Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 3


    ఈ రెండు కాంప్లెక్సులనీ దాచిపెట్టడానికి మగవాళ్ళంటే తనకు పడదన్నట్లు ప్రవర్తించేది. మాటలూ, చేష్టలూ అలానే వుండేవి.

 

    అలాంటి నిరుపమ ఓరోజు సాయంకాలం ఫ్యాక్టరీ నుంచి బస్టాండ్ కొచ్చింది. తరుణ్ అప్పటికే అక్కడున్నాడు. ఆ రూట్ లో బస్సులు చాలా తక్కువ. బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి ఇద్దరూ మాటల్లో పడ్డారు.

 

    సమయం వస్తే తను ఎలాంటిదో చెప్పడం ఆమె అలవాటు. అలానే ప్రారంభించింది.

 

    "సెక్స్ లో ఏం వుందో తెలియదుగానీ అందరూ దానికోసం వెంపర్లాడుతుంటారు. నాకైతే సెక్స్ అంటేనే అసహ్యం. అదేదో ఇద్దరు వ్యక్తుల హింసలా అనిపిస్తుంది. ఐ హేటిట్" అంది.

 

    అతను మాత్రం కూల్ గా "అలానా" అన్నాడు.

 

    దాంతో ఆమె మరింత రెచ్చిపోయింది. "ఎస్, మగపిల్లల్ని చూస్తే జంతువులను చూస్తున్నట్లుందే తప్ప మరో ఫీలింగ్ కలగదు. అయినా మగపిల్లలతో క్లోజ్ గానే వుంటాను. అప్పుడప్పుడూ సరదాగా భుజంమీద చేయి వేస్తాను. షేక్ హ్యాండిస్తాను. కవులూ కాకరకాయలూ చెప్పినట్లు అప్పుడు ఒళ్ళు ఝల్లుమనడం గానీ, గుండె గుభిల్లుమనడంగానీ ఎరగను"

 

    "ఇదేదో మీరు చాలా గ్రేట్ గా ఫీలవుతున్నట్లున్నారుగానీ నాకు మాత్రం జబ్బుగా తోస్తోంది" అన్నాడు తరుణ్.

 

    ఆమె మీద అలా కామెంట్ చేసినవాడు మొదటివాడు అతనే. అందుకే ఆమె షాక్ తింది.

 

    అతను పట్టించుకోనట్లు చెప్పుకుపోయాడు.

 

    "నిజంగా మీకలా అన్పిస్తుంటే శారీరకంగా లోపమేదైనా వుండాలి కానీ అలాంటిదేమీ వుంటుందని నేను అనుకోవడం లేదు. ఇక మీ మనసుదే లోపం. మిమ్మల్ని ఎవరూ పెళ్ళి చేసుకోరన్న గట్టి నమ్మకం మీకుంది. పెళ్ళి లేకుండా సెక్స్ ను అనుభవించే ధైర్యంలేదు మీకు. అందుకే దానిమీద విముఖత పెంచుకోవడానికి అదేదో హింస అని, నరబలి అని అనుకుంటూ వచ్చారు.       

 

    ముప్ఫై ఏళ్ళవరకూ దాన్ని మీరు సక్సెస్ ఫుల్ గా అమలుపరిచారు. సెక్స్ లో ఏమీ థ్రిల్ లేదని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవడమే కాకుండా ఇతరులని కూడా మోసపుచ్చాలని ప్రయత్నిస్తుంటారు.

 

    కానీ ప్రతిరాత్రీ తోడు కోసం మీ శరీరం చేసే యాగీని మాత్రం జోకొట్టుకోలేక పోతున్నారు. ఈ విషయం ఏదో సందర్భంలో మీ మాటలవల్లో, మీ ప్రవర్తనవల్లో తెలిసిపోతుంటుంది"  

 

    అతను ఆగాడు. ఆమె శిలాప్రతిమలా అయిపోయింది. అద్దంలో చూసుకుంటే అస్థిపంజరం కనిపించినట్టు ఆమె భయపడిపోయింది.

 

    అతను తిరిగి ప్రారంభించాడు. "అయిదు నిముషాలపాటు జరిగే ఆ కార్యక్రమం మీద విముఖత పెంచుకోవడానికి ఇరవై మూడు గంటలా ఏభై అయిదు నిముషాలు ప్రయత్నించడం ఎంత దారుణమో ఆలోచించండి. మీకు యిష్టమైన రంగంలో మీరు రాణించడానికి, వ్యక్తిగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి ఆ టైమ్ ని వుపయోగించండి. ఇదంతా జరగాలంటే ఎలాంటి మినహాయింపు లేకుండా హేవ్ సెక్స్ విత్ ఎ గుడ్ గై" అన్నాడు.   

 

    ఆమె బిగుసుకుపోయి చూస్తోంది.

 

    ఆమెని అలా వదిలిపెట్టి వచ్చేశాడు. రెండో రోజునుంచి ఫ్యాక్టరీకి వెళ్లడం మానేశాడు.

 

    తను ఎదురుపడితే ఆమె యిబ్బందిగా ఫీలవుతుందేమోనని ఉద్యోగాన్ని వదిలేశాడు.

 

    అక్కడినుంచి వచ్చేశాక దినపత్రికలో చేరాడు. రెండు రోజుల క్రితం అదీ పోయింది. ఇదిగో యిప్పుడు ఇలా సరితాదేవి గండం వచ్చి పడింది. ఈ సంఘటనతో అతను ఎంతగా డిస్టర్బ్ అయ్యాడంటే జోరున వర్షం కురుస్తున్నా తెలియడంలేదు. అప్పటికే టౌన్ దాటి కొంత పక్కగా తూర్పుదిక్కుకు నడుస్తున్నాడు.

 

    కాలికేదో తగిలింది. అది పూలతీగో, మచ్చలపామో తెలియడం లేదు. కాలుని విదిలించి కొట్టాడు.

 

    తిరిగి నడక ప్రారంభించాడు. అప్పటికి అతను బయల్దేరి అయిదు గంటలు కావస్తోంది. దాదాపు ఇరవై అయిదు కిలోమీటర్లు వచ్చేశాడు.

 

    అంతలో తన వెనక ఎవరో వస్తున్నట్లు చిన్నగా అలికిడి వినిపించింది. నడక వేగం హెచ్చించాడు గానీ తలతిప్పి చూడలేదు. కీచురాళ్ళ రొద చీకట్లను తొలుస్తున్నట్లుంది. కప్పల అరుపులు ఆకాశానికి చిల్లులు పెడుతున్నట్లుంది.

 

    అతను బాగా నీరసించిపోయాడు. కాలు కదపలేని స్థితి. అటూ ఇటూ చూశాడు. దూరంగా దీపాలున్నట్లు అనిపించింది.

 

    కొండ దిగువ కనపడుతున్న దీపాలు ఏమై వుంటాయి? దారి దోపిడీ దారుల స్తావరమా? దెయ్యాల విడిదా? లేక ఫారెస్ట్ బంగాళానా?

 

    తన ఊహలకి తనకే నవ్వొచ్చింది. అది ఏదైనా తెల్లవారేవరకు తను అక్కడ వుండక తప్పదు.  

 

    అటుకేసి నడిచాడు అతను.

 

    దగ్గరౌతున్నకొద్దీ అక్కడ చాలా భవనాలు వున్నట్లు తోచింది. వెనకే ఎవరో వస్తున్నట్లు శబ్దాలు మళ్ళీ మొదలుకావడంతో పది అంగట్లో అక్కడికి చేరుకున్నాడు. రెండో మూడో పెద్ద బెల్టింగ్ లున్నాయి. మరికొన్ని చిన్నవి కూడా వున్నాయి.

 

    వాటి మెయిన్ గేటుగుండా లోపలికి ప్రవేశించడం అంత మంచిపని కాదనుకున్నాడు. ఇంత రాత్రివేళ తను ఎవరో చెప్పాలి. వాళ్ళ రియాక్షన్ ఎలా వుంటుందో తెలియదు. అందుకే తెలియకుండా లోపలికి వెళ్ళి ఏదో ఓ మూల పడుకుండిపోవాలి.

 

    అలా అనుకున్నాడు గానీ లోనికి ఎలా వెళ్ళాలో అంతుబట్టలేదు. పదడుగుల ప్రహరీగోడ. దానిపైన మూడు వరసల ముళ్ళకంచె. గోడకు దిగువ ఏదైనా కంత వుందేమోనని చూస్తున్నాడు. అతని ఊహ కరెక్టే.

 

    నీళ్ళు వెళ్ళడానికి చిన్న కంత వదిలిపెట్టారు. నీళ్ళ ఫ్లోకి మట్టి కొట్టుకుపోవడం వల్ల కంత కాస్తంత పెద్దదిగానే వుంది.

 

    నేలమీద బాగా పడుకుని లోనికి పాకాడు. పూర్తిగా శరీరాన్ని అవతలికి దాటించాక పైకి లేవబోయాడు. ఆలోచనలేని ఆ తొందరపాటు అతన్ని కష్టాల్లోకి నెట్టింది. ఆ సమయంలో పక్కనున్న పూలకుండీకి కాలు తగిలి కిందపడింది.

 

    ఆ శబ్దానికి అక్కడున్న సెంట్రీ అలర్ట్ అయ్యాడు. చేతిలోనున్న ఫైవ్ సెల్స్ టార్చిని ఫోకస్ చేసుకుంటూ సెంట్రీ అటు రావడం మొదలుపెట్టాడు.

    అంత అలర్ట్ గా వున్నారంటే అది ఫారెస్ట్ బంగాళా అయి వుంటుందనుకున్నాడు అతను.  

 

    కానీ అతను వూహించింది తప్పు.

 

    అది అనాథ మహిళా సదన్. అది ప్రారంభమైన ఈ అయిదేళ్ళలో ఓ యువకుడు అందులోకి ప్రవేశించడం అదే మొదటిసారి.

 

    కాంతివంతమైన బ్యాటరీలైటు వెలుగు అతనిమీద పడింది.

 

    అప్పుడు టైమ్ రాత్రి పదకొండు గంటలైంది. టౌన్ కి దూరంగా కాస్తంత విసిరేసినట్లుండే ఆ భవనం దీపాల వెలుగుల్లో వెలుతురు పిట్టలు వాలిన చెట్టులా వుంది. చెట్టు చివర మిఠాయి పొట్లంలా వుండే సరితాదేవి ఆ భవనం హాలులో అసహనంతో తిరుగుతోంది.

 

    ఆమెకి ముప్ఫై ఏడేళ్ళు. కానీ ఒక్కో సమయంలో ఒక్కో వయసున్న దానిలా అనిపించడం ఆమె ప్రత్యేకత. ఉదయాన్నే లేచి స్నానాదులు ముగించుకుని దైవ ప్రార్థన చేస్తున్నప్పుడు యాభై ఏళ్ళ దానిలా వుంటుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS