Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 24


                                           ఇరువది ఏడవ సూక్తము

           ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. సోమరసమున ప్రసన్నుడై ఇంద్రుడు ఏమి చేసినాడు? ఈ సోమరసమును త్రావి ఏమి చేసినాడు? ఈ సోమరసముతో మైత్రిచేసి ఏమి చేసినాడు? పురాతనులు, ఆధునాతనులగు స్తోతలు సోమగృహమున నీ వలన ఏమి పొందినారు?

    ("భరద్వాజృషిః ఫలవిలంబనాసహిష్ణుఃసన్ అనయేంద్ర మాక్షిపతి" అని శాయణుడు. భరద్వాజునకు ఫలప్రాప్తిలో జాగు జరిగినందున ఇంద్రుని ఆక్షేపించుచున్నాడు. "ఎవడబ్బసొమ్మని" రామదాసు రాముని సరిగ్గా ఈ కారణముననే ఆక్షేపించినాడు)

    2. సోమపానమున ప్రముదితుడయిన ఇంద్రుడు శుభ సుందర కార్యములు చేసినాడు. సోమరసపానముచేసి సుందరకర్మలు చేసినాడు. దానితో అతడు శుభకార్యములు చేసినాడు. పురాతన, అధునాత స్తోతలకు యజ్ఞగృహమున శుభకర్మలు ప్రసాదించినాడు.

    ("ఏవమాక్షిప్త ఇంద్రః తస్మై ఋషయే ఈప్సితం ధనం ప్రదదౌ తదనంతరం ఋషిః" శాయణుడు. ఆవిధముగ ఆక్షేపించగా ఇంద్రుడు ఆ ఋషికి కోరిన ధనము ఇచ్చినాడు. తరువాత ఋషి అన్నమాటలివి)

    3. ధనవంతుడవగు ఇంద్రా ! నీ సమాన మహిమగల వాడు మాకు కనిపించడు. నీ సమాన ధనవంతుడు మాకు కనిపించడు. నీకు సరివచ్చు సమర్థుడు మాకు కనిపించడు.

    4. ఇంద్రా ! నీవు 'వరశిఖాసురు' ని పుత్రులను వధించినతీరు మాకు అవగతము కాలేదు. బలపూర్వక నిక్షిప్తమగు నీ వజ్రధ్వని మాత్రమునకే బలిష్టతములగు వరశిఖ పుత్రులు అసువులు బాసినారు.

    5. ఇంద్రుడు చయమానరాజుయొక్క అభ్యవర్తినామక పుత్రునకు ధనప్రదానము చేయుచు పరశిఖాసురుని పుత్రులను వధించినాడు. 'హరియూప' నది లేక నగరపు పూర్వ భాగమున వసించిన వరశిఖగోద్రజుడగు 'వృచీవాన్' పుత్రులను ఇంద్రుడు పరిమార్చినాడు. అప్పుడు ఉపరిభాగమున ఉండి వరశిఖుని శ్రేష్ఠపుత్రులు ఆ భయమున చచ్చినారు.

    6. బహుజన ఆహూత ఇంద్రా ! యుద్ధమున నిన్ను గెలిచి అన్నము, యశము సాధించదలచినవారు, యజ్ఞపాత్రలను భగ్నము చేసినవారు, కవచములు ధరించినవారగు వరశిఖుని నూటముప్పది మంది పుత్రులు యవ్యావతి హరియూపియ వద్దకు వచ్చి ఏకకాలమున నిహతులయినారు.

    7. ఇంద్రుని అశ్వములు రోచమానములు. శుభంకరులు. తృణాభిలాషులు. తేపతేప గడ్డి రుహి చూచునవి. అవి ద్యావాపృథ్వుల మధ్య సంచరించును. ఇంద్రుడు సృంజయరాజువద్దకు తుర్వశరాజును చేర్చినాడు. దేవవాక్ వంశజుడు 'అభ్యవర్తి' రాజు వద్ద వరశిఖ పుత్రులను వశీభూతులను చేసికున్నాడు.

    8. అగ్నీ ! మరింత ధనము ఇచ్చువాడు. రాజసూయము చేసినవాడు. చయమాన పుత్రుడు. అభ్యవర్తి మాకు భరద్వాజునకు స్త్రీల సహితముగా రథములు ఇరువది ఆవులు ఇచ్చియున్నారు. వృధువంశధరుడు రాజు అభ్యవర్తియొక్క ఈ దక్షిణ అవినాశ్యము.

                                         ఇరవది ఎనిమిదవ సూక్తము

        ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు 2,3 జగతి, మిగిలినవి అనుష్టుప్.

    1. గోవులు మా ఇంటికి రావలెను. మాకు శుభములు కూర్చవలెను. అవి మా కొట్టమున విశ్రమింపవలెను. మా విషయమున ప్రసన్నులు కావలెను. ఈ కొట్టమున వివిధ వర్ణములు గోసంతతి కూడినది. ఆ గోవులు ఉషఃకాలమున ఇంద్రునకు పాలు ప్రదానము చేయవలెను.
   
    2. ఇంద్రుడు యజ్ఞము చేయువారలకు, స్తోత్రములు చేయువారలకు కోరినంత ధనము ఇచ్చును. అతడు వారికి సర్వదా ధనము ఇచ్చును. అతడు వారి స్వంత ధనమును తీసికొనడు. ఇంద్రుడు నిరంతరము వారి ధనమును పెంచును. వారిని ఆ ఇంద్రాభిలాషులను శత్రువులకు దుర్భేద్యమగు స్థానమున నిలుపును.

    3. గోవులు మా వద్ద నష్టపడరాదు. దొంగలు మా గోవులను దొంగిలించరాదు. శత్రువుల ఆయుధములు మా గోవులమీద పడరాదు. గోవులుగల యజమాని ఇంద్రాది దేవతలకు యజనముచేసిన గోవులు ఇంద్రునకు ఇచ్చిన గోవులతో చిరకాలము సంబంధము కలిగి ఉండవలెను.

    4. దుమ్ము రేపుచు, యుద్ధమునకుసాగు అశ్వములు గోవులను చేరరాదు. అవి విశ్వసనాది సంస్కారములు పొందరాదు. యాగశీల నరుని గోవులు నిర్భయముగా స్వేచ్చగా సంచరించును.

    5. గోవులు మాకు ధనము కావలెను. ఇంద్రుడు మాకు గోవులను ఇవ్వవలెను. గోవులు హవ్య శ్రేష్ఠసోమరస భక్షణ ప్రదానము చేయవలెను. నరులారా !! గోవులే ఇంద్రుడగును శ్రద్ధగల మనమున గోవులను కోరండి.

    6. గోవులారా! మాకు పుష్టిని ఇవ్వండి. మీ క్షీణము, అమంగళ అవయములను సుందరముగా మలచండి. శుభవచన గోవులారా ! మా ఇంటికి శుభములు సమకూర్చండి. యాగసభలో మీ మహా అన్నమే కీర్తించబడును.

    7. గోవులారా ! మీరు సంతానయుక్తులుకండు. చక్కని గడ్డి మేయండి. నిర్మల తటాకజలము త్రాగండి. హింసించు జంతువులు మీమీద పడరాదు. కాల కుఠారము మీకు దూరముగా ఉండవలెను.

    8. ఇంద్రా ! నీకు బలము కలుగుటకు గోవులకు పుష్టి కలుగవలెనని ప్రార్థింతుము. గోవులకు గర్భాదానము చేయు వృషభములు బలము కలవి కావలెనని ప్రార్థింతుము. అందువలన గోవులక్షీరాదికములతో ఇంద్రుడు సంతుష్టుడగును.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత నాలుగవ అష్టకము ఆరవ మండలమున నాలుగువ అధ్యాయమున ఆరవ అధ్యాయము సమాప్తము)


        ఓం నతామినన్తిమాయినో నధీరావ్రతా దేవానాం ప్రథమాధ్రవాణి
        నరోదసీ అద్రుహా వేద్యాభిర్నపర్వతావి నమే తస్థివాంసః

               ఏడవ అధ్యాయము             ఇరువది తొమ్మిదవ సూక్తము

             ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. యజమానులారా ! మీ నేతృస్వరూప ఋత్విక్కులు స్నేహభావమున ఇంద్రుని సేవింతురు. వారు మహాస్తుతులు ఉచ్ఛరింతురు. వారి బుద్ధి శుభంకరము. అనుగ్రహాత్మకము. ఇంద్రుడు మహాధనప్రదాత. అందుకే రక్షణలకుగాను రమణీయుడగు మహా ఇంద్రుని పూజింతురు.

    2. ఇంద్రుని చేత మానవహితకర ధనము సంచితమై ఉన్నది. ఇంద్రుడు రథారూఢుడు. అతడు బంగారు రథము ఎక్కును. అతని విశాల బాహువులందు కిరణములు నిలిచి ఉన్నవి. ఇంద్రుని అశ్వములు బలిష్ఠములు అవి రథమునకూడి ఇంద్రుని వహించును. అట్టి ఇంద్రుని మేము స్తుతింతుము.

    3. ఇంద్రా ! ఐశ్వర్యలాభమునకుగాను భరద్వాజుడు నీ పాదసేవ చేయుచున్నాడు. నీవు నీ బలమున శత్రువులను పరాజితులను చేయుదువు. వజ్రము ధరింతువు. స్తోతలకు ధనము ప్రదానము చేసెదవు.నేతవగు ఇంద్రా ! అందరి దర్శనార్థము నీవు ప్రశస్తము, సతత గమనశీల రూపము ధరించుము. సూర్యునివలె పరిభ్రమణశాలిని అగుము.

    4. సోమము అభిషుతముకాగా చక్కని మిశ్రమము అగును. సోమము అభిషుతముకాగా పాకయోగ్యములగు పురోడాశాదులు వండబడును. వేపిన యవలు పేలాలుకావచ్చును. సంస్కరింపబడును. హవిర్లక్షణ అన్నకర్తలగు ఋత్విక్కులు స్తోత్రములతో ఇంద్రుని స్తుతింతురు. వారు శాస్త్రములను ఉచ్ఛరించుచు దేవతల వద్దకు వెళ్లుదురు.

    5. ఇంద్రా ! నీ బలము అపారము. ద్యావాపృథ్వులు నీ మహాబలమునకు బెదురుదురు. గోపాలుడు నీరు త్రాగించి గోవులను తృప్తిచెందించినట్లు స్తోతలు వెంటనే తృప్తినిచ్చు హవ్యముతో యజ్ఞముచేసి నిన్ను తృప్తుని చేస్తారు.

    6. అందమగు ముక్కు, దవడలుగల ఇంద్రుడు ఈవిధముగా ఆహ్వానించ యోగ్యుడు. ఇంద్రుడు స్వయముగా వచ్చినను, రాకున్నను స్తోతలకు ధనము ప్రదానము చేయును. ఉత్కృష్టతర బలశాలి ఇంద్రుడు వృత్రాది అనేక రాక్షసులను, శత్రువులను పరిమార్చును.


                                        ముప్పదవ సూక్తము

           ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. వృత్రవధాది వీరకార్యములు చేయుటకుగాను ఇంద్రుడు మరల ప్రవృద్దుడయినాడు. ఇంద్రుడు ప్రధానుడు. జరారహితుడు. అతడు స్తోతలకు ధనము అందించవలెను. అతడు ద్యావాపృథ్వులను అతిక్రమించును. ద్యావాపృథ్వులు రెండు ఇంద్రునకు సగము భాగమే అగును !

    2. ఇంద్రుని బలము అసురులను హతమార్చగలది. మేము ఇప్పుడు ఇంద్రుని బలమును స్తుతించుచున్నాము. ఇంద్రుని మహాకార్యములను ఎంతటివాడును బాధింపజాలడు. అతడు నిత్యము తిరిగు సూర్యుని దర్శనీయుని చేసినాడు. శుభకర్మలు చేయు ఇంద్రుడు భువనములను విస్తీర్ణము చేసినాడు.

    3. ఇంద్రా ! తొలినాటివలె నేడును నదులకు సంబంధించిన నీ కార్యము కొనసాగుచున్నది. నదులు పారుటుకు నీవే బాటలు వేసినావు. భోజనమునకు స్థిరముగా కూర్చున్న మానవులవలె నీ ఆ దేశమున పర్వతములు నిశ్చలములై నిలిచినవి. శుభ కర్మలు చేయు ఇంద్రా ! సమస్త లోకములు నీవలననే స్థిరములు అయినవి.

    4. ఇంద్రా ! నీ సదృశుడు మరొకడు లేడు. నీ సదృశుడగు దేవతలేదు. నరుడు లేడు. ఈ మాటలు వాస్తవ సత్యములు. జలరాశి ఆక్రమించి పడుకున్న మేఘమును నీవు వధించినావు. సముద్రమున చేరుటకు జలమును నీవు విముక్తము చేసినావు.

    5. ఇంద్రా ! వృత్రుడు ఆక్రమించి పెట్టుకున్న జలరాశిని ప్రవహించుటకుగాను విడిపించినావు. మేఘపు దృఢబంధనమును తెంపినావు. సూర్యుడు, ద్యులోకము, ఉష మూడింటిని ఏకకాలమున ప్రకాశితము చేయుము. సర్వజగత్తుల ప్రజలకు ప్రభవవు అగుము.


                                       ముప్పది ఒకటవ సూక్తము

 ఋషి - భరద్వాజ సహోత్రుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్. చివరిది శక్వరి.

    1. ఇంద్రా ! నీవు ధనపాలకుడవు. ధనముల ప్రధాన స్వామివి. ఈ సమస్త లోకములు నీ ఆజ్ఞను వర్తనులయి ఉన్నవి. మానవులు పుత్రుని కొఱకు, శత్రువిజేతయగు పౌత్రునికొఱకు, వర్షము కొఱకు నిన్ను వివిధ రీతుల స్తుతించెదరు.

    2. ఆకాశమున పుట్టిన మేఘము పతన యోగ్యముకాదు. అయినా ఇంద్రా ! నీ భయమున మేఘములు వర్షించుచున్నవి. నిన్ను చూచినంత ద్యావాపృథ్వులు, పర్వతములు, వృక్షములు, సంపూర్ణ స్థావర ప్రాణిజాలము గడగడలాడును.

    3. ఇంద్రా ! కుత్సునకు సాయము చేయుటకుగాను నీవు 'శిష్ణు' నితో యుద్ధము చేసినావు. యుద్ధమున 'కువయు' ని వధించినావు. సంగ్రామమున సూర్యుని రథచక్రమును హరించినావు. అప్పటినుంచి సూర్యుని రథము ఏకచక్రము అయినది. పాపకారి రాక్షసులను వధించినావు.

    4. ఇంద్రా ! నీవు దస్యు శంబరాసురుని నూరు నగరములను ఛిన్నాభిన్నము చేసినావు. ప్రజ్ఞావంత, అభిషుత సోమక్షేత్ర ఇంద్రా ! అప్పుడు సోమాభిషవకారి దివోదాసునకు ప్రజ్ఞా పూర్వక ధనము ప్రదానము చేసినావు. స్తుతించు భరద్వాజునకు ధనము ప్రసాదించినావు.

    5. అదధ్యభటులు, విపుల ధనముగల ఇంద్రా ! మహా సంగ్రామమునకుగాను నీ భయంకర రథమును అధిరోహింపుము. ప్రకృష్ట మార్గములుగల ఇంద్రా ! నీ రక్షణలతో మావద్దకు విచ్చేయుము. విఖ్యాత ఇంద్రా ! ప్రజలందు మమ్ము ప్రఖ్యాతులను చేయుము.


                                           ముప్పది రెండవ సూక్తము

     ఋషి - భరద్వాజ సహోత్రుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రుడు మహామహుడు. వివిధ శత్రువులను వధించువాడు. బలవంతుడు. వేగవంతుడు. విశేష స్తుతియోగ్యుడు. వజ్రధారి. ప్రవృద్ధుడు. అట్టి ఇంద్రుని కొఱకు అపూర్వములు, సువిస్తీర్ణములు, సుఖదాయకములగు స్తోత్రములను చదివినాము.

    2. ఇంద్రుడు మేధావులగు అంగిరులకొఱకు జననీ స్వరూప స్వర్గమును, పృథ్విని సూర్యుని ద్వారా ప్రకాశితము చేసినాడు. అంగరులు స్తుతించగా ఇంద్రుడు పర్వతములను చూర్ణము చేసినాడు. ధ్యానశీల స్తోతలగు అంగిరులు తేపతేపకు ప్రార్థించగా ఇంద్రుడు గోవులను బంధన విముక్తుల చేసినాడు.

    3. అంగిరులు హవనము చేయువారు. స్తుతించువారు. సంకుచితజానువులు బహుకర్మకారి అగు ఇంద్రుడు అంగిరులతో కలిసి గోవులకొఱకు శత్రువులను పరాజితులను చేసినాడు. మిత్రభూతులు, మేధావులగు అంగిరులతో కలిసి మిత్రాభిలాషి, దూరదర్శి అగు ఇంద్రుడు అసురపురములను భగ్నము చేసినాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS