ఈ మిస్టరీ ఏమిటో మనం తెలుసుకోవాలి! ఇవాళ నించి అదే మన ప్రోగ్రాం! ఒకే! అన్నది ప్రియాంక!
బిగ్రేడ్ లో సభ్యులందరూ అలాగేనని తలలు ఊగించారు.
"ఆ అందగాడి పేరేమిటన్నావూ? మర్చిపోయాను "
"నీ పేరే నీకు గుర్తుండదు. ఇంకొకరి పేరెలా గుర్తుంటుంది. నీ తలలో ఉన్నది మెదడు కాదు. మట్టి ముద్ద" తలలూగించే పూలమొక్కల వంక చూస్తూ అన్నది ప్రియాంక.
"మళ్ళీ మళ్ళీ ఆ పేరు చెప్పాలంటే సిగ్గు పడుతోందే!"
"షటప్! నాకెందుకూ సిగ్గు"
"నువ్వు అతన్ని ప్రేమిచావని అందరూ చెప్పుకుంటున్నారు"
"అందరూ చెప్పుకుంటున్నారా? నువ్వు అనుకుంటున్నారా?"
"దానికొచ్చే వెర్రి ఆలోచనలన్నీ అందరి నెత్తిన రుద్దటం దానికి అలవాటే కదా! కొత్తేముంది!" అన్నది మరో అమ్మాయి.
"వెర్రి వెర్రి ఆలోచనలు చేశావంటే తంతాను. ఐస్ క్రీం వస్తోంది అందరూ తినండి" అంది ప్రియాంక.
ఆమెతో స్నేహం చేయటం ఓ ఆకర్షణ! కావలసినంత కాలక్షేపం! తినేందుకు వచ్చిన వాళ్ళు దగ్గర అవుతారు.
ఐస్ క్రీం తెచ్చిన వ్యక్తీ నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. అందంగా క్రాప్ దువ్వుకున్నాడు. ఒక చేతిలో హ్యాండ్ స్టిక్ ఉంది. మరో చేతిలో ట్రే ఉంది. అందంగా పాలిష్ చేసిన షూ!
నెమ్మదిగా అడుగు వెంట అడుగు వేస్తూ వచ్చాడు. లాన్ లో బ్రిగ్రేడ్ అంతా కుర్చీలు వేసుకున్నారు.. మధ్య టీ పాయిఉంది. ఐస్ క్రీం కప్పులున్న ట్రేని దాని మీద ఉంచాడు.
"రాందుల్ణారీ! స్పూన్లు మర్చిపోయావు" అంది ప్రియాంక.
"అవును మర్చిపోయాను. ప్రిజ్ మీద ట్రేలో ఉన్నాయి. ఐస్ క్రీం తీసి కప్పుల్లో ఉంచాను. స్పూన్లు సంగతి గుర్తు రాలేదు. వెళ్ళి తీసుకొస్తాను." అంటూ తిరిగి మాములుగా వెళ్ళిపోయాడు రాందులారీ!
"అతన్ని చూస్తే మీకేమనిపిస్తోంది?" అని అడిగింది ప్రియాంక.
"పనివాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందేమిటి? పనివాడనే అనిపిస్తుంది .
'అది కాదు . ఎలా ఉన్నాడు"
"మనిషి లాగే వున్నాడు"
"మాములు మనిషిలాగే ఉన్నాడా?"
"మనిషి మనిషిలా ఉండగా పశువులా ఉంటాడా?"
"అతను గ్రుడ్డివాడు"
"మమ్మల్ని పిచ్చివాళ్ళని చెయ్యకు"
"కాని కళ్ళున్న వాళ్ళ కన్నా చాలా నయం. కళ్ళున్నా పనివాళ్ళు చేసే పొరపాట్లు అతడు చెయ్యడు"
"గుడ్డివాడు అంటే రెండు కళ్ళు లేవా?"
"నూటికి నూరు శాతం చూపు లేదోయ్!"
"మామూలు మనిషిలాగే తిరుగుతున్నాడు కదా!"
"అదే అతని ప్రత్యేకత! వారం రోజుల్లో ఏ యింటిలో అయిన యిట్టే యిమిడి పోతాడు. అన్నీ తెలుసుకుంటాడు "
"పనిలో పెట్టుకునేందుకు కళ్ళున్న వాళ్ళెవ్వరూ దొరకలేదా?"
"అలాగని ఎగతాళి చెయ్యను. వాళ్ళు మనుషులే కదా! కలలుంటాయి. ఆశయాలుంటాయి. కోరికలుంటాయి. అందరిలాగానే సంతోషంగా ఉండాలనీ ఉంటుంది. సుఖ దుఃఖాలు ఉంటాయి. వాళ్ళని మనం గౌరవించాలి. ఆదరంగా చూడాలి! యెగతాళి చెయ్యకూడదు రామ్ దుల్లారీ నూటికి నూరు శాతం చూపు లేనివాడే!
ఓ రోజు డిల్లీ రైల్వే స్టేషన్ లో డాడీ వెయిటింగ్ రూం లో కూర్చున్నారు. మినీ ట్రాన్సిష్టర్ లో మా వ్యాపారాల అడ్వర్టైజ్ మెంట్లూ చూస్తున్నారు. ఈలోగా రైలు వచ్చింది. హడావుడిగా సామాను తీసుకుని బయల్దేరాడు డాడీ.
"మీకు రిజర్వేషన్ అయిందా?" అని ఎవరో స్నేహితుడు అడిగారట! 'అయింది ఏసీ. కూపే! నంబర్ ఏలేవేన్" అని చెప్పి డాడీ వచ్చేశారు.
కూపేలో కూర్చున్న తరువాత పది నిమిషాలకి ట్రాన్సిష్టరు గుర్తొచ్చింది. రైలు కి ఇంజన్ ఎటాచ్ అయింది కూడ.
బయలుదేరే వేళ అయింది. కూత వేస్తోంది.
తిరిగి వెళ్ళి ట్రాన్సిస్టరు తెచ్చుకునే సమయం లేదు. దాని మీద ఆశలు వదులుకున్నారు.
"ఇది ఏసి. కూపే కదండీ " నల్ల కళ్ళాద్దాలు పెట్టుకున్న రాందుల్లారీ మా డాడీనే అడిగాడు.
"అవును ఎందుకు? ఏ.సి కూపే అయితేనే కాని బెగ్గింగ్ చెయ్యవా?"
"ఇది సీట్ నెంబర్ ఎలెవన్ కదండీ!"
"అవును ఎలేవెన్! సీట్ నంబర్లవారీగా చేస్తావా! బెగ్గింగ్!"
"అది కాదు సార్! ఇందాక వెయిటింగ్ రూమ్ లో కూర్చుంది మీరే కదా!"
"అవును, నువ్వు అక్కడే కన్పించావు . నేను కన్పించటం లేదా?"
"లేదయ్యా! నాకు కన్పించడు. భగవంతుడు జన్మ యిచ్చాడు కాని చూపు యివ్వలేదు."
"ఓ నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నావు కదా గుర్తించలేక పోయాను. నన్నెలా గుర్తించావు?"
"గొంతు విని గుర్తించా బాబుగారూ!"
"మంచి తెలివయిన వాడివే! ఇదిగో రూపాయి బ్రెడ్ కొనుక్కో"
"అడుక్కునేందుకు రాలేదు బాబయ్య!"
"మరెందుకొచ్చావు"
"వెయిటింగ్ రూం లో మీరు మీ ట్రాన్సిష్టరు మర్చిపోయారు. ఇదిగో తెచ్చాను " అంటూ ట్రాన్సిష్టర్ అందించాడు.
డాడీ చాల ఆశ్చర్యపడిపోయారు. అతనికి చూపు లేదు. కాని తెలివి ఉంది. నిజాయితీ ఉంది.
"కళ్ళున్నా మా కంటే నువ్వే నయం " అన్నారు.
"అదేంటి బాబయ్యా! కబోది జీవితం కదా నాది. ట్రాన్సిష్టర్ వింటూ మీరు మాట్లాడుకుంటున్నారు. ట్రాన్సిష్టర్ మీదే అని అర్ధమయింది. ఎవరో స్నేహితుడు అడిగితె మీ సీటు నెంబర్ చెప్పారు. మీరు వెళ్ళాక కూడా యిది మ్రోగుతుంది.
మర్చిపోయివుంటారని ఊహించాను. ఇంటికి వెళ్ళాక గుర్తొచ్చి బాధపడతారు కదా! మీరు పోయింది అనుకోరు. ఆంధ్రాకి పోయి డిల్లీ రైల్వే స్టేషన్ లో దొంగలు కొట్టేశారని చెప్తారు. ఆ అవమానం దొంగలకి కాదు . డిల్లీకి!' ఆ మాటలు వింటున్న ఇతరులు కూడా అమితాశ్చర్య పోయారు.
అతని సంస్కారం వారందరినీ ఆకర్షించింది. కళ్ళు లేక పోయిన మనోనేత్రం ఉన్న ఉత్తమ సంస్కారి రామ్ దుల్లారీ!
"నువ్విక్కడి ఏం చేస్తుంటావు?"
"కళ్ళు లేని కబోదిని బాబూ! దిక్కుమాలిన జన్మ!"
"నీకు ఎవరూ లేరా?"
"దిక్కుమాలోన వాళ్ళకి దేవుడొకడున్నాడు దిక్కు"
"నీ తెలివీ జాగ్రత్త, నిజాయితీ నాకు నచ్చాయి. నాతొ వస్తావా ?
"వస్తాను కాని మీకు నామీదుండే నమ్మకం మీ వాళ్ళందరికీ ఎందుకుంటుంది బాబూగారూ!" అన్నాడు రామ్ దుల్లారీ!
"అదంతా నేను చూసుకుంటాను " అంటూ వెంట పెట్టు కొచ్చారు డాడీ. ఇంటి కొచ్చాక అయిదారు రోజుల్లో ఎక్కడేముందీ అన్నీ కనిపెట్టేశాడు. కంటిచూపు ఉన్న మనుషులయినా పొరపడతారు. విశ్రాంతి కావాలనుకుంటారు.
కాని రాందుల్లరీ ఎప్పుడు నిద్ర పోతాడో తెలియదు. ఎప్పుడు మేల్కుంటాడో తెలియదు. ఆ వరండాలో పడుకుంటాడు.
ఎవరే పని చెప్పినా చేసేస్తాడు.
ఈ మధ్య మార్కెట్ కీ, పోస్ట్రాఫీసు కి కూడా వెళ్ళ గలుగుతున్నాడు అంటూ అతని కధ అంతా వివరించింది ప్రియాంక!
