11. ఇంద్రా ! నీవు బహుజనా హూతుడవు. విధాతవు. అత్యంత పూజనీయుడవు. నీ అశ్వములు అందరిచే పూజింపబడునవి. వాటిమీద మా వద్దకు విచ్చేయుము. నీ అశ్వములను దేవ, మానవులలో ఎవరును నివారింపజాలరు. ఆ అశ్వములపై త్వరత్వరగా మాకు ఎదురేగి రమ్ము.
ఇరువది మూడవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రా ! సోమము అభిషుతమైనప్పుడు స్తోత్రము ఉచ్చరించబడినప్పుడు శాస్త్రము విహితమైనప్పుడు అప్పుడు నీవు రథమున గుఱ్ఱములను పూన్చెదవు. రెండు చేతులందు వజ్రము ధరించి రెండు అశ్వములు లాగు రథమున వచ్చెదవు.
2. ఇంద్రా ! స్వర్గమున శూరులు. తెగించు సంగ్రామమున చేరుదువు. అభిషవకారి యజమానిని రక్షించెదవు. నిర్భీకుడవయి ధార్మికుడు మఱియు సంత్రస్తుడగు యజమానికి విఘ్నములు కలిగించు దస్యులను వశపరచుకొందువు.
3. ఇంద్రుడు అభిషుత సోమపానకర్త. భీషణ ఇంద్రుడు స్తుతి కర్తలకు ఆపదలులేని మార్గమున నడిపించును. యజ్ఞములు చేయుటయందు దక్షుడు, సోమభిషవముచేయు యజమానికి స్థానము కల్పించును. స్తుతించువారికి ధనము ప్రదానము చేయును.
4. ఇంద్రుడు వజ్రధారి, సోమపాయి, గోదాత. మానవులకు హితము కూర్చువాడు. పుత్ర ప్రదాత. స్తోతస్తోత్రములు వినువాడు స్వీకరించువాడు.
ఇంద్రుడు తన అశ్వద్వయముతో హృదయ స్థానీయ మూడు సవనములకు విచ్చేయును.
5. ఇంద్రుడు పురాతనుడు. మా విషయమున పోషణాది కార్యములు నిర్వహించువాడు. ఇంద్రుడు అభిలషించిన స్తోత్రములను ఉచ్ఛరింతుము. సోమము అభిషవించబడినపుడు ఇంద్రుని స్తుతింతుము. ఉక్థము ఉచ్చరించుచు ఇంద్రుని వర్థిల్లచేయు హవిర్లక్షణ అన్నము సమర్పింతుము.
6. ఇంద్రా ! మా స్తోత్రములను వర్థిల్ల చేసినావు. సోమాభిషవము అయినపుడు నీ కొరకుగాను నిరతిశయ సుఖదాయకములు, కమనీయములు, హవియుక్తములగు స్తోత్రములను ఉచ్ఛరించుము.
7. ఇంద్రా ! సోమపానము చేయుటకు యజమాని పరచిన కుశలమీద కూర్చుండుము. మోదమునంది మేము అందించు పురోడాశమును స్వీకరించుము. పెరుగు మున్నగునవిగల సోమరసమును వెంటనే త్రాగుము. తరువాత నమ్మిన యజమాని తావరమును పెంపొందించుము.
8. ఉద్యతాయుధ ఇంద్రా ! నీ ఇచ్చవచ్చినరీతి మోదించుము. ఈ సోమరసము నీకు అందవలెను. మా స్తోత్రములు మీకు అందవలెను. మమ్ము రక్షించుటకుగాను ఈ స్తుతి నీకు అందవలెను.
9. స్తోతలారా ! సోమము అభిషవింపుడు. ఇంద్రునకు సోమరసము. అతని కోరికతీరునంత అర్పించుడు. ఇంద్రుడు మనసు పోషించునంతటి సోమము స్వీకరించవలెను. ఇంద్రుడు అభిషణశీల యజమాని సుఖములకు ఆటంకము కలిగించడు.
10. సోమాభిషవము జరిగినంత హవిరూప ధనవంతుడు. యజమానికి ఈశ్వరుడగు ఇంద్రుడు స్తోతలకు సన్మార్గము చూపవలెను. ఆశించిన ధనము ప్రసాదించవలెను. అది గ్రహించియే భరద్వాజుడు స్తుతించినాడు.
(ఆంధ్రవచన ఋగ్వేద సంహిత నాలుగువ అష్టకము ఆరవ మండలమున నాలుగువ అధ్యాయమున రెండవ అనువాకము సమాప్తము)
మూడవ అనువాకము ఇరువది నాలుగవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. సోమవంతమగు యజ్ఞమున ఇంద్రుడు సోమపానము చేయవలెను. హర్షించవలెను. ఆ హర్షమును యజమాని కోరికలు తీర్చవలెను. వైదికోపాసన సహితస్తోత్రము ఫలప్రదాత కావలెను. అభిషుత సోమపానము చేయు ఇంద్రుడు రసము తగ్గిన సోమమును త్యజించడు. ఇంద్రుడు ధనశాలి. అతడు స్తుతికారుల స్తుతులతో అర్చనీయుడు. ద్యులోకవాసి, స్తుతులకు అధిపతి, ఇంద్రుడు రక్షకుడగును.
2. ఇంద్రుడు శత్రుహింసకుడు. పరాక్రమశాలి. మానవహితకర్త. వివేకశాలి, మా స్తోత్రములు వినువాడు. మమ్ము రక్షించువాడు. గృహ ప్రదాత. స్తోతలచేప్రశంసనీయుడు. స్తోతలను భరించువాడు. అట్టి ఇంద్రుడు యజ్ఞమున స్తుతులు వినును. మాకు న్నప్రదానము చేయును.
3. విక్రాంతుడవగు ఇంద్రా ! చక్రద్వయమునకు అక్షమువలె నీ అపారమహిమ ద్యావాపృథ్వులను అతిక్రమించును. చెట్టు కొమ్మలవలె నీ రక్షణకార్యము వర్ధిల్లును.
("అక్షో యథాచక్రాభ్యాం బహిర్గతః" అని శాయణుడు. చక్రమును దాటి ఉండు అక్షము ఇరుసు చక్రము తిరుగుటకు ఉపకరించును. అట్లే ఇంద్రుడు ద్యావాపృథ్వుల నడకకు కారణమై వాటిని దాటును)
4. ఇంద్రా ! నీవు బహు కర్మివి. ప్రజ్ఞావంతుడవు. గోవుల మార్గములు సర్వత్రకాననగునట్లు నీ శక్తియుక్తులు సర్వత్ర కనిపించును. దూడలకు పలుపులవంటి అనిరుద్ధమగు నీ శక్తులు అనేకమంది శత్రువులను కట్టివేయును.
5. ఇంద్రుడు నేడు ఒకపని చేయును. మరుసటి రోజు అంతకన్న విలక్షణ కార్యము చేయును. మరల మరలు సత్, అసత్ కార్యములను అనుష్ఠించును. ఇంద్ర, మిత్ర, వరుణ, పూష, సవితలు ఈ యజ్ఞమున మా కోర్కెలు తీర్చవలెను.
6. పర్వత శిఖరములనుండి నీరు లభించినట్లు ఇంద్రా ! నీవద్దనుండి శస్త్రములు, హవిద్వారా యజమానులు తమ కోరికలను పండించుకుందురు. స్తుతులతో వందనీయుడవగు ఇంద్రా ! యుద్ధమున గుఱ్ఱములు వడివడిగా పరిగెత్తినట్లు నిన్ను స్తుతించు, అన్నాభిలాషులగు భరద్వాజాదులు స్తుతులతో నీవద్దకు వడివడిగా చేరుదురు.
7. "న యం జరన్తి శరదో న మాసా న ద్యావ ఇంద్ర మవ కర్మయంతి" సంవత్సరములు, మాసములు ఇంద్రుని వృద్ధుని చేయజాలవు. దినములు ఇంద్రుని దుర్భలుని చేయజాలవు. అట్టి ప్రవర్ధమానమగు ఇంద్రుని దేహము మా స్తుతులు, స్తోత్రములచే స్తూయమానమై వర్థిల్లవలెను.
8. మా స్తోత్రములతో స్తుతించబడిన ఇంద్రుడు దృఢగాత్రుడు. సంగ్రామమున చలించనివాడు. యజమాని ఎంతటి గుణవంతుడయినను దస్యుసహితుడు అయినపుడు ఇంద్రుడు మెచ్చడు. మహాపర్వతములు సహితము ఇంద్రునకు సుగమములు, అగాధములు సహితము అతనికి అవలీలలు. "గంభీరోచిద్భవతి గాధమస్మై"
9. బలశాలివి, సోమపానకర్తవగు ఇంద్రా ! ఎవరి ద్వారాగాని మాకు ఉదార చిత్తమున అన్నము, బలము ప్రదానము చేయుము. రాత్రింబవళ్లు మా రక్షాతత్పరుడవగుము.
10. ఇంద్రా ! సంగ్రామమున స్తుతికర్తను రక్షించుటకుగాను అతనిని అనుగ్రహింపుము. దూరపు దగ్గరి శత్రువులనుండి అతనిని రక్షింపుము. ఇంటిలోకాని అడవులందుగాని శత్రువులనుండి రక్షింపుము. మేము శోభన పుత్రవంతులమై నూరు సంవత్సరములు మోదించవలెను. "మదేమ శతహిమాః సువీరాః"
ఇరవది అయిదవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. బలవంతుడవగు ఇంద్రా ! సంగ్రామమున మమ్ము అధమ, మధ్యమ, ఉత్తమ భేదములేక అందరిని నీ రక్షణలతో పాలింపుము. భీషణ ఇంద్రా ! నీవు మహానుడవు. మాకు భోజ్యసాధన అన్నములు అందించుము.
2. ఇంద్రా ! మా స్తుతులను వినుము. మా సైన్యము శత్రుసేనను నష్టపరచగలది. నీవు దానిని రక్షింపుము. యుద్ధమునకు వచ్చిన శత్రువు కోపమును పోగొట్టుము. యజ్ఞాదికార్యములు నిర్వహించు యజమానులకుగాను వారి కార్యములు చెరచు సమస్త జనులకు నష్టపరచుము.
3. ఇంద్రా ! శత్రువులు జ్ఞాతిరూపులగుదురు. దగ్గరి వారు దూరపువారగుదురు. వారు మాముందుకురారు. మమ్ము బాధించుటకు ఉపక్రమింతురు. అట్టి శత్రువుల బలమును నష్టపరచుము. వారి వీర్యమును నష్టపరచుము. వారిని పరాంగ్ముఖులను చేయుము.
4. ఇద్దరు విరోధులు సంగ్రామమున ఎదురు పడినప్పుడు పుత్ర, పౌత్ర, ధేను, జల, భూమి కొరకు కల్లోలము సృష్టించి వివాదమునకు దిగినప్పుడు అప్పుడు ఇంద్రుడు అనుగ్రహించినవాడు శత్రువీరులను నష్టపరచును.
(సుమారుగా వివాదకారణములనన్నింటిని పేర్కొన్నాడు)
5. ఇంద్రా ! విక్రాంతులు, శత్రునిహంతలు, విజేతలు, యుద్ధమున ప్రకుపిత యోద్ధలు ఎంతటి వారయినను నీతో యుద్ధముచేయ సమర్థులుకారు. వారిలో ఎవరును నీకు సాటివచ్చువారు కారు. వీరందరని మించిన శ్రేష్ఠతముడవు.
6. మహా శత్రువును నిరోధించుటకు పరిచారక సహితగృహముకొఱకో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడినప్పుడు యజ్ఞమున ఋత్విక్కులు ఇంద్రునకు హవి సమర్పించినవానికే జన, ధన లాభము కలుగును.
7. ఇంద్రా ! నిన్ను స్తుతించినవాడు బెదిరినపుడు వానిని రక్షింపుము పాలింపుము. మా నేతృతమ పురుషులలో నిన్ను అందుకొనగలవారికి త్రాతవగుము. మమ్ము ముందు నిలిపిన స్తోతలను కాపాడుము.
8. ఇంద్రా ! నీవు మహామహుడవు. శత్రువధకుగాను నీకు సమస్త శక్తులు అర్పించబడినవి. యుద్ధమున దేవతలందరు నీకు శత్రువును పరాభవించునదియు లోకములను భరించునట్టిదియునగు బలమును ప్రదానము చేసినారు.
9. ఇంద్రా ! ఈ రీతిన స్తుతించబడిన నీవు యుద్ధమున మమ్ము శత్రువు పైబడుటకు ప్రోత్సహించుము. ప్రేరేపింపుము. మా కొఱకుగాను హింసించు అసురసేనను వశపరచుకొనుము. మేము భరద్వాజులము. నిన్ను స్తుతించువారలము. మాకు అన్నముతోసహా అవశ్యము నివాసము లభించవలెను.
ఇరువది ఆరవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రా ! మేము స్తోతలము. అన్న లాభము కొఱకు సోమరసమున నిన్ను ఆర్ద్రుని చేతుము. ఆహ్వానింతుము. మా పిలుపు వినుము. మానవులు యుద్ధమునకు సాగినపుడు నీవు మమ్ము భద్రతరముగ రక్షింపుము.
2. ఇంద్రా ! నీవు అందరకు ప్రాపణీయుడవు. మహా అన్న లాభమునకుగాను వాజినీపుత్రుడు భరద్వాజుడు అన్నవంతుడై నిన్ను స్తుతించుచున్నాడు. నీవు సాధుజనుల పరిత్రాతవు. దుర్జన వినాశకుడవు. ఉపద్రవము కలిగినపుడు భరద్వాజులు నిన్ను ఆహ్వానింతురు. వారు ముష్టి ఘాతముల శత్రువును నష్టపరచగలవారు. గోవుల కొఱకు యుద్ధము కలిగినప్పుడు నీ మీద నిర్భరులగుదురు.
3. ఇంద్రా ! అన్న లాభమునకుగాను భార్గవ ఋషిని ప్రోత్సహించుము. హవ్యదాత 'కుత్సుని' కొఱకు అసుర శుష్ణుని వధించినావు. దివోదాసుని సుఖవంతుని చేయుటకు శంబరుని తల త్రుంచినావు. వాడు తనను దుర్భేద్యుడనుకున్నాడు.
4. ఇంద్రా ! 'వృషభ' రాజునకు యుద్ధసాధన మహారథమును ఇచ్చినావు. అతడు శత్రువులతో పది రోజులు యుద్ధము చేసినపుడు అతనిని రక్షించినావు. 'వేతసు' నకు సాయము చేసి 'తుగ్రా' సురుని వధించినావు. స్తవకర్త తుజిరాజు సమృద్ధిని మరింత పెంపు చేసినావు.
5. ఇంద్రా ! నీవు శత్రునిహంతవు. అనెక్ ప్రశంసనీయ కార్యములు చేసినావు. వందల-వందల, వేల వేల శంబరుని సేనలను చెదరగొట్టినావు. పర్వతము నుండి వెడలినవాడును యజ్ఞాదికార్య విఘాతకుడగు శంబరాసురుని వధించినావు. విచిత్రముగా దివోదాసును రక్షించినావు.
6. ఇంద్రా ! నీవు శ్రద్ధా పూర్వక అనుష్ఠానమునను సోమపానమునను ముదితుడవయి 'దభీతి' కొఱకు చుమురాసురుని వధించినావు. 'పిఠీనసు' నకు రజినామక కన్యను ప్రదానము చేసినావు. బుద్ధి బలమున అరువదివేల యోద్ధలను ఏకకాలమున కూల్చినావు.
(పిఠినసుడు ఇంద్రుని మిత్రునిగా చెప్పబడినాడు)
7. వీరులతోటివాడవు, బలవత్తముడవగు ఇంద్రా ! నీవు త్రిభువన రక్షనుడవు. శత్రువిజేతవు. స్తోతలు నీవు ప్రసాదించిన సుఖమును, బలమును కీర్తింతురు. మేము భరద్వాజులము, నీవు ప్రసాదించిన ఉత్కృష్ట సుఖమును, బలమును సాటి స్తోతలతో కలిసి అనుభవింతుము.
8. పూజనీయ ఇంద్రా ! మేము నీ మిత్రభూతులము. స్తోతలము. ఈ స్తోత్రములు ధనలాభము కొఱకు చేయబడినవి. వీటిద్వారా మేము నీకు నిరతిశయ ప్రీతిపాత్రులము కావలెను. ప్రాతర్దన పుత్రుడు మాకు రాజగు క్షత్రశ్రీ శత్రువులను వధించి ధనలాభము పొంది అందరిలో ఉత్కృష్టుడు కావలెను.
