"అయితే దొంగ లాటరీ టికెట్లు ఉన్నాయంటావు."
"అసలు వాటికన్నా నకిలివే ఎక్కువ అమ్ముతారు. ఎందుకంటె నిజమయిన టికెట్ అమ్మితే యిరవై పైసలు మిగుల్తాయి. నకిలీ టికెట్ అయితే మొత్తం రూపాయి మిగుల్తుంది కదా!"
"డ్రా తియ్యక ముందే ప్రయిజ్ వచ్చే నంబర్ తేలుస్తుందంటావు"
"తప్పకుండా తెలుస్తుంది "
"లాటరీ వ్యాపారం నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చుకునెందుకు తెలీని కలిగన వాళ్ళు సృష్టించిన మాయ అంటావు"
"నేననటం కాదు. అసలు నిజం అదే!"
జయసింహ కళ్ళు తెరుచుకున్నాయి. తన సమస్యకి ఈ మనిషి ఏదయినా సమాధానం చెప్పగలదనిపించింది.
"బైరాగీ! నేనొక టికెట్ తీసుకున్నాను. దాని నంబర్ నోట్ చేసుకుని లాకర్ లో దాచాను. ఆ నంబర్ కి ప్రైజు వచ్చింది. కాని డ్రా తీసేలోగానే బాంక్ లాకర్స్ ప్రేలిపోయాయి.
ఇప్పుడు నేను పది లక్షలు కోల్పోయాను. అదే నెంబర్ గల టికెట్ మరొకరు డిపాజిట్ చేసి డబ్బు తీసుకున్నారు.
ఇదెలా జరిగి ఉంటుందంటావు?" అని అడిగాడు.
భైరాగి గంజాయి దట్టించిన చిలుం పట్టి రెండు దమ్ములు లాగాడు. కళ్ళు తేలిపోతూ ఉండగా గుబురు గడ్డంలోకి వ్రేళ్ళు పోనిచ్చి నిమురుకున్నాడు తాపీగా!
"అదా సంగతి!? అదన్న మాట దిగులు? ప్రయిజ్ తీసుకొన్న వాళ్ళది నకిలీ టికెట్ కావచ్చు. కాని అది నకిలీ టికెట్ అని నువ్వు నిరూపించాలంటే అసలు టికెట్ ని నువ్వు చూపగలగాలి.
ఆ టికెట్ ఎక్కడ కొన్నావు?" కళ్ళు చికిలించి చూచాడు.
"శ్రీవన దుర్గాంబా ఏజన్సీ లో కొన్నాను"
"నీకు నకిలీ టికెట్ ఇచ్చుంటాడు కోటిలింగం . వాడు నాకు బాగా తెలుసు! బడాచోర్" అన్నాడు బైరాగి!
"నాకు యిచ్చింది నకిలీ టికెట్ అయ్యేందుకు వీలులేదు. ఆ నకిలీ టికెట్ అయితే లాకర్ ని ప్రేల్చి వేయవలసిన అగత్యం లేదు" జయసింహ లాజికల్ గా అలోచించి చెప్పాడు.
"అయితే నీ టికెట్ నంబర్ అతనికి గుర్తుండాలి!"
"కాని దాన్ని నేను ఎక్కడ దాచానో అతనికి తెలియదు కదా?"
"అంతా గొడవగా ఉంది. ఇలాంటి కేసులు నాకు తెలుసు. కాని నువ్వు దాన్ని ప్రైజు ప్రకటించకముందే లాకర్ లో దాదాపు సహజంగా ఎవరూ అలా చేయరు.
అందువల్ల నీ కేసు క్రొత్తగా అనిపిస్తోంది. అర్ధం కాలేదు"
"ఇప్పుడు నాకు అర్ధమవుతోందిలే!" అంటూ కదిలిపోయాడు జయసింహ! బైరాగి కళ్ళు అప్పగించి చూస్తున్నాడు.
అసలు టికెట్ స్మాష్ అయ్యాక నకిలీ టికెట్ కి తిరుగులేదు. టికెట్ కొన్న అసలు వ్యక్తీ దాన్నిఆశ్రద్దగా చేజార్చుకోవచ్చు. కొందరు జేబులో పెట్టుకుని మర్చిపోయి చాకలికి బట్టలు వేయవచ్చు. కొందరు చిత్తు కాగితాలు చింపుతూ దాన్ని కూడా చించి పారేయవచ్చు.
ఒక మద్రాసీ లక్ష రూపాయల ప్రైజు వచ్చిన టికెట్ పేడా పళ్ళికల్లో దాచి పోగాట్టుకుంది. ప్రైజు రాలేదు. ఓ క్లీనరు కుర్రాడు లారీ సీటు క్రింద దాచుకుని పోగొట్టుకున్నాడు. లాటరీ వచ్చినా డబ్బు మాత్రం రాలేదు.
లాటరీ అంటే అదృష్టం దురదృష్టాల మధ్య దోబూచులాట.
ఎన్నో చిత్రాలు జరుగుతుంటాయి.
కాని తాను పోగొట్టు కోవటం వెనుక ఏదో కుట్ర జరిగింది.
బ్యాంకు లాకర్స్ తీసుకున్న వారిలో తన ప్రక్క నున్న వారెవరో వీరి లాకరులో బాంబు దాచవచ్చు! లేదా బాంకు లోపల ప్రవేశించి బాంబు అమర్చవచ్చు. బాంబు అమర్చే అవకాశాలు అనేకం వుంటాయి.
వీరికి తాను లాకరులో దాచినట్లు తెలియాలి!
ఎలా తెలిసిందనే విషయం అలా ఉంచి అలాంటి వారు తాను లాటరీ తీసుకున్న తరువాతే అ లాకరు తీసుకుంటారు!
తనతో పాటుగా కాక ఆ తరువాత లాకరు తీసుకున్న వారెవరో తెలుసుకోవటం సులభమే! ఎందుకంటె తాను లాకరు తీసుకుని ఎక్కువ రోజులు గడవక ముందే అది ప్రేలిపోయింది.
వారికి అ నెంబరుకే ప్రైజు వస్తుందని ఎలా తెలిసింది?
ప్రయిజు వచ్చే నంబరు తన దగ్గరుందని దాన్ని లాకరులో దాచానని వారికి ఎలా తెలిసింది?
నకిలీ టికెట్స్ కి బ్లాక్ మనీకి ఉన్న సంబంధం ఏమిటి?
నల్ల డబ్బు అనే అడవి మృగాలు ఏ నంబరుకి ప్రయిజు వస్తుందో ముందుగా ఎలా తెలుసుకుంటారు?
చాలా ముఖ్యమయిన ప్రశ్నలు అతని మనసుని పట్టాయి? వాటికి సమాధానాలు వెతకటం అంత తేలికయిన పని కాదు.
కాని తన విషయంలో ఆ సమాచారమంతా సేకరించాలంటే ముందు తన తరువాత లాకర్సు ప్రేలిపోయే ముందుగా జరిగిన ఆ కొద్ది రోజుల్లో ఎవరు లాకరు తీసుకున్నారో తెలుసుకోవాలి.!
అగమ్య గోచరమయిన చాల పెద్ద ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతకటం అక్కడ నించే ప్రారంభం కావాలి.
బ్యాంకు మేనేజరు సహకరించటం ల్లేదు. అందువల్ల తిరిగి అతని దగ్గరకు పోవాలంటే మనస్కరించలేదు.
కాని పరిశోధన ప్రారంభించాలి! ఆలోచనల మధ్య ఎంత దూరం నడించింది తెలియలేదు. వివశుడైపోయి ఆలోచించాడు.
డింగ్ డాంగ్ క్లాత్ షోరూం వరకు వచ్చాడు. ఇదమిద్దమయిన అభిప్రాయం ఆలోచన పధకం లాంటివి ఏమీ లేకుండానే బ్యాంకు లోనికి నడిచాడు.
అటెండర్ మేల్దా మీద కూర్చుని కన్పించాడు.
"మేనేజర్ గారున్నారా?" అని అడిగాడు.
"లేరు! బయటికేళ్ళారు. మరో అరగంటలో వస్తారు"
"లాకర్ కీ హ్యాండోవర్ చెయ్యాలి. ఎవర్ని చూడాలి"
"అమ్మాయి గారిని అడగండి" అంటూ షీనా వంకా చూపించాడు. అటు వైపుగా నడిచాడు. బ్యాంకులో జనం రద్దీలేదు.
వాలెట్ లోంచి చిన్న అద్దంతీసి ముఖాన్న అతికించుకున్న 'బిందీ ప్లాస్టిక్ బొట్టు సరిగా ఉందొ లేదో చూసుకొంటోంది షీనా!
ట్రిమ్ చేసుకున్న ఐ బ్రోస్ ని మరొకమారు చూసుకుంది. బ్యూటీ క్లినిక్ వాళ్ళు చేసిన హెయిర్ స్టెయిల్ మొత్తం కన్పించలేదు.
తీరికగా ఉన్న తన ప్రశంతతని భగ్నం చేస్తూ దగ్గరగా అడుగు చప్పుడు విన్పించటంతో తల ఎత్తి చూసింది.
"వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ!?"
"ప్రేలిపోయిన లాకర్ తాలుకూ "కీ' యిచ్చేందుకొచ్చాను"
"అవును, మీ అందరికీ క్రొత్త లాకర్స్ యిస్తున్నారు" సంతకాలు పెట్టించుకుని 'కీ' హ్యాండోవర్ చేసుకుంది.
"మీరే చివరిగా యిచ్చారు!"
"మిగిలిన వారందరూ యిచ్చేశారా? చివరగా లాకర్ తీసుకుంది కూడా నేనే కదండీ! అందుకే చివరగా యిచ్చాను "
ఆమె రిజిష్టర్ వంక చూస్తోంది.
"అదేమిటలా అంటారు. చివరివారు మీరెందుకవుతారు?"
"నా తరువాత ఎవరున్నారు?"
"ఒకరున్నారు"
"కొంచెం వారి అడ్రసు యిస్తారా?"
"మీకెందుకు? అలా యివ్వకూడదు"
"మీరు చెప్పదలుచుకుంటే అడ్డేముంది?"
"చెప్పవచ్చు . కాని.....!"
"ఈ సాయం చేస్తే మీ మేలు ఎన్నటికీ మర్చిపోను"
"అయితే మీరు ఒకసారి మా యింటి దగ్గర కలవండి" అడ్రస్ యిచ్చింది.
"థాంక్స్" అంటూ తిరుగు ముఖం పట్టాడు జయసింహ!
అతడు అలా వెళ్ళగానే అంతసేపూ ఎంతో జాగ్రత్తగా వారి మాటలు వినాలని ప్రయత్నించిన అటెండరు ఆమె దగ్గరగా వచ్చాడు!
