Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 3


    "వద్దు డాక్టర్. నా కెవరూ లేరు, నే నెవరికీ లేను ఎవరికీ రాయవద్దు-"అంది అదోరకం విరక్తితో.
    "అంటే నీకు తల్లిదండ్రులు లేరా. పోనీ అన్న తమ్ములు."
    "ఉన్నారు డాక్టర్. అందరూ ఉన్నారు అమ్మా, నాన్న, అన్నయ్యలు, చెల్లెళ్ళు - కాని నేనేమయినా విచారించే వాళ్ళు లేరు." శారద కళ్ళల్లో నీరు తిరిగింది.
    విజయ కేమీ అర్ధం కాలేదు. ఒక్కక్షణం శారదని పరీక్షిస్తూ చూడమ్మా శారదా నేనొక ప్రశ్న అడిగితే ఏమనుకోవు గదా ..."
    "ఏమి అనుకోడానికి ఏముందిగా మీ రడిగే ప్రశ్న నాకు తెలుసు డాక్టర్. డాక్టర్ గారూ నిన్న ఏదో దుఃఖంలో ఆవేశంలో ఏదో అనేశాను ఏమనుకోకండి. మీరు డాక్టర్లు. ఒక మనిషిని మృత్యుముఖం నించి కాపాడగలిగి నందుకు మీకు చాలా ఆనందంగా వుండచ్చు. కాని నన్ను రక్షించి మీరు నా కెంత ద్రోహం చేశారోమీకర్ధంకాదు. చచ్చిపోవడంతో నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఆశించాను. కాని కథ మళ్ళీ మొదటికి వచ్చింది డాక్టర్."
    "చూడమ్మా - సమస్యకి పరిష్కారం చావే అయితే లోకంలో ఏ సమస్యా మిగిలే ఉండదు. చచ్చిపోయి నీవు సాధించగల్గింది ఏముంటుంది. నీ కోసం ఒకరో ఇద్దరో రెండు రోజులు ఏడుస్తారు. నీవు నీ కథ కాలగర్భంలో కల్సిపోతారు. నిండు జీవితాన్ని అర్ధాంతంగా పరిసమాప్తి చేసుకుంటే నష్ట పోయేది నీవు కాని మరెవరూ కాదు. అంచేత నీ సమస్య నీవే పరిష్కారం ..."
    "తెల్సు డాక్టర్. ఇదంతా నాకు తెలుసు. అన్ని ప్రయత్నాలు విఫలమైతే భవిష్యత్తులో ఏ ఆశ కనపడకే ఇంతకి తెగించాను. డాక్టరుగారూ, నేను మనిషిని. చీము నెత్తురు ఉన్నదాన్ని, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చంపుకొని పశువులా ఎలా బతక గలను. కాస్తో కూస్తో చదువు కున్నాను. బొత్తిగా వ్యక్తిత్వం అన్నది మరిచిపోయి బానిసలా ఎలా బతకగలను మీరే చెప్పండి డాక్టరుగారూ! మీ కర్ధం కాదు నా వ్యధ. ఈ పరిస్థితిని అనుభవించిన వాళ్ళకి గాని అర్ధంకాదు" శారద ఆవేశంగా అంది.
    విజయ అదోలా నవ్వింది. "ఈ బాధ నా కర్ధం అయినట్టు మరొకరికి అర్ధం కాదు శారదా. అందుకే నీ బాధ ఏమిటో తెల్సుకోవాలని నాఆరాటం. నీవేం అనుకోకపోతే, అభ్యంతరం లేకపోతే నీ బాధ ఏమిటో నాకు చెప్పు. నన్ను ఓ డాక్టరిలాకాక ఓ స్నేహితురాలిగా భావించు. నే నేనేమయినా సహాయ పడగలనేమో చూస్తాను" శారద చెయ్యి చేతిలోకి తీసుకుని స్నేహపూర్వకంగా అంది.
    ఆమె చూపిన అభిమానానికి, ఆదరణకి శారద కళ్ళు చెమ్మగిల్లాయి. "డాక్టరుగారూ నా మీద మీరింత దయ ఎందుకు చూపిస్తున్నారు" అంది పట్టుకున్న గొంతుతో.
    విజయ ఆ మాట విననట్టు నవ్వి ఆప్యాయంగా శారద చేతిపై చెయ్యివేసి నిమిరింది.
    "డాక్టరుగారూ ఎలా చెప్పను. ఏం చెప్పను! యే స్త్రీ తనంతట తాను చెప్పుకోలేని సంగతులు యివి. చెప్పినా ఎవరూ ఏం చెయ్యలేని పరిస్థితి యిది" బిడియంగా అంది శారద.
    "శారదా, మీ వారి గురించేనా నీవు చెప్పబోయేది. మీవారు నిన్ను సరిగా చూడరా" అనుమానంగా అంది విజయ.
    శారద కాస్త ఆశ్చర్యంగా "మీ కెలా తెలుసు? ఎలా తెల్సింది?" అంది.
    డాక్టరు విజయ అదోలా నవ్వింది.
    "అనుభవం నేర్పిన పాఠం. భర్త నిరాదరణ ఒక్కటే ఆడదాని మనస్సుని ఇంత విరక్తిలో పడేస్తుందని నాకు తెలుసు. ఆత్మహత్య చేసుకొనేంత తెగింపు ఒక స్త్రీకి ఏర్పడిందంటే భర్త హింస ఒక్కటే కారణం అన్నది నాకు తెలుసు. ఐతే పిల్లలున్న స్త్రీ ఆ పిల్లలకోసం ఆ నరకం సహిస్తుంది. నీకు పిల్లలు లేరు గనుక ఆ బంధం నిన్ను బంధించలేదు. ఏం నిజమేనా?"
    శారద ఆశ్చర్యంగా చూసింది "డాక్టరుగారూ, మీరు మీకు అనుభవం అంటున్నారేమిటి? మీ యిద్దరిని చూస్తుంటే ఎంతో ముచ్చటైన దాంపత్యం అనిపిస్తుంది. డాక్టరు శ్రీధర్ గారు సంస్కారులని చూస్తేనే తెలుస్తుందే. అలాంటిది మీరేమిటి ఇలా అంటున్నారు. అనుమానంగా వుంది."
    "శ్రీధర్ - శ్రీధర్ దేముడు. శ్రీ గురించి కాదు నేను చెప్పేది..."
    "మరి?" మధ్యలోనే తెల్లపోతూ ఆడింది శారద.
    "నా గురించి తర్వాత, ముందు నీ గురించి చెప్పు. ఒక్క అరగంట టైముంది, తరువాత నాకు తీరదు." విజయ తొందర పెట్టింది.
    శారద ఒక్క నిముషం మాటలకోసం తడుముకుంది "ఎక్కడనించి చెప్పను. ఎలా మొదలుపెట్టను." శారద గొణిగినట్లు అంది.
    నిజమే. జీవితాన్ని కథలా చెప్పడం సుళువా? శారద లాంటి మామూలు ఆడపిల్ల ఏం చెప్పగలదు? ఎలా చెప్పగలదు? తను కన్న కలలన్నీ గాలిలో కలిసిపోయాయని బతుకులో తీపి, ఆశ హరించి పోయిందని ఎవరితో ఏమని చెప్పుకోగలదు?
    విజయ అసహనంగా కదలడం చూసి శారద తనని తాను కూడదీసుకుంటూ "డాక్టరుగారూ మీ రన్నట్టు భర్త నిరాదరణ ఏ స్త్రీ సహించలేదు. కేవలం నిరాదరణకే అయితే ఏదో మనసు చంపుకొని గానుగెద్దులా బతకవచ్చు. కాని ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకుని అవమానాలు సహిస్తూ ఏన్నర్ధం బతికాను. ఆయనలో ఏ నాటి కన్నా మార్పురాదా అన్న ఆశతో ఈ నాటివరకు ఓపిగ్గా ఎదురు చూశాను. కాని నా ఆశ వృధా అడియాస అని ఇన్నాళ్ళల్లో జరిగిన ప్రతి సంఘటన బలపరుస్తూంటే భవిష్యత్తులో ఏ ఆశ కనిపించక యింతకి తెగించాను డాక్టర్."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS