Previous Page Next Page 
పెళ్ళి చేసి చూడు పేజి 10


    ఏదేమయినా అతను వెంటనే తన కార్యక్రమాన్ని వివరిస్తూ ఉత్తరం వ్రాసి పారేశాడు. జూన్ అయిదో తేదీ వరకు సెలవు పెట్టెనని కూడా రాశాడు. ఈలోగా అతనికి మోహనరావు దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. తను మే పదిహేనో తారీఖు ప్రాంతంలో వస్తాననీ - ముందుగా భార్యను పంపిస్తున్నాననీ వ్రాశాడు. రాజారావు వదిన కూడా అతను బయల్దేరే రోజునే అదే ట్రయిన్లో కలకత్తాలో బయల్దేరనున్నది.
    అన్నయ్య రావడం లేదని నిరుత్సాహ పడ్డ వదిన వస్తోందన్న వార్త రాజారావుకు చాలా ఆనందాన్ని కలిగించింది. వయసులో అట్టే పెద్దది కాకపోయినా విరజ చాలా తెలివైనది. అరిందలా వ్యవహారాలు చూడగలదు. అన్నయ్య వచ్చే లోగా తనూ వదినా కలిసి చాలా వ్యవహారాలు చక్క బెట్టగలమని రాజారావు భావించాడు.
    ఒకసారి ప్రయాణం నిశ్చయమయ్యే క రోజులు గడవడం కష్టమైంది రాజారావు . బరువుగానే అయినప్పటికీ మొత్తం మీద రోజులు గడిచి ఒకటవ తేదీ రాత్రి వచ్చింది.
    చాలాకాలపు విరహానంతరం భార్యను చూడబోతున్నానన్న ఆనందమూ, తమ ఇద్దరి సంసార జీవితానికి ప్రతి బింబమైన పుత్రుణ్ణి చూడబోతున్నానన్న ఉద్వేగమూ, చెల్లెలి పెళ్ళి విషయంలో ఇంటి వద్ద పరిస్థితి లేలా వున్నాయో అన్న బెంగా - రాజారావు మనసులో పరుగు లేడుతుంటే పట్టాల మీద ట్రయిన్ పరుగులేడుతోంది.

                                                 8
    విరజ , రాజారావు వేర్వేరు కంపార్టుమేంట్లలోంచయినప్పటికీ ఒకే ట్రయిన్ లోంచి దిగారు రాజమండ్రి ప్లాట్ ఫారం మీద. స్టేషన్ కు శ్రీకాంత్ వచ్చాడు.
    "వెంటనే లాంచీల రేవుకు వెళ్ళిపోదాం---" అంది విరజ.
    శ్రీకాంత్ టైము చూసి -----" ఇప్పుడు రెండు నలభై అయింది. ఎలాగూ బొబ్బర్లంక లాంచీ నాలుగు గంటల వరకూ లేదు- నేను సామాను తీసుకుని లాంచీల రేవుకు వెళ్ళిపోతాను. మీరుకాస్త టిఫిన్ తీసుకుని నెమ్మదిగా బయల్దేరి రండి --' అన్నాడు.
    మోహిని తనకాకలేస్తోందంది. రాజారావు ప్రశ్నార్ధకంగా వదిన వంక చూశాడు. విరజ కళ్ళలోనే అతనికి సమాధానం కనిపించింది. ఇంటికి వెళ్ళాలని ఆత్రుతగా ఉందామెకు . రాజారావుకూ అంతే - కానీ గంటన్నర సేపు లాంచీల రేవులో పడిగాపులు పడే బదులు అదే మంచిదని అతనికి తోచింది.
    శ్రీకాంత్ సామానుతో వెళ్ళిపోయాడు. విరజ ఎనార్ధం వయసున్న మోహిని, రాజారావు కలిసి స్టేషన్ కు దగ్గరలోనే ఉన్న హోటల్ కు వెళ్ళారు. హోటల్లో విరజ రాజారావుకు చెప్పింది -- అన్నయ్య నీకు చెప్పినట్లు పదిహేనో తేదీకి కాక ముందుగానే వచ్చేస్తున్నారు. ఏడో తేదీ సాయంత్రానికే వచ్చేస్తారు ----"
    'అదేం?" అన్నాడు రాజారావు.
    "ముందు సెలవు దొరకలేదాయనకు. కానీ మనింటి సంగతి ఆయనకు తెలుసు కదా. చాలా గట్టిగా ప్రయత్నించారు. మొత్తం మీద పని అయింది. సెలవు కాస్త ముందుగా పెట్టుకునే అవకాశం వచ్చింది ----"
    "ఈ వేళ రెండో తేదీ . అంటే మరో ఆరు రోజుల్లో అన్నయ్యోచ్చేస్తాడన్న మాట----"
    మోహిని కోకాకోలా అడిగింది. రాజారావు రెండు కోకాకోలా చెప్పాడు సర్వర్ కి. అతనికి కోకాకోలా సహించదని తెలిసిన విరజ -- "రెండోది నీకయితే చెప్పు. నేనిప్పుడు కోకాకోలా తాగలేను -' అంది . రాజారావాశ్చర్యపడ్డాడు. విరజకు కోకాకోలా అంటే విపరీతమైన ఇష్టం. ఒకేచోటయితే బాగుండదని - షాపు కొకటి చొప్పున ఒకోసారి ఆమె అరడజను కోకాకోలా వరుసగా తాగిన సందర్భాలున్నాయనీ మోహనరావు చాలాసార్లు చెబుతుండేవాడు.
    మనసులో కంగారు, భయము ఉంటె అన్ని రుచులూ నశిస్తాయని రాజారావుకూ తెలుసు. వదిన లక్ష్మీ పెళ్ళి విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నందుకు అతనికి చాలా సంతోషంగా వుంది. అయినా వరసకు ఆడపడుచులు కానీ - వాళ్ళు అక్కచెల్లెళ్ళలా మసలుతారు.
    "శ్రీకాంత్ తనకేమీ తెలియదంటూన్నాడు. నాన్నగారు మాత్రం చాలా ధైర్యంగా, ఉత్సాహంగా కనిపిస్తున్నరని అంటున్నాడు --' అన్నాడు రాజారావు ,విరజ మాట్లాడలేదు.
    ఏదో టిఫిన్ తిన్నామనిపించుకుని ఒక రిక్షా బేరమాడుకుని -- ఇద్దరూ లాంచీల రేవుకు చేరుకున్నారు.
    
                                  *    *    *    *

    "వచ్చేరా - రండి రండి -----' అన్నాడు వెంకట్రామయ్య. అయన ముఖం అంతులేని ఆనందంతో వెలిగిపోతోంది. తండ్రి ముఖం చూసిన రాజారావుకు సంతృప్తి కలిగింది.
    'అన్నీ వాళ్ళకు తర్వాత వివరిద్దురు గానీ - ముందు వాళ్ళను కాస్త కాళ్ళూ అవీ కడుక్కుని స్థిర పడనివ్వండి --- " అంది పార్వతమ్మ.
    ఇంటికి వచ్చిన వాళ్ళను కాళ్ళు కడుక్కుంటే కానీ వదిలి పెట్టదు పార్వతమ్మ.
    "కులాసానా అత్తయ్యా ---" అడిగింది విరజ.
    పార్వతమ్మ ముఖం నీరసంగా పెట్టేసింది ------' ఏమిటోనమ్మా గుండె నీరసం ఇంకా తగ్గలేదు.
    రాజారావు నూతి దగ్గరా, విరజ నీళ్ళ గదిలోకి కాళ్ళు కడుక్కుందుకు వెళ్ళారు.
    వెంకట్రామయ్య వాళ్ళ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఇద్దర్నీ కూడా పిలిచేశాడాయన. మోహిని తన అత్తయ్యల దగ్గర కెళ్ళి పోయింది ఆడుకునేందుకు.
    వెంకట్రామయ్య విరజకూ, రాజారావుకూ తను సంబంధం స్థిరపరచిన విశేషమంతా ఒక్క కావ్యం లా వర్ణించి చెబుతున్నాడు. వర్ణన రసవత్తరంగానే వుంది. కానీ - అయన జరిగింది చెబుతున్నాడు- వీళ్ళు జరగబోయేదాని గురించి ఆలోచిస్తున్నారు. అందువల్ల అట్టే అనందించలేకపోయారు.
    'అంటే కట్నం ఏడు వేల అయిదు వందలన్నమాట " అన్నాడు రాజారావు.
    "కాక అప్పగింతల బట్టలున్నాయి --" అంది విరజ.
    "అవును- వాళ్ళ కుటుంబానికి మాత్రమే -----' అన్నాడు వెంకట్రామయ్య.
    'అంటే - అయిదుగురాడపిల్లలు, అయిదుగురు మగపిల్లలు, తల్లీ, తండ్రి....' అని లెక్క వేస్తోంది విరజ.
    "మొత్తం పన్నెండుగురు ...." అన్నాడు రాజారావు.
    వెంకట్రామయ్య దెబ్బతిన్న ముఖం పెట్టి ----" ఇంకా పెళ్ళి కొడుకు మమ్మగారోకావిడ వున్నారు" అన్నాడు.
    'అంటే మొత్తం పదముగ్గురన్నమాట ...." అని రాజారావు "నాన్నా - మీరు పెళ్ళికి ఖర్చెంతవుతుందో అంచనా వేశారా?" అనడిగాడు.
    తన మాటలు వినకుండా ఏవేవో ప్రశ్నలు వేస్తున్నందుకు చిరాకు కలిగింది వెంకట్రామయ్యకు. క్షణం తటపటాయించి "ఇంకా లేదు.....' అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS