Previous Page Next Page 
ప్లే పేజి 21


    
    ఖైరతాబాద్ ప్లై ఓవర్ బ్రిడ్జిమీద వాహనాలు, బ్రేకులు ఫెయిలైనట్టుగా స్పీడ్ గా పరుగెడుతున్నాయి.
    
    సిటీబస్సులు, కార్లు, ఆటోలు....పేవ్ మెంట్లమీద నడుస్తున్న జనం రద్దీగా ఉంది వాతావరణం.
    
    సరిగ్గా అదే సమయంలో బేరర్ యాదగిరి, విశ్వేశ్వరయ్య ట్రాఫిక్ ఐలాండ్ ని క్రాస్ చేసి, పరుగు పరుగున, అప్పుడే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఎక్కుతున్న సిటీబస్ రాడ్ పట్టుకుని, బస్ ఫుట్ బోర్డ్ దగ్గర నుంచున్నాడు సరిగ్గా-
    
    అదే సమయంలో అతన్ని రెండు కిలోమీటర్ల దూరంనుంచి అనుసరిస్తున్న స్కూటర్ - ఆ స్కూటర్ మీదున్న ఇద్దరు వ్యక్తులు స్కూటర్ని ఫ్లైఓవర్ బ్రిడ్జివేపు మళ్ళించారు. స్కూటర్ వెనక కూర్చున్న వ్యక్తి చూపులు, నేరుగా బేరర్ యాదగిరి మీదే ఉన్నాయి... బస్సుకి, స్కూటర్ కి మధ్య దూరం కేవలం ఇరవై అడుగులు మాత్రమే ఉంది.
    
    బస్సు స్లో అయ్యే సమయం కోసం వాళ్ళిద్దరూ ఎదురుచూస్తున్నారు. సిటీబస్సు, మింట్ కాంపౌండ్ దగ్గర మలుపు తిరిగింది, లిబర్టీ చౌరాస్తా వేపు పరుగెడుతోంది.
    
    స్కూటర్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి, గేరుమార్చి స్పీడ్ పెంచాడు. బేక్ సీట్లో కూర్చున్న వ్యక్తి చేతిలో పొడవాటి, ప్లాస్టిక్ కవర్ ఉంది. ఆ కవర్ ని చూడగానే అందులో హాకీస్టిక్ ఉందని అందరూ అనుకుంటారు కానీ -అందులో ఉన్నది పొడవాటి తల్వార్ అని ఎవరికీ తెలీదు! ఆ తల్వార్ ని ఆ కవర్ లోంచి బైటకు తియ్యడానికి టైమ్ కోసం ఎదురు చూస్తున్నాడు రెండో వ్యక్తి.
    
    అతని చూపులన్నీ బస్సు స్పీడుమీద, యాదగిరి కదలికల మీదా ఉన్నాయి. సిటీబస్సు ట్రాఫిక్ ఐలాండ్ ని సమీపిస్తోంది.
    
    "జర జాగ్రత్త.... బీ కేర్ ఫుల్..." స్కూటర్ ని డ్రైవ్ చేస్తున్నవ్యక్తి హెచ్చరించాడు. ఆ హెచ్చరికలోని సిగ్నల్ ని అందుకున్నాడు బేక్ సీట్లోని వ్యక్తి అతని బొటనవేలు, ప్లాస్టిక్ కవర్ బటన్ మీద కెళ్ళింది. మరుక్షణంలో ఆ బటన్ టప్ మని శబ్దంచేస్తూ విడిపోయింది.
    
    మూడే మూడు నిమిషాలు....
    
    బస్సు ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర 'స్లో' అయింది.....స్కూటర్ వేగం పెరిగింది ట్రాఫిక్ పోలీస్ రెడ్ సిగ్నల్ ఇవ్వటంతో, అన్ని వాహనాలకు సడన్ బ్రేక్ పడింది.
    
    వరసగా ఆటోలు ఆగిపోయాయి. ఆటోల మధ్యనుంచి వెళ్ళిన స్కూటర్ సరిగ్గా సిటీబస్సు బేక్ డోర్ దగ్గర ఆగింది..."
    
    "మారో...ఖతం కరో..."
    
    పెను అరుపు వినబడ్డం, స్కూటర్ వెనక సీట్లోని వ్యక్తి, ప్లాస్టిక్ కవర్ లోంచి తల్వార్ బయటకు తీయడం, స్కూటర్ దిగడం, యాదగిరి కాళ్ళను తెగనరకడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
    
    రెండు కాళ్ళూ రెండు ముక్కలైపోయాయి. పెద్ద అరుపు అరిచి యాదగిరి కిందపడిపోయాడు....
    
    కిందపడిన యాదగిరి గుండెల్లో తల్వార్....మళ్ళీ రెండు సార్లు దిగింది.
    
    నెత్తురు పౌంటెన్ లా ఎగిరి పక్కనున్న ఆటో మీద పడింది...
    
    సరిగ్గా అదే సమయంలో-
    
    ఆ ఆటోకి వెనక, స్కూటర్ మీదున్న ఓ కుర్రాడి చేతిలోని కెమెరా అసంకల్పితంగా పనిచెయ్యడం ప్రారంభించింది.
    
    అతనో ప్రొఫెషనల్ ప్రెస్ ఫోటోగ్రాఫర్...!
    
    జనం.... హాహాకారాల్తో పరుగెత్తడం ప్రారంభించారు.
    
    సరిగ్గా-
    
    అదే సమయంలో ఆగిన ఆటోలోంచి కిందకు దిగింది ఓ అమ్మాయి ఏం జరిగిందో తెలుసుకోడానికి ముందుకొస్తున్న ఆమె తన పక్కనుంచి కేకలేసుకుమ్తూ వెళ్ళిపోతున్న స్కూటర్ మీద యువకుల్ని చూడడం, భయంతో వెనక్కి జరగడం-
    
    అదే సమయంలో ఆమె చూపులు, స్కూటర్ నెంబర్ ప్లేట్ ను చూడడం జరిగిపోయింది.
    
    కానీ ఆ నెంబర్ ప్లేట్ మీద నెంబర్ చాలా విచిత్రంగా ఉంది...
    
    VSP XXX
    
    మరో క్షణంలో స్కూటర్ అక్కడ నుంచి మాయమైపోయింది. ఆటోలో వెళ్ళి కూర్చున్న ఆమె వెంటనే ఆ స్కూటర్ నెంబర్ ని తన అరచేతి మీద రాసుకుంది.
    
    "బ్లడీ పీపుల్.... బ్లడీ బాస్టర్స్.... కళ్ళ ముందు మర్డర్ జరిగితే.... అందరూ ఎలా చూస్తున్నారో చూడండి...." ఆ కామెంట్ విన్పించిన వేపు చూసింది ఆమె.
    
    ఫోటోగ్రాఫర్ ఇంకా ఫోటోలు తీస్తూనే ఉన్నాడు.
    
    ముందుకు కదులుతున్న ఆటోలోంచి ఆమె అలవోకగా ఆ ఫోటోగ్రాఫర్ వేపు చూసింది.
    
    మరో పది నిమిషాల తర్వాత ఆ ప్రాంతం నిర్మానుష్యమైపోయింది. బేరర్ యాదగిరి శవం గడ్డకట్టిన రక్తం మధ్యన పడిఉంది.
    
                                                    *    *    *    *    *
    
    సూర్యవంశీ ఒక పనిని చేపట్టాడంటే, ఆ పని పూర్తయ్యే వరకూ నిద్రపోడు.
    
    అందుకే-
    
    వికారాబాద్ నుంచి నేరుగా రూమ్ కొచ్చేసాడు.
    
    అప్పటికి రాత్రి పది గంటలు దాటింది. దార్లోనే రైల్వేస్టేషన్ ఎంక్వయిరీకి ఫోన్ చేసాడు.
    
    తెల్లవారుజామున 3 గంటలకు కోణార్క్ వెళ్ళే ట్రైనుంది.
    
    టిక్కెట్ కౌంటర్లో తెల్సిన ఫ్రెండ్ కి, టిక్కెట్ కోసం చెప్పేసి, బార్ లోకి వెళ్ళిపోయాడు.
    
    అతనికింకా బేరర్ యాదగిరి మర్డర్ విషయం తెలీదు!
    
    తనిచ్చిన మాటప్రకారం ఎ.సి.పి. నిరంజనరావుకి ఫోన్ చెయ్యాలనే విషయం కూడా అతను మర్చిపోయాడు.
    
                                                   *    *    *    *    *
    
    రాత్రి 12 గంటలు దాటింది.
    
    తన రూమ్ లో అంతవరకూ ఆలోచిస్తూ కూర్చున్న ఎ.సి.పి. నిరంజనరావుకి బేరర్ యాదగిరి మర్డర్ అనూహ్యంగా ఉంది.
    
    ఫ్రీ ప్లాన్డ్ రిచ్ డ్ మర్డర్!
    
    హార్ట్ ఆఫ్ ది సిటీలో జరిగిన మర్డర్, హోంమినిస్టర్ దృష్టిలో పాతకక్షల మర్డర్!
    
    యాదగిరి మర్డర్, తనని బెదిరించడానికో భయంకరమైన హెచ్చరిక! అతని సిక్స్త్ సెన్స్ చెప్తున్న విషయం అది ఆ వెంటనే ఇమ్మీడియట్ గా నిరంజనరావుకి గుర్తొచ్చిన వ్యక్తి సూర్యవంశీ! సూర్యవంశీ విషయమై అతను కంగారుగా ఉన్నాడు. వెంటనే వికారాబాద్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాడు. అక్కడికి సూర్యవంశీ రాలేదని తెలియడంతో హతాశుడయ్యాడతను.... ఏం చెయ్యాలో తోచక, స్వయంగా జీపు నడుపుకుంటూ సూర్యవంశీ ఫ్లాట్ కి వెళ్ళాడు.....
    
    అప్పుడు-
    
    రాత్రి 12-40 నిమిషాలు దాటింది.
    
                                                     *    *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS