మిధ్య
-శిఖా వెంకట రమణా రాజా

కూలిపోయి రెండు చేతుల మధ్యా తల ఉంచుకుని, గుండెల్లో చెలరేగే సాగర మదనాన్ని అరికట్టుకోలేని ప్రయత్నం లో జ్ఞాపకాలు తవ్వుకుంటూ వెనక్కి వెనక్కి పద్దెనిమిది పందొమ్మిది సంవత్సరాల మధ్య ఆగిపోయింది.
* * * *

"చూడు, మహేశ్వరీ, చంటిపిల్ల ఏడుపులా ఉంది. ఇంట్లో ఎవరూ లేరా? లేక ఉండే పట్టించు కోవడం లేదా? ఒక్కసారి వెళ్లి చూసివస్తే ఏమౌతుందోయ్? రెండు మూడు రాత్రులుగా ఆ పిల్ల గొంతు తడారి పోయేలా ఏడుస్తుంది. నీకు వినిపించడం లేదుటోయ్?" భార్య పక్కనే ఒత్తిగిలబోతూ ఆ పిల్ల ఏడుపు హృదయాన్ని రంపపు కోతలా బాధ పెడుతుంటే నిద్ర పోతున్న ఇల్లాలిని కుదిపి తెలివి వచ్చేవరకూ లేపి తన బాధని చెప్పుకుని ఉపశమనం పొందేడు చంద్రశేఖరం.
"ఇప్పుడే అర్ధరాత్రి .....ఏడుస్తే ఏడవనివ్వండి. నిద్ర ముంచుకు వస్తుంది. నేను ఇప్పుడు వెళ్లి అవన్నీ వాకబు చేయలేను!" మహేశ్వరి ఆవలింత కు చిటిక వేస్తూ ఒళ్ళు విరుచుకుని వెనక్కి వాలిపోయింది. ముంచుకు వస్తున్న నిద్రకి కళ్ళు మూతలు పడి పోతున్నాయి. ఎంత ప్రయత్నించినా తెరుచుకోవడం లేదు. మహేశ్వరి , చంద్రశేఖరం కూడా విఫలుల యేరు. ఆ పిల్ల ఏడుపు అనంతాకాశం లో ప్రతిధ్వనిస్తూ దిగంతాల వరకూ వ్యాపించ సాగింది. కొంత సేపయేక జోల పాట వినిపించింది. మృదుమధుర మైన ఆ గొంతులో ఆ పిల్ల ఏడుపు శృతి లా కలిసి ఇటు పాటకీ, అటు ఏడుపు కీ కూడా మార్దవం తెచ్చి పెట్టింది. చంద్రశేఖరం లేచి వెళ్లి కిటికీ ఊచలు పట్టుకోవడం పాటకు తెలివి వచ్చిన మహేశ్వరి గమనించింది.
"నా చిట్టి తల్లి! ఏడవకు , మా అమ్మవిగా!' అతని గొంతు నిండిపోయిన కుండలా తొణికిసలాడుతుంది -- దుఃఖ భారం తోనో, లేక పొడి పొడి అలిసి పోవడం వల్లనో. మహేశ్వరి పక్క మీంచి లేచి కూర్చుని స్టూలు ఆసరాగా చేసుకుని పట్టి మంచం దిగి భర్త వెనకే వచ్చి అయన భుజం మీద చేయి వేసి తన వైపు తిప్పుకుంది. చంద్రశేఖరం కళ్ళు చెమ్మ గిల్లెయి. నూనె దీపం కాంతి లో నీటిలో చేప పిల్లల్లా తళతళ లాడుతున్నాయి. అయన భార్య మొహం లోకి చూస్తూ, "నా అంచనా అబద్దం కాకపొతే బహుశా అయన భార్యా వియోగం పొంది ఉంటాడు. చూడు, ఆ కంఠం లో ఎన్ని అపశ్రుతులో! పగ వాళ్ళకి సైతం వద్దు, మహేశ్వరి, ఈ శిక్ష . భార్యా భర్తలో ఎవరు ముందు పోయినా రెండో వాళ్ళు జోడు గుర్రం లేని గుడ్డి గుర్రం లా జీవిత రధాన్ని ఈడ్చే ప్రయత్నం లో ఎదురు దెబ్బలు తినాలి. తల్లి లేని పిల్ల స్థితి చాలా హృదయ విదారకమైనది. మగవాడి కేం తెలుస్తుంది పసి పిల్లల్ని పెంచడం? పాపం!" అంటూ నిట్టుర్చేడు.
"ప్రపంచం లో చాలా మందే ఉంటారు ఇలాంటి వాళ్ళు. అందర్నీ ఉద్దరించడం మన వల్ల ఆయె పనా. చెప్పండి? ఆ పిల్ల ఏడుస్తున్నదంటే అది దాని ఖర్మ!" మాట పూర్తీ చేయక ముందే దెబ్బతిన్న దాని మాదిరిగా ఉలిక్కి పడింది మహేశ్వరి. తొట్టె లో పిల్లడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు. పరుగున అక్కడికి చేరుకొని పిల్లాడిని భుజం మీద వేసుకుని సముదాయించే ప్రయత్నం లో ఉండిపోయింది. చంద్రశేఖరం తొట్టె దగ్గరగా వచ్చి పరువు పైకి ఎత్తాడు. నల్లటి కుండ చీమ తన పని అయిపోగానే కమ్మీల మీంచి దాటుతుంది. భార్యకి చూపించి, "ఇది వాడి ఖర్మ!" అన్నాడు.
పిల్లాడు తల్లి ఒడిలోకి చేరగానే ఏడుపు ఆపేశాడు.
చంద్ర శేఖరం భార్య కి దగ్గిరగా కూర్చుని, "ఈ మహాత్తంతా స్త్రీ ఒడిలో ఉంది, మహేశ్వరీ. నువ్వు వెళ్లి ఆ పిల్లని తీసుకురా. నీకు తోడుగా నేనూ వస్తాను." అన్నాడు. భర్త మొహం లోకి క్షణం చూసింది. తల్లి లేకుండా సవతి తల్లి నిర్దాక్షిణ్యపు శిక్షణ లో కష్టాల బరువుకి క్రుంగి పోకుండా తనంతటి వాడు తాను అయేడు చంద్రశేఖరం. అతనిలో మామూలు మనుషులకీ, అందులో మగవారికీ , ఉండే జాలి కన్నా చాలా ఎక్కువే కలిగంది. ఐశ్వర్యాన్ని కౌగలించుకుని, అందం, గుణం వీటిని నరనరాల్లోనూ స్వంతం చేసుకుని పెరిగిన అతను అవిటి వాడయేడు. నిజానిజాలు తెలియవు కానీ సవతి తల్లి ఆపద్యం చేయించడం లో అతనికి రెండు కాళ్ళలోనూ పటుత్వం లేకుండా పోయిందని లోకం అంటుంది. ఆ స్థానం లో కర్రకాళ్ళు ఉన్నా అవి ఎంత స్థిరంగా ఉన్నాయో అతనిలో అభిజాత్యం , అభిమానం , మంచీ , మర్యాద అంతే స్థిరంగా ఉన్నట్లు చాటి చూపుతున్నాయి. "మీరు.....!" మహేశ్వరి తటపటాయించి అన్నది: "మీరు కూడా ఎందుకు? రంగని తీసుకు వెడతాను. బాబుని ఉయ్యాల్లో పడుకో పెడతాను. చూస్తూ ఉండండి." అన్నది.
బండార్లం కలో అతనికి దాదాపు ఏభై ఎకరాల పైనే బంగారం పండించే సుక్షేత్రం, పాతిక ఎకరాల కొబ్బరి తోట ఉన్నాయి. ఊళ్ళో అందరికీ తలలో నాలుక ఉండే చంద్రశేఖరం ఊరి పెద్దగానే చలామణీ అవుతున్నాడు. అయన సాత్త్వికుడైతే . అయన ఇల్లాలు సాద్వి అనుకుంటారు పేద జనం. పేద విద్యార్ధులకి చదువు చెప్పిస్తూ, వారాలు ఇప్పిస్తూ అనునిత్యం పెళ్లి వారిల్లులా చేసుకున్నాడతను తన ఇంటిని. సవతి తల్లికి పిల్లలు లేని కారణంగా ఆవిడ మరణానంతరం ఆస్తి మొత్తం అతని కిందకే వచ్చింది. ఎన్నో చికిత్సలూ, పేరు పొందిన సర్జన్లూ, మహా పట్టణాల్లో ఉన్న హాస్పిటళ్ళూ అతనికి పోయిన కాళ్ళని తిరిగి రప్పించ లేకపోయేయి.
పిల్లాడికి పాలు ఇచ్చి మహేశ్వరి నౌకరు ని వెంట తీసుకుని రగ్గు ఒంటి నిండా కప్పుకుని ఆభరణాలు ఘల్లు ఘల్లు మంటుంటే లక్ష్మీదేవిలా కదిలి, రెండిళ్ళ అవతలే ఉన్న పెరటి ద్వారం గుండా బయలుదేరి చాలా త్వరగా ఆ ఇల్లు చేరుకొని తలుపు తట్టింది.
నౌఖరు ఆవిడ వెనకే వెళ్ళాడు. తలుపు తెరిచి "చీకట్లో ఎవరూ?' అని ప్రశ్న వేశాడు ఇంటి యజమాని. "నేను!" క్లుప్తంగా జవాబిచ్చింది. అతను తలుపు పూర్తిగా తీసి, "రండి" అన్నాడు ఆదరంగా. పిల్ల గుక్కపట్టి ఏడుస్తున్నది. గదిలోకి వెళ్ళేక ఆవిడే అడిగింది. "పాప ఏడుస్తుంది. ఇంట్లో ఎవరూ లేరా?"
అతని వైపు నుంచి వెంటనే జవాబు రాలేదు.
హరికేన్ లాంతరు స్తంబాని కున్న మేకు ఆధారంగా మిణుమినుకుమంటూ వేలాడుతుంది. నిశ్శబ్దం నృత్యం చేస్తుంటే మరోసారి గొంతు సవరించుకుని , "పాప తల్లి లేరాండీ ఇక్కడ?' అన్నది.
అతను దీర్ఘంగా నిట్టుర్పు విదిచేడు. "పాప తల్లి......" అతని మాటలు దూది పింజల్లా తెలిపోతున్నాయి. "పాప తల్లి ఇక్కడ కాదు, ఈ లోకం లోనే లేదు."
"అయ్యో! ఎన్నాళ్ళు అయింది పోయి?"
"పురిట్లో నే."
మహేశ్వరి మాట్లాడ లేకపోయింది. ఏమని సమాధానం ఇవ్వాలో, ఏ విధంగా ఊరడించాలో ఆ క్షణాన అర్ధం కాలేదావిడకి. రెండు చేతుల్లోకి తీసుకుని గుండెల్లో కి అదుముకుంది. గుండెల్లోంచి మాతృత్వం పెల్లుబికి పాతాళగంగలా భూదేవిని చీల్చుకుని పైకి వచ్చి బ్రద్దలై నట్లు మహేశ్వరి వక్షఃస్థలం తడిసి పోయింది. "పాపని నేను తీసుకు వెడతాను. పాప పేరు చెప్పేరు కాదు."
