Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 4

 

ఇచ్చి పుచ్చుకునే ధోరణి

   
    దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిన్న బెంగుళూరు లో జరిగిన విషయం సభ వారికి విదితమే. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల ముఖ్యంనత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి ఈ సమావేశానికి హాజరు కాలేక పోయారు.
    దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశామంటే యిదేదో కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను ఒక త్రాటిపై తెచ్చే యత్నమని కొందరు కొన్ని అపోహలు సృష్టించడానికి యత్నిస్తున్నరని మాకు తెలుసు.  అయితే ఈ సమవేశంలో పాల్గొన్నవారిలో ఎవ్వరం కూడా కేంద్రానికి వ్యతిరేకులం కాము. ఈ భారతభూమి మనది. మన మంతా అందులో అంతర్భాగం. భరతమాత మన తల్లి. మనమంతా ఆమె బిడ్డలం. ఇది మా నిశ్చితాభిప్రాయం.
    శరీరం బలంగా వుండాలంటే అన్ని అవయవాలు బలంగా వుండాలి. అదే విధంగా కేంద్రం బలంగా వుండాలంటే రాష్ట్రాలు మౌలికంగా బలంగా వుండాలి అన్నదే మా భావన.
    వివిధ కార్యక్రమాల అమలులో, ముఖ్యంగా ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించినంత వరకు రాష్ట్రాలు మరింత స్వేచ్చ కలిగి వుండాలని నిన్నటి సమావేశంలో భావించాం. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. 8 వ ఆర్ధిక కమీషన్ సమర్పించవలసిన విషయాల గురించి విసృత మైన ఏకాభిప్రాయం వ్యక్తమైంది. సమావేశంలో గైకొన్న కొన్ని నిర్ణయాలను సభ వారికి వివరిస్తాను.
    ప్రజా సంక్షేమం కోసం ఆరోగ్యం, విద్య నీటి పారుదల, విద్యుచ్చక్తి మున్నగు సౌకర్యాల కల్పన , నాటి అమలు రాష్ట్ర ప్రభుత్వాల భుజ స్కందాల పైన ఉన్నది. వీటికయ్యే వ్యయభారం చాలా ఎక్కువ. రక్షణ శాఖను మినహాయిస్తే కేంద్ర ప్రభుత్వం చేయవలసిన ఖర్చు తక్కువ. అయినప్పటికీ వనరులు మాత్రం కేంద్రప్రభుత్వం వద్దనే ప్రధానంగా కేంద్రీకృతమై వున్నాయి.
    కేంద్రానికీ, రాష్ట్రానికీ మధ్య ఆర్ధిక పరిస్థితులకు సంబంధించి రాజ్యాంగంలో వున్న నిబంధనలను సవరించుతున్న తీరు చాలా అసంతృప్తికరంగా వున్నది. ఆదాయం పన్ను, ఎక్సైజ్ పన్ను మున్నగువాటిలో కేంద్రం రాష్ట్రాలకు యిస్తున్న వాటా ఏ మాత్రం సంతృప్తి కరంగా లేదు.
    ఈ పరిస్తితుల దృష్ట్యా రాష్ట్రాలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించి ఒక ప్రత్యెక ఆర్ధిక కమీషన్ ను (Finacal Cimmission) నియమించాలని కేంద్రానికి సిఫార్స్  చేయడలచాం. గత 35 సంవత్సరాల అనుభవం దృష్ట్యా ఆర్ధిక వ్యవహారాలలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సమీక్షించి వనరులను ఉభయులకు సమతులమైన రీతిలో పంపిణీ చేసేందుకు వీలుగా రాజ్యాంగానికి, శాసనాలకు సవరణలు ప్రతిపాదించే చట్టబద్దమైన అధికారాలు ఈ కమీషన్ కు వుండాలని సమావేశంలో నిర్ణయించాం.
    ప్రస్తుత వ్యవసాయ ధరల విధానం అసంతృప్తికరంగా వుంది. రైతుకు గిట్టుబాటు ధరను యిది పరిగణలోకి తీసుకోవడం లేదు. సబ్సీడీల పై హెచ్చు మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయవలసిన అగత్యాన్ని కూడా యిది సృష్టికరిస్తుంది. ఉత్పత్తి, వ్యయం, స్థానిక ఉత్పాదక స్థాయి, మార్కెటు సరళి మున్నగు అంశాల గురించి రైతు ప్రతినిధులతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వాలే వ్యవసాయోత్పత్తుల ధరలను నిర్ణయించే పద్దతి అవసరం. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించే గిట్టుబాటు ధరలకు పరపతి సౌకర్యాలను సమన్వయపరచాలి. రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీ తప్ప మార్కెట్టులో ధరలు పడిపోతే ప్రణాళికేతరంగా కేంద్ర నిధుల నుండి సబ్సిడీలు సమకూర్చాలి.
    మధ్య దళారీల అధిక లాభార్జన నిర్మూలించడానికి రైతు సంఘాలు తమ ఉత్పత్తులను తామే ఎగుమతి చేసుకోడానికి కూడా పూర్తి అవకాశాలు కల్పించాలి.

ప్రపంచ బ్యాంకు నుంచి అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుంచి, విదేశాల నుంచి దొరికే రుణాలను కేంద్ర ప్రభుత్వం తాను ఆ సంస్థల నుంచి పొందిన షరతుల మీదే రాష్ట్రాలకు బదిలీ చేయాలి. సర్వీసు చార్జీల నిమిత్తం కేంద్రం యిందు కోసం కేవలం నామమాత్రపు మొత్తాన్ని మాత్రమే స్వీకరించాలి.
    ఖనిజాల మీద రాయల్తీల ద్వారా కొన్ని రాష్ట్రాలకు చాలా ఆదాయం లభిస్తుంది. అయితే ప్రధానమయిన ఖనిజాల మీద రాయల్టీని సవరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వుంది. ఇప్పటివరకు వున్న అనుభవాల దృష్ట్యా ఈ సవరణలు క్రమబద్దంగా లేవు. మార్కెటులో సరుకుకు గల గిరాకీని బట్టీ జరగడం లేదు. అందువల్ల ఈ రాయల్టీని ఎప్పటికప్పుడు సవరించే అధికారాన్ని రాష్ట్రాలకు బదిలీ చేయాలి.
    ఆంధ్రప్రదేశ్ వరదల వల్ల అనావృష్టి వల్ల తీవ్రంగా నష్టపోతుంది. అనావృష్టి కార్యక్రమాలకింద అందజేస్తున్న సహాయంలో 70 శాతాన్ని రుణంగా పరిగణిస్తూన్నారు. నిజానికి ఈ సహాయ కార్యక్రామాలు అందుకు గురైనా ప్రాంతాన్నీ, ప్రజలనూ అడుకోదానికీ ఉద్దేశించినవి. అందువల్ల భవిష్యత్తులో అటువంటి సహాయంలో 75 శాతాన్ని గ్రాంటుగాను, 25 శాతాన్ని రుణంగాను పరిగణించాలి. తుఫానులూ, వరదల వల్ల కలిగే నష్టాన్ని కేంద్రమే పూర్తిగా భర్తీ చేయాలి.
    ఇటీవల బడ్జెటులో ప్రధానమంత్రి గ్రామీణభివృద్ది నిధిని ఏర్పాటు చేశారు. ఇది కొంత గందరగోళాన్ని సృష్టించింది. ఆదాయం పన్ను చట్టంలోని 35 వ సెక్షనును సవరించడం ద్వారా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకోడానికి పరిశ్రమలను యిప్పటివరకు ప్రోత్సహించారు. అయితే ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి నిధి ఏర్పాటు వల్ల ఈ అవకాశం జారిపోవచ్చు. అందువల్ల పాత రాయితీలను కొనసాగించవలసినదిగా కోరాం.
    ధర్మకర్త్రుత్వ సంఘాల నిధులను ప్రభుత్వ సెక్యూరిటీలలోనూ, బ్యాంకులలోనూ పెట్టుబడి పెట్టాలని మొన్నటి బడ్జెటులో  కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ధర్మకర్త్రుత్వ సంఘాల నిధులను చిన్న తరహ పొదుపు ఉద్యమంలో పెట్టుబడి పెట్టాలని సూచించాం. దీని వల్ల రాష్ట్రాలకు తమ వాటా లభిస్తుంది.
    ఉమ్మడి ప్రయోజనకరమైన అంశాలను ఎప్పటికప్పుడు చర్చించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక మండలిని ఏర్పాటు చేయడం భావ్యమని భావించాం. ఇందుకు తొలిమెట్టుగా దక్షిణాది రాష్ట్రా ముఖ్యమంత్రుల మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ మండలి ఇందుకోసం ఎప్పటికప్పుడు సమావేశాలు జరుపుతుంది.
    ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలలో మరింత సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించడానికి ఆరంభించిన యత్నాలలో తోలి అధ్యాయం మాత్రమే. ఉమ్మడిగా , సమిష్టిగా చర్చించి పరస్పరం యిచ్చి పుచ్చుకునే ధోరణిలో ప్రతిపాదనలు సాగించి , మనముందున్న అనేక సమస్యలను ఈ విధంగా పరిష్కరించుకోగలమని , ప్రజాజీవితాన్ని వెలుగుబాటలో పయనింప చేయడానికి యిది నాందీ వాచకం కాగలదని ఆశిస్తున్నాం.

        1983 మార్చి 22 న రాష్ట్ర విదానసభలో ......

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS