పరిస్థితి ఇలా మారుతుందని మంత్రిగారు కాని, ముఖ్యమంత్రిగారు కానీ ఊహించలేదు. ప్రజల ఆవేశం ఇలాగే వుంటే ఆ ప్రవాహం ప్రభుత్వ పునాదులనే కదిపివేస్తుందన్న భయం వేసింది. పరిస్థితి తీవ్రత గురించి ముఖ్యమంత్రి ముందు భాగ్యారావుతో అంతరంగికంగానూ, అటు తర్వాత మంత్రివర్గంతో అత్యవసరంగానూ సమావేశం జరిపారు. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున వస్తున్నప్పుడు తల వంచక తప్పదని గుర్తించారు.
ఆనాటి రేడియో, టీవీ వార్తలలో మహర్షి పట్టణం సంఘటన విషయంలో తనకి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా.... ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మంత్రి భాగ్యారావుగారు తమ రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి సమర్పించినట్లు వచ్చింది. పత్రికలన్నీ ఈ వార్తను మొదటి పేజీలో ప్రముఖంగా ఫోటోలతో సహా ప్రచురించాయి.
మంత్రిగారు రాజీనామా చేయడంతో ప్రజల ఆవేశం చల్లారింది. ప్రతిపక్షసభ్యులు కూడా రభస చేయడం ఆపివేశారు. చేయాలనుకున్న ప్రజా ప్రదర్శనలూ, ర్యాలీలూ ఆగిపోయాయి.
రోజులు గడిచాయి... , వారాలూ గడిచాయి..., నెలలు గడుస్తున్నాయి!
మంత్రిగారి రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించలేదు.
భాగ్యారావుగారు దానిని ఉపసంహరించుకున్నదీ లేదు. దానిని ఆమోదించమని పట్ట పట్టనూ లేదు. ప్రజలు మళ్లీ ఆ విషయాన్ని పట్టించుకోనేలేదు. ఎంతైనా వారికి జ్ఞాపకశక్తి తక్కువ కదా!
సెక్రటేరియట్ సమీపంలో స్టార్ హోటల్ లో ప్రఖ్యాత మెజీషియన్' ధనం రెడ్డి' మాజిక్ ప్రదర్శన జరుగుతోంది. దానిని తిలకించడానికి ముఖ్యమంత్రి, భాగ్యారావు గారూ, ఇతర మంత్రులూ, అధికారులు వచ్చారు.
ముఖ్యమంత్రిగారు, భాగ్యారావుగారూ, మరికొందరు మంత్రులు ముందు వరుసలో కూర్చున్నారు.
ధనంరెడ్డిగారు - "మహాశయులారా! ఇప్పుడు మీకొక విచిత్రం చూపుతాను అని భాగ్యారావుగారితో సార్... మీ జేబులో కాగితాలు ఏమైనా వుంటే ఇలా ఇయ్యండి!' అన్నారు.
"నా జేబులో కాగితాలు ఏముంటాయి? ఒక రాజీనామా లేఖను ఎప్పుడూ జేబులో పెట్టుకు తిరుగుతుంటాను" అన్నారు భాగ్యారావుగారు.
"ఫర్వాలేదు. అదే ఇయ్యండి" అన్నారు రెడ్డిగారు.
భాగ్యారావుగారు దానిని బయటకు తీసి ధనం రెడ్డికి అందించాడు.
"మహా జనులారా! ఇదిగో... ఇది భాగ్యారావుగారి రాజీనామా లేఖ. దానిని మళ్ళీ వారికే ఇచ్చేస్తున్నాను" అని తిరిగి ఇచ్చేశాడు.
భాగ్యారావుగారు దానిని తిరిగి జేబులో పెట్టుకున్నారు.
"అబ్రకదబ్ర" అని, "సార్... ఆ లేఖ మళ్లీ ఒకసారి ఇలా ఇస్తారా?" అని అడిగాడు ధనం రెడ్డి.
భాగ్యారావుగారు జేబులో చేయి పోనిచ్చారు. "అరే... ఏమైందీ? ఇక్కడే పెట్టాను. కనిపించడం లేదు" అంటూ మిగిలిన జేబులు కూడా వెతుక్కోసాగారు.
"అయ్యా ..మంత్రిగారి రాజీనామా లేఖ మాయం అయిందట. మీ ఎవరి జేబుల్లోకైనా వచ్చిందేమో కొంచెం చూసుకుంటారా?" అన్నాడు ధనం రెడ్డి.
అందరూ తమ జేబులు చూసుకోసాగారు.
"అయ్యా.... ముఖ్యమంత్రిగారూ! తమరు మరోలా అనుకోకపోతే ఒక్కసారి తమ జేబు కూడా చూస్కుంటారా?" అన్నాడు ధనం రెడ్డి.
ఇబ్బందికరంగా ముఖంపెట్టి ప్రక్కనజేబులోకి చేయి పోనిచ్చారు ముఖ్యమంత్రిగారు.
అంతే..... తేలు కుట్టినట్లు ఒక్కసారి చేయి పైకి లాక్కున్నారు. దాంతోపాటు ఆ రాజీనామా లేఖ పైకి వచ్చింది. "అరే.... ఈ రాజీనామా లేఖ నా జేబులోకి ఎలా వచ్చిందీ?" అన్నారు ఆశ్చర్యంగా పైకి.
"భాగ్యారావుగారి రాజీనామా లేఖ ముఖ్యమంత్రిగారి జేబులోకి ప్రవేశించింది. ఆ లేఖ సమర్పించవలసింది ఆయనకేగా!" అన్నాడు ధనం రెడ్డి నవ్వుతూ.
సభికులు హర్షాతిరేకంతో చప్పట్లు చరిచారు.
"అయ్యా ..ముఖ్యమంత్రిగారూ.... తమరు దయచేసి ఆ రాజీనామా లేఖను మరోసారి తీసి ఇలా ఇస్తారా?" అన్నాడు ధనం రెడ్డి.
ముఖ్యమంత్రిగారు జేబులోకి చేయి పోనిచ్చారు. ఆ లేఖ తగల్లేదు. చేతిని బాగా పోనిచ్చి వెతికారు. కనిపించలేదు. జేబును తిరగేసి చూశారు. అయినా కనిపించలేదు. మిగిలిన జేబుల్లో కూడా వెతికారు. ఎక్కడా కనిపించలేదు.
ఆ లేఖ మాయమయింది. "మీరే ఏదో చేశారు!" అన్నారు ముఖ్యమంత్రిగారు.
"మాయమయిందా? ఉష్ కాకీ అయిందన్నమాట! ఇంక అది కనిపించదు" అన్నాడు ధనం రెడ్డి .
హాలు చప్పట్లతో దద్దరిల్లిపోయింది.
తన రాజీనామా లేఖ శాశ్వతంగా మాయమవడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు భాగ్యారావుగారు.
- రచన... ప్రత్యేక సంచిక.... మే' 98
*********
