Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 2

    అది విన్న గోపి తెల్లబోయి చూశాడు.
    "అదేంటండీ... అది మీరు రాసిన పాటే కదా... బూతుగా ఉందని అంటారేంటీ?!..." అన్నాడు గోపి.
    బూతప్ప గతుక్కుమన్నాడు.
    "ఏంటీ?... బూతుగా ఉందని అన్నావా?...సాహిత్యం లోతుగా ఉందని అనబోయి పొరబాట్న అలా అనేసి ఉంటాను... పాడింది చాల్లేగాని... నువ్వికవెళ్లు..." గోపిని ఛీదరించుకుంటూ అన్నాడు బూతప్ప.
    గోపి స్టేజి వెనకాలకి వెళ్లిపోయాడు.
    ఆ తర్వాత మీనా వచ్చి పాడింది.
    "నువ్వు ఇంకాస్త కీచుగా పాడి ఉంటే బావుండేది... ఎందుకంటే నువ్విలా పాడ్తే చాలా దరిద్రంగా ఉంది! నీ గొంతుకి కీచుగా పాడ్తేనే సూటవుతుంది." అని కీచురాణి ఆమెని కామెంట్ చేసింది.
    ఆమె కామెంట్ కీ మీనా కుమిలిపోయింది.
    ఆ తర్వాత పద్మ నీచాతినీచంగా పాడింది. జడ్జీలు ముగ్గురూ తలలు ఊపారుగానీ సరిగమ పప్పారవ్ ఇలా అన్నాడు..." నువ్వు డాన్స్ చెయ్యలేదేం?..."
    "ఇది పాటల పోటీ కదండీ... డ్యాన్స్ చేయమంటారేంటీ?..." యాసగా అంది పద్మ.
    "కానీ ఈ రోజుల్లో పాడేవాళ్లు పాటకంటే డ్యాన్స్ ఎక్కువ చెయ్యాలి!... అలా ఎక్కువ డ్యాన్స్ చేస్తూ కాస్త కాస్త పాడాలన్నమాట!. పాడిందిచాలు గానీ ఇకపోయి కూర్చోవే టస్కులకిడి కుయ్యా!..." అన్నాడు బూతయ్య.
    పద్మ భోరున ఏడుస్తూ స్టేజి వెనక్కి పరిగెత్తి దబ్బున నేలమీద కూలబడింది. మిగతా ముగ్గురు పార్టిసిపెంట్స్ ఆ అమ్మాయికి ఊరుకోబెట్టారు.
    తర్వాత రెండో రౌండ్ ప్రారంభం అయ్యింది.
    మళ్లీ రాజు స్టేజిమీదికి వచ్చాడు.
    "రా రా రాజుగా... రా..." అన్నాడు సరిగమ పప్పారవ్.
    ఆ పిలుపుకి రాజుకి చాలా కోపం వచ్చింది. అయినా కోపాన్ని అణుచుకున్నాడు.
    "ఒరేయ్ రాజుగా... మాయా మాళవ గౌళ రాగంలో కంపోజ్ చేసిన పాట ఏదైన పాడ్తావా..." అడిగాడు సరిగమ పప్పారవ్.
    "ఏంటి?... అలాంటి రాగం నిజంగా ఉందా?..." సరిగమ పప్పారవ్ చెవిలో గుసగుసగా అడిగింది కీచురాణి.
    "నీకు రాగం గురించి తెల్సా?" అంటూ బూతప్ప కూడా పప్పారవ్ ని అడిగాడు.
    "ఏమోనెహె... అలాంటి రాగం ఏదో ఉన్నట్టు విన్నా... నాకూ సరిగా తెలీదు"
    "అసలు మీరు ఏ క్లాసికల్ రాగంలోనూ ట్యూన్లు కట్టరు కదా... మరి రాజుగాడు పడడానికి పాటలలెక్కడి నుండి వస్తాయ్?" మెల్లిగా అడిగింది కీచురాణి.
    "మేము కట్టకపోయి ఉండొచ్చుగానీ పాపం... పాతకాలం మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో ఒకరు ఆ రాగంలో ఏదో పాట కట్టే ఉంటారులే..." అన్నాడు సరిగమ పప్పారవ్.
    రాజు స్టేజిమీద నీళ్ళు నముల్తూ నిల్చున్నాడు.
    "ఏం?... ఆ రాగంలో పాట పాడడం రాదా?..." అడిగాడు సరిగమ పప్పారవ్.
    రాజు తల అడ్డంగా ఊపాడు.
    "సరే... ఏదైన క్లాసికల్ బేస్ ఉన్న పాట పాడు..."
    రాజు"సలలిత రాగ సుధారస సారం!" పాట పాడాడు... ఫరవాలేదు బాగానే పాడాడు.
    "ఏడ్చినట్టే పాడావ్ గానీ... ఇహ వెళ్ళారా టొంగు టొస్కాయ్..." అన్నాడు బూతప్ప.
    రాజుకి కోపం కట్టలు తెంచుకు వచ్చింది.
    "ఏంటండీ...మర్యాదలేకుండా యిష్టం వచ్చినట్టు అవమానిస్తూ మాట్లాడ్తున్నారు?... మీకు నేను పాడే విధానం నచ్చకపోతే నచ్చలేదని చెప్పాండి గానీ... ఇలా అవమానిస్తే ఎలా?" అన్నాడు ముక్కు పొంగించి ఘొల్లుమని నవ్వుతూ.
    అతని మాటలకి సరిగమ పప్పారవ్, కీచురాణి,బూతప్ప, యాంకర్... నలుగురూ పడీ పడీ నవ్వారు.
    "ఓరి నీ అమాయకత్వం కూలా... అసలు నువ్వు ఏనాడైన హిందీ ప్రోగ్రాములు చూశావా?..." నవ్వాపుకుంటూ అడిగాడు సరిగమ పప్పారవ్.
    "లేదండీ... నేను తెలుగు ప్రోగ్రాములే చూస్తాను" అన్నాడు రాజు అయోమయంగా.
    "అలా చెప్పు... హిందీలో ఇలాంటి పాటల పోటీలూ... డాన్స్ పోటీల ప్రోగ్రాములు వస్తుంటాయ్... ఆ ప్రోగ్రాముల్లో అయితే జడ్జీలు పార్టిసిపెంట్స్ ని తిట్టిన తిట్లకి నువ్వయితే ఊరేసుకు చస్తావ్... చెప్పుతో కొట్టడం ఒకటే తక్కువ... అలా బిహేవ్ చేస్తారు వాళ్లు పార్టిసింపెంట్స్ తో... మేం వాళ్లు అవమానించే దాంట్లో పదో వంతు కూడా మిమ్మల్ని అవమానించడం లేదు... మీరెంత లక్కీనో తెల్సా?"
    రాజు అవునా... అన్నట్టుగా అమాయకంగా చూశాడు.
    "ఇంత చెప్పినా అలా చూస్తావేం రా బేవకూఫ్... ఇంక నువ్వెళ్లి వెనకాల చావు!" అంది కీచురాణి.
    రాజు వెళ్లాక గోపీ, మీనా, పద్మాలు కూడా క్లాసికల్ ట్యూన్స్ లో పాడారు.
    వాళ్లని కూడా రెచ్చిపోయి తిట్టారు ముగ్గురూ... నువ్వు అలా పాడావ్... ఇలా పాడావ్. ఏడ్చినట్టు పాడావ్... నీ బొందలా పాడావ్ అంటూ.
    ఆ తర్వాత మరో రెండు రౌండ్లు... డ్యూయెట్ రౌండ్... జడ్జీస్ ఛాయిస్ రౌండు కూడా జరిగాయ్. రౌండ్ రౌండ్ కీ వాళ్లు విజృంభించి నలుగురు పార్టిసిపెంట్స్ నీ ఎగిరెగిరి ఉత్సాహంతో తిట్టారు.. ఈసడించారు... వేళాకోళం చేశారు... హేళన చేశారు. పాపం ఆ నలుగురూ స్టేజిమీద జీవచ్ఛవాలుగా తిరిగారు... అవమానంతో కుమిలిపోయారు.
    చినరికి జడ్జిమెంట్ ఇచ్చే టైం వచ్చింది.
    "మా చేతిలో ఏం లేదు... ప్రేక్షకులు ఎవరు బెస్ట్ సింగర్ అని నిర్ణయిస్తే వారే బెస్ట్ సింగర్... కాబట్టి మీకు యస్సెమ్మెస్ ద్వారా ఓటేసి గెలిపించమని మీరు ప్రేక్షకుల్ని అడుక్కోండి...హిహిహి..."అన్నాడు సరిగమ పప్పారవ్ భుజాలు ఎగరేసి కులాసాగా నవ్వుతూ.
    "ఈ మాత్రం దానికి కొండముచ్చుల్లా మీ ముగ్గురూ ఇక్కడ కూర్చోడం ఎందుకూ?... మమ్మల్ని తిడ్తూ ... అవమానిస్తూ ఉండడానికా?..." అని ఆ ముగ్గుర్నీ బండబూతులు తిట్టుకుంటూ ఈ నలుగురూ వారివైపు పళ్లు నూర్తూ కొరకొరా చూశారు.
    అదిగో... అప్పటినుండీ నలుగురూ ఓట్లు అడుక్కోవడం మొదలయ్యింది.
    పాపం... నలుగురిలోకి రాజే బాగా పాడాడు... కానీ అతనికి ప్రెండ్స్ సర్కిల్ ఏమాత్రం లేదు... బంధువులు కూడా అంతంత మాత్రమే. మీనా, పద్మలకి ఏదో... ఓ మాదిరి సర్కిల్ ఉంది.
    కానీ... గోపీకి మాత్రం... అబ్బో.... చాలా పెద్ద సర్కిల్ ఉంది... అతను ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్పాడు. తనకే ఓటు వెయ్యమని... అతని ఫ్రెండ్స్ మొత్తం అతనే బెస్ట్ సింగర్ గా ఓటు వెయ్యడమే కాదు... వారి ఫ్రెండ్స్ తో కూడా చచ్చేట్టు వేయించారు... గోపికి బంధువులు కూడా ఎక్కువే... గోపీ బంధువులంతా కూడా గోపీకి ఓటేశారు.
    మరో ముఖమైన విషయం... గోపి తండ్రి ఒక ప్రభుత్వ కార్యాలయంలో చాలా ఉన్నతమైన పోస్టులో ఉన్నాడు... ఆయన తన పీయేలకీ, సెక్రట్రీలకీ తన కొడుకు విషయం చెప్పాడు... అంతే... వాళ్లు ఆ ఆఫీసులోని స్టాఫ్ అందరిచేతా గోపీయ్ బెస్ట్ సింగర్ గా ఓటేయించారు. అంతే కాదు... బ్రాంచ్ ఆఫీసుల్లో వారితో కూడా ఓటేయించారు...
    అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ గోపి కులం!... ఆ కులస్థులు అంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువమంది ఉండడంతో కులాభిమానంతో అందరూ గోపికి ఓట్ చేశారు...
    అంతేకాకుండా గోపీ ఇంటింటికీ వెళ్లి తనని తాను పరిచయం చేస్కుని యస్సెమ్మస్ చేసి తనని గెలిపించమని ఓట్లు అడుక్కున్నాడు.
    ఇంకేం... అందరికంటే చాలా నీచ, నికృష్ణ... ఛండాలంగా పాడిన గోపీయే ఉత్తమ సింగర్ గా ఎన్నిక అయ్యాడు.
    "మీరూ గార్ధబమే" కార్యక్రమంలో ఉత్తమ గాయకుడిగా ఎనికైన గోపీకి ఆ ఛానల్ వాళ్లు ఓ సబ్బుపెట్టీ... ఓ పెన్సిలూ... మరో ఎరైసరూ బహుమతిగా ఇచ్చారు.
                                                 *    *    *


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS