Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 26


    
    భజనలు పక్షపాతము లపశ్రుతు లెక్కువ; రక్తి తక్కువై
    గజిబిజిచేసె తర్జనల గర్జనలన్ విజయాబ్ద; మింతతో
    విజయకు వీడుకోలు చదివించి జగ మ్మిక నిర్వికారమౌ
    విజయ సమాగమ మ్మనుభవించుత! నూత్న శుభోదయమ్ములో!
    
    "ఏ రోజుకైన చల్లారునా 'కొరియా'బ
        జారులో రేగిన కారుచిచ్చు"
    "ఏనాఁటికైన కాలూనునా 'వియతుమిన్'
        బావుటాపై శాంతి పావురమ్ము"
    ఏదినమ్మునకైన ఎగురునా 'ఫ్రెంచిండి
        యా' గుండెపై 'ఇండియా పతాక"
    "ఎప్పటికైన శాంతించునా జమ్ము కా
        శ్మీరాలపై కరాచీ తుఫాను"
    అనుచు నుత్కంఠమై భవిష్యత్తువైపు
    కాంచుచున్నది నేఁటి ప్రపంచ మెల్ల;
    క్రొత్త ఏడాది నీ "కఱ్ఱపెత్తనమున"
    తొలఁగుత జగత్తునాకు దుండగుల భయాలు !!
    
    నాగార్జునాద్రి నున్నని పాలరాళ్ళపై
        సిరులు చిల్కిన తెల్గు శిల్పలహరి
    ఏకశిలాపురీ ప్రాకారములపైన
        విశ్రమించిన తెల్గు విజయలహరి
    విద్యానగరనందనోద్యాన వీథుల
        కాంతు లీనిన తెల్గు కావ్యలహరి
    త్యాగరాయల భావరాగ డోలికలలో
        కళలు చిందిన తెల్గు గానలహరి
    ఒక్కసారిగ మరల నింకొక్కసారి
    పొంగిపొరలును గాకత్రైలింగజగతి;
    పసిడిపంటల ఆంధ్రసౌభాగ్యలక్ష్మి
    నవ్వుకొనుగాక ఈ నవానందవేళ !!
    
    ఆది "యుగాది" నీది! తెలుగమ్మ స్వతంత్ర గృహ ప్రవేశ భా
    గ్యోదయమైన పిమ్మట; నవోదిత రాష్ట్రములో సమైక్య సం
    పాదనచేసి అభ్యుదయ పద్దతులందు పురోగమించి ఆ
    హ్లాదము గూర్పుమోయి ప్రజలందరు నీకు "జయంబు" పల్కఁగన్.
    
    వేయుటకేమిలే ! వేసిన అభివృద్ధి
        పథకాలు మఱి బూజుపట్టకుండ
    చేయుటకేమిలే! చేసిన ధర్మ తీ
        ర్మానాలు రూపులు మారకుండ
    పొంగుటకేమిలే! పొంగిన తటినీ త
        రంగాలు పంటలు మ్రింగకుండ
    పలుకుటకేమిలే ! పలికిన పౌరవా
        గ్ధానాలు నోళ్ళలో నానకుండ
    
    వెడలి ముందుకు - వెనుకంజ వేయకుండ -
    తిరిగి వెనుకకు గోతులు తీయకుండ -
    మేలుకొని - మేలుగా రాజ్యమేలుకొనెడి -
    తెలుఁగు వెలుఁగులు తొలి యుగాదికి "జయోస్తు."
    
                                    మా గురుదేవులు
    
    కప్పురము పలుకు, భావన
    విప్పిన నెమిలిపురి, మనసు వెన్నెల, పూవుల
    దెప్పగదే దీవన, మా
    కుప్పా శ్రీ ఆంజనేయ గురుదేవులకున్.
    
    ఫాలంబందు విభూతిరేఖలు, పయిన్ పట్టంచు దుశ్శాల్వ, ముం
    గేలన్ భాష్యము, కుండలాలు చెవులన్ గీల్పొల్పి, ఏమేమియో
    ఆలాపించుచు, వెంట శిష్యతతి రాగా; పెద్ద బాజారునన్
    కాళీదాసుని భంగి వత్తురు ! నమస్కారంబు మీ మూర్తికిన్.
    
    సాక్షాత్పాణినివో! పతంజలివొ! అస్మాద్దేశికస్వామివై
    దాక్షిణ్యంబున చేరదీసి అనవద్యంబైన విద్యాధనం
    బక్షయ్యం బగు భిక్షపెట్టితివి; ప్రత్యక్షంబు ప్రత్యక్షరం;
    బక్షీణంబులు మీ కటాక్షములు మా కాధేయ పాధేయముల్.
    
    సభ్యత మోసులెత్తె: గుణసంపద తీగెలు సాగె: రాగవా
    ల్లభ్యము పల్లవించె: సరళత్వము పువ్వులు పూచె: భావసౌ
    రభ్యము నిండె స్వీకృత పురాకృత పుణ్యఫలంబు పండె: మా
    కభ్యుదయంబు చేకురె దయామయ : యుష్మదనుగ్రహంబునన్
    
    ఆశాస్యంబుల కాగమంబు, ధృతి కన్వాదేశ, మామ్రేడితం
    బాశాజ్యోతికి, వీప్స నిర్మితికి, ప్రత్యాహార ముత్సాహ ధీ
    కౌశల్యంబుల కెల్ల, సంహిత సమీక్షాశక్తికిన్, యుష్మదీ
    యాశీర్వాద మొకండు! పూజ్యగురుదేవా! కౌముదీవల్ల భా!
    
    గ్రహియించినారు వ్యాకరణంబు సాధుస
        త్తములైన దేశికోత్తముల చెంత
    ప్రవహించినారు రెండవ వ్యాసదేవులై
        రసధురీణములౌ పురాణములను
    త్రావించినారు విద్యాసుధల్ పెక్కుచం
        దాల విద్యార్ధి బృందాల కర్ధి
    రచియించినా రపూర్వములైన భవ్యకా
        వ్యములు రసజ్ఞసేవ్యములుగాగ
    
    మలుచుకొన్నారు సౌమ్యరమ్య ప్రశాంత
    పావనమ్మైన నిస్స్వార్ధ జీవనమ్ము;
    విలుచుకొన్నారు సద్యశో విభజనములను;
    ఆంజనేయాభిధేయ ! కుప్పాన్వవాయ !!
    
    ఎంతో యిష్టము మా గురూత్తముల కీ యేనున్; ప్రభాతాంత భా
    ష్యాంతవ్యాకరణ ప్రపాఠనము, శిష్టాచారసంపత్తియున్,
    శాంతో దారమహేశ్వరాంఘ్రియుగళీ సాష్టాంగ పుణ్యక్రియా
    సంతోషంబు, తెనుంగు భాగవత, ముచ్చైశ్శిష్య వాత్సల్యమున్.
    
    శ్రీమద్వేదులసూర్యకోవిదమణే శిష్యాగ్రణీర్ద క్షిణా
    మూర్తే రాత్తకళానిధేః ప్రియసుతః ప్రజ్ఞాప్రియంభావుకః!
    కుప్పావంశపయః పయోనిధివిధుః సాహిత్యవిధ్వన్మణిః
    శ్రీమాన్ తత్రభవాన్ భవాన్ విజయతే శ్రీ ఆంజనేయ ప్రభుః !!
    
                                        శ్రీ విశ్వనాధ
    
    నిద్రాణ మ్మగు జాతికిన్ నవనవోన్మేషమ్ము చేకూర్చి ని
    ర్ణిద్రస్ఫూర్తి, పథప్రవర్తియయి నర్తించెన్ భవన్మూర్తిలో !
    భద్రంబుల్ భవదీయ భారతికి విద్వన్మండలాధ్యక్ష! శ్రీ
    మద్రామాయణకల్పవృక్ష! కవిసమ్రాట్! నిత్యసత్య ప్రియా!
    
    ఎవరయ్యా ప్రతి - విశ్వనాథులకు - బ్రాహ్మీదత్త సాహిత్య సం
    స్తవనీయ ప్రతిభాసనాథులకు - విశ్వస్తుత్య పాండిత్య వై
    భవ సంప్రాప్త యశోధినాథులకు - నిర్వ్యాజానురాగంబునన్,
    కవితాయోగమునన్, బ్రసన్నరసవద్గాథా ప్రయోగంబునన్ !!!
    
    నవలల్ గూర్చును; నాటకంబులను విన్నాణంబుగాఁదీర్చు; మేల్
    కవితల్ నేర్చు; కథల్ వెలార్చు; సుమహాకావ్యంబు లీడేర్చు; నీ
    జవసత్వంబులు సర్వతోముఖ మహాసాహిత్యసౌభాగ్యముల్;
    భవదీయస్తవనీయలేఖిని కివే బ్రహ్మాయురారోగ్యముల్ !!
    
    విశ్వ "కళాప్రపూర్ణుఁ"డని విశ్వకవిన్ నిను నేఁడు సాహితీ
    విశ్వము విశ్వసించె, మన విశ్వకళా పరిషత్తు తానిటుల్
    శాశ్వతమైన గౌరవ మొసంగె; మహాంధ్రమునందు రాజరా
    జేశ్వరియై భవత్కవిత యేలుత ప్రాజ్ఞరసజ్ఞరాజ్యమున్.
    
    చాళుక్యజనపాలు కేలఁ గేల్ కీలించి
        నన్నయ సుప్రసన్నముగఁ జూచె
    శబ్దశాసణుని పార్శ్వమ్మున నిలుచుండి
        తిక్కయజ్వ రసైక దృష్టిఁ జూచె
    తిక్కయజ్వకు ప్రక్క ప్రక్కగా నిల్చి శ్రీ
        నాథుండు సబహుమానముగఁ జూచె
    కవిసార్వభౌము వెన్కనె నిలంబడి పొంగి
        పొంగి పెద్దన తొంగి తొంగి చూచె
    
    శయ్య జిగిదేఱ - భావాలు జాలువాఱ
    చేవ నిండాఱ - వైచిత్రి చెలువుమీఱ
    అక్షర మ్మక్షరము కల్పవృక్ష మగుచు
    నీవు రామాయణము వ్రాయు నిముసమందు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS