Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 3


    "ఫరవాలేదురా అబ్బాయ్. నీ టేస్టు గొప్పదని మేమంతా అంగీకరిస్తున్నాం" అంటూ వచ్చాడు శీతంరాజు.
    "ఈ వూళ్ళో నాలుగు మహత్తరమైన సినిమా హాల్స్ ఉన్నాయని తెలిసింది. త్వరగా ఓ హాల్ మీదకు దాడి చేస్తే బావుంటుందని పురజనుల అభిప్రాయం. ఏమంటారు?" అడిగాడు శ్రీధర్.
    "ఆ అభిప్రాయాన్ని నేను బలపరుస్తున్నాను" అన్నాడు వీర్రాజు.
    "నేను బలహీనపరుస్తున్నాను" నవ్వుతూ అన్నాడు సృజనుబాబు మూలగా ఉన్న మంచంమీదకు వరిగి పోతూ.
    "ఏం? ఎందుకని?"
    "సినిమా చూసేంత ఓపిక లేదు. బస్ జర్నీతో బాగా అలసిపోయాను."
    "నాకూ ఓపిక లేదు. కావాలంటే మీరు ముగ్గురూ పోయిరండి" తనూ సృజనుబాబు పక్కనే పడక్కుర్చీలో జారగిలబడుతూ అన్నాడు సురేంద్ర.
    "మీ ఖర్మ! మీ మనసులు ముసలివి అయిపోయాయ్. నేనెప్పటికయినా తెలుగు సినిమా తీస్తే 'ముసలి మనసులు' అని పేరుపెట్టి అందులో మీ ఇద్దరినీ హీరోలుగా బుక్ చేసేస్తాను.
    ఒకడికి ఓపిక లేదట___మరోడికి ప్రయాణపు బడలిక! పదండ్రా! మనం మహారాజుల్లా వెళదాం!" అంటూ బయటకు నడిచాడు సీతంరాజు.
    వీర్రాజు, శ్రీధరం అతన్ని అనుసరించారు.
    కొద్దిసేపు ఏవేవో విషయాలు మాట్లాడుతూనే ఉన్నాడు సురేంద్ర. సృజన్ బాబు వింటున్నట్లు 'ఊఁ' కొడుతున్నాడు గానీ అతని మనసంతా పూర్తిగా స్వరూప మీద ఆలోచనలతో నిండిపోయింది.
    హైస్కూల్ చదువయిపోయాక, కాలేజీలో చేరడానికి స్వంత ఊరు వదలి ఆ ఊరు వెళ్ళాల్సి వచ్చింది తను అదే కాలేజీలో స్వరూపని మొదటి సరిగా చూశాడు. తనే కాదు! ఆమెను ఒకసారి చూసిన వాళ్ళెవారయినా సరే__మర్చిపోవటం జరగదు. ఫైనలియర్లో ఉండగా ఆమె జరుపుతోన్న ప్రణయకలపాల గురించి కాలేజి కుర్రాళ్ళందరూ చెప్పుకోవడం మొదలెట్టారు. మొదట్లో తనూ నమ్మలేదు. కానీ తరువాత, తరువాత-తన కళ్ళతో చూసి-నమ్మాల్సి వచ్చింది.
    
                                      2
    
    "ఏమిట్రా, వెధవ పరధ్యానం నువ్వూనూ! నిద్రొస్తోందా ఏమిటి?" నవ్వుతూ అడిగాడు సురేంద్ర.
    "లేదు....లేదు...." ఉలికిపాటుతో అన్నాడు సృజన్ బాబు.
    "అన్నాయ్! ఆయనకు భోజనం వడ్డించాము...." ఆ గదిలోకొస్తూ అంది సురేంద్ర చెల్లెలు రమణి.
    "పదరా! భోజనం చేద్దూగాని" లేస్తూ అన్నాడు సురేంద్ర.
    "మరి నువ్వో?..."
    "నువ్వువచ్చేముందే మనవాళ్ళందరం కానిచ్చేశాం!"
    సురేంద్రతోపాటు పక్కగదిలోకి నడిచాడు సృజన్ బాబు.
    "మరి-మీ చెల్లాయ్ పెళ్ళెప్పుడు చేస్తున్నావ్?" నవ్వుతూ రమణి వంకచూస్తూ అడిగాడతను.
    రమణి సిగ్గుపడిపోయింది.
    "దానిష్టం! ఎప్పుడు కావాలంటే అప్పుడే! మొగుడు మా మావయ్య కొడుకేగా! రడీగా ఉన్నాడు!" నవ్వుతూ జవాబిచ్చాడు సురేంద్ర.
    "బావని నేనేం చేసుకోను." అంది రమణి పౌరుషంగా.
    ఇల్లంతా పిల్లలకేకలు-చంటిపిల్లల ఏడుపులు-పెద్దాళ్ళ మాటలతో గొడవగా ఉంది.
    త్వరగా భోజనం ముగించి బయటపడ్డాడు సృజన్ బాబు. సురేంద్ర కూడా అతని వెనుకే బయటికొచ్చాడు.
    సిగరెట్ తీసుకొని వెలిగించి "అలా కాసేపు తిరగొద్దామా?" అన్నాడు సురేంద్రతో.
    "పద!" అన్నాడు సురేంద్ర.
    చెప్పులు వేసుకుని ఇద్దరూ రోడ్డు మీద కొచ్చి కాలువవేపు నడవసాగేరు. చీకటిని గెలవడానికి మునిసిపల్ లైట్లు వృధా ప్రయత్నం చేస్తున్నాయ్! రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. దూరంగా ఎక్కడినుంచో పాత హిందీ సినిమా పాటలు వినబడుతున్నాయ్. రోడ్డు ప్రక్కనే ప్రవహిస్తోన్న పంటకాలువ చిన్నగా శబ్దం చేస్తోంది. కాలువలో అక్కడక్కడా ఒడ్డున నిలిపివేసిన పడవల్లో నుంచి మిణుకు మిణుకుమంటూ దీపాలు వెలుగుతున్నాయ్.
    "అయితే పెళ్ళికూతురితో నీకు ముందే పరిచయం ఉందన్న మాట!" తేలిగ్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సృజన్ బాబు.
    "ఆ! అలాగే అనుకోవచ్చు....." నవ్వుతూ అన్నాడు సురేంద్ర.
    "అంటే....ప్రేమ కథ లాంటిదేమయినా..."
    సురేంద్ర నవ్వాపుకోలేకపోయాడు.
    "నీ ఇష్టం! ఎలా అనుకున్నా ఫరవాలేదు. అసలు జరిగిందేమిటంటే మీ చిన్నమ్మ వాళ్ళకి రాజమండ్రినుంచి ఈ ఊరికి ట్రాన్స్ ఫరయింది. వాళ్ళింటికి ఎదుగ్గానే స్వరూప వాళ్ళిల్లు. మా చిన్నమ్మకూతురు కృష్ణకుమారి నీకు తెలుసు కదా! కృష్ణకి స్వరూపకీ స్నేహమయిపోయింది. నేను వారం రోజులపాటు శెలవులు కలిసివస్తే చిన్నమ్మ వాళ్ళింటి కొచ్చాను. కృష్ణకుమారి ద్వారా స్వరూప పరిచయమైంది. ఎంచేతో తెలీదు గాని-ఆ అమ్మాయ్ నన్ను అమితంగా ఆకర్షించేసిందిరా! అందుచేత ఆ కొద్ది రోజుల్లోనే ఆమెను వివహం చేసుకోవాలనే నిర్ణయానికొచ్చేశాను. వెంటనే మా అమ్మని వాళ్ళింటికి పంపి సెటిల్ చేయించేశాను..."
    "ఆ అమ్మాయి కూడా వప్పుకొందా?" ఆత్రుతగా అడిగాడు సృజన్ బాబు.
    "భలేవాడివే! ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఎలా చేసుకొంటాననుకొన్నావ్?
    సృజన్ బాబుని మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయ్. స్వరూప విషయం సురేంద్రకి తెలియజేయాలా వద్దా! అనేది సమస్య అయికూర్చుంది. చేస్తే తనమూలాన ఈ వివాహం ఆగిపోతుంది. చెప్పకపోతే జీవితాంతం మనశ్శాంతి కరువై పోతుంది. ఏనాటికీ సురేంద్ర దగ్గరమనస్ఫూర్తిగా మాట్లాడలేడు. వాడు తన ప్రాణ స్నేహితుడు. సురేంద్ర దగ్గర ఇలాంటి విషయం దాచటం తనకు సాధ్యం కానిపని. స్నేహానికి పరమార్ధం రహస్యాలు పంచుకోవడం. దాచుకోవడం కాదు.
    ఇద్దరూ పక్కనే ఉన్న వంతెనమీద కూర్చున్నారు. ఉండుండి చల్లని గాలి విదిలించి కొడుతోంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS