Previous Page Next Page 
తీరం చేరిన నావ పేజి 25


    రాజారావు మనసు మెత్తపడింది. ఆలోచన మధ్య హఠాత్తుగా మరో సంగతి గుర్తువచ్చింది అతనికి. మర్నాడు అతని స్నేహితులు నల్గురు వస్తున్నారు. లంచి, డిన్నర్, మందు పార్టీ-పేకాట అప్పుడప్పుడు యిలా రోజంతా గడపడం అలవాటు- వాళ్ళు పెళ్ళినిర్ణయం అయినట్లు విని పెళ్ళికూతురు యిక్కడే వుందని విని చూస్తామన్నారు-వాణి యిప్పుడు కోపంగా ముభ్వంగా వుంటే బాగుండదు-అందుకనయినా లేవగానే వాణిని ప్రసన్నురాలిని చేసుకోవాలి.
    రాజారావు ఆలోచన అది.
    
                                           *    *    *
    
    "నేను రేపు ఉదయం మావూరు వెళ్ళిపోతాను-" రాజారావు లేచాక టీ పట్టుకెళ్ళే వంకతో రాజారావు గదిలోకి వెళ్ళింది వాణి-టీ బల్లమీద పెట్టి తల వంచుకుని ముభావంగా అంది-రాజారావు మొహం ప్రసన్నంగా మార్చుకొని "అదేమిటలా తొందరపడి పోతున్నావు వెళుదువుగానిలే అన్నట్టు రేపు మా ఫ్రెండ్స్ కొందరు నిన్ను చూడాలని వస్తున్నారు. నీవు వెళ్ళిపోతే ఎలా-వెళుదువు గానిలే ఎల్లుండి."
    నవ్వుతూ అంటున్న రాజారావుని వింతగా చూసింది వాణి- అంతవరకు జరిగింది మరిచి, రెండు గంటల క్రితం అంత దురుసుగా ప్రవర్తించిన అతను ఏం జరగనట్లు నవ్వుతూ మాట్లాడుతూంటే ఆ నవ్వు వాణికి ఆనందాన్నివ్వలేదు సరిగదా అదో రకం విముఖత కల్గించింది- ఏం జవాబివ్వాలో అరక్షణం తట్టలేదు.
    "ఆ.... వాణీ రేపు మా ఫ్రెండ్సు భోజనాలు, ఫలహారాలు అన్నీ యిక్కడే చేస్తారు- కాస్త అన్నీ బాగా చేయించాలి..."
    "మీ ఫ్రెండ్స్ వస్తే నేను చేసేది ఏముంది- అన్నింటికి పని వాళ్ళున్నారు- ఇన్నాళ్ళుగా జరగలేదా-యింటికి వెళ్ళాలి పనుంది కాస్త" అంది వాణి.
    "వెళ్ళవచ్చు ఎల్లుండి, కారులో పంపిస్తాగా, రేపు వుండు- వాళ్ళు వస్తామని అన్నాక నీవు లేకపోతే బాగుండదు" రాజారావు ఎంత ప్రయత్నించినా గొంతులో అసహనం తొంగిచూసింది-వాణి అంతకంటే గట్టిగా కాదనలేక పోయింది.
    "ఆ- వాణీ సాయంత్రం అలా కారులో షికారు వెడదాం-ఊరు అది చూడలేదుగా నీవు-పొలాలు, తోటలు అవి బాగుంటాయి చూద్దాం- వచ్చిందగ్గరనించి నిన్ను ఎక్కడికి తీసికెళ్ళలేదు-ఐదుగంటలకి తయారవు" మహా ఉదారంగా అన్నాడు రాజారావు నవ్వుతూ.
    అతనితో షికారంటే, కాబోయే భర్తతో ఏకాంతం అంటే ఏ ఆడపిల్లయినా ఎదురుచూసే మధురానుభూతి ఏమో గాని వాణి మాత్రం చేదుమాత్ర మింగమన్నట్టు యిబ్బందిగా చూసింది.
    "ఏమిటలా చూస్తున్నావు-నిన్నేం మింగనులే షికారు తీసి కెళ్ళి - డ్రైవరుంటాడులే కావలిస్తే, నీకు భయమయితే-" హాస్యం ఆడాడు..."వెళ్ళు, తయారవు శీతాకాలం త్వరగా చీకటి పడ్తుంది" అన్నాడు.
    యింక తప్పించుకునే మార్గం లేక వాణి తన గదిలోకి వెళ్ళిపోయింది.
    తయారయి వచ్చిన వాణి కట్టుకున్న వాయిల్ చీర చూసి "యింతకంటే మంచి చీరలు లేవా, అప్పుడు డబ్బు యిచ్చాను. ఏమి కొనుక్కోలేదా?" అన్నాడు నుదురుచిట్లించి-వాణి బిడియంగా లేదని తల ఆడించింది.
    "షికారుకి ఫరవాలేదుగాని రేపు మా ఫ్రెండ్స్ వస్తారు ఎలా-సర్లే-రాత్రే డ్రైవర్ ని సిటీ పంపించి తెప్పిస్తాను" అన్నాడు రాజారావు.
    రాజారావుతో కారులో కూర్చున్న దగ్గిరనించి వాణి కేదో ఊపిరి ఆడనట్లు గాభరాగా వుంది.
    కారు ఊరులో వెడుతూంటే రాజారావు ఏది ఏదో చెప్పుతున్నాడు. ఊరుపొలిమేరలు దాటాక ఇదివరకు ఇవన్నీ తమ పొలాలే అన్నీ అని చెప్పాడు. తరువాత తమ పొలాలు అమ్మిడబ్బు అంతా ఎలా కంపెనీలలో పెట్టుబడి పెట్టాడో షేర్లు తీసుకున్నాడో చెప్పాడు- వాణి యిదివరకూ యివన్నీ విన్నందువల్ల అనాసక్తంగా వింటూ కూర్చుంది- అదే సమయంలో రాజర్వు స్థానంలో కిషోర్ వుంటే యీ షికారు ఎంత సరదాగా వుండేది అని ఆమె మనసు ఆలోచిస్తూంది- ఆమె ఆలోచన మధ్య కారు కిషోర్ వాళ్ళ ఊరు మధ్యనించి పోవడం గుర్తించలేదు-కిషోర్ వాళ్ళ యింటి ముందునించి కారు వెళ్తుంటే చటుక్కున "అరె- కిషోర్ యిల్లు - యిక్కడికా వచ్చాం" అంది ఆనందాశ్చర్యాలతో సంభ్రమంగా.....అనేశాక గాని తను నోరు జారిన సంగతి గుర్తించలేదు. రాజారావు కళ్ళు చికిలించి, అనుమానంగా చూస్తూ- 'నీకెలా తెలుసు' అనడిగాడు. వాణి జవాబు చెప్పలేక తడబడ్తూ బెదురుగా చూస్తూ గుటకలు మింగింది.
    "ఎలా తెలుసు- వాళ్ళింటికెళ్ళావా?-" రాజారావు గొంతు మారిపోయింది-వాణి యింక తప్పించుకునే మార్గం లేక, అసలేమి చెప్పాలో ఆలోచించే వ్యవధి లేక మౌనంగా తల ఆడించింది- రాజారావు మొహం కఠినంగా మారింది.
    "ఓహో- ఈ వారం రోజుల్లో చాలా గ్రంధమే జరిగిందే- నీవు వాళ్ళింటికెళ్ళడం, వాళ్ళు మనింటికి రావడం-ఊ... యింకేం జరిగింది- అసలు నీకు వాళ్ళకి ఎలా కల్సింది అంతలో" అంతవరకు తెచ్చిపెట్టుకున్న ప్రసన్నత మాయమయి నిజ వైఖరిలోకి దిగిపోయి కఠినంగా అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS