Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 22


                                                              స్వ - పరం


    "ఎంతైనా..... ఇంతిది పనికిరాదు."


    - అంటూ రుసరుసలాడుతూ సెక్షన్ లోకి తిరిగి వచ్చాడు సుబ్బారావు. సుబ్బారావుకి లంచ్ అవర్ లో టిఫిన్ చేస్తూ న్యూస్ పేపర్ చదవడం,  టిఫిన్ చేశాక  కాసేపు ఏ వార పత్రికో, మాస పత్రికో చూడడం అలవాటు.

 
    "ఏం బాబూ.... ఈవేళ మీ ఆవిడ టిఫిన్ లో కారం ఎక్కువ వేసిందా ఏమిటి?"అన్నాడు ప్రసాద్ నవ్వుతూ.


    "అదయినా పర్వాలేదు. ఈ అన్యాయం మరీ దురన్యాయంగా వుంది" అన్నాడు సుబ్బారావు.


    "ఏమిట్రా అది? పేపర్లో ఏమైనా దుర్వార్త చదివావా ఏమిటి?" అన్నాడు ప్రసాద్ కొంచెం సీరియస్ గా.


    "పేపరూ కాదు, పాడూ కాదు. నువ్వే చెప్పు - రామారావు మంచి రచయితే.... నేను కాదనను. అతని రచనలు తరచుగా పడని పత్రికలు లేవు. అలాగని - నేను కూడా రచయితనే అయినా నాకేం అసూయ లేదు. కాని, ఒకే సంచికలో - అందులోనూ... ఒకే మాస పత్రికలో ఒకే రచయిత కథలు రెండింటిని వేయడం ఏమి సబబు?" అంటూ నా ముందు ఒక మాస పత్రికను పడేశాడు సుబ్బారావు.

 
    ఆ పత్రికను తెరచి పేజీలు తిరగవేశాడు ప్రసాద్. సుబ్బారావు చెప్పింది నిజమే. ఆ సంచికలో  రామారావు కథలు రెండు వున్నాయి.


    "నిజమే సుబ్బారావ్ - నువ్వు చెప్పింది అక్షరాలా నిజం! ఇది మంచి జర్నలిజం కాదు" అన్నాడు ప్రసాద్ పత్రికను మూస్తూ.

 
    తన అభిప్రాయంతో ప్రసాద్ కూడా ఏకీభవించడంతో సుబ్బారావు. ముఖం ఆనందంతో తళతళా మెరిసింది. కోపం చల్లారింది.


    "అవునా... ఏమాత్రం ఇంగిత జ్ఞానమున్నవాడైనా అదే మాట  అంటాడు. అది  సరేనయ్యా..... ఈ పత్రికవాళ్లకి రామారావు  మీద అంత అభిమానం వుందనుకో. అతని రెండో కథని ఏదైనా పెన్ నేమ్ తో వేస్తే పోలా? ఎంత ప్రేమ వుంటే మాత్రం - ఇలాగా చూపించేది?" మళ్లీ అందుకున్నాడు సుబ్బారావు.


    "అది అతనిపైగల అభిమానాన్ని వ్యక్తం చేయడం అనుకుంటున్నావుకానీ, నిజానికి - ఆ పత్రిక వాళ్లు తమకీ, అతనికీ కూడా తెలియకుండా అపకారం చేస్తున్నారు' అన్నాడు ప్రసాద్.

 
    ప్రశ్నార్దకంగా చూశాడు సుబ్బారావు.


    "అవును. ఈ విధంగా చేయడం వల్ల పాఠకులకి - రామారావు ఆ పత్రిక వాళ్లకి ఏ దగ్గరి బంధువోనని అనిపిస్తుంది. ఆశ్రిత పక్షపాతంతో వేసిన రచనలు అనగానే.... అవి నిజానికి  ఎంత బాగున్నా, వాటిని ఏహ్యభావంతోనే చూస్తారు పాఠకులు. ఈ విధంగా ఆ రచయిత  వ్యక్తిత్వం దెబ్బ తింటుంది. పత్రికవాళ్ల మీద కూడా - 'పాఠకులు. ఈ విధంగా  ఆ రచయిత వ్యక్తిత్వం దెబ్బ తింటుంది. పత్రికవాళ్ల మీద కూడా - 'వాళ్లు ఆశ్రితుల రచనలనే వేస్తారు, వాళ్లకి నీతి నియమాలు లేవు' - అనే అభిప్రాయం ఏర్పడుతుంది. అంతటితో  ఆ పత్రిక  విలువా తగ్గిపోతుంది. ఈవిధంగా ఇద్దరికీ  చెడే జరుగుతుంది" అన్నాడు ప్రసాద్.


    "నా మనసులోని భావాల్ని ఎంత చక్కగా చెప్పావు! నేనూ రచయితనేకదా.... కాస్తో, కూస్తో పేరు కూడా సంపాదించాను. రామారావు రచనలంత తరచుగా కాకపోయినా నా రచనలూ అన్ని పేపర్లలోనూ పడ్తాయి. రేపు ఏ పత్రికైనా నా రచనలని  రెండింటిని ఒకే సంచికలో వేస్తానన్నా నేను ఒప్పుకోను. జర్నలిజం  అనేది ఆదర్శవంతంగా వుండాలి" అన్నాడు సుబ్బారావు.


     అంతటితో  ఆ చర్చ ముగిసింది. ఎవరి సీట్లలోకి వారు పోయి ఆఫీసు పనిలో నిమగ్నమయ్యారు - సుబ్బారావు, ప్రసాదు.

 
                               *    *    *    *    *

    
    రెండేళ్ళ కాలం ఇట్టే గడిచిపోయింది.


    ఈ రెండేళ్ళలోనూ సుబ్బారావు రచయితగా మంచి ప్రగతిని సాధించాడు. అతని  రచనలు కూడా తరచుగా అన్ని పత్రికలలోనూ పడడం  మామూలైంది. ప్రజా బాహుళ్యంలో  మంచి పేరు సంపాదించాడు.

 
    ఆరోజు సుబ్బారావు నవ్వు ముఖంతో పనికట్టుకొని ప్రసాద్ సీటు దగ్గరికి వచ్చాడు.

 
    "ఇది చూశావురా...?"  అంటూ ఓ వార్తా పత్రికను ప్రసాద్ ముందు పడేశాడు.


    "ఏమిట్రా అది? నీ కథ ఏదైనా పడిందా ఏమిటి?" అన్నాడు ప్రసాద్.


    "అది మామూలేగా! లోపల చూడు - నీకే తెలుస్తుంది" అన్నాడు ఆనందంతో ఉబ్బిపోయిన బుగ్గల్ని  బిగదీసుకుంటూ.

 
    పత్రిక తెరిచి పేజీలు తిరగవేశాడు.  అందులో సుబ్బారావు కథలు రెండున్నాయి.

 
    "ఏమిట్రోయ్.... రామారావుకి మల్లే నీ కథలు కూడా రెండు పడ్డాయే ఒకే సంచికలో!" అన్నాడు ప్రసాద్ ఆశ్చర్యంతో.


    "రామారావుకీ, నాకూ పోలికేమిట్రా? అతనివన్నీ కేవలం ఫార్ములా కథలు. నావైతే ఐడియాలిస్టిక్!"అన్నాడు సుబ్బారావు హీరోలాగా.


    "కావచ్చు. కాని, అవి ఎంత మంచివైతే మాత్రం - ఒకే సంచికలో  రెండు వేయడం ఏమి  సబబు? ఇటువంటి జర్నలిజాన్ని నువ్వు కూడా విమర్శించేవాడివి కదా!" అన్నాడు ప్రసాద్ - అతని మాటలకు ఆశ్చర్యపోతూ.

 
    "నిజమే! నేనూ అలాగే అనుకునేవాడిని. కాని, పాఠకులు నా రచనలు ఇంకా ఇంకా కావాలని ఉత్తరాలు రాస్తుంటే ఆ పత్రికవాళ్లు మాత్రం ఏం చేస్తారు? పాఠకులను నిరుత్సాహపరచలేరు కదా! పైగా... ఇవి రెండూ - రెండు వినూత్న పద్దతులలో రాశాను. నా రచనలవల్ల వాళ్ళ పత్రిక అమ్మకాలు పెరుగుతున్నాయి" అన్నాడు సుబ్బారావు.

 
    సుబ్బారావు మాటలకు ఎంతో ఆశ్చర్యపోయాడు ప్రసాద్. 'రెండేళ్ళ క్రితంనాటి సుబ్బారావేనా ఇలా మాట్లాడుతోంది?'అనుకున్నాడు.


    "కావచ్చు. రెండూ ఒకే పేరు మీద వేసే బదులు - ఒక దానికి ఏదైనా పెన్ నేమ్ పెట్టుకోలేకపోయావా?"అన్నాడు ప్రసాద్.


    "అలా పెట్టుకొంటే పాఠకులకు ఏమి తెలుస్తుంది?వారికి కావలసింది నా పేరుతో వున్న రచనలాయె!" అన్నాడు సుబ్బారావు గర్వంగా.


    ఇంక ప్రసాద్ ఏమీ మాట్లాడలేదు. 'స్వవిషయానికీ, పర విషయానికీ ఇంత తేడా వుంటుందా?'...  అని ఆశ్చర్యపోయాడు.


                                - భారత మిత్రం... .2 అక్టోబర్' 77
    
        అమెరికా అయితేనా....!


    ఫ్రెంచ్ వారు  కళారాధకులు. శృంగారంలో కూడా కళాత్మకత ఉట్టిపడాలనుకుంటారు వారు.

 
    ఒకసారి 'సుసాన్' అనే అమ్మడు పారిస్  వెళ్ళింది. అక్కడ  'పియెరీ' అనే ఫ్రెంచ్ అబ్బాయితో పరిచయం కలిగింది. ఆ పరిచయం ప్రేమగా,  అటుపై పరిణయంగా  పరిణమించింది.

 
    మొదటి రాత్రి పియెరీ తన శృంగార కళను సుసాన్  మీద ప్రయోగించటం మొదలుపెట్టాడు.

 
     ముందుగా ఆమె వ్రేలికొనలను  ముద్దాదాడు. తర్వాత  భుజాల మీద, ఆపై మెడ వెనుక  ముద్దులు గుప్పించసాగాడు. ఈ వ్యవహారంతో విసిగిపోయిన సుసాన్ -

 
    "ఇదే మా అమెరికా భర్తలయితేనా.... ఈ పాటికి  హనీమూన్ కూడా పూర్తి చేసుండేవారు!"అంది ఒళ్ళు మండి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS