Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 20


    రెండడుగులు సింహద్వారం కేసి వేసి, అప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు.

 

    ఒకింత సేపటికి తేరుకున్న వాళ్ళు మౌనంగానే లోపలకు నడిచారు.

 

    "అమ్మా..." నాయకకి నాయనమ్మని అమ్మా అని పిలవడమే అలవాటు చిన్నప్పటినుంచి.

 

    ఆ పిలుపుకి నాగమ్మకి గుండె చిక్కబట్టినట్టయింది.

 

    తన పిలుపుకు నాయనమ్మ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఒకింత ఆశ్చర్యపోయిన నాయకి జరగారానిదేదో జరిగివుంటుందని అనుమానించింది. మరేదో అడుగుదామని పెదవి కదిపేలోపే -

 

    "నువ్వెళ్ళి స్నానం చేసిరామ్మా... నీ కిష్టమైన వంటలన్నీ చేయించాను. తృప్తిగా, తనివితీరా నువ్వు తింటుంటే నేను చూసి తృప్తి పడతాను" అంది నాగమ్మ.

 

    నాయనమ్మ చూపులు ఎటో వున్నాయి.

 

    ఎదుట వున్నది ఎవరయినా సూటిగా వాళ్ళ కళ్ళలోకి చూసి మాట్లాడే నాయనమ్మ ఎందుకలా ఎటో చూస్తున్నది? ఆ చూపుల్లో అపరాధ భావం కూడా తన కళ్ళబడింది.

 

    ఏమిటిదంతా?

 

    ఏం జరిగింది?

 

    ఇల్లంతా సందడిగా వుంటుందని తాను ఎంతగానో ఊహించింది. కాని, తీరా చూస్తే ఇంట్లో ఎప్పటిలా పదిమంది పనివాళ్ళున్నా వారిలో కళ లేదు- సందడి లేదు- సంతోషం అంతకంటే లేదు.

 

    ఆమె మరేమీ మాట్లాడకుండా వడివడిగా మెట్లెక్కింది. తన బెడ్ రూమ్ చేరుతూనే నేరుగా బాత్ రూమ్ లోకి వెళ్లిపోయింది.

 

    వేడినీళ్ళు టబ్ లోకి వదిలి సోప్ పౌడర్ ని అందులో ఒకింత చిలకరించి తలకి పాలిథిన్ నెట్ పొదువుకొని టబ్ లోకి దిగి నెమ్మదిగా పరుండిపోయి ఆలోచించడం మొదలెట్టింది.

 

    కింద నాగమ్మ దగ్గరుండి డైనింగ్ టేబుల్ పై పదార్థాలన్ని సర్దిమ్చి మనుమరాలి కోసం ఎదురుచూడసాగింది.

 

    అంతలో అర్జునరావు లోపలకొచ్చాడు. అతనికోసమే ఆత్రుతగా ఎదురుచూస్తున్న నాగమ్మ దగ్గరికి రమ్మని సైగ చేసింది.

 

    "చూడు అర్జునరావు. పాపకు ఇక్కడి పరిస్థితులేమీ చెప్పి వుండవని భావిస్తున్నాను" అంది గంభీరంగా.

 

    "లేదండి... చెప్పలేదు... మీరు ఇచ్చిన సూచన నాకు గుర్తుంది" అన్నాడు అర్జునరావు వినయంగా.

 

    "త్వరలోనే పాపకు పెళ్ళి చేసెయ్యాలనుకుంటున్నాను. అప్పటి వరకు మన వ్యాపారా లావాదేవీల గురించి కాని, ఇటీవల మనకు మన వ్యాపారంలో ఎదురయిన ఇబ్బందుల  గురించి కాని ఒక్క మాట కూడా పాపకు తెలియజెప్పకూడదు. ముందే తెలిస్తే పోయినదాన్ని సాధిస్తాననో, శ్రమిస్తాననో పంతానికి వెళ్తారు ఈ జెనరేషన్ పిల్లలు. వ్యాపారంకన్నా, ఆ వ్యాపారం ద్వారా సంపాదించే ఆస్తుల కన్నా నా పాప పెళ్ళి చేసుకుని సంతోషంగా వుండడమే నాకు కావాలి" ఆమె కంఠంలో అలుపు తొంగిచూసింది.

 

    శారీరకంగా ఆరోగ్యంగా వున్నా మానసికంగా ఆమె బాగా అలసిపోయి వుంది.

 

    బిజినెస్ ప్రపంచంలో తను ఇప్పటివరకు తిన్న దెబ్బలని తలుచుకుంటేనే నిస్పృహ ఆవరిస్తోందామెని.

 

    తన మనుమరాలికి కూడా అదే స్థితి ఎదురవుతుందేమోనని భయపడతోంది.

 

    డబ్బుకోసం, ధనిక సమాజంలో స్థానం కోసం నెత్తురు కారకుండా పీకల్ని కోయడాన్ని, తమకు తెలీకుండానే తమ వెనుక గోతులు త్రవ్వడాన్ని పొంచి వుండే ప్రమాదాల్ని తలుచుకొని ఆమె భయపడుతోంది.

 

    సాధారణంగా నిబ్బరాన్ని కోల్పోని నాగమ్మే బిజినెస్ ప్రపంచంలో బోర్డ్ రూమ్స్ లో జరిగే డ్రామాలని తలుచుకొని నాగరికంగావెన్నుపోట్లు పొడవడాన్ని, చట్టబద్ధంగా న్యాయాన్ని సమాధి చేయడాన్ని గుర్తుకు తెచ్చుకొని ఒణికిపోతోంది.

 

    మనిషికి అర్థం తను సుఖంగా, ప్రశాంతంగా బ్రతుకుతూ మరో నలుగురికి సహాయపడడమే అని ఆమె భావిస్తుంది.

 

    దానికోసం... కోరి కష్టాల్ని, అశాంతిని ఆహ్వానించడం ఆమెకిష్టం లేదు.

 

    అనంతకోటి ప్రశ్నలు ఆమెను క్షణకాలం చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేశాయి.

 

    దిగజారిపోతున్న మానవ విలువల పట్ల ఆమె బాధపడని రోజు లేదు ఈ మధ్యకాలంలో.

 

    నాగమ్మ ఇక పైన ఆలోచించలేకపోయింది. ఆలోచించడానికే భయపడింది.

 

    ఆమె ఆలోచనల్లో ఎంతో దూరం వెళ్ళిపోయిందని అర్జునరావు మౌనంగా వుండిపోయాడు.

 

    ఆమె దుఃఖ భాజాకమైన ఆలోచనలపై తెర దింపేసి అర్జునరావు వేపు చూస్తూ -

 

    "మంచి సంబంధాలు చూడు. ఆల్ రెడీ మనం చూసిన సంబంధాలు నాలుగున్నాయి. వాటిల్లోంఛి మంచి సబంధాన్ని ఎన్నిక చేసుకుందాం. సాత్వికుడు, సహృదయుడు, ధీశాలి, విద్యావేత్త, మంచితనం, మానవత్వం తెలిసినవాడు, నైతిక విలువలకు ప్రాణం ఇచ్చేవాడు - కేవలం డబ్బుకోసమే బ్రతకనివాడు, క్షణానికో పెళ్ళాన్ని మార్చని మనస్తత్వమున్న వాడ్ని చూడాలి. జాగ్రత్తగా వెతకాలి. నేను చెప్పిన చెప్పిన లక్షణాలన్నీ వున్న యువకుడు దొరకడం కష్టమే. కాని తప్పదు. పాపకు నేనే తల్లిని, తండ్రిని. నా ఎన్నికలో చిన్న పొరపాటు జరిగినా ఆ ఫలితం అనుభవిస్తూ జీవితాంతం కుళ్ళిపోయేది నా బంగారు తల్లి.

 

    టైమ్ లేదు. నా గుండెల్లో రగులుతున్న బడబాగ్నిని ఇంకెక్కువ కాలం నేను భరించలేను. నేను చూపించిన వాడితో మరో ఆలోచన లేకుండా తాళికట్టించుకునేందుకు సిద్ధపడిన నా మనుమరాలి నమ్మకాన్ని, ఆశల్ని, ఆశయాల్ని, ఈ ఎంపికలో సార్థకం చెయ్యాలి అర్జునరావు..." ఆమె ఇంకా ఏదో అనబోతుండగా నాయకి మెట్లు దిగిరావడం కనిపించింది.

 

    వెంటనే ఆమె మౌనాన్ని ఆశ్రయించింది. ఆ ఇద్దరికేసి చూపుల్ని మార్చి మార్చి చూసిన అర్జునరావు లోలోపలే నవ్వుకున్నాడు. 'అన్నీ దుర్గుణాలేవున్న 'గొప్ప' వ్యక్తి నీ మనుమరాలికి మొగుడు కాబోతున్నాడు. నువ్వెంత ఆశపడ్డా, నీ మనుమరాలెన్ని కలలు కన్నా అతను ఈ ఇంట్లో అడుగుపెట్టి మీ కలల్ని, ఆశల్ని కూల్చక తప్పదు నాగమ్మ' లోలోనే అనుకున్న అర్జునరావు చిరునవ్వును, ఆప్యాయతను మొఖానికి పులుముకుని నాయకి కేసి చూశాడు.

 

    "రామ్మా... రా... ఎన్నాళ్ళయిందో మన వంటలు రుచి చూడక" అంది నాగమ్మ ఆప్యాయంగా నాయకి కేసి చూసి.

 

    నాయకి నవ్వుతూ వచ్చి నాగమ్మ పక్కనే కూర్చుంది. కడిగిన ముత్యంలా, మంచుబిందువుల తాకిడికి పులకించే అరవిచ్చిన గులాబీలా వుందిప్పుడు నాయకి.

 

    ఫ్రెష్ నెస్, పరవళ్ళు తొక్కే యవ్వనం ఆమెలో అణువణువునా తొణికిసలాడుతున్నాయి. ఎందరో సెక్సువల్ ఫేంటసీలకి, మరెందరో కలల ప్రపంచాలకి, ఆమెని ప్రేమించామానుకునే ఇంకెందరో ఎడోల్ సెంట్ ఊహల వుధృతికి ఆమె కేంద్ర బిందువు. బాధలు, భయాలు తెలీని ప్రశాంతమైన జీవితం ఇప్పటివరకూ ఆమెది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS