Previous Page Next Page 
తప్పు పేజి 2

    దీక్షితులు తేరుకునే సరికి బళ్ళ వాళ్ళు యెదురుచూస్తూ నిలుచున్నారు. అయన చివరి మాటగా కొడుకుతో అన్నాడు.   'పచ్చగా దబ్బపండులా వున్నదని మిడిసి పాటుతో నా మాటని నువ్వు లెక్క జెయ్యడం లేదు. దారిద్ర్యం చుట్టుకున్నప్పుడు ఈ అందచందాలు నిన్ను ఆకలి నుంచి తప్పించవు. ఏదో వుద్రేకంలో పడి కన్న వాళ్ళని కాలదన్నుకుంటున్నావు. రేపు చేతులు కాలేక నా కాళ్ళ మీద పడి ప్రాధేయపడినా ప్రయోజనం లేదు. నేను చస్తూ చస్తూ కూడా నీ మీద వీసం అంత జాలి చూపించను. ఆస్తిని యావత్తూ యే అనాధశ్రమానికో రాసి మరీ గుటుక్కు మంటాను. డబ్బునే కాలదన్నుకునే నీకు దాని అవసరం తెలిసి రావాలని నేను కోరుకుంటున్నాను. యింక ఈ జీవితంలో నీ మొహం నాకు చూపించ నవసరం లేదు. ' భార్యని అయన చూపుల్తో కదిలించాడు. ఆ సమర్ధత ఆవిడ తన పెళ్ళి అయిన పన్నెండేళ్ళ ప్రాయం లోనే గమనించిందికడుపు తీపి అనే పదానికి ఆవిడ చండశాసనుడైన భర్త సమక్షం లో యెన్నడూ కూడా ప్రాధాన్యతని యివ్వలేదు.
    భర్త వెనుకే ఆవిడా అనుసరించింది. విష్ణుమూర్తి చలించలేదు. బళ్ళన్నీ ఒక్కసారిగా కదిలాయి. ఎడ్ల మెడల్లో గంటలు గణగణ లాడుతుండగా ఒక దాని వెంట మరొకటి పరుగు పందాలు వేశాయి. మగ పెళ్ళివారు తరలి వెళ్ళిపోయారు. ఆడపెళ్ళి వారు పెళ్ళి కొడుకు సహృదయత, విశాల దృక్పదానికి మనసులోనే ఆనంద పడ్డారు. గోవిందని అతను నడిపించుకుని లోపలికి తీసుకు వెళ్లాడు. విశ్వనాధం, మీనాక్షి ల మనసుల్లో వెలితిగానే వుంది. బుణ భారానికి తల వొంగినట్లయింది యిద్దరికీ. విశ్వనాధం బావమరిదికి కృతజ్ఞతలు కళ్ళతోనే తెలిపాడు. గోవింద భర్త  యేకాంతంగా వున్న సమయంలో అతని పాదాల మీద చేతులుంచి నెమ్మదిగా అన్నది. 'మీరు ....మీరెంత మంచివారు మీరే యీ విధంగా అదుకోక పొతే మేమేమై పోయే వాళ్ళం.'
    ఆవిడ కన్నీటిని కొనగోటితో మీటి హాయిగా నవ్వాడు అతను! పిచ్చిదానివి నువ్వు, సంబంధం సాప్టపదీనం అని వూరికే అనలేదు మనవాళ్ళు. డబ్బు శాశ్వతం కాదు. గోవిందా, ప్రపంచం లో  మనిషి మనిషిగా నిలబడ గలగాలంటే మానవత్వం వుండాలి.'
    అతని మాటలు వింటుండి పోయింది గోవింద మంత్ర ముగ్ధలా, నాగవల్లీ మొదలైన తంతు కార్యక్రమాలు ముగియగానే పెళ్ళివారు యెక్కడి వాళ్ళు అక్కడికి సరుదు కున్నారు. మూడు నిద్రలు ముగిశాయి. ఆవేళ ప్రొద్దుటే విశ్వనాధం దగ్గరికి వచ్చి విష్ణుమూర్తి విషయం కదిపాడు. నేను వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఇంక వెడతాను. గోవిందని నాతొ బాటు యిప్పుడు పంపిస్తారా బావగారూ!
    విశ్వనాధం తల యెత్తాడు. మీనాక్షి అతను మాట్లాడక ముందే తను కలిపించుకుని అన్నది. 'యీ యింట్లో పెళ్ళి కాగానే ఆవిడ వెళ్ళిపోతే యిల్లు  బిక్కుబిక్కుమంటుంది. కొన్నాళ్ళు సరదాగా మాతో వుంచుకుని పంపిస్తాం.'
    గోవింద అక్కడే నిలుచుని పూర్తిగా విని ' ఆయనకి అక్కడ యెవరూ లేరుట వదినా. హోటల్లో తిని యేరుగరుట, లాంచన ప్రాయంగా అడిగారు కానీ నువ్వు యిక్కడే నిలుచుని నేను వెళ్ళి పోతానని చెప్పు అని నాతొ అన్నారు. నేను కూడా వెడతాను" అన్నది.
    మీనాక్షి విశ్వనాధం మొహా మొహాలు చూసుకున్నారు. చిన్నప్పుడే తల్లినీ తరువాత తండ్రినీ పోగొట్టుకున్న గోవిందని  అన్నావదినలు అపురూపంగానే చూశారు.
    విశ్వనాధం అమలాపురం బాంక్ లో గుమస్తా గా పని చేస్తున్నాడు. తండ్రి కోరిక మీద పేరూరు లో స్వంత యింట్లో పెళ్ళి చేసేందుకు పదిరోజులు సెలవు పెట్టి మరీ వచ్చాడు. జ్ఞానం వచ్చాక గోవింద స్నేహితులతో మీనాక్షి ని గురించీ, విశ్వనాధం గురించి చెబుతూ మా అమ్మా, నాన్నా-- అనేది పదేళ్లు దాటుతుంటే నిజం తెలిశాక వదినా. అన్నయ్యా అనే పిలిచేది. గోవిందకి పన్నెండేళ్ళు రాకుండానే తండ్రి గౌరీపతి కాలం వేసే ముద్రకి లొంగి పోయి తను రెక్కలు విదిలించుకుని పరలోకానికి పరుగులు పెట్టాడు. పల్లెటూరి వాతావరణానికి భిన్నంగా తండ్రి అజ్ఞాని శిరసా వహిస్తూ గోవిందని పెంచి పెద్ద చేశాడు విశ్వనాధం. లోకం కాకుల్లా పొడుస్తున్నా అతను లెక్క చేయలేదు. చెల్లెల్ని బి.ఎ వరకూ చదివించాడు . వుద్యోగం చేయించాలనుకుంటుండగానే లక్షల కదికార్లయిన విష్ణుమూర్తి తల్లితండ్రులతో వియ్యం పొందిందుకు సిద్దం అయేడు. అంత వరకూ తను చెల్లెలి కోసం దాచి వుంచిన ఆరువేలు ముందుగా యిచ్చేసి బాంక్ వాళ్ళని మరి కొంత అడిగాడు. ఆ డబ్బు సమయానికి రాకపోవడం తో అభాసు పాలవలసిన పరిస్థితులు విష్ణుమూర్తి మంచితనం వల్ల సానుకూల పడ్డాయి.
    మర్నాడు మంచిరోజు నిర్ణయించి చెల్లెల్ని సాగనంపేందుకు విశ్వనాధం సిద్దం అయేడు. ప్రయాణం దగ్గర పడగానే మీనాక్షి ఆడపడుచును కౌగలించుకుని కంట తడి పెట్టింది. మీనాక్షి మొక్కని దేవుడూ, చేయని వ్రతం లేదు.అయినా ఆవిడ పురాకృత కర్మ ఫలాన్ని అనుభవించక తప్పలేదు. రెండుసార్లు ఆపరేషన్ చేసి ఫలితం కనిపించలేదు. గోవిందని ఆవిడ అడ్డాల్లో బిడ్డగా పెంచింది. గోవిందకి గతం కళ్ళ యెదుట కదులుతుంటే దుఃఖం ఆగింది కాదు. వీధిలో బండీ సిద్దంగా నిలుచుని గోవింద రాక కోసం యెదురు చూస్తోంది. విశ్వనాధం కళ్ళల్లో మెదిలే కన్నీటిని గోప్యంగా దాచుకునేందుకు వ్యర్ధ ప్రయత్నం చేస్తున్నాడు. విష్ణుమూర్తి వాచీ చూసుకుని 'గోవిందా ' అని కేక వేశాడు. వదిన కౌగిట్లో నుంచి బయటికి వచ్చి అన్నా వదినలకి నమస్కరించి కుడికాలు బండి మీద మోపింది గోవింద. బండివాడు 'చల్' మనగానే ఆగ మేఘాల మీద దౌడు తీసింది గుర్రం దుమ్ము లేపుకుంటూ . వీధి మలుపు తిరిగే వరకూ నిలుచుని గుమ్మానికి చేరగిలబడి పోయి పెద్ద పెట్టున వచ్చే ఎక్కిళ్ల శబ్దాన్ని భర్త వినకుండా చీర చెరుగు అడ్డం వేసుకుని దిగమింగలని ప్రయాస పడుతున్న మీనాక్షి భర్త వెనకగా వచ్చి భుజం మీద చేయి వేసే వరకూ సుషుప్తి లోనికి రాలేక పోయింది.
    అతను భార్య మొహాన్ని తన వేపుకి తిప్పుకుని వోదార్పుగా అన్నాడు. 'మనపిల్ల అయినా అత్తవారింటికి వెళ్ళక తప్పేది కాదు . గోవిందని మనం యెలా చూశామో నీకు తెలుసును. భగవంతుడికి కూడా తెలుసు. తల్లి లేని పిల్ల పట్ల నిర్లక్ష్యంతో మనం పెంపకం విషయంలో యే మాత్రమైనా హెచ్చు తగ్గులతో ప్రవర్తిస్తాం అనుకున్నాడో యేమో . మనకి పిల్లల్ని లేకుండా చేశాడు. పిల్లలు లేరనే విచారం నాకు లేదు మీనాక్షి గోవిందే మగపిల్లాడు అయి వుంటే మన కళ్ళ యెదుట వుండేవాడు'. ఆడపిల్ల అయి అత్తవారింటికి వెళ్ళి పోయింది.'
    'ఛ! అసుర సంధ్య వేళ ఏడవకూడదు. గోవిందకేం యెంత అదృష్ట వంతురాలు. ఎక్కడున్నా మన పిల్ల కాకుండా పోతుందా!'
    మీనాక్షి కళ్ళల్లో నీళ్ళు అవిరామంగా కారుతూనే వున్నాయి. భర్త వోదార్పుమాటలు వుపశాంతిని యివ్వలేదు. తన గుండెల్లో చిన్నారి చేతుల్తో మొత్తిన గోవింద యివాళ యెదిగి అత్తవారింటికి వెళ్ళిపోవడం బాకులు గుచ్చినట్లుగానే వుంది. భర్త గుండెల్లోకి వాలిపోయి తనివితీరా ఏడ్చింది మీనాక్షి. ఆరాత్రి ఆవిడ విస్తరి ముందు నామ మాత్రంగా కూర్చుంది. మరి రెండు రోజులు గడిచే వరకూ మామూలు మనిషి కాలేక పోయింది.
    
                              *    *    *    *
    లోకంలో అనుబంధాలు రకరకాలు కావచ్చును. మనిషి కొన్నిసార్లు తెలిసో తెలియకో తప్పులు చేస్తారు. చేశాక పశ్చాత్తాపంతో ప్రక్షాళనం ఆయె వ్యక్తులు నూటికి ఒకళ్ళో యిద్దరో కావచ్చును ప్రపంచంలో-- తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తప్పని ఒప్పుకున్నా సమాజం సానుభూతి చూపించదు. కారణం సమాజం కనుక. తప్పుని ఒప్పుగా నగిషీలు చెక్కి చూపిస్తే సగర్వంగా ఆమోదిస్తుంది. అభినందిస్తుంది. కిరీటం పెట్టి మహారాజుని చేస్తుంది. నిజానికీ అబద్దానికి మాధ్య గల అగాధాన్ని కృత్రిమమైన సాధనాల ద్వారా పూడ్చి వేయవచ్చును. ఒక వెల్లువ ఓకే పడవని ముంచే ప్రయత్నంలో మరో వెల్లువ వొడ్డుకు చేర్చవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం అయింది భగవంతుడు ఆడించే నాటకం తాలూకు రంగాలు. నేను చేస్తున్నాను అనేకన్నా దేవుడు చేశాడు అనుకుంటే మనిషి అంతరాత్మకి తృప్తే ఆనందం.
    "నన్ను పెళ్ళి చేసుకో గౌరీ పతీ ఎన్నాళ్ళీ చాటు మాటు బ్రతుకు. నాకీ నీతిమాలిన పనులు చేస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలని వుంది, పెళ్ళి చేసుకుంటే సంఘం మనకి యిచ్చే గౌరవం మర్యాదా యెంత వున్నతంగా వుంటాయో ఆలోచించు. ప్లీజ్, కంటికీ మింటికీ యేకధారగా యేడుస్తూ అతని పాదాల్ని అంటుకుని ప్రార్ధిస్తుంది అన్నపూర్ణ. ఆ పిల్ల కన్నీటి తాలుకూ బిందువులు భూమిలోకి యింకి పోతున్నాయి. ఆవిడ గోడు వినేందుకు యెవరూ లేకపోయినా భూదేవి మాత్రం వోర్పుగా కన్నీటిని తనలో అయిక్యం చేసుకుంటోంది.
    గౌరీ పతి దిగ్బ్రాంతుడయ్యాడు. అన్నపూర్ణ యిలా అడుగుతుందని అతను కలలో కూడా అనుకోలేదు. నిశితంగా ఆ పిల్ల వైపు భ్రుకుటి ముడివేసి చూడసాగాడు. అన్నపూర్ణ అందరి ఆడపిల్లల మాదిరిగా లేదు. విధాత ఆదమరిచి యే దేవలోకాల్లోనో విహరించాల్సిన ప్రతిమని ఈ భూలోకం లోకి పంపెడేమో అనిపిస్తోంది. అందం అనేక రకాలు కావచ్చును. అన్నపూర్ణ అందం తాచు పాము పోలికలా వుంది. గోధుమ వన్నె త్రాచుపాము పడగ యెత్తి సగర్వంగా ఆడుతూ వుంటే బోయవాడు వూరుకోలేక పోయాడు. పట్టుకుని బుట్టలో వేసుకుని సంపాదనకి బయలుదేరాడు. కోరలు తెగిపోయాక, జవసత్వాలు వుడిగినదాన్ని కృతఘ్నుడై అడవుపాలు చేశాడు.
    అన్నపూర్ణ పరిస్థితి యిప్పుడు సరిగా అదే విధంగా వుంది. గౌరీపతి దిక్కులు చూస్తుంటే కుదిపి కుదిపి అడిగింది. అతను మాట్లాడలేదు. జవాబు చెప్పేందుకు అతని దగ్గర అక్షరాలే కరువై పోయాయి. అన్నపూర్ణ ఏడుస్తుంటే కనీసం కన్నీరు తుడిచేందుకు కూడా చేతగాని వాడై పోయాడు ఆ క్షణంలో.
    'యిన్నాళ్ళూ నన్ను వూరించి చివరికి యింత దగా చేయడం న్యాయం కాదు గౌరీ పతి. నన్ను పెళ్ళి చేసుకో. నాతొ సుఖపడ్డ మనిషిని కలకాలం కాపురం చేసేందుకు దేనికి జంకుతున్నావు.'
    తలయెత్తి అతను నెమ్మదిగా అన్నాడు: 'నీకు తెలియదా అన్నపూర్ణా. నేను సద్భ్రాహ్మణుల యింట్లో పుట్టానని.'
    అతను విసిరిన కంకర్రాయి ఆ పిల్ల కణతకి తగిలింది. అవాక్కయి బిత్తరపోయి చూస్తుండి పోయింది. అతని వైపు లిప్తపాటు. తోకతొక్కిన త్రాచులా అతని వైపు చూస్తూ అతని గుండెల్లోకి తలదూర్చి నిగ్రహంగా తనను తానూ తమాయించుకుంది. 'బ్రాహ్మణులు యెంత మాట వుపయోగించావు. క్లబ్బుల్లో తెగత్రాగి, మా యింట్లో నీచు మాంసాలు తిని చివరికి నన్ను యేలుకునే విషయంలో ఏం ప్రయోగం చేశావు, నీ బ్రహ్మణ్యం ఏం నేర్పింది గౌరీపతి. ఆడపిల్ల అందంగా కనిపిస్తే అనుభవించి వదిలేయమన్నదా. పెళ్ళీ పెడాకులూ లేకుండా గుంభనంగా వ్యవహరించ మన్నదా. యిప్పుడు నేను వట్టి మనిషిని కూడా కాదు. కాలంతో బాటు మనుషులు మారాలి. యింత చదువు చదివేవు. నన్ను అన్యాయం చేయమని నీ అంతరాత్మ చేబుతోందనే అంటావా? నిన్ను నమ్ముకుని నీ వలలో పడి నేను యిప్పుడేలా బయట ప్రపంచానికి మొహం చూపించను? యింత విషం యివ్వు గౌరీ పతీ. నీచేత్తో యిచ్చావనే తృప్తిగా మింగి చచ్చి పోవడం లో నాకు ఆనందంగా వుంటుంది!'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS