సిగ్గుతో నేను మాట్లాడలేదు.
"తాగడానికి నీళ్ళియ్యి ముందు"
నాకు నీళ్ళిచ్చి, శుభ్రంచేసి పడుకోబెట్టాడు. నాకు వేరే చీర లేదు. దుప్పటి కప్పుకున్నాను.
"అదంతా యేం చేస్తావు?"
నా చిన్నిపాపని బట్టలో లుంగచుట్టాడు.
"పారేస్తా!"
"నువ్వా! నీచేత యీ పనికూడా చేయించుకుంటున్నానా నిర్భాగ్యురాల్ని!"
"మాట్లాడకు"
వెళ్ళివొచ్చాడు.
"ఎక్కడ పారేశావు?"
"ఇంక నీకు కనబడదు."
ఎందుకో ఆ పిల్ల దిక్కులేకుండా పారెయ్యడమంటేనే నాకు కష్టంగా వుంది.
"నువ్వేమైనావో చెప్పు. నీకే అపాయం వొచ్చిందో అని"
"నేను యేటినుంచి తిరిగివచ్చి వాణ్ని చూసి వెంటనే మీదపడ్డాను. మా వాళ్ళు వాడికి బాగా తెలుసు. నన్ను లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి పోయినాడు. మళ్ళీ నీ దగ్గరికి వచ్చి యేం చేస్తున్నాడో, నువ్వేమైనావో, నీ బలహీనంతో అని నా భయం. 'ఆమెని తాకావా నిన్ను చంపేదాకా నేను నిద్రపో'నని అన్నాను కాని కుర్రవాణ్ణి నా మాట లక్ష్యం చేస్తాడా? అని సందేహమేసింది. వాడు వెళ్ళిన నిమిషాన్నించి ఆ తాళ్ళు కొరుక్కుని యిప్పటికి వొదిలించుకున్నాను" అన్నాడు.
అతని నోరంతా రక్తమే! మెత్తని చేతులు నగిలిపోయినాయి తాళ్ళ బిగుసుతో. 'ఇంత వోర్చుకున్నావా బాబూ?' ఆ మాటలు చెప్పి నా చేతుల్లోకి తూలాడు. అట్లాగే వుత్తవొంటికి అతన్నదుముకున్నాను. ఇద్దరమూ నిద్రపోయినాము. మధ్యాహ్నం దాకా.
7
రమ్మని అమీర్ కి మీరా కబురు పంపాడు. కాని అతను వొస్తాడంటే నాకు అర్థంకాని భయం పట్టుకుంది. రాకుండా వుంటేనే బావుంటుందేమో ననిపించింది. అతను రాగానే మీరాతో జరుగుతున్న యీ మధుర స్వప్నంలోంచి మెలుకువ వస్తుందని భయం.
ఇట్లా ప్రేమ మాగడమూ, ప్రేమలో సందేహాలు రావడమూ, ఒకేసారి యిద్దరిమీద ప్రేమ వున్నట్లు తోచడమూ, ఆ ప్రేమే చెరొకరిమీద చెరొక విధంగా, వేరు కారణాల వల్ల కలిగినట్టుండడమూ - ఇదంతా మీవంటివారు వొప్పుకోరు. వొళ్ళు కొవ్వెక్కితే, అట్లానే వుంటుందిలే. పశుకామం, అంటారు. అట్లా ఇద్దరిమీద వుండడం అసంభవమని తమ నీతి శాసనాలతో సృష్టినే, ప్రపంచంలోని హృదయాల్నే పాలించి అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు రాస్తారు కొందరు పుస్తకాల్లో! మీని గాలి మాటలు, నావి రక్తపు అనుభవాలు.
వారం రోజుల కిందటే కదా అమీర్ని అంత గాఢంగా కోరాను? యీ బాధంతా అతను రావాలనేకదా అనుకున్నాను. కాని ఆ మూడురోజుల నరకమూ నాకు మీరాని అపరిమితంగా సన్నిహితుణ్ణి చేసింది. మీరా నా జీవిత వృక్షాన్నంతా పెనవేసుకున్నాడు. నేను పడ్డ యమబాధంతా మీరా అనే మంత్రంతో ఆనందమయంగా కనబడుతోంది. మళ్ళీ జబ్బుగా పడుకుంటేనేమి అనుకున్నాను. మీరా నాకు చూపిన మహాప్రేమ ప్రవాహం అవసరం లేక సన్నగిల్లింది. మళ్ళీ ఆ తీవ్ర త్యాగం అవసరమై నా కోసం ప్రవహిస్తే అతని ప్రేమ ననుభవించాలనిపిస్తోంది. కాని అతని రుణం తీర్చుకోగలనా? ఏం చేస్తే తీరుతుంది?
ఒకనాటి రాత్రి మీరాని పిలిచి చెయ్యి పట్టుకుని పక్కన కూచోపెట్టుకున్నాను. 'మీరా నేను నీకు కావాలా?' అర్థంకాక నావంక చూశాడు.
'అవాళ మధ్యాహ్నం....? అర్థమయిందని నా చేతుల్లోని అతని వేళ్ళు నాకు చెప్పాయి.
అతని చంపల్లోని సిగ్గుని చూసి మురుస్తూ.
'నీకు కావలిస్తే యీ రాత్రి అయినా సరే'
'నీ కవసరమా?"
"నా కిష్టమే." నాకు సిగ్గేస్తోంది.
'అదికాదు. నేను నీకు అవసరమా? అమీర్ మల్లె కావాలా!'
ఎంత ఔదార్యమో? ఎంత లోతైన నాజూకైన స్వభావామో! అతన్ని గట్టిగా పక్కకి అదుముకుని మొహాన్ని తిప్పుకుని ముద్దు పెట్టుకున్నాను. నేను వొదిలిన అతని వేళ్ళు నా జుట్టులోంచి కదలలేదు. "నీతో అబద్ధం చెప్పలేనోయ్. నేను అమీర్ దాన్నే అనిపిస్తుంది. నాకిష్టముండదు. నేనేం గొప్పదాన్నీ, పతివ్రతనీ అని కాదు."
"అయితే యెందుకడిగావు?" ఆ ప్రశ్న నన్ను గుచ్చుకుంది, సిగ్గుతో.
"నిన్ను సంతోష పెడదామని. యెందుకంటే నేను అమీర్ దాన్నైనా అతనిమీద కంటే నీపైనే నాకు ప్రేమ యెక్కువ."
మాటలు తప్పించి యేవో మాట్లాడి వెళ్ళిపోయినాడు. మీరా లాంటి వాణ్ణి మళ్ళీ చూస్తానా? తురకలని గుమ్మంలోనికి రానియ్యరు పవిత్రులైన మీరందరు.
"దీదీ అమీరు వస్తే?" అన్నాడు ఒకరోజు.
"ఏమిటి?"
"నాకు భయంగా వుంది."
"భయం?" నాకు తెలుసు కాని అడిగాను. ఆడదాన్ని.
"వొప్పుకోడేమో?"
"ఎందుకు మీరా?" అడిగాను కాని ఆ ప్రశ్న నన్నూ బాధిస్తోంది.
"మనమింత స్నేహంగా వుండడం"
"తప్పేముంది?"
"లేదు. కాని అతనేమనుకుంటాడో?"
"అంతమాత్రం విచక్షణ లేనివాడా?"
"విచక్షణ వుంటుందా? నాకు భయమేస్తోంది" అన్నాడు.
"భయపడకు నేనున్నానుగా...."
"ఎందుకు; నిన్నేమైనా చేస్తాడని భయమా? నేను కాపాడనా?"
అమీర్ నా మాట వినడా?

