రాజారావు కళ్ళల్లో భయం కనబడింది. తను అనుమానించినంతా అయిందనిపించి అతనికి కంగారు కలిగింది.
రాజారావు ముఖం చూసిన వెంకట్రామయ్యకు అసంతృప్తి కలిగింది. తన శ్రమను కొడుకు గుర్తించలేదన్న బాధతో అయన "బసవరాజుగారమ్మాయికి ఇరవై రెండేళ్ళు నిండిపోయాయి . నాలుగేళ్ళుగా ప్రయత్నిస్తున్నారు. ఇంకా సంబంధం స్థిరపడలేదు. వీరభద్రంగారమ్మాయి కి పన్నెండు వేలు కట్న మిస్తే గానీ పెళ్ళి కుదర్లేదు. ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ కట్నంలో - ఇంత తక్కువ వయస్సులో అమ్మాయికి కుదిరిన పెళ్ళి ఈ జిల్లా మొత్తానికిదొక్కటే " అన్నాడు.
నాలుగు డబ్బులున్న ప్రతివాడినీ సార్వబౌముడిగా పొగిడే సంప్రదాయ కవిత్వం - సహజంగా అబ్బిన వెంకట్రామయ్యకు అతిశయోత్తులు కరతలామలకం.
రాజారావు పరిస్థితి అర్ధమై పోయింది. తండ్రి ఊహ జీవి. ఇటీవల తను సాధించిన విజయం కలిగించిన మత్తులోంచి ఆయనింకా విడిపడలేదు. ముందు సంగతి గురించి ఆయనింకా అలోచించి నట్లు లేదు.
"నిజమే ననుకోండి నాన్నా - మీరు కాబట్టి ఈ సంబంధాన్ని కుదర్చగలిగారు. మీ మంచితనం, మీ తెలివితేటలు - లక్ష్మీ భవిష్యత్తుకు బంగారు బాటను వేయగలవని ఆశిద్దాం. ప్రస్తుతం ముందు జరగవలసిన పని గురించి ఆలోచించాలి కదా - మనకిప్పుడుడెంత డబ్బు కావాలన్నది ముందుగా చూసుకోవాలి ...."
రాజారావేదో చెప్పబోతుండగా ---'అన్నట్లు మనకిప్పుడు అర్జంటుగా ఆరు వేల రూపాయలు కావాలి - కట్నం డబ్బు అడ్వాన్సుగా ఇస్తానని మాటిచ్చాను. ఎందుకంటె ఆ డబ్బుతోనే వాళ్ళు లక్ష్మీకో గొలుసు చేయిస్తారు. కొన్ని బట్టలు కొంటారు. ఇంకా ఇతర ఖర్చులకు అవసరపడతాయి.....ఈ విషయంలోనే వాళ్ళకు నేనుత్తరం వ్రాయవలసి ఉంది. ఇప్పటికే ఆలశ్యమై పోయింది...." అన్నాడు వెంకట్రామయ్య.
రాజారావు కంగారుగా ----' అలశ్యమంటున్నారు. వాళ్ళు కానీ మీ కుత్తరం రాశారా ఈ విషయంలో ---' అన్నాడు.
"అవును - వచ్చి వారం రోజులయింది....' అన్నాడు వెంకట్రామయ్య తాపీగా.
"వెంటనే జవాబు రాసేయవలసినది ....' అంది విరజ వీలైనంత నెమ్మదిగా.
వెంకట్రామయ్య ముఖంలో చిరాకు కనిపించింది ---" మీరు రానిదే నేనేం చేయగలను. మీరు వచ్చేక - ఏదో విధంగా ....' అని వెంకట్రామయ్య అంటుండగా.....
"ఇంట్లో డబ్బెంతుంది ?" అనడిగాడు రాజారావు. ఇంతసేపూ ఈ ప్రశ్న అడగడానికే అతను సంకోచిస్తున్నాడు.
"బాగుంది . డబ్బుండడానికి నాకేమైనా నెల జీతాలా ఏమన్నానా. నా దగ్గర పైసా లేదు ----" అన్నాడు వెంకట్రామయ్య.
రాజారావు గుండె గుబీలుమంది. పెళ్ళి కింక సరిగ్గా ఇరవై మూడు రోజులు టయిముంది. ఇంతవరకూ ఏపనీ ఆరంభించబడినట్లు లేదు. పనుల సంగతలాగుంచితే డబ్బు - ఎక్కడ్నించి వస్తుంది? ఎలా వస్తుంది?
హటాత్తుగా రాజారావుకేదో గుర్తు వచ్చింది ---' అన్నట్లు ఎవరో నాలుగువేల రూపాయల బాకీ తీర్చినట్లున్నారు ....' అన్నాడతను . ఇలా ఎక్కుదీయవలసిరావడం అతనికి బాధగానే ఉంది.
వెంకట్రామయ్య ఇబ్బందిగా ముఖం పెట్టేశాడు ----' నన్ను గురించి మీరేమనుకున్నా సరే - నేనేం చేయలేను. సంపదలో పుట్టి పెరిగాను. అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే వంశం నాది. జైలు పాలు కాబోతున్న ఒక మనిషిని కాపాడ్డానికి నాలుగువేలూ ఇచ్చాను. ఆ డబ్బివ్వకాపోతే అతని ఉద్యోగం ఊడి జైలు పాలు కావడమే కాక అతని సంసారం దిక్కులేనిదై పోతుంది. ఎలాగూ ఆ నాలుగువేలూ అనుకోకుండానే వచ్చాయి . అనుకోకుండానే పోయాయి. ఈ మానవత్వం మీ కర్ధం కాదు----"
రాజారావుకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. అతని కళ్ళముందు రకరకాల దృశ్యాలు మేదుల్తున్నాయి. ఒక దృశ్యంలో తండ్రిని దేవుడిగా కొలుస్తున్న ఒక సంసారం, రెండో దృశ్యంలో "ఈ పెళ్ళి జరగదు ?" అంటున్న భీమరాజు.
తండ్రి నిజంగానే గొప్పవాడు. ఆయనకు స్వపర భేదం లేదు. అందరి కష్టాలు ఆయన్ను కదిలిస్తాయి. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆయనకూ కొన్ని బాధ్యతలుండవా? కన్న కూతురి పెళ్ళి విషయంలో - పెళ్ళి నిశ్చయం చేయడం వరకేనా అయన బాధ్యత?
వీలైనంత సౌమ్యంగానే అన్నాడు రాజారావు ---"నిజమే నాన్నా- మీ మానవత్వం మాకర్ధం కాదు . కానీ మీరు చేసిన ఈ పని వల్ల మీ కూతురి పెళ్ళి ఆగిపోతే ...."
వెంకట్రామయ్య నవ్వాడు --- "సంపాదించుకుంటున్న చెట్టంత కొడుకులున్నారు. నాకేం భయం. తర్వాత మీకో విషయం తెలియదు. ఈ ప్రపంచంలో అన్నీ తన ప్రయత్నం వల్లనే జరుగుతున్నాయని మనిషి అనుకుంటే అది వాడి అజ్ఞానం. దేవుడనేవాడొకడున్నాడు. మనం చేసే ప్రతి పనినీ చూస్తూనే ఉంటాడు. ఏం జరిగినా అయన సంకల్పం లేనిదే జరగదు. అయన సంకల్పమున్నది కాబట్టే లక్ష్మీకి పెళ్ళి నిశ్చయమయింది. ఏ విఘ్నాలు లేకుండా ఈ పెళ్ళి జరిగి తీరుతుందని నాకు నమ్మకముంది. మీరేమీ కంగారుపడకండి. అన్నీ అవే జరిగిపోతాయి ----"
విరజ ముఖం మాడ్చుకుని కూర్చుంది. 'సరే అయితే నేను కలకత్తా పోతాను. దైవసంకల్పం వల్ల జరగబోయే ఆ పెళ్ళికి చూడ్డానికి ముహూర్తం టైముకి వస్తాను -----" అన్న మాటలు ఆమె కళ్ళలో కనబడ్డాయి రాజారావుకి. అతను తండ్రి వంక చిరాగ్గా చూసి ----"మీరు చెప్పింది కాదనను. కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా ---" అన్నాడు.
"కూడదని నేననలేదు. భయంగా బెంగగా ఉండడం వల్ల ప్రయోజనముండదంటున్నాను. ధైర్యంగా ఉత్సాహంగా ఉండమంటున్నాను.....' అన్నాడు వెంకట్రామయ్య.
తండ్రి చెప్పింది సబబేననిపించింది రాజారావుకి -----"మీరు చెప్పింది బాగానే వుంది . ఇప్పుడెం చెయ్యాలో మీరు చెప్పండి ---"
వెంకట్రామయ్య క్షణం అలోచించి -----"అర్జంటుగా ఆరువేల రూపాయలు తీసుకుని హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలశ్యమైపోయింది....' అన్నాడు.
"నా దగ్గర - సుమారు మూడు వేల రూపాయలున్నాయి ...." అన్నాడు రాజారావు.
"నేనో వెయ్యి తీసుకొచ్చాను. మిగతా డబ్బు అన్నయ్య తీసుకొస్తారు....' అంది విరజ.
వెంకట్రామయ్య ఆలోచనలో పడ్డాడు. విరజ రాజారావు వంక చూసి ----' అన్నయ్య అయిదువేల వరకూ తీసుకు రావచ్చు. మన మిప్పుడు మొత్తం పెళ్ళి ఖర్చెంతవుతుందో చూస్కోవాలి కేగదా ----" అంది.
"పెళ్ళి ఖర్చంటే ---మొత్తం తంతులన్నీ తెలియాలి-----" అంటూ రాజారావు తన పెళ్ళి గురించి గుర్తు చేసుకుందుకు ప్రయతిన్త్సున్నాడు. అప్పటికి అతని వివాహమై ఆరు సంవత్సరాలు కావస్తోంది. ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన తన పెళ్ళి విశేషాలు గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది విరజ. వెంకట్రామయ్య గారు మాత్రం ఎనిమిదేళ్ళ ఆఖరి కూతుర్ని పిలిచి ---' సోమయాజులు గారింటి కెళ్ళి నేను రమ్మన్నానని ఆయన్ను తీసుకురా--' అన్నాడు.
తన అసహనాన్ని రాజారావు మనసులోనే అణచుకున్నాడు. ఈ పని తండ్రి చాలా ముందుగానే చేసి ఉండాల్సిందనిపించిందతనికి. పదే పదే అలా అనుకుని ప్రయోజనం లేదని తెలిసి కూడా అనుకోకుండా ఉండలేకపోతున్నాడు తను. శక్త్యుత్సాహ లురకలు వేసే వయస్సతనిది. పొంగుచల్లారిన వయసు వెంకట్రామయ్యది. ఆలోచనల్లో రెండుతరాల బేధ మెప్పుడూ వారిమధ్య ఉంటుంది.
సోమయాజులు వచ్చేక వాళ్ళు పెళ్ళి తంతుల గురించి మాట్లాడేరు. సోమయాజులు గారితో ఒక చిన్న ఇబ్బంది వుంది. ఆయనకు వెంకట్రామయ్య గారంటే విపరీతమైన గౌరవమూ , రవంత భయమూ కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో పెళ్ళి తంతులన్నీ యధావిధిగా అందరిళ్ళలోనూ జరగడం లేదు. ఎవరి శక్తి కొద్ది వాళ్ళు తంతుల్ని జరిపిస్తున్నారు. అయితే ముఖ్యమైనమంటూ కొన్ని ఉంటాయి గదా - అవేమిటో సోమయాజులు గారితో మాట్లాడి తెలుసుకోవడం కష్టమైంది.
