Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 22

 

    బయటివరకు వెంబడే వచ్చింది మాధురి.
    "గుడ్ నైట్ ---" అందామె తీయగా .
    "గుడ్ నైట్ " అని త్వరత్వరగా నడిచాడు సురేంద్ర . అతని కిప్పుడు సినిమాకి వెళ్ళాలనిపించటం లేదు. ఎక్కడయినా కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలనుంది. బీచ్ వేపు నడిచాడతను. చీకటి అంతా నిర్మానుష్యంగా ఉంది. రోడ్డు మీది లైట్లు గుడ్డిగా వెలుగుతున్నాయ్.
    సముద్రపు ఘోష ఎక్కువగా ఉంది.
    ఇసుకలో కూర్చున్నాడతను. ఓడ ఒకటి చాలా దూరంలో హార్బర్ వేపు వస్తూ కనిపించింది.
    ఇప్పుడతని ఆలోచనలన్నీ మాధురీ మీదే ఉన్నాయ్. ఈ మధ్య కాలంలో ఆమెతో బాగా చనువు ఏర్పడింది. రెండు మూడు రోజులకోసారయినా ఆమెతో మాట్లాడుతూ కాసేపు గడపటం అలవాటయిపోయింది. అయితే ఆమె ఇంటి కెళ్ళడం ఇదే మొదటిసారి! అదీ ఇంత రాత్రి వరకూ ఎప్పుడూ మాటలాడుతూ కూర్చోలేదు. బహుశా తనంటే ఆమెకూ అభిమానం వుండే ఉంటుంది. అందుకే ఆఫీసు వదలినా తనతో కొంతసేపు సరదాగా మాట్టాడుతూ గడుపుతుంటుంది. ఆమెను మరింత దగ్గర చేసుకోవాలని తన ప్రయత్నం. ఇద్దరి మనసులూ ఒకటయితే - తనామెని వివాహం చేసుకోడానికి సిద్దంగా ఉన్నాడు . ఆమె అందగత్తె నిజానికి తనకిప్పుడు కావలసింది ఆమె అందం కాదు. ఒకరికొకరు అర్ధం చేసుకోవడం, మనసులు కలవడం!
    అలా జరిగితే తమ జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుంది. తను అంతవరకూ జరిగిన విషయాలన్నీ మర్చిపోగలడు.
    ఒక కారు దూరంగా రోడ్డు వెంబడే వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ యువకుడూ యువతీ దిగి మాట్లాడుకొంటూ నడుస్తున్నారు.
    టైము చూసుకొన్నాడు సురేంద్ర.
    పది దాటింది.
    లేచి ఇంటి వేపు బయల్దేరాడు . తల్లి తనకోసం ఎదుర్చుస్తుంటుంది. తను గూడా అన్నం తినదు.
    ఇల్లు చేరుకున్నాడతను.
    నాలుగు మెతుకులు భోజనం చేసి మంచం మీద పడుకున్నాడు. తల్లి చాలాసేపు గడప దగ్గరే తచ్చుట్లాడి తరువాత వెళ్ళి పడుకుంది.
    ఉదయం లేస్తూనే త్వరత్వరగా తయారయి వీధిలో  కొచ్చాడతను. ఎక్కడి కెళ్ళాలో తేలీలేదు.
    అయోమయంగా నడవసాగాడు.
    ఇంట్లో మాత్రం ఉండబుద్ది కావటం లేదు.
    స్వరూప కెంత ధైర్యం! తప్పు చేసినట్లు వప్పుకుంటూనే -- అది తప్పు కానే కాదని వాదిస్తుంది. మగాళ్ళందరు నీతిగలవాళ్ళేనా అని నిలదీసి అడిగింది.
    మగా ఆడా ఒకటేలా అవుతారు? మగాడు నీతి తప్పినా అతనికేనష్టమూ లేదు. అదే ఆడది నీతి తప్పితే ఎన్ని గొడవలు ! అసలు ప్రకృతి సిద్దంగానే ఆడదానిని దేవుడలా సృష్టించాడు. ఆడది పవిత్రంగా ఉండాలి. అంతే! లేకపోతే ఎవరూ క్షమించరు. క్షమించకూడదు కూడా.
    "ఏమిటి పొద్దున్నే బయల్దేరారు? అసలు రాత్రి ఇంటి కెళ్ళారా?" నవ్వుతూ అడిగింది మాధురి.
    వాళ్ళింటి గడపలో నుంచుని తల దువ్వుకొంటుందామె.
    ఒక్కసారిగా స్పృహలోకొచ్చాడతను.
    తను మాధురి వాళ్ళింటికొచ్చాడా? ఎందుకు? ఇక్కడికి రావాలని లోలోపల కూడా అనుకోలేదు. చాలా ఇబ్బందిగా అనిపించింధతనికి.
    "ఇక్కడికి దగ్గరలో మా ఫ్రెండ్ ఇల్లుంది! అక్కడి కెళుతున్నాను" అనేసి అక్కడ నుంచి త్వరత్వరగా నడిచాడతను.
    చాలాసేపు హోటల్లో కూర్చొని టైము అవగానే ఆఫీస్ కి చేరుకున్నాడు. మాధురి అతనిని చూసి చిన్నగా నవ్వి తన పనిలో నిమగ్నమయిపోయింది. చాలాసేపు ఆమె వంకే చూస్తూ కూర్చుండి పోయాడతను. చివరకు బలవంతంగా ఫైల్స్ తీసి ముందు పెట్టుకొని వాటివంకే చూడసాగాడు.
    ఆ సాయంత్రం అయిదుగంటల కల్లా మాధురి అతని సీటు దగ్గర కొచ్చి "ఇవాళ చాలా బిజీగా ఉన్నట్లున్నారే?" అంది నవ్వుతూ.
    "అవునండీ! ఉదయం నుంచీ అసలు ఏవీ ముట్టుకోకుండా కూర్చున్నాను. తీరా ఇప్పుడు అర్జంటుగా కొన్ని ఫైల్స్ పుటప్ చేయాల్సి వచ్చింది."
    "సరే - నేను వెళుతున్నాను " బయటకు నడవబోతూ అందామె.
    "పోనీ - ఒక్క అరగంట అగలేరూ? నేనూ వచ్చేస్తాను" అడిగాడతను.
    "ఊహూ! ఇవాళ త్వరగా ఇంటి కెళ్ళాలి. వేరే ప్రోగ్రాం ఉంది."
    "సరే -- అలాగయితే వెళ్ళిపొండి! మీ ప్రోగ్రాం చెడగొట్టటం నాకిష్టం లేదు."
    ఆమె వెళ్ళిపోయింది.
    నిరాశపడిపోయాడు సురేంద్ర. తనకోసం ఆమె వేచి ఉంటుందని అనుకున్నాడు . కనీసం అడిగినందుకయినా అగవచ్చుగా. ఇంటిదగ్గిరా ఏం ప్రోగ్రాం ఉంటుంది? సినిమా కెళ్ళడం తప్పితే ఇంకేముంది ?
    ఒకవేళ తను ఆమె దగ్గర తీసుకొంటున్న చనువు మూలాన ఆమె దృష్టిలో చులకన అయ్యాడేమో. రేపట్నుంచీ తాను కొంచెం ముభావంగా ఉండటం నేర్చుకోవాలి.
    పని ముగిశాక తిన్నగా ఇంటికి చేరుకున్నాడతను.
    ఆ మర్నాడు ఆఫీస్ కెళ్ళేసరికి తన సీటు దగ్గరే కూర్చుని కనిపించిందామె.
    "మీ కోసమే చూస్తున్నాను." అంది నవ్వుతూ. తలంటు పోసుకోవడం చేత కాబోలు జుట్టు పొడిగా ఉంది.
    "ఏమిటి విశేషం?" అడిగాడతను చిరునవ్వుతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS