"ఎస్సర్!"
"రచయితలంటే నాకు పరమద్వేషం. డూ యూ నో దట్?"
భవానీశంకర్ గాబరా పడ్డాడు.
"ద్వేషమా మేజర్?"
"నేను మేజర్ కాదు_ కల్నల్"
"ఓ సారీ_ కల్నల్! రచయితలంటే ద్వేషం ఎందుకని కల్నల్?"
"కాలేజీలో చదివేప్పుడు ఓ రచయితగాడు కాలేజ్ మాగజైన్ లో ఓ ఇడియాటిక్ కథ రాశాడు. అందులో ఏమి రాశాడంటే చేతిని పావుగంటసేపు ఐస్ లో వుంచితే తేలు కుట్టినా, పాము కుట్టినా విషం చేతికి ఎక్కదని రాశాడు. వాడి కథను నమ్మి మా కాలేజ్ బ్యూటీ ముందు తేలుతో కుట్టించుకున్నాను. దాంతో విషం ఎక్కి నురగలు కక్కి పడిపోయి బ్యూటీక్వీన్ ముందు ఇన్సల్ట్ అయిపోయి, హాస్పిటల్లో చేరి రెండ్రోజులు వుండాల్సి వచ్చింది."
అందరూ పగలబడి నవ్వారు.
"అది కథ అని గుర్తుంచుకుంటే ఎంతో బావుండేది కల్నల్! రచయితలు రాసే కథల్ని నిజాలనుకొని వాటితో ఎక్స్ పెరిమెంట్స్ చేసేవాళ్ళు ముందు మెదడు కండిషన్ చెక్ చేయించుకోవాలి" భవానీశంకర్ సలహా ఇచ్చాడు.
కల్నల్ కనకారావ్ కి వళ్ళు మండిపోయింది.
పక్కనే వున్న రివాల్వర్ తీసి చంద్రకాంత్ కి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కబోయాడు. రత్నప్రభ అతని చేతిమీద లాగి కొట్టేసరికి రివాల్వర్ ఎగిరి దూరంగా పడింది.
"అంటే ఆ బ్యూటీక్వీన్ దగ్గర ఆరోజు ఫెయిలయి ఇన్సల్ట్ అవ్వకపోతే ఈపాటికి దాన్నే చేసుకుని వూరేగేవారన్నమాట" అంది కోపంగా.
కల్నల్ గాబరాపడ్డాడు.
"నిన్ను కలుసుకోకముందు ఆ అమ్మాయినే బ్యూటీక్వీన్ అనుకున్నానే_ ఆముదపు చెట్టులాగా- అహ్హహ్హ" అన్నాడు కవర్ చేసుకుంటూ.
"షటప్! సిగ్గులేకపోతే సరి. ఆ రచయితెవరోగానీ గ్రేట్ మాన్. అందుకే మీలాంటి బుద్ధిలేనివాళ్ళకి బుద్ధిచెప్పటానికే అలా రాశాడు" రత్నప్రభ మరింత కఠినంగా అంది.
"నో! అలా పాఠకుల్ని మిస్ గైడ్ చేసే రచయితలంటే నాకు వళ్లుమంట. ఐ హేట్ దెమ్. ఇంకో రచయితగాడేం చేశాడో తెలుసా మిస్టర్ చంద్రకాంత్?"
"ఏదో చేసే వుంటాడు కల్నల్! అందులో ఏమాత్రం సందేహం లేదు. మనం వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు."
"నో! ఐ డోంట్ ఎగ్రీ. పట్టించుకోవాల్సిన అవసరం వుంది. ఎందుకో తెలుసా?"
"తెలుసుగానీ మర్చిపోయాను."
"యూ షుడ్ నెవర్ ఫర్ గెట్! రచయితంటే సమాజాన్ని గైడ్ చేసే ఒక మహావ్యక్తి. అతనేం రాసినా సమాజం పట్ల బాధ్యతతో రాయాల్సి వుంటుంది."
"అఫ్ కోర్స్! నేనెప్పుడూ అలాగే రాస్తుంటాను."
"నీ సంగతి కాదు మిస్టర్ చంద్రకాంత్ నేను మాట్లాడేది. "హాకస్ ఫోకస్" అనే నవల రాసిన ఒక పరమ నికృష్ట రచయిత గురించి మాట్లాడుతున్నాను."
"ఆ నవల పేరు చూస్తేనే వాడో నికృష్ట రచయితని తెలిసిపోతోంది" తనూ ఉత్సాహంగా అన్నాడు భవానీశంకర్.
పూజ కెవ్వున కేక వేసింది.
"వాటీజ్ దిస్ మిస్టర్ చంద్రకాంత్? ఆ నవల ఫెంటాస్టిక్ నవల. ఐ సింప్లీ లవిట్_ మీర్రాసిన నవల్స్ అన్నింటిలోనూ అది మాస్టర్ పీస్" అంది ఉత్తేజంగా.
భవానీశంకర్ స్టన్ అయ్యాడు.
"అది నేను రాసిన నవలా?"
"మీర్రాసిన నవల మీరే మర్చిపోయారా?" ఆశ్చర్యపోతూ అంది పూజ.
భజన్ రావ్ చప్పున అందుకున్నాడు.
"ఒకేసారి అయిదారు నవలలు రాసే సీజన్ కదండీ_ పాపం_ పాత నవలలన్నీ తెగ మర్చిపోతుంటారు ఈ రచయితలు. అందులోనూ చంద్రకాంత్ గారు మరీ బిజీ రైటర్."
"అవునవును గుర్తుకొచ్చింది. 'హాకస్ ఫోకస్' నేనే రాశానది. ఏ సంవత్సరమో గుర్తులేదుగానీ, నేనే. విత్ మైన్ ఓన్ హాండ్స్_ రాశాను" సర్దుకుంటూ అన్నాడు భవానీ.
కనకారావు అమాంతం లేచి నిలబడ్డాడు అగ్గి అయిపోతూ.
"వాట్? హాకస్ ఫోకస్ నవల నువ్వు రాశావా?"
భవానీ డైలమాలో పడ్డాడు.
ఆ నవల రాసిన వాడిని మర్డర్ చేయాలి అన్న లెవల్లో మాట్లాడాడిందాక. ఇప్పుడు తనే అది రాశానని చెప్తే...
"నేను రాశానంటే ఎగ్జాక్ట్ గా నేనే కాదనుకోండి_ ఐమీన్_ దానికి చాలామంది కన్సల్టేషన్స్, సజెషన్స్, డెవలప్ మెంట్స్ ద్వారా సహాయం చేస్తుంటారన్నమాట. అంటే ఒక నవల ఒక రచయిత రాశాడూ అంటే దాని వెనుక ఎంతోమంది రచయితలుంటారన్న మాట. అంటే_"
"మిస్టర్ చంద్రకాంత్! మర్యాదగా లేచి నిలబడు."
భవానీశంకర్ లేచి నిలబడ్డాడు.
"వాట్ కల్నల్? ఎనీ ప్రాబ్లమ్?"
"ఎస్! నిన్ను గన్ తో కాల్చాలి యిప్పుడు."
"మనది మిలటరీ రూల్ కాదు బ్రదర్! ఎవడినిబడితే వాడిని కాల్చిపారేయడానికి. అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో మనది డెమోక్రసీ! అంటే కేవలం పోలీసులకే కాల్చిపారేయడానికి పవర్సుంటాయి. ఇంకెవరికీ వుండవ్."
"ఐ డోంట్ కేర్! నాకు ఉరిశిక్ష పడినా ఫర్లేదు_ నిన్ను కాల్చిపారేయటం ఖాయం. ఉరికంబం ఎక్కినా సమాజానికి గొప్ప సేవ చేశానన్న సంతృప్తి వుంటుంది నాకు."
"ఆల్ రైట్ మేజర్! ముందు భోజనం కానీండి_ కాల్పులు గురించి తర్వాత ఆలోచిద్దాం."
"డాడీ! చంద్రకాంత్ నా అభిమాన రచయిత_ అతనితో అలా మాట్లాడటం నాకు నచ్చలేదు" కోపంగా అంది పూజ.
"అతన్ని కాల్చాలనుకోవటం అందుకేనమ్మా! నీలాంటి బ్రెయిన్ లెస్ కిడ్స్ ని అలాంటి చెత్త నవలలు రాసి మెంటల్ కేస్ లుగా మార్చేస్తున్నాడు. కేవలం సమాజ క్షేమం కోసం కాల్చక తప్పదు."
"డాడీ_ ప్లీజ్! హి ఈజ్ అవర్ గెస్ట్" చిరాకుగా అంది సీత.
"ఎస్ ఫాదరిన్లా! నా బెస్ట్ ఫ్రెండ్!" తనూ సపోర్ట్ చేశాడు గోపాల్రావ్.
"ఆల్ రైట్! ఒక కండిషన్ మీద వదిలేస్తాను"
"ఏమిటది మిత్రమా?"
"నువ్వు నన్ను హిప్నటైజ్ చేసి చూపించాలి."
"హిప్నటిజమా?"
"అవును."
"అది కావాలంటే మీరెవరయినా హిప్నాటిస్ట్ దగ్గరకెళ్ళాలి కల్నల్! రచయితల వెంటపడితే ఏం లాభం?"
"మరి ఆ నవలంతా హిప్నాటిజం మీద రాశావు కదా! హీరో ఎవర్ని కావాలంటే వాళ్ళని హిప్నటైజ్ చేసి చివరకు విలన్స్ బారి నుంచి హిప్నాటిజం సాయంతోనే హీరోయిల్ని రక్షిస్తాడని రాశావుగా?"
"అలా రాశానా_ రాసే వుంటాను"
"పైగా హిప్నాటిజం ఒక బ్రహ్మాండమైన సైన్స్. అది నాకొచ్చు అని ముందు మాటలో డబ్బా కొట్టుకున్నావు కదా?"
