Previous Page Next Page 
గురవాయణం పేజి 10


                                                      చుట్టాలు
    
    "కాకులు అరిస్తే చుట్టాలు వస్తారు" అని అమ్మచెప్పిన మాటలు గట్టిగా నమ్మేసి, అవి ఎప్పుడు అరుస్తాయా అని ఆశగా ఆకాశంవైపు చూస్తుండేవాడిని చిన్నప్పుడు. ఆరోజుల్లో చుట్టాలు వచ్చిన ఆ నాలుగురోజులు మనకుపండుగే. వచ్చిన వాళ్ళు తినుబండారాలు తెస్తారు.
    మన రోజులు బాగుంటే, కొత్త బట్టలు కూడా దొరుకుతుంటాయి అడపాదడపా. ఇంట్లో కూడా. నాన్ వెజ్, గారెలు లాంటివి ప్రత్యక్షమవుతుంటాయి. కనీసం ఒక్క సిన్మా చాన్స్ అన్నా గిట్టుబాటు.
    అన్నిటికంటే ముఖ్యంగా, ఆ నాలుగురోజులు, అమ్మమాట విననక్కర్లేదు. మరి ఇన్ని సదుపాయాలు అందించే చుట్టాలరాక, నాలాంటి పిల్లకాయలికి పండుగేకదా. వచ్చిన చుట్టాలు రకరకాలు. చికెన్, గారెలు, పాయసం, కిళ్ళీ. ఈ నాలుగూ అమరాయంటే డీలక్స్ మోడల్ బంధువన్నమాట. వీళ్ళు ఏడాదికి, ఒకరో, ఇద్దరో ప్రత్యక్షమవుతారు.
    వీళ్ళని మనం చాలా అతివినయంతో చేతులకు తువ్వాలు అందించడం, కాళ్ళకు చెప్పులు అందించడంలాంటి, బుట్టలోవేసే పనులుచేస్తూ, "మీ సేవే మాభాగ్యం" అని వీలుచిక్కినప్పుడల్లా గుర్తు చేస్తుండాలి. మన పంట పండిందంటే ఒక్కోసారి, వీడ్కోలు సమయంలో పదిరూపాయలు ఈనాం దాకా దొరకచ్చు. కొంతమంది పిసినారి చుట్టాలుంటారు. వీళ్ళని తొందరగా పసికట్టేయచ్చు.
    వచ్చేటప్పుడు ఏమీ తీసుకురారు. వారంపైనే ఉంటారు. దానికితోడు, స్నానానికి వేన్నీళ్ళుబదులు చన్నీళ్ళు, భోజనానికి కూరల బదులు పచ్చళ్ళు-ఇలా పరిస్థితి దిగజారిందంటే- వీళ్ళు మరీ (పిసి)నాసి రకం అన్న మాట. వీళ్ళకోసం మనం అస్సలు మన విలువైన సమయాన్ని, అతివినయాన్ని వెచ్చించకూడదు. నా తాతలిద్దరు చెరొకరకం అనుకునేవాడిని ఆరోజుల్లో. నాన్ననాన్న, పప్పుచెక్క, అరటిపండ్ల గెల, వేరుశెనక్కాయల బస్తా- ఇలా వాసిలో, రాసిలో ఏమాత్రం తగ్గకుండా, తెచ్చేవాడు. ఓ NTఓడి సిన్మా-ఇంటర్వెల్ లో గోల్డ్ స్పాట్, సమోసాలు అదనం ఆకర్షణలు.
    అమ్మనాన్న ఎప్పుడూ ఓ బస్తా తనే మోసు కొచ్చేవాడు. దాంట్లో తినుబండారాలు ఏవీ ఉండేవి కాదు. సిన్మాలేదు. సమోసా లేదు.
    ఈ తాతని పిసినారి చుట్టంకింద లెక్కేసి, తెగ లైట్ తీసుకునేవాడిని. తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత, అమ్మ చెప్పితే తెలిసింది. కష్టపడి, తనే మోసుకొచ్చింది బియ్యం బస్తా అని. దానితోనే ఇల్లు గడిచేందుకు వెసలుబాటు అని.
    కొంతమంది స్పెషల్ అట్రాక్షన్ చుట్టాలు ఉంటారు. ఉదాహరణకి- రామిరెడ్డి మామయ్య తెచ్చే రంగు రంగుల చొక్కాలుకోసం, రమణ మామయ్య తెచ్చే రకరకాల స్వీట్స్ కోసం, కోటి బాబాయితో వచ్చే చెల్లెలు శైలజకోసం వీళ్ళెప్పుడొస్తారా అని ఎదురు చూస్తూండేవాడిని.
    మనకిష్టమైన చుట్టాల అవసరాలని అలా పసికట్టి ఇలా తీర్చేయాలి. తాత చుట్ట(రికం) నిలబడేలా అగ్గి పెట్టె అందించడం, రామిరెడ్డి మామకు బట్టలు ఇస్త్రీ చేయించుకురావడం, రమణ మామకి పేకాడేటప్పుడు, నిరంతరంగా Berkley సిగరెట్టు ప్యాకెట్టు Supply చేయడం, పేకలో డబ్బులు పోతున్నప్పుడు, చడీ చప్పుడు లేకుండా, Berkley నుంచి Charminarకి సెటిల్ అయిపోవడం- ఇత్యాది కార్యక్రమాలతో బంధువులతో బంధం పెంచుకోవాలి.
    ఇప్పటికీ బంధువులతో బాంధవ్యం నిలుపుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాను. కాకపోతే, పని ఒత్తిడివల్ల, హాస్పిటల్ బాధ్యతవల్ల, చుట్టాలతో గడప గలిగే సమయం, అవకాశాలు బాగా తగ్గిపోయాయి. పిల్లల పెళ్ళిళ్ళకు, నేనే స్వయంగా ఫోన్ చేసి అందరినీ ఒకచోటచేర్చి, కొంతసమయం గడపగలిగాను.
    అదృష్టం ఏమిటంటే, అమ్మవైపు, నాన్నవైపు, భార్యవైపు, అందరు చుట్టాలూ హైదరాబాద్ లోనే ఉండటం. కాకపోతే చిన్నప్పటిలాగా చుట్టాలు వచ్చి మూడు, నాలుగు రోజులుండడం మాత్రం జరగడం లేదు- పెళ్ళిళ్ళల్లో, పేరంటాల్లో కలవడం తప్ప, ఆకొద్ది సమయంలోనే, అందరినీ ఒకచోటచేర్చి, కూర్చి, గ్రూప్ ఫోటోలు తీయించడం నా స్పెషాల్టి.
    మా బంధువర్గంలో, ఎవరింట్లో అయినా మంచి గ్రూప్ ఫోటో ఉందంటే, దానివెనక నా హస్తం ఉన్నట్లే. 'ఎదవగోల' అని చిన్నవదిన రాజి విసుక్కున్నా "నా పిల్లలులేకుండా గ్రూప్ ఫోటోలు తీస్తాడు" అని పెద్ద వదిన ఊర్మిళ, అభాండం వేసినా- తర్వాత వాళ్ళేనా మంద(మతి) ఫోటోలని మెచ్చుకుంటుంటారు.
    కొంతమంది ప్రస్తుతకాలం పిల్లలకు దగ్గర బదువులతో కనీస పరిచయాలుకూడా ఉండటం లేదు. కారణాలు అనేకం.
    'చెట్టుకొకరు, పుట్టకొకరు' లాగా, ప్రపంచం నాలుగు మూలలకి విసిరేయబడడం, ఎవరికి వారే, జీవితం పరుగుపందెంలో మునిగిపోవడం, పిల్ల కాయలందర్ని కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా కలపగలిగే పెద్దతలకాయ లేకపోవడం - ముఖ్య కారణాలు అనిపిస్తాయి నాకు.
    ఈ నేపథ్యంలో భవాని తోబుట్టువుల బంధువులు, ఆ బంధువులబంధువులు, అలాఅలా పెంచుకుంటూ, ఆప్యాయతలు పంచుకుంటూ, ఓ వందమందిదాకా సభ్యులైన 'బ్రహ్మోత్సవం' చుట్టాలందరికీ నా అభినందనలు.
    ప్రతి సంక్రాంతికీ, వందమందినీ తోటలోపోగేసి, భోగి మంటేసి, చతుర్ముఖ పారాయణం (పేకాట) ఏర్పరచి, పీకలదాకా, లెక్కకు అందని, మిక్కిలి రుచికరమైన, అనేక పిండివంటలు, తిండి వంటలు, మెక్కింపచేసి పేరు పేరునా గుడిసెల్లో, గుడారాల్లో, నెలవు, సెలవు ఏర్పాటుచేసి, వర్ష నృత్యం (Rain Dance), తెల్లవాడి బిళ్ళంగోడు (Cricket) లాంటి ప్రత్యేక ఆకర్షణలతో అలరారించి,
    ఆ మూడ్రోజులు, వారి ప్రేమానురాగాల పాయసంతో పొలమారించే ఆదిదంపతులు రమ, రాజమౌళికి-ఆశీస్సులు, అభినందలతో....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS