Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 9


    "వాడినీ పూటకు అలా వదిలేయ్యమ్మా, రేపటికీ సర్దుకుంటాడు. పూర్ ఫెలో ఐ పిటీ హిమ్ " అంది వసంత. మాలతి కాఫీ తీసికెళ్ళి "కాఫీ తాగాన్నయ్యా' అంది. ప్రసాద్ ఓసారి లేచి కూర్చుని కాఫీ తాగేసి గ్లాసు యిచ్చేసి మళ్ళీ పడుకున్నాడు. మాలతి ఎలా పలకరించాలో తెలియక బయట కెళ్ళి పోయింది. ఆఖరికి ఆరుగంటలకి వెంకట్రావుగారోచ్చాక ఆవిడ మళ్ళీ సోది చెప్పుకొచ్చింది. అయన నిట్టుర్చారు భారంగా.
    "ఎవడి కన్నా విరక్తి పుడ్తుంది యీ పరిస్థితుల్లో, చూడాలి..... ఏం చెయ్యాలో తోచటం లేదు. ఏదో ఒకటి చెయ్యటానికి లేక వాడు పిచ్చేక్కుతున్నాడు " అన్నాడు.
    "అది సరే , ముందు ఏం జరిగిందో కనుక్కోండి కాస్త....' ఆదుర్దాగా అంది.
    "ఏం జరగడానికి ఏముందే, ఉద్యోగం రాలేదు. బాధపడ్తున్నాడు" అంటూనే అయిష్టంగా "ప్రసాద్" అని పిల్చాడు. రెండుసార్లు పిలిచాక సావిట్లోకి వచ్చాడు ప్రసాద్ నెమ్మదిగా. "ఏమయింది యింటర్వ్యూ .... యీ సారీ సెలెక్టు కాలేదా.....సరే, అయిందేదో అయింది. తిండి మానడం ఎందుకు, ఉద్యోగం రాకపోతే పస్తులు....."
    "ఉద్యోగం యిస్తానన్నారు...." ప్రసాద్ నెమ్మదిగా అన్నాడు. ఒక్కసారిగా అందరి మొహాలలోకి కళ వచ్చింది. ఆ తరువాత అపనమ్మకంగా చూస్తూ, "మరి....మరేం" అన్నారంతా ఒక్కసారిగా ఉత్సాహంగా.
    'వాళ్ళిస్తానన్నది గుమాస్తా ఉద్యోగం కాదు. వాళ్ళ కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ చేస్తామన్నారు. వుండడానికి పెద్ద మేడ, కారు అన్నీ ఇస్తామన్నారు...."
    "ఏమిటి?" తెల్లబోయారంతా..... ప్రసాద్ కి కాని ఉద్యోగం రాలేదని మతి చలించిందా అన్నట్టు అప్రతిభులై చూశారందరూ.
    "ప్రసాద్.....ఏమిటి మాట్లాడుతున్నావు? వెంకట్రావుగారూ అందరికంటే ముందుగా తేరుకుని అడిగారు.
    "అవును, యింకా ఏభై వేల క్యాష్ యిస్తాం అన్నారు....' యీ సారి ప్రసాద్ కి ఏదో అయిందన్న అనుమానం అందరికీ బలపడింది. అంతా ఆందోళనగా ఒకరి మొహాలు వొకరు చూసుకున్నారు.
    "ఒరేయ్ నీకు మతేమన్నా పోయిందా" కాంతమ్మ ఆందోళనగా అంది. ప్రసాద్ అందరి వంక స్థిరంగా చూశాడు. "నాకేం మతిపోలేదు. బుర్ర చెడలేదు. తిన్నగా వినండి. ఆ కంపెనీ ప్రోప్రయిటర్ నారాయణ మూర్తి గారు , నన్ను కంపెనీకి మేనేజింగ్ డైరక్టర్ చేస్తామన్నారు. యిల్లూ కారు, క్యాష్ అంతా యిస్తారు. కాని ఒక షరతు మీద, వాళ్ళ అమ్మాయిని పెళ్ళాడలన్నారు." ప్రసాద్ మాటలు ఉగ్గబట్టి వింటున్న అంతా ఒక్కసారి తేలిగ్గా నిట్టుర్చారు.' అంతేకదా, దానికేం వుంది. అంతా లక్షాధికార్లు అంతా బిజినెస్సు వున్నవాళ్ళు నీకు పిలిచి పిల్లనిచ్చి , హోదా , ఉద్యోగం డబ్బు యిస్తామంటే కొంప మునిగినట్లు మాట్లాడుతావెంరా.' కాంతమ్మ అంది ఆనందంగా.
    'అగు, ..... ' వెంకట్రావుగారు అసహనంగా కాంతమ్మ ని వారించి 'అంత లక్షాధికార్లు, మేడలు, కార్లు, డబ్బులు అన్ని యివ్వగలిగిన వాళ్ళకి నీవంటి మంచి అల్లుడు దొరకలేదా! ఓ గుమస్తా కొడుక్కి, బి.కాం చదివి ఉద్యోగం చేసుకోవాలనుకునే మనలాంటి సామాన్యులకి పిల్ల నెందుకు యిస్తానన్నారు.' అయన అనుమానంగా చూస్తూ అడిగారు. అప్పటికి ఆ విషయం అందరికి తట్టి జవాబుకి ఆరాటంగా చూసారు ప్రసాద్ వంక.
    "వాళ్ళ అవిటి పిల్లని పెళ్లాడితే అదంతా లాభంగా యిస్తారు. పొలియో వచ్చి రెండు కాళ్ళు పడిపోయిన ఆ అమ్మాయిని జీవితాంతం నడవలేని వాళ్ళ పిల్లని పెళ్ళాడితే నష్టపరిహారంగా యిస్తారు అవన్నీ" ప్రసాద్ ఒక్కక్కమాట వత్తి పలికాడు. అందరినీ చూస్తూ. పిడుగు పడినట్టు నిశ్శబ్దం అయిపోయారంతా. అందరి మొఖాలు వెలవెల బోయాయి.
    'అవిటిపిల్లా....." అప్పటివరకు ఆరాటంగా విన్న అందరి మొహాలు మాడిపోయాయి. కాంతమ్మ ఆందోళనగా చూస్తూ అంది. "అంటే అన్నీ వున్న వాళ్ళెవరూ చేసుకోరని యిలా మనలాంటి వాళ్ళయితే వప్పుకుంటారని ఉద్యోగం, డబ్బు, అన్నీ యిచ్చి చేద్దామనుకున్నారన్నమాట...."
    "లేకపోతే వాళ్ళు మనలాంటి వాళ్ళ మొహం అన్న ఎందుకు చూస్తారు? ఏదో లోటుండబట్టే ఆశ చూపించి అల్లుడిని చేసుకోవాలనుకున్నారు. బాగానే వుంది యింకా ఏమిటో అనుకున్నాను, దాని కోసం యింత బుర్ర చెడగోట్టుకుని , తిండి మానుకోడం ఎందుకు....' వెంకట్రావు గారు విసుగ్గా అన్నారు.
    "ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.' ప్రసాద్ నెమ్మదిగా అన్నాడు. అంతా ఆశ్చర్యంగా చూసారు.
    "ఏమిటి , అవిటిపిల్లను చేసుకుంటావా, మతి గాని పోయిందా....' కాంతమ్మ అడిగింది.
    "ఎంత డబ్బు , ఉద్యోగమూ అవీ యిచ్చినా చూస్తూ చూస్తూ అవిటి దాన్నెలా చేసుకుంటావు. పెళ్ళంటే జీవితాంతం వుండేది. నడవలేని భార్యతో ఏం కాపురం చేస్తావు....ఏం సుఖ పడతావు...." వెంకట్రావు గారు అసహనంగా అన్నారు.
    "కాపురం చెయ్యచ్చని పిల్లలు కలగటానికి ఏ లోపం లేదన్నారంట డాక్టర్లు...."
    'అయితే మాత్రం, కాళ్ళు లేని భార్యతో, ఏ సంతోషం లేకుండా డబ్బు తింటూ బతుకుతావా ఏమిటి...." కాంతమ్మ తల్లి ప్రాణం అంగీకరించలేదు.
    "అమ్మా.....ఏ సుఖం అన్నా డబ్బు తోటే ముడిపడి వుందని యీ రెండేళ్ళలో నాకు బాగా అర్ధం అయిందమ్మా..... ఉద్యోగం లేకుండా, డబ్బు లేకుండా నానాబాధలు పడుతూ బతికే కంటే డబ్బిచ్చే సుఖలన్నా పొందడం తెలివైనపని అని నిర్ణయించాను. డబ్బు లేకుండా పెళ్ళాం వుండి మాత్రం పొందే సుఖం ఏముంటుంది. పస్తులు, రోగాలు, పిల్లలు, ఏడుపులు మధ్య పొందే సుఖం ఏముందమ్మా! కనీసం డబ్బుంటే భార్య స్థానంలో పది మంది పనివాళ్ళు నాకు అన్నీ అమురుస్తారు. సంసారానికి భార్య వుంటుంది. కారు, మేడ, డబ్బిచ్చే సుఖాలని వదులుకోడం తెలివితక్కువమ్మా...... ఆలోచించు వాళ్ళిచ్చే ఏబై వేలతో వసంత, మాలతి కి పెళ్ళిళ్ళు చెయ్యచ్చు. కమలకి టైపు అది నేర్పించి మా ఆఫీసులో ఉద్యోగం యిప్పించవచ్చు. నాకొచ్చే జీతంతో మనం హాయిగా బతకచ్చు. శంకర్ కి మంచి చదువు చెప్పించవచ్చు. మీ కొడుకు అంత హోదాలో వున్నాడంటే మీకు గర్వం కాదూ, యీ పెళ్ళి వద్దంటే, ఎప్పుడో ఏదో గుమస్తా ఉద్యోగం దొరకచ్చు. ఏ నాలుగైదు వందలతో చాలిచాలని జీతంతో నేను నా సంసారం తిని తినక గడపాలి. మిమ్మల్ని ఆడుకునే అవసరం అసలుండదు. అమ్మా, నేను ఉదయం నించి అంతా ఆలోచించాను. నేను యీ అవకాశం వదులుకోనమ్మా . ఒక్క కాళ్ళు లేని లోటు తప్ప మిగితాదంతా ఆలోచిస్తే అదృష్టం కొద్ది యీ అవకాశం నాకు వచ్చిందనుకోవాలి. అంచేత మీరు నాకు అడ్డుచెప్పకండి నాన్నా....' ప్రసాద్ స్థిరంగా అన్నాడు.
    అందరూ మౌనంగా ఆలోచనలో పడ్డారు. భవిష్యత్తులో తమ స్థితిగతులు యీ పెళ్ళితో ఎలా మారేది అంచనా కట్టసాగారు ఎవరి మనస్సులో వారు వెంకట్రావుగారి బుర్రలో ఏబై వేలు కదిలాయి. ఇంకో జన్మ ఎత్తినా అంత డబ్బు తను సంపాదించలేడు. ఆడపిల్లలిద్దరి పెళ్ళిళ్ళు, ఎల చెయ్యను భగవంతుడా అని బెంగ పెట్టుకున్న తరుణంలో ఆ డబ్బుతో పెళ్ళిళ్ళు, పేరంటాలు, చదువులు అన్నీ అయి నిశ్చింతగా వుండవచ్చు. యీ దినదినగండం బతుకు నించి విముక్తుడై హాయిగా బతకచ్చు. అందరి మనస్సులు డబ్బు ప్రభావానికి ప్రలోభపడ్డాయి.....కాని చూస్తూ , చూస్తూ ప్రసాద్ ని ఉరికంబం ఎక్కించినట్టు ఏదో బాధగా అన్పించింది. తమ స్వార్ధం కోసం ప్రసాద్ సుఖసంతోషాలని బలిపెట్టాలా , తమ కోసం వాడు అంత త్యాగం చేస్తుంటే సంతోషంగా అంగీకరించాలా.... ఎవరి మనస్సుల్లో వారే బాధపడ్డారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS