ఎడ్యుకేషనల్ సైడ్ విగరస్ గా వర్క్ చేసుకోవడం, మనస్సు నిండా నాయనమ్మను నింపుకొని ఆరాధించడం తప్ప ఆమెకి మరొకటి తెలీదు.
ఖాళీ దొరికితే స్పిల్ బెర్గ్ ఫేంటసీలు, ఎడ్డిమర్ఫీ హాస్య చిత్రాలు చూడడం- ఇంకా ఖాళీ దొరికితే ఐయాన్ రాండ్ బుక్స్ ఒకటికి పదిసార్లు చదవడం- ఇంతకిమించి మరో ప్రపంచం తెలీదని కాదు- తెలిసినా తెలుసుకోవాలనుకునే వరకే. పూర్తిగా లోతుకు వెళ్ళలేదు.
మాయలు, మంత్రాలు, కుట్రలు, కుతంత్రాలు అసలే తెలీవు.
అప్పుడప్పుడు పేపర్స్ లో వచ్చే వార్తలు చదివి ప్రపంచంలో ఇన్ని మాయలున్నాయా? ఇంత మోసగాళ్ళున్నారా అని విస్మయపడి వెంటనే అదో తలనెప్పిగా భావించి వెంటనే దృష్టిని మరల్చివేసేది.
అప్పుడప్పుడు నాయనమ్మ ఇండియా నుంచి పంపించే మంచి మంచి సినిమాల వీడియో కేసెట్లు, మంగళంపల్లి, జేసుదాసు, కిషోర్ కుమార్, ఘంటసాల, రఫీ, ఎస్.ఫై. ఆడియో కాసెట్లు చుట్టూ వేసుకొని వాటిని చూస్తూ వింటూ గడిపేది.
వంద జన్మలకో మానవజన్మ. ఆ మానవజన్మ కూడా క్షణభంగురం. అందమయిన క్షణాన్ని ఆనందంగా అనుభవించక కుట్రలు, రాజకీయాలతో ఏదో సాధిస్తున్నామనుకుని నాశనం చేసుకోవడం ఆమె కిష్టం లేదు.
తనకయితాను సృష్టించుకున్న ఓ చిత్రమయిన ప్రపంచంలో ఇన్నాళ్ళు బ్రతికిన నాయకి అతిత్వరలోనే తనో అగాధంలోకి జారిపోబోతున్నానని ఊహించలేక నాయనమ్మతో సరదాగా కబుర్లు చెప్పసాగింది.
"ఈ మధ్య మూడు తెలుగు సినిమాలు చూశాను తెలుసా నాయనమ్మా. మూడు చాలా బావున్నాయి. నా అమెరికన్ ఫ్రెండ్స్ కి కూడా బాగా నచ్చాయి. తెలుగులో మంచి సినిమాలే వస్తున్నాయి కదమ్మా?" ఆనందంగా అంది నాయకి.
"దానికి 'అప్పుడప్పుడు' అనే సవరణ పెట్టుకోవడం మంచిదమ్మా. మరికొన్ని తెలుగు సినిమాలు చూస్తుంటే తల తిరిగిపోయుండేది" అర్జునరావు తన సహజధోరణిలో అన్నాడు.
"చెడును చూసి నిరాశావాదాన్ని పెంచుకోవడం నేర్పొద్దు అర్జునరావు. మంచిని చూసి ఆశాభావాన్ని పెంచుకోనివ్వు" అని అర్జునరావు కేసి చూసి చటుక్కున తలతిప్పి మనమరాలి వేపు చూస్తూ-
"యింకేమిటి అక్కడి విశేషాలు? అవునూ, వీడియో కేసెట్ ఏదమ్మా?" అంది నాగమ్మ మనుమరాలిని కళ్ళతోనే ఆప్యాయంగా స్పృశిస్తూ.
"అరెరె సారీ అమ్మా. ఇప్పుడే తెస్తాను" అంటూ వేగంగా తిరిగి తన గదికేసి దూసుకుపోయింది నాయకి.
నాగమ్మ కళ్ళలో ఓ క్షణం నీళ్ళు తిరిగాయి. ఏ కష్టమూ ఎరక్కుండా పెరిగిన తన చిన్నారి తల్లి రేపుని ఎలా ఆహ్వానిస్తుంది? తట్టుకుంటుందా? ఆత్మస్థయిర్యంతో నిలబడగలుగుతుందా? దుఃఖ భాజకమయిన ఆలోచనలు కొద్దిసేపు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి.
* * * *
"అమ్మాయి ఎలా వుంది?" కనకారావు ప్రశ్నించాడు ఆసక్తిగా...
"ప్చ్... ఏదో ఫర్వాలేదులే. సర్దుకుపోతాను" అన్నాడు సామంత్ కనకారావుని ఉడికించాలని.
బిత్తరపోయాడు కనకారావు.
"ఓర్నీ... ఫర్వాలేదా? కడిగిన ముత్యం" అన్నాడు కనకారావు హేళనగా చూస్తూ.
"నువ్వు ముత్యం మొహం ఎప్పుడన్నా చూశావా?"
"చూడలేదు. అయితే?"
"మరి కడిగిన ముత్యం... కడగని ముత్యం అని ఎలా చెప్పగలవు? అయినా పిల్ల నల్లగా వుందోయ్... ఫర్వాలేదులే సర్దుకుపోతాను"
"ఇందాకటి నుంచి చూస్తున్నాను. సర్దుకుపోతాను, సర్దుకుపోతాను అంటూ ఏదో దేశాన్ని, నన్ను, ఆ అమ్మాయిని ఉద్దరించబోతున్నట్టు చెబుతావేం? నువ్వేం సర్దుకుపోనక్కర లేదు. పెళ్ళి చేసుకుని ఆ అమ్మాయి కలలకు మంగళం పాడి ఆ ముసలావిడ్ని మానసికంగా దెబ్బ తీస్తే చాలు"
కనకారావు మాటలుపూర్తి కాకుండానే అక్కడికో వ్యక్తి వచ్చాడు. అతని వెనుకే ఓ అమ్మాయి కూడా వుంది.
ఎవరు అన్నట్టు భుజాలు ఎగరేశాడు సామంత్.
"తెమ్మన్నావుగా ఓ అమ్మాయిని... తెప్పించాను. నీ పోరుపడలేక తెప్పించాను కాని, నా పనికి అంతరాయం కలిగించవద్దు. అదే జరిగితే పీటర్- నిన్ను, నన్ను ప్రాణాలతో వుండనివ్వడు" అన్నాడు కనకారావు చిరాకు వ్యక్తం చేస్తూ.
"వాడెవడు నన్ను ప్రాణాలతో వుండకపోనివ్వడానికి? వాడి చేతుల్లో ఏమన్నా యమపాశం వుందా?" అని వచ్చిన యువతీ వేపు తిరిగి...
"నేను చెప్పినట్టు చెయ్యాలి. ఒక్క వారం రోజులే" అన్నాడు సామంత్.
ఆ యువతి అలాగే అన్నట్టు తలవూపుతూ - "మరి నాకేమిటి?" అంది.
"నీకేమిటి అన్నది కనకారావు చూసుకుంటాడు. డబ్బు కావాలంటే ఇస్తాడు. పెళ్ళయిందా నీకు? పెళ్ళికాకపోతే కనకారావు కాణీ కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటాడు. ఇంకేం కావాలి?"
ఆ యువతీ సామంత్ ని విస్మయంతో చూసింది.
కనకారావుకి అరికాలిమంట నెత్తికెక్కింది "నేను పెళ్ళి చేసుకుంటానా? తిక్క తిక్కగా వుందా?" కోపంగా ప్రశ్నించాడు కనకారావు.
"పెళ్ళికాక, కోర్కెలు తీరక, నీకే తిక్క తిక్కగా వుంది. అయినా ఇంతకంటే అందమయిన పిల్ల దొరుకుతుందా నీకు? అయినా అసలింత కాలం పెళ్ళెందుకు చేసుకోలేదు నువ్?"
కనకారావు తలపట్టుకున్నాడు.
"మళ్ళీ టాపిక్ డైవర్టు చేశావు?"
"టాపిక్ అంటే గుర్తుకొచ్చింది - నేనెప్పుడు రంగంలోకి దిగాలి?" అన్నాడు ఆ అమ్మాయికేసే చూస్తూ.
"ఎంతా...ఇంకో పదిరోజుల్లో"
"సరే నేనీ అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్ళొస్తాను" ఎస్.ఐ.నరసింహాన్ని గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు.
"షికార్లకు వెళ్ళటానికా ఈ అమ్మాయిని రప్పించింది?" సామంత్ అంటే కనకారావుకి అసలు పడడం లేదు.
"నువ్వు పెళ్ళి చేసుకోపోబట్టే గదా ఇలా ఏడ్చేది?"
"ఏడవడం ఏమిటి?"
"ఆ అమ్మాయిని నేను బయటకు తీసుకెళతానంటే ఏదేదో ఊహించుకొని ఏడుస్తున్నావుగా?"
"నీతో మాట్లాడలేనయ్యా... ఏదో పనుందని ఓ అమ్మాయి కావాలని చెప్పావు. సరేనని తెప్పించాను. ఆమెను తీసుకుని షికార్లకు వెళుతున్నావేమోనని అలా అన్నాను. అంతేకాని నాకేం వేరే ఉద్దేశం లేదు" అన్నాడు కనకారావు మొహం మాడ్చుకుంటూ.
"చూడండి...మీరు మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈలోపు టైమ్ వృధా అయిపోతోంది. ఒక నాటకం వేయడానికి నాకు పదిరోజులు చాలు. ఏ పాత్రనయినా బ్రహ్మాండంగా రక్తి కట్టించగలను. అందుకు నాకు ఐదొందలు ఇస్తారు" అందామె అక్కడే వున్న సోఫాలో కూర్చుంటూ.
