రామారావు గదివద్దకు మెట్లెక్కిపోయి తలుపుతట్టెను. రామారావు దీపము పెద్దదిచేసి తలుపు తీసెను. గదియంతయును తెల్లని వెస్తురు. బల్లపై గాజు గిన్నెలో పెద్ద తెల్ల గులాబి పూలుండెను. ఒకమూల తెల్లని చిన్న మంచము,పరుపు కుర్చీలు,ఒక సోపా. రామారావు రెప్పవాల్చక శశిరేఖ వంక చూచెను.
రామ - శశి! ఎన్నడును నిన్నింత అందముగా చూడలేదు.ఎట్లా వున్నావు యింత అందంగా?
శశి- నిజంగా?
రామ - నిజం, దూరమున కనపడని మబ్బులోనుండి వచ్చు మెరుపులతో తళతళలాడు ఆకాశమువలె వుంది నీ ముఖము. ఇట్లా కూర్చో?
అని చెయ్యి పట్టుకొని ఆమెను సోఫామీద కూర్చుండబెట్టి తానును కూర్చుండెను.
రామ- నీవు రావనుకున్నాను. అందుకనే దీపం తగ్గించి నిద్రపోబోతున్నాను నీవు వచ్చేటప్పటికి.
శశి- నేను రాలేకపోతే అట్లాగే నిద్రపోయ్యేవాడవే కదూ?ఇంక మళ్ళి నన్నెప్పుడు చూశేవాడవు?
రామ- మఱి యింకేం చెయ్యను?
శశి - నేనే నువ్వయితే శశిరేఖను వెతుక్కుంటో వచ్చేవాణ్ని.
రామ - వెతుక్కుంటూ వస్తే లాభామేమన్నా వుంటేనా?
శశి - నిజం చెప్పు నా మీద ప్రేమ వున్నదా?
రామ - ఇన్ని దినాలూ నీ కోసమే కాచుకొని వున్నానే! ఇంకా సందేహమేనా?
శశి - నాకు తెలుసునులే?నా మీద కాదు నీ ప్రేమ. నీ మనస్సులో వుండే పవిత్రురాలయిన శశిరేఖమీద. చిన్నప్పుడు నీకు వాగ్ధత్తం యిచ్చి, నిన్ను పెళ్ళి చేసుకొని,నిన్నే ద్తేవంగా కొల్చే శశిరేఖ మిదకాదూ, నిజం చెప్పు ఆ రూపమా నాది. గనుక నా మీదనే గావును ప్రేమ వుండవలసింది అనుకుంటావు. అది నీ కర్తవ్యమనుకుంటావు. కాని తీరా నా దగ్గరకు వచ్చి, నా స్వేచ్చా నా మాటలూ, నా నడతా చూచి భయపడి, ఇది నా శశిరేఖ కాదే అని ఆశ్చర్యపడుతూ వుంటావు.
రామ - ఛి!ఛి!కాదు. కాని ఇంతకూ నీ వేమి నిశ్చయం చేసుకున్నావు?
శశి - అదేదో చెప్పేసి పొమ్మంటావు. అంతేనా?
రామ - చేపుదూ!
శశి - ఇట్లారా! దగ్గిర కూచో, చెపుతాను. ఆ ఒక్క మాటతో అవుతుందా మన ప్రేమ అంతా? నిజం చెప్పు, పెళ్ళి చేసుకుంటేనే గాని ఈశ్వరుడు మనం కలిసి ఉండడం వప్పకోడూ?
ఆమె అతని తోడ పై చెయ్యి వేసెను.
రామ - వివాహమంటే పరస్పరభివృద్ది కోఱకు, సంతానాభివృద్ది కోసం రెండు ఆత్మలు కలవడం.
శశి - ఎందుకో అందుకు. రెండు ఆత్మలు కలవడమెగా కావలసింది!సరే,ఇంక ఎవరో కలపడమెందుకు?
రామ - ఈశ్వరుడిముందు కలిసినట్లు.
శశి - మనమే కలుద్దాం, యీశ్వరుడి ముందు.
రామ - సంఘం వప్పకుంటుందా అట్లా అయితే? సంఘానికి తెలియాలి.
శశి - తెలుపుదాం.
రామ - ముందు అనుజ్ఞ పొందాలి. అదే పెళ్ళి.
శశి - అయితే యీ పెళ్ళిళ్ళని సంఘం వప్పకుంటుందా?
రామ - ఆ బ్రహ్మ సంఘం వప్పకుంటుంది.
