"నేతి" సౌవర్ణ మాణిక్య పీఠము వెట్ట
"కుప్పా"జగా వెల్లగొడుగుఁ బట్ట
"నౌడూరి" శిల్ప సుందర కిరీటము గూర్ప
"అమ్ముల" శ్రీ తిలకమ్ము తీర్ప
"చీరాల" నవరత్న హారాలు కై సేయ
"చిట్యాల" మంజు మంజీరము లిడ
"కూచిభట్ల" మనోజ్ఞ కుండలా లర్పించ
"ములుకుట్ల" పన్నీరు చిలుకరింప
"వాణి" యును "వేణి" "రాణి" పారాణి దిద్ద
కొలువు దీరెను హరికథా కువలయాక్షి;
మ్రొక్కె నీకు సుగాత్రి నీముద్దుపుత్రి
నెట్లు దీవింతువో ఆదిభట్ల బాబు!
"బాలాజి" సరిక్రొత్త పారిజాతము లివ్వి
"భోగలింగము" జాజి పూవు లివ్వి
"పరిమి సుబ్రహ్మణ్యు" సరసీరుహము లివ్వి
"పాతూరి" వకుళ పుష్పమ్ము లివ్వి
"పెద్దింటి"మేల్ గులాబీ ప్రసూనము లివ్వి
"ములుకుట్ల" సంపెంగ మొగ్గ లివ్వి
"బాల బ్రహ్మానందు" నీలోత్పలా లివ్వి
"తెల్లాకుల"వి మంచి మల్లె లివ్వి
కమ్మని సుగంధములు విరజిమ్ము నేఁడు
హరికథోధ్యానవనమందు; నందుకొనుము
నీవు నాటిన తోటలో పూవు లొసఁగు
శ్రీ సపర్య! నారాయణదాసవర్య !!
"ఎవఁడురా! యచట తెం డింకొక్క గ్లా" సంచు
అమృత రక్షకులకు నాజ్ఞ యొసంగి
"సుధకంటె మా హరికథ లెస్స" యని బృహ
స్పతితోడ నర్మ భాషణము నెఱపి
"ఏమమ్మ వాణి! యేదీ వీణ! సరిక్రొత్త
తీవలా" యని 'గిరాందేవి' నడిగి
"ఆగవే రంభ! ఆ హస్త మట్టులు గాదు
త్రిప్పిపట్టు" మటంచు తప్పుదిద్ది
"ఏమయా! క్రొత్త సంగతు లే" మటంచు
బ్రహ్మమానసపుత్రుని పలుకరించి;
ఆదిభట్ల నారాయణాఖ్యము మహస్సు
తిరుగు నిందందు స్వర్గ మందిరములందు !!
సంగీత సాహిత్య జగదంగణము ధగ
ద్దగిత మ్మొనర్చు గంధర్వతార
వాసిఁగాంచిన మహావాగ్గేయకారుఁడై
భారతి నర్చించు భక్తమౌళి
అమరుఁడౌ "ఉమరు ఖయ్యాం" రుబాయతు లాంధ్ర
సంస్కృతమ్ముల కెత్తు సవ్యసాచి
హరికథారాజ్య మూర్ధాభిషిక్తుండయ్యు
స్వార్ధం బెఱుంగని పార్ధివుండు
వాలు మెలి మీసకట్టు, జుల్పాల జుట్టు,
నొసట కుంకుమ బొట్టు, మేల్పసిడిగట్టు,
విద్దెలకు పట్టు! నడయాడు వేల్పుచెట్టు!
హరికథా శిల్పసమ్రాట్టు! "ఆదిభట్టు"
సురభి
నవరస నాట్య సరోవర
నవజీవన వర్ధమాన నళినములారా!
నవ మిత్రములారా! నవ
నవోదయము మీకు సురభినందనులారా !!
విజయశ్రీ లివె మీఁకు గైకొనుఁడయా! వేనోళ్ళ మాప్రేక్షక
ప్రజ మేల్ మేలని మెచ్చి తెచ్చిరి రసార్ధ్రస్వాంతులై; యీ సభన్
విజయంచేసిన విద్వదగ్రణులు దీవింపంగ శ్రీ శారదా
విజయాలంకృత నాట్యమండలి జగద్విఖ్యాతి నార్జించుతన్.
సంగీత సాహిత్య శృంగార గంగా త
రంగాలు బుసబుస పొంగినటులు
చల్ల చల్లని పాలవెల్లిలో జాబిల్లి
మల్లెమొగ్గలు వెదజల్లినటులు
వందారు సుందరీ మందార మాలా మ
రందమ్ము లందందు చింది నటులు
సోగకన్నుల రాణి మూగ చూపులలోని
రాగాలు తీగలై సాగి నటులు
సురభి నగరాన తలయెత్తి, పెరిగి, విస్త
రిల్లి, శాఖోపశాఖలై యెల్ల దిక్కు
లొరసి ఫలపుష్పభరితమై మెరసె నేడు
కౌతుకము లల్లి మీ కళా కల్పవల్లి !
కనుమూసి తెఱుచులోననె మారిపోయెడు
నవ దృశ్య పరివర్తనములు చూచి
ఇంద్రధనుస్సుపై కెక్కుచున్నట్లు రం
గులు మారుతెర తెరంగులును చూచి
సినిమాల తలదన్ను చిత్రవిచిత్ర సం
ఘటన నిర్మాణ దక్షతలు చూచి
'వాతాపి గణపతి' గీత మారంభించు
ప్రాక్సంప్రదాయ సంపదలు చూచి
రంగ రమణీయ జంత్ర మంత్రములు చూచి
నర్త్జకీ నర్తనావర్తనములు చూచి
సమ్ముదము జెంది తన్మయత్వమ్ము నంది
మెచ్చెను సుధీజనమ్ము మేల్మేలు మిమ్ము !!
స్త్రీ పాత్రంబులు స్త్రీలె దాల్చు టొక వైశిష్ట్యంబుగా నాట్యల
క్ష్మీ పూజా పరతంత్రులైన 'ధనలక్ష్మీ' పుత్రులారా! కళా
శ్రీపాదార్చకులార! మీకివె శుభాశీస్సుల్; విశాలాంధ్రలో
దీపించున్ భవదీయ నాటక కళల్ దేదీప్యమానంబులై !
మన గుంటూరు; మహాంధ్ర నాటక కళా మాధుర్య సౌందర్య సా
ధనకుం బేరు; కవీంద్ర చంద్రులకు కేంద్రం బౌచు నొప్పారు; మా
జనముల్ మెచ్చిన "శారదవిజయ" దీక్షాదక్షులౌ మీ కివే
ఘనసవ్మానము లాదిశేష మఱిరేఖల్ సత్య సౌహార్దముల్.
జయోస్తు
జయ జయ ! జయాభ్యుదయ! సహృ
దయ హృదయప్రియ! సుహృదయ! దయసేయుము! నీ
కయి కయిసేసిన గద్దియ
పయి విజయంచేయు! ముదయ భాస్వంతుడవై!
క్రొమ్మావి కొమ్మ కమ్మని
కెమ్మోవి చివుళ్ళు బుజ్జగించిన కలకం
ఠమ్ములు కలకంఠములై
సమ్మోదము తోడ నీకు స్వాగత మిచ్చున్.
వగరు వగరుగ, పుల్ల పుల్లగను, తియ్య
తియ్యగా, చేదు మ్రింగిన తెలుగుబిడ్డ
తొగరు చెక్కిళ్ళ బాష్పాలు తుడుచుకొనుచు
"జయము" పలుకును నవయుగస్వామి! నీకు.
రాజువట నూత్న సంవత్సరమున కీవు!
రమ్ము రమ్మోయి! ఈ చైత్ర రథపథాల !
చిగురు చెంగావి కలికి కుచ్చెలలు చెదర
ప్రకృతి నీ కెత్తు ప్రణయ నీరాజనమ్ము!
కెంజిగురాకు హేతుల నొకించుక వంచి ప్రఫుల్ల మంజరీ
మంజుల మాధవీ మధుర మంగళమూర్తి వసంతలక్ష్మి పు
ష్పాంజలి పట్టు నీకు, కమలాకరముల్ రసరాగపూర్ణ దృ
క్కంజములన్ వెలార్చు నవకౌతుక బాష్ప మరందబిందువుల్.
కన్నులు విప్పకే తెరలు గట్టిన చీకటిలో ప్రసుప్తమై
యున్న జగత్తు నీ నవయుగోదయవేళ స్వయం ప్రబుద్ధమై
వన్నెలు దిద్దుకోవలె! నవత్వములోపల మానవత్వ మ
భ్యున్నతి నందుకోవలె! మహోజ్జ్వల జీవన సుప్రభాతముల్ !!
