Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 28

 

    మానుల్ని - మాట్లాడకూడదని వ్రతం. పెట్టుకున్న వాళ్ళని చూస్తె నాకు చాలా గౌరవంహెచ్చుతోంది. నిజం మాట్లాడారా అర్ధం కాదు మనుష్యులకి. అబద్దం మాట్లాడ్డం ఇష్టం లేదు. అందుకని మౌనులౌతారు జ్ఞానులు. అందరూ అబద్దాలలో యోచించి అబద్దాలలో మెలగడం చేత ఒకరి అబద్దం ఒకరికి అర్ధమౌతుంది. నిజమౌతుంది. నిజమే అర్ధం కాదు. అంతేకాదు, నిజం అబద్దమవుతుంది. పిల్లికి వెలుతురు చీకటైనట్టు. నా మాటలు వింటున్న మనుషుల మొహాలు గమనించినప్పుడల్లా ఎందుకు మాట్లాడనా? మరీ యింత పశువునైనా నే అని అసహ్యమేస్తుంది. (మరిచిపొయినాను , పశువుల్ని నిందిస్తున్నాను. అవి మాట్లాడవు) ఇంక వ్రాతా! ఈ వ్రాతల 'వీక్నెస్' ఇంకా పోలేదు. ఎప్పుడు పోతుందో. హరీంద్రనాద్ అన్నట్టు.......'అప్పుడు చెప్పవలసిందీ వుండదు. వ్రాయవలసిందీ వుండదు. ఒకరికి చెప్పగలమనుకోడం అహంభావం. ఒకరికి చెప్పాలనే కోర్కె మనోదుర్భలత్వం."
    దీని అవినీతి యేమిటంటే , యిట్లాంటి కోర్కెలు వేట, జూదం వ్యభిచారం , యిట్లాంటివి అందరిలోపలా అణిగే వున్నాయని, వొప్పుకోరు. పోనీండి. ఒకరికీ యింకోరికీ , పుణ్యత్ములకి , పాపాత్ములకి, ధర్మాత్ములకీ, రౌడీలకి యేమి భేదం లేదు. పనులు, పనులు పైపనులు దినచర్యలు, డాంబికాలు, వేషాలు నిగ్రహాలు , అగ్రహారాలు ఇంతే భేదం . అందరు మనుషులూ ఒకటే. ఈ పై పనులను లెక్కవేసి జమకట్టి ఫలితాల నిస్తాడు. ఈశ్వరుడని నమ్మకం. కళ్ళులేవు , బుద్ది లేదు, యీ దేవుడికి యీ పుణ్యత్ముల వూహాలో . భయపడి, శ్రమపడి, వున్న కోర్కెల్ని అణుచుకుని సౌఖ్యాలు వొదులుకోడంవల్ల, అవన్నీ అనుభవించినవాళ్ళకి శిక్షలు లేవంటే ధర్మపరులకి బాధ అందువల్లనే సంఘం పేర అంత క్రౌర్యం చూపుతారు మర్యాదస్తులు. మాటలు మాత్రం సర్వజ్ఞానస్వరూపుడివి, సత్యస్వరూపుడిని, అంటారు. ఈ బ్రహ్మాసమాజం వాళ్ళు దేవుడికి ఇన్ని లక్షణాలూ వున్నాయని తెలిసి  కూడా రామ్మూర్తిని వెలేశారు వ్యభిచారానికి. మీలో ఎవరు వ్యభిచారికాదని అడిగినందుకు నన్ను వెలేశారు. వ్యభిచారం చెయ్యని వారిలో కూడా వ్యభిచారం వుందంటే మండిపడతారు. పూర్వపతివ్రతల కధల్లో యిట్లా గూడ వ్యభిచారాల్ని యెత్తి చూపాలని యీ నాడు ప్రయత్నించారా! ఏ పత్రికలూ అచ్చువెయ్యవు.
    మనమీ లోకంలో యిచ్చే values న్నూ కొంచెం ఉన్నతావరణలో (highor plane) వాటికి వుండే విలువలున్నూ భేదిస్తాయని చూప ప్రయత్నించినందుకే నా 'మృత్యువు' చాలామంది మంచి మిత్రులకి అర్ధం కాలేదు.
    ఇవన్నీ మానసికమైన అలవాట్లు, మన సుగుణాలూ, దుర్గుణాలూ. అంతకన్న ఎక్కువ విలువలేదు వీటికి. ఒక్కటి నిశ్చయం. ఇదంతా యీ బేధాలన్నీ మనసే కల్పిస్తోంది . కొంచెం training (ట్రైయినింగు) తో అనేక మార్పులు తెచ్చుకోవచ్చు, ప్రయత్నించరు గాని చూడండి. ఇప్పుడు నేను ఎనిమిది మైళ్ళు బస్సు మీద పోవాలి. తరవాత మూడు మైళ్ళు సైకిలు మీద , తరవాత రెండు మైళ్ళు కాలి నడక , తరవాత బడి తనిఖి మూడు గంటలు. పిల్లలూ, టీచర్లూ. తల్చుకుంటే ఇదంతా విసుకు, వికారం, మనసుని పిలిచి ముందు కూచోబెట్టుకుంటాను.
    "బస్సు ప్రయాణమంటే ఎందుకు నీకు విసుకు? ఎదురుగా వీచే గాలీ, చుట్టూ పొలాల మీద మెరిసే యెండా , బస్సులో వాళ్ళు మాట్లాడుకునే మాటలూ. తరవాత తమాషాగా సైకిలెక్కి గట్ల మీద, అంచుకు పొర్లే కాలవ నీటి పక్కనే, నేరేడు చెట్ల నీడల్లోంచి, అట్లా అట్లా పోయి, తరవాత దిక్కులు చూచుకుంటో యెదురుగా వచ్చే మనుషుల్ని పరీక్షించుకోంటో , నీలం ఆకాశం కేసి చూస్తో , జెముడు కాకి మూలుగు వింటో , వూరు - బడి....."
    అక్కడదాకా సగం సందేహంతో వినే మనసు చప్పున కూర్రాడిమల్లె యెదురు తిరుగుతుంది. ఆ బడిపిల్లలు అన్నా కొంచెం వూరుకుంటుంది గాని ఆ రిజిష్టర్లు, లెక్కలు, అనేటప్పటికి లేచి నుంచుని 'ఎడిశావులే, నోరుముయ్యి ఆ అఘోరం నాకు తెలీకపోలేదంటుంది. కాని ఎన్నడో ఏనాడో ఆ రిజష్టర్ల ని కూడా ఆకర్షకంగా చెయ్యలేక పోతానా అని ఆశ.
    ఏమైతేనేం, మన మనసులో వంకర్లు తీశానూ, లోకంలో వంకర్లన్నీ మాయమౌతాయి. ఈనాడు కొట్టాగా అక్షరాలు వ్రాసిన పిల్లాడు తండ్రికి గొప్పగా చూపినట్టు. ఈ మాటలు బడాయిగా వ్రాస్తున్నానే గాని యీ సంగతి లక్షల మంది యిదివరకే చెప్పారనుకుంటాను లోకానికి.
    నాతొ మాట్లాడతారు కొందరు.
    "నేనేండీ ఎన్నడూ ఇంకో స్త్రీ----"
    "నాకండీ ఎప్పుడూ పరోపకారం చెయ్యాలనే తప్ప----"
    "మా వంశములోనే లేదండి అట్లాంటి...."
    "నా భార్య పోయిందీ ఆ విచారంలో ------"
    నేను నిజం మాట్లాడితే వాళ్ళు ఏ గుణాలు గొప్పగా చెప్పుకుంటున్నారో అనే నా దృష్టిలో క్షుద్రంగా తోస్తున్నాయంటే!--
    ఇప్పటికే ఏకాకిని. ఇంక యీ మాత్రం మనుష్య సంబంధం కూడా పోతుందని భయం.
    మౌనమే వుత్తమం.
    కొందరు వొదలరు.
    "మీ అభిప్రాయమేదో చెప్పండి."
    ఏం చెప్పను? అందుకనే అబద్దం చెప్పకూడదనే బ్రహ్మసమాజపు నాటి నియమం వొదులుకుంటున్నాను మెల్లిగా! నిజం చెపితే అబద్దమంత హనీ చేస్తోంది.
    "నిజం చాలా విలువైన వస్తువు. ఈ పశువుల ముందు చల్లబోకు" అనిపించాడు ఆస్కార్ వైల్డు.
    ముఖ్యంగా యీ దేశంలో యీ భూతదయగాళ్ళు కులకుల లాడుతున్నారు. అందరి హృదయాలలో కూడా యీ ఘాతుకం ఉండనే వుంది. అంటే వాళ్ళ చూపులే వేట చూపులంటే , యీగల్ని తోలడంలో మాటల్ని కొరకడంలో యిడ్లెన్లని మింగడంలో వాళ్ళ గేదె నడకల్లో అన్నిట్లో నాకు కనబడుతోనే వుందంటే , ముఖ్యం యీ గోరక్షణ వాళ్ళూ , బల్లుల్ని ఆపడానికి ప్రాయోజనవేశం చేసే వాళ్ళు, యజ్ఞాలకి అడ్డపడేవాళ్ళు, దయాపరులూ , వీళ్ళందరి sub- conscious motive అంతరాంతర ప్రోద్భలం మారణోత్సాహమే అని తెలియజేస్తే !


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS