ఊరగాయ నవ్వింది.
ప్రముఖ సంస్థ ఒకటి ఊరగాయ పరిశ్రమని కూడా ప్రారంభించింది.
ఏ పేపర్లలో చూసినా ఆ పచ్చళ్లని గురించిన ప్రకటనలే! వివిధ భారతిలో ప్రకటనలే కాకుండా ప్రత్యేక కార్యక్రమాలు కూడాను. రోడ్ల మీద పోతుంటే ముఖ్యమైన సెంటర్లలో ఈ పచ్చళ్ళను గురించిన పెద్ద పెద్ద హోర్డింగ్స్! నాకు సినిమాలు చూసే తీరిగా, ఓపికా లేవుకాని, ఎడ్వర్టయిజ్ మెంట్ షార్ట్స్ సినిమాలుగా కూడా ఖాయంగా వచ్చే వుంటాయని నా నమ్మకం.
ఏమైతేనేం.... ఆ ప్రకటనల జోరుతో మనసులోనే నాసికాపుటాలకి కమ్మని ఊరగాయల వాసన తగిలి నోరూరిపోసాగింది. ఇంక ఊరి ఊరి కారిపోయే స్థితి వచ్చేసరికి జిహ్వ చాపల్యం ఆపుకోలేక ఒక సీసా కొనేశాను.
పావుకిలో సీసాకి పదిహేడు రూపాయలు పెట్టడమంటే ముందు మనసు కొంచెం పీకులాడినా అది అందించబోయే రుచులు తలచుకొని ధైర్యం చేసి కొనేశాను. కుస్తీ పోటీల్లో ట్రోఫీని కొట్టేసినట్లు, అర్జునుడు మత్స్య యంత్రాన్ని సాధించినట్లు (పడిపోయిన ఆ చేపను చేతిలో పట్టుకు తిరిగాడో, లేదో నాకు తెలీదు - అసలు ఆ చేప పడిపోయిందో, లేదో - లేదా గుచ్చుకున్న బాణం దానికే వుండిపోయిందో కూడా నాకు తెలీదు) నలుగురికీ కనిపించేటట్లు ఆ సీసాను తీసుకుని హంసగమనంతో ఇంటికి బయలుదేరారు.
అలా నెమ్మదిగా నడుస్తుంటేనే నలుగురూ నన్ను చూసి - అంతటి సాహసం చేయలేనివారు అసూయతో నావంక చూస్తారని ఆశించాను. కాని, చెప్పొద్దూ... నా విషయం పట్టించుకున్నవాడెవడూ లేకపోవడంతో నిరాశే కలిగింది. 'పోన్లే - ఇదీ మంచికే... నన్ను చూసి అసూయపడితే వాళ్ల మనసుకి బాధ కలుగుతుంది. అంటే.... పరోక్షంగా వాళ్ళని బాధించినవాడినవుతాను. ఆ పాపం అంటకుండా వుండడానికే భగవంతుడు ఇలా చేశాడు' అని నన్ను ఓదార్చుకుని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను.
ఇంటికి చేరాక... కనీసం ఇప్పుడైనా ఒక్కడైనా - ఆఖరికి.... ఇరుగుపొరుగువారైనా చూస్తారేమోనని గేటు దగ్గరే, నలుగురికీ కనిపించేటట్లు సీసా పట్టుకుని కాసేపు తారట్లాడాను. ఊహూ.... ఎవ్వరైనా పట్టించుకుంటేగా!
ఇంతలో.... లోపల్నుంచి చూసిన మా చిన్నవాడు - "అరుగో... నాన్నగారు వచ్చారు!" అన్నగావుకేకతో ఇంక అక్కడ అవకాశం లేక గేటు తీసుకుని నెమ్మదిగా లోపలకి రాసాగారు.
నా చేతిలో సీసా వుండడం చూసి, "నాన్నగారు ఏదో తెస్తున్నారు!" అని మళ్లీ ఓ అరుపు అరిచాడు వాడు.
కొంచెం దూరాన్నించి చూసినవన్నీ అరుపుల్లో చెప్పడం వాడికి అలవాటు.అది హాబీయేమో కూడా! వాడిచ్చే అనౌన్స్ మెంట్స్ చూస్తుంటే - 'భవిష్యత్తులో వీడు ఏ రేడియోలోనో, టీ. వీ. లో అనౌన్సర్ గా అఘోరించడు కదా...' అని అనిపిస్తుంది. 'అటువంటప్పుడు ఏ రైలుస్టేషన్ లోనో, బస్ స్టాండ్ లోనో రాకపోకలు తెలిపే అనౌన్సర్ కాకుడదా...?' అని మనసు పరిహసిస్తుంటుంది.'ఛీ.,... పాడు ఆలోచనలు!' అని నా మనసుని నేనే మందలించుకుంటాను.
ప్రతి చర్యకీ వాడిచ్చే కామెంట్రీ చూస్తుంటే - 'బహుశా ... వీడు ఏ క్రికెట్ కామెంటేటర్ గానో పేరు గడించి నాకూ కీర్తి తెస్తాడు' అనిపిస్తుంటుంది. వాడికి క్రెడిట్ అంటే మహాపిచ్చి ఉండడంతో ఇది నా అంతరాత్మ చెప్తున్న భవిష్యద్వాణి అనిపిస్తుంటుంది. ఇంట్లో అందరికీ - ఆఖరికి.... వంటింట్లో వంట చేసుకునే మా ఆవిడా, మధ్య గదిలో కూర్చుని 'కృష్ణా ... రామా...' అనుకునే మా అమ్మకీ కూడా ఈ జాడ్యం అంటించేశాడు వాడు. పోపు వేస్తూనే మా ఆవిడ - "ఇప్పుడు స్కోరు ఎంతరా?" అని అడుగుతుండడం, భాగవతం చదువుతూ కూడా మా అమ్మ - " ఇప్పుడు బ్యాటింగ్ ఎవరిదిరా?" అని మధ్యమధ్య అరుస్తుండడం చూస్తే' ఇది కలికాలం కాదు..., క్రికెట్ కాలం!" అనిపించేది నాకు.
మా ఇంట్లో క్రికెట్ అంటువ్యాధి సోకనివాడిని నేనొక్కడినే! అంటించాలని విశ్వప్రయత్నం చేశారు కాని, నాకు అంటుకోలేదు. 'ఎద్దుకేమి తెలుసు అటుకుల రుచి....?!'అన్న సామెతను జ్ఞాపకం చేసుకున్నారో, ఏమో.... ఇంక నా వెంటపడడం మానేశారు. క్రికెట్ వ్యాధి అంటకపోయినా మావాడి బ్యాటింగ్ పుణ్యమా ... అని రెండు మూడుసార్లు ఆ బాల్ దెబ్బలు రుచి చూశాను. దాంతో మావాడు క్రికెట్ కళానైపుణ్యం ప్రదర్శించేటప్పుడు ఆ ఛాయలకి కూడా వెళ్ళడం మానుకున్నాను.
నేనైతే నోరు మూసుకుని ఊరుకున్నానే కానీ, ఊళ్లోవాళ్ళు ఊరుకుంటారా? ఒకటి, రెండుసార్లు రోడ్ మీద పోయేవాళ్ళ వీపుల్ని ఆ బాల్ 'నగారా మోత' మోగించడం, దాంతో వాళ్ళు గేటు తీసుకుని మా కాంపౌండ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చి మావాడ్ని కొట్టేటంత పనిచేయడం, సమయానికి నేనుండి వారిని "అయ్యా... బాబూ.... ఏదో చిన్నతనం! పొరబాటయిపోయింది... ('క్షమించండి' అనడానికి అభిమానం అడ్డువస్తుందాయె!) ఇంక ఆడనీయనులెండి!" అని బ్రతిమలాడి పంపించేసరికి తల ప్రాణం తోకకి రావడంతో ఇంక నేను ఇంట్లో వుండగా మా చిన్నవాడు, పెద్దవాడు క్రికెట్ క్రీడను ఆపేశారు.
ఆ తర్వాత ఓసారి మా అమ్మగారు పండగనాడు దేవుడికి పూజ చేద్దామని దొడ్లో పూలు కోసుకుంటుంటే మావాడు కొట్టిన బంతి సూటిగా వెళ్లి ఆమె తలకి తగలడంతో "చచ్చాన్రోయ్..." అన్న పెద్ద అరుపు అరిచి క్రిందపడిపోయి కళ్లు తేలేసింది ఆవిడ. ఆవిడ ముఖాన నీళ్ళు చల్లి సపర్యలు చేశాక కాని, పోబోయిన ఆవిడ ప్రాణం తిరిగి రాలేదు. కాని, మా ప్రాణాలు మాత్రం పోయినంత పనయ్యింది. అది ఓ మాదిరి గట్టిగా వుండే కాన్వాస్ బంతి కనుక సరిపోయింది. ఆవిడ తలకి బొప్పి మాత్రమే కట్టింది. అదే అసలు సిసలు ఇనుపగుండు వంటి క్రికెట్ బాల్ అయితే తల పగిలి ప్రాణం పోయుండేదే!
ఆరోజు సెలవు కావడంతో నేనూ ఇంట్లోనే వున్నాను. ఎన్నాళ్ళ నుంచో క్రికెట్ ఆడకపోవడంతో మా అబ్బాయిలకి మనసు పెరపెరలాడింది.ఆడితే నేనేమంటానోనని భయం! ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు'టెస్ట్ డోస్' లాగా నా రియాక్షన్ చూడాలని బ్యాటూ, బంతీ పుచ్చుకుని దొడ్లో తిరిగారు. 'పోనీలే.. పండగనాడు కాసేపు ఆడుకుంటార్లే...' అని నేనూ చూసీ చూడనట్లు ఊరుకున్నాను. నాలో రియాక్షన్ రాకపోవడంతో ధైర్యం తెచ్చుకుని వాళ్లు ఇంక ఆట మొదలుపెట్టారు.
'ప్రథమ కబలేమస్తికా పాల్' అన్నట్లు - మొదటి షాట్ తోనే వాడు వాళ్ల నాయనమ్మని 'ఔట్' చేయలేదు కాని, అంతపనీ చేశాడు. ఆ దెబ్బతో వాళ్లు మళ్లీ క్రికెట్ జోలికి పోలేదు. మా అమ్మకి కూడా క్రికెట్ దెబ్బ నషాళానికి అంటిందేమో.... ఇంక స్కోర్ గురించి అడగడం మానేసింది. దానికితోడు - టీ. వీ. లో కూడా చీటికిమాటికి క్రికెట్ మ్యాచ్ లు చూపడం ఆగిపోయింది. అంతటితో ఓ వెలుగు వెలిగి ఆరినట్లే క్రికెట్ ఘోష మా ఇంట్లో అంతరించింది.
"నాన్నగారి చేతిలో ఏదో పెద్ద సీసాయే వుంది. ఫ్రూట్ జామ్ తెచ్చినట్లున్నారు" అన్నాడు మా చిన్నవాడు మళ్లీ.
"అదేంకాదోయ్... దాని ఆకారం చూస్తే బూస్ట్ సీసాలాగా వుంది. మనకి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయిగా - అది తాగితే చురుగ్గా చదువుకుంటామని తెచ్చుకుంటారు" అన్నాడు మా పెద్దవాడు- టీ. వీ. ఎడ్వర్టయిజ్ మెంట్ లు చూసీ చూసీ ఆ సారం వంటబట్టడంతో.
