"నన్నా! నన్నేమి చెయ్యడు. నాకా భయమేమీలేదు. పోనీ నన్నేం చేసినా చెయ్యనీ. ఏం చేస్తేనేం? అది కాదు, నిన్ను" అంటున్నాడు మీరా.
"నన్నేమి చెయ్యడు?"
"నీకు తెలీదు."
"నాకంటే పెద్దవాడిమల్లే మాట్లాడుతున్నావే?"
"నాకు లోకం తెలీదనా? అమీరు సంగతి తెలీదనా! నాకంటే ఏం పెద్దదానివి నువ్వు? నీకేం తెలుసు?"
నిజమే. నేనతనికన్న యేమాత్రం పెద్దదాన్ని! ఆడదాన్ని గనక అట్లా మాట్లాడుతున్నావు కాని - అన్నాడు గదా "నీకు తెలీదు; అందులో తురకవాళ్ళ సంగతి నీకేం తెలుసు?" ఊరుకున్నాను, ఆలోచిస్తే అమీరు రక్తపు మాటలు జ్ఞాపకం వొస్తున్నాయి. మీరా కూడా ఆలోచిస్తూ కూచుని అన్నాడు కదా.
"ఇదుగో, నా కంఠం నులమనీ, నీమీద చెయ్యి వేశాడా-అమీరు- అందుకనే నిన్ను విడిచిపోను. నా మూలాన నిన్నేమన్నా చేస్తే-చేస్తే చంపేస్తాను. పొడిచేస్తాను గుండెల్లో"
నేను మాట్లాడలేదు. నా పులిపిల్ల కళ్ళలోని నిప్పుల్ని, చంపలమీద మంటల్ని చూస్తున్నాను.నా చిన్నబాబు తక్తుమీద నించి మాట్లాడుతున్నాడు. "మాట్లాడవేం? అప్పుడు నా మొహం చూడను పొమ్మంటావా దీదీ?"
ఏం చెప్పను?
"మాట్లాడవా?" అన్నాడు అనుమానంతో. నేను మాట్లాడలేదు. చప్పున లేచి గుమ్మంలోకి నడిచాడు.
"నేను రాను రాను. అమీరు వచ్చిం తరువాత."
"నువ్వు రాకపోయేట్టయితే, అమీర్ రానక్కరలేదు" అన్నాను.
"ఎందుకఖ్కర్లేదు! నువ్వఖ్కర్లేదన్నా తనూరుకుంటానా? అతనూరుకుంటాడా?" పోట్లాట పోయింది. నా చూపుల్లో చప్పున స్త్రీ జాతికి సహజ ఆయుధం ధరించాను. నీళ్ళు నిండాయి.
"మీరా, నన్ను వొదిలేస్తావా?"
"అమీర్ కి కోపం వచ్చి నిన్నేమన్నా చేస్తే!"
"మీరా! ఆ ఆపద రానీ ఆలోచిద్దాము"
8
అమీరు వొచ్చినప్పుడు మీరా లేడు. రాగానే అతని కళ్ళు న దేహాన్ని ఆక్రమించుకుని వెతికాయి. సిగ్గుతో మెల్లిగా పక్కగా నుంచున్నాను. నా నడుం పక్కగా చెయ్యేసి నా మొహంవంక చూసి "మునుపటి కంటె కూడ ఎంత బావున్నావో! నీ కళ్ళలో కొత్త కాంతి వెలుగుతోంది" అన్నాడు.
అవే అతని మొదటి మాటలు. నేను తనకోసం చేసిన త్యాగం సంగతి యెత్తి నన్ను మెచ్చుకుని లాలిస్తాడని పడుతున్న ఆశ భగ్నమై నన్ను బాధపెట్టింది. ఆ సంగతి సూచనగా ఒకటి రెండుసార్లు ఎత్తినా అతను వినదలుచుకోలేదు.
అమీరు లేని నాలుగు నెలలూ, అసలు కాలంలో లేకుండా పోయినట్టే వుంది. తలచుకున్నా నాకు ఆ కాలం జరిగినట్టే తోచదు. ఎప్పుడూ మేమిద్దరమూ అనాదినించి, సృష్టి పూర్వంనించి అట్లానే కలిసి వున్నామనిపించింది. మేమిద్దరమూ లేకుండా యీ సృష్టి నిలుస్తుందనిగానీ ఆ కొండ గడ్డి అట్లా ఎత్తుగా పరిమళంగా ఎదుగుతుందని గాని వూహించలేను.
"మనం పోయిం తర్వాత యీ గుడిశలో ఎవరన్నా వుంటారో, పాడుబడి, నక్కలు కూచుంటాయో?" అని అమీరంటే....
"మనం లేకపోవడ మేమిటి?" అన్నాను.
పూర్వం మల్లేనే సంతోషంగా గడిపాము వారం రోజులు. కాని అర్ధరాత్రి అతన్ని ఆనుకుని ఆకాశపు నలుపు లోపలికి చూసేటప్పుడు, అతను మెల్లిగా చల్లని గాలిలో పాడుతూ కూచుండగా, వెనకనించి నేను అతని కళ్ళకేసి చూస్తే యెప్పుడో త్వరలోనే ఆ శాంతం విరిగి నా తల పగిలేట్లు బద్దలై పడుతుందని భయం వేసింది. అంత సంతోషంలోనూ కూడా నా హృదయం "మీరా యేడీ రాడేం" అంటోంది. అమీర్ తానా నాలుగు నెలలూ యెక్కడ వున్నదీ, యేమి చేసిందీ చెప్పలేదు. నేనేం చేస్తున్నదీ అడగలేదు. గుచ్చిగుచ్చి అడుగుతాడని భయంగా వుంది. కాని అడగలేదని బాధగానూ వుంది.
వారం రోజులైన తరువాత గావును. బియ్యం కోసం అమీర్ వూళ్ళోకి వెళ్ళాడో లేదో, చెట్ల వెనక మళ్లాడో లేదో వొచ్చి నా యెదుట తల వొంచుకొని నుంచున్నాడు.
"మీరా! యిన్నాళ్ళేమైనావు?" కళ్ళంబడి నీళ్ళు పెట్టుకున్నాడు.
"మీరా, ఎందుకోయ్. నా బాబూ!"
"దీదీ, అంతా ఆఖరా?"
"ఏమిటి?"
నా కర్థమయింది కాని అడిగాను.
"నీకు తెలీదూ".
"ఏమిటోయ్ ఆ మాట? ఏమీ ఆఖరు కాదు. నువ్వు వుత్త భ్రమపడుతున్నావు." అంటున్నాను కానీ, ఏదో మార్పు కలిగిందని నా హృదయం అదుర్తోనే వుంది. "దీదీ! నేనీ బాధని భరించలేను. ఈ-"
"ఏమిటాబాధ! ఎందుకు?"
"నాకు తెలీటంలేదు. చాలాసార్లు ప్రశ్నించుకున్నాను, అర్థంకాదు కాని భరించలేను. మాట్లాడలేను? ఈ మూడు రోజులూ ఆ పొద వెనక కూచుని వున్నాను-రాత్రింబవళ్ళు..."
పాపం?
"అయ్యో, మీరా మూడురోజులు అక్కడ వున్నావా? ఎందుకు రాలేదూ? పిచ్చితండ్రి! నిన్ను మరిచిపోయి, నేను నా ఆనందంలోనే వున్నానా? కాని నిన్ను మరిచిపోలేదు. దుర్మార్గురాల్ని, నిర్భాగ్యపుదాన్ని, ఏం చెయ్యను నీ బాధని తీర్చడానికి!"
నుంచుని అతనిని నా పక్కన కూచో పెట్టుకుని, అతని తలని గట్టిగా కావలించుకున్నాను.
"నేను నీ కఖ్ఖర్లేదు, నిజం కాదనకు....నేను చూస్తూనే వున్నాను.... నీ జీవితంలో నాకు స్థలం లేదు."
"మీరా, నువ్విట్లా అంటావని నేనెన్నడూ అనుకోలేదు. చూడు. అమీర్ నేను పూర్వంమల్లే ప్రేమగా వున్నందుకేనా నీకీబాధ? ఎందుకు వుండననుకున్నావు? వుండనని ఎన్నడన్నా అన్నానా?"

