెలవులకి వస్తూ పెదబావ తీసుకువస్తాడు చిన్న బావకి!" చెప్పింది కావేరి.

    "ఆ ఉంగరమో?..."

    "అదా...మా మామయ్యదట!...ఆయన చనిపోయిన తరువాత పెద బావ పెట్టుకోవాలని చూస్తే వాదులు అయిందట! అందుకని చిన్న బావకి యిచ్చాడు. అయినా యిన్ని విషయాలు అడుగుతున్నావు ఎందుకే?" అనడిగింది సుబ్బులుని కావేరి.

    "వాచీ ఉంగరం కొత్తగా వుంటేను! తెలుసుకోవాలనిపించింది..."

    ఇంతలో స్కూలు రావటంతో యిద్దరూ లోపలికి వెళ్ళి క్లాసులో కూర్చున్నారు. అప్పటికి యింకా సెకండ్ బెల్లు కాలేదు. ఆ క్లాసు కిటికీలో నుంచి చూస్తే హెడ్ మాష్టారుగారి ఆఫీసు రూం, టీచర్సు వెయిటింగ్ మాం కనిపించుతాయి. ఇంకొక మాస్టారుతో మాట్లాడుతున్న డ్రాయింగ్ మాష్టారిని చూసింది కావేరి. అంతవరకూ మరుగున పడిపోయిన ఫోటోల విషయం గుర్తుకు వచ్చింది....సుబ్బులు టైం టేబుల్ చూసుకుంటున్నది ఆ రోజుది. ఇదే అదను అనుకొని పొట్టమీద చెయ్యి వేసుకుని నొక్కుకుంటూ గబగబా బైటికి వచ్చేసింది. ఆ స్కూలు గ్రౌండులోనే దూరంగా వున్న బాత్ రూం దగ్గరకు వెళ్ళినట్టు వెళ్ళి కొంత వ్యవధి తరువాత స్టాఫ్ రూం దగ్గరకు వచ్చి డ్రాయింగ్ మాష్టారు కోసం కళ్ళతోనే వెతుకుతున్నది.

    అంతవరకూ అక్కడేవుండి మరో మాష్టారుతో మాట్లాడుతుండగా చూసింది. ఇంతలోనే ఎటు వెళ్ళారు? అనుకుంటూ వుండగా తెలుగు మాష్టారు అటూ వెళ్తూ కావేరిని చూసి అఆగి అడిగారు.

    "ఏమిటమ్మా! యిటు వచ్చావు?..."

    "డ్రాయింగ్ మాష్టారుతో మాట్లాడాలని వచ్చాను సార్!"

    "హెడ్ మాష్టారు రూంలో వున్నట్లున్నారు. వుంటే చెబుతాను!" అంటూ వెళ్ళిన పడి నిముషాలలో డ్రాయింగ్ మాష్టారు కావేరి దగ్గరకు వచ్చారు. కావేరిని చూడగానే ఎందుకు వచ్చిందీ అర్ధం అయింది.

    "మాస్టారూ! నా ఫోటోలు యివ్వరూ?...."

    "ఇంటికి రా! యిస్తాను.."

    "ఇప్పుడు రమ్మంటారా?"

    "ఇప్పుడు ఎలా వీలవుతుంది?"

    "నాకు యిప్పుడయితేనే వీలవుతుంది మాస్టారూ?"

    "అయితే పద!...ఆఁ అలా కాదు! ముందు నేను వెళతాను. తరువాత నువ్వు రా. అలా అయితే బాగుంటుంది..."

    వెనకా ముందు అయితే ఏమిటి? బాగుండేది ఎవరికో కావేరికి అర్ధం కాలేదు. అర్ధం చేసుకునే వయస్సు కాదు....ఇంకా యిప్పుడు తప్ప యింక వీలవదు...అదీగాక తన ఫోటోలు చూసుకోవాలని ఎప్పటి నుంచో ఉవ్విళ్ళూరుతున్నది. ఎన్నిసార్లు అడిగినా యింటికిరా! యింటికి రా! అన్నమాట తప్ప! ఎలాగూ స్కూలుకి వస్తున్నారుగా? తీసుకురాకూడదు?...తన యింటికి ఎందుకు వచ్చి తీసుకోదు? అన్న బెట్టు తప్ప!...తన అవసరం కదా? అదే వచ్చి తీసుకుంటుంది కదా? అన్న గొప్ప!....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS