Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 5

 

ఆనంద నందనాలు  వెల్లి విరియాలి

        సుస్వాగతం    -- రుధిరోద్గారికి
        శుభాకాంక్షలు --- తెలుగు వారికి
    క్రొంగొత్తవత్సరంలో అడుగోడితున్న ఈ శుభ సందర్బంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో వున్న తెలుగు సోదరీ సోదరులందరికీ నా నూతన సంవత్సరం శుభాకాంక్షలు.
    ఆశలకు ప్రోది, ఆకాంక్షలకు పునాది మన ఉగాది. జీవితం సుఖదుఃఖాల మేలుకలయికలనీ, అన్నిటినీ సమదృష్టి తో వుంచుకొని బ్రతుకును నిత్యవసంటంగా మలచుకొమ్మని సూచిస్తుంది -- ఈ రోజు మనం స్వీకరించే వేప పూత ప్రసాదం. ఇది తెలుగు ఉగాది విశిష్టత.
    ఈసారి ఉగాదికి ఓ ప్రత్యేకత వుంది. 250 సంవత్సరాల తరువాత తమిళ, తెలుగు ఉగాదులు కలిసి ఈరోజునే వస్తున్నాయి. కాగా, కర్నాటక, తమిళ, మహారాష్ట్ర ప్రజలందరకూ ఇదే ఉగాది. ఈనాడే ఉగాది. ఆ సోదరులందరికీ నా శుభాకాంక్షలు.
    ఉగాదులతో కలబోసుకున్నది తెలుగు వారి చరిత్ర. తెలుగునాట ఒకనాడు పాడిపంటలు వెల్లి విరిసాయి. పాలు, తేనెలు పొంగి పోరలాయి. కళామయూరాలు పురివిప్పి కలకలలాడాయి. పౌరుషం ప్రజ్వరిల్లింది. శాతవాహన, ఇక్ష్వాక, కాకతీయ, విజయనగర సామ్రాజ్యాల కాలంలో తెలుగుతేజం దిగ్దిగంతాలకు విస్తరించింది. అనంత కీర్తిని అర్జించింది,.
    ఆ సమృద్దిని సాధించి అలనాటి తెలుగు జాతి గౌరవాన్ని తెలుగు వారి ఆత్మాభిమానాన్ని పూనప్రతిష్టించి తెలుగు ప్రజా జీవితాన్ని సౌభాగ్యవంతం చేసి, తెలుగు భాషా సంస్కృతుల పునర్జీవనం సాధించాలన్నదే మా ఆశయం. పేదరికాన్ని పారద్రోలాలన్నదే మా సిద్దాంతం.
    ఈ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం ఈ మూడు నెలల స్వల్ప కాలంలోనే అనేక ప్రజాహిత నిర్ణయాలను గైకోన్నదని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఆనాడు మీకిచ్చిన హామీలను ఏనాడూ విస్మరించబోమని తెలియజేస్తున్నాను. మీరుంచిన విశ్వాసానికి విరుద్దంగా నడుచుకోమని కూడా హామీ యిస్తున్నాను. ప్రజకే ప్రభుత్వం. ప్రభుత్వమే ప్రజలు. మేమూ మీ ప్రతినిధులం. సంఘ సంక్షేమానికి అంకితమైన వారం.
    ఉషస్సులు లేని, ఉగాదులెరుగని తాడిత, పీడిత ప్రజానీకం అంటరానితనం, మొదలైన దురాచారాలకు గురై ఇక్కట్లలో, చీకట్లలో తమ బ్రతుకులను భారంగా ఈడుస్తున్నారు. అలాంటి బడుగు వర్గాల బ్రతుకులలో వెలుగులు చిందించాలని , వారికి చేయూత నందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. నిలువ నీడకు కూడా నోచుకోని పేదవారి కోసం రెండు లక్షల 20 వేల శాశ్వత గృహాల నిర్మాణానికై ప్రభుత్వం బృహత్తర పధకాన్ని చేపట్టింది. చేసిన బాసల మేరకు కిలో బియ్యం రెండు రూపాయలకు పేదవారికి అందించే కార్యక్రమాన్ని ఈపర్వదినం నాడే ప్రారంభిస్తున్నాం. ఇందువల్ల లక్షలాది శ్రమజీవుల కుటుంబాలకు సంక్షేమం జరుగగలదని  ఆశిస్తున్నాను.
    దేశానికి అన్నదాత రైతన్న. అతని శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రైతే దేశానికి వెన్నుముఖ. రైతు సంక్షేమమే దేశ సంక్షేమం . తమ ప్రయోజనాలను పరిరక్షించుకుకునేందుకై తమకు సంబంధించిన అన్ని సమస్యల పైన స్వయం నిర్ణయాలు తీసుకునే అధికారం రైతు సోదరులకే వుండాలన్నది మా ఆదర్శం. అందుకే సహకార ప్రాతిపదికపై గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఒక నూతన వ్యవసాయిక వ్యవస్థను రూపొందించడానికి నిర్ణయం తీసుకున్నాం. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికై ఎట్టి చర్యలను తీసుకోనడానికైనా మేము వెనుకాడబోమని మనవి చేస్తున్నాను.
    స్వాతంత్యం తరువాత 35 సంవత్సరాలు గడచినా దురదృష్టవశాత్తూ మన గ్రామాల్లో ఇంకా మంచినీటి సమస్య అపరిష్కృతంగానే వుంది. కడివెడు నీళ్ళ కోసం మన ఆడపడుచులు మైళ్ళకు మైళ్ళు మండు టండలో వెళ్ళవలసిన దుస్థితి అనేక గ్రామాలలో వున్నది. ఈ సమస్యకు తక్షణ పరిష్కారాన్ని అన్వేషించి అందరికీ మంచినీరు అందించాలన్నదే ప్రభుత్వ దృడ దీక్ష. పరాయి పాలనలో మన జాతి వైభవం నశించి, కృశించి పోగా యింకా ఈ మాత్రమైనా మన సంస్కృతీ బ్రతికి వున్నదంటే అది మన ఆడపడుచుల చలవే అని మనవి చేస్తున్నాను. సోదరీమణుల సంక్షేమం కోసం ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. అది నా గుండెల్లో మెదిలే అనుభూతి. ఆడపడుచులకు మగవారి తో బాటు సమానహక్కులు తండ్రి అస్థిలో లభించలన్నదే నా విధానం. ఇందుకనుగుణంగా మన శాసన సభలలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి మీకందరికీ తెలుసు. ఏడుకొండల వాని అభయముద్రలో , పద్మావతిదేవి చల్లని శుభశీస్సులతో వచ్చే సంవత్సరం నుండే మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ప్రారంభించ పడుతుందని తెలియజేయడానికి నాకు ఎంతో సంతోషంగా వుంది.

భావి భారత పౌరులు మన విద్యార్ధులు. బ్రిటీషు పాలకుల వారసత్వంగా లభించిన బానిస విద్యావిధానం యింకా మన విద్యాలయాలలో కొనసాగుతూ వుండడం సిగ్గుచేటు. ఈ పరిస్థితిని ఆమూలాగ్రంగా మార్చి వేసి మన యువకులు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని క్రమశిక్షణను, స్థైర్యాన్ని సాధించుకునే అవకాశాలు విద్య ద్వారా కల్పించాలన్నదే మా అభిమతం. విద్యను అంగడిలో పెట్టి, అమ్ముకునే దౌర్భాగ్య స్థితి మానకు ఉండకూడదనే పట్టుదలతో కళాశాలల్లో కాపిటేషన్ ఫీజు రద్దు చేశాం. ప్రతిభ కే గుర్తింపు అని నినదించాం. విద్యాలయాలను ఆదర్శ సంస్థలుగా తీర్చిదిద్ది, యువశక్తిని సాంఘిక సంస్కరణోధ్యమంలో లయబద్దం చేసి వినియోగించుకోవాలన్నదే మా లక్ష్యం. ఇందుకై 'తెలుగు వెలుగు' కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం.
    "తెలుగదేలయన్న ---- దేశంబు తెలుగు ఏను
    తెలుగు వల్లభుండ తెలుగో కండ
    ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి 
    దేశ భాషలందు తెలుగు లెస్స"
    ఇది సాక్షాత్తూ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవుని నుడి. తేనే లొలుకు తియ్యదనం మన తెలుగు భాష సొత్తు. సుమధుర లలిత సంస్కృతీ స్రవంతిగా వాసి కెక్కిన భాష ఈనాడు ఎంతగా చిద్రమైపోయింది. తెలుగు సంస్కృతీ పునరుద్దరణకు మనమందరం అంకితం కావలసిన అవసరం వచ్చింది. అదే ఆదర్శంతో తెలుగు భాషే ప్రధాన భాష కావాలని ఈ ఉగాది నుంచి తెలుగును అన్ని స్థాయిలలో అమలు చేస్తున్నాం. తెలుగు సంస్కృతీ విస్తరించాలి. తెలుగుతనం వర్ధిల్లాలి. తెలుగు బావుటా విను వీధుల్లో రెపరెపలాడాలి. అలనాడు తెలుగునాట మ్రోగిన విజయ దుందుభుబు మరోసారి దిగ్దిగంతాలలో నినదించాలి. తెలుగుతల్లి తన ముద్దు బిడ్డల మురిపాలలో ఆనందమయి కావాలి.
    తెలుగు ప్రజలందరి జీవితాలలో నిత్య వసంతాలు తొణకాలని, ఆనందనందనాలు వెల్లివిరియాలని కోరుకుంటూ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.


    15 , ఏప్రిల్ 1983 రుదిరోద్గారి ఉగాది నాడు ఆకాశవాణి / దూరదర్శన్ లలో ప్రసారితం.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS