ఏ సంబంధం అనుకుంటున్నావు! కృష్ణమౌళి అంటే నీకు ఇష్టంలేదు!
అతన్నికాక ఇంకెవర్ని చేసుకుంటావు!
అతను నిన్ను కృష్ణుడిలా ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకుంటాడు. నీ తండ్రి అన్నయ్య ఎవరూ ఆపలేరు. అంతా ముందే ప్లాన్ చెయ్యటం జరిగిపోయింది. నేను ఈ యింటికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు! నీ మెడలో కృష్ణమౌళి చేత మూడుముళ్ళు వేయించడానికే వచ్చాను తెలుసా!
అతను వంటావిడ కొడుకా! నీ అంతస్తుకి తగిన సంబంధంగాదూ. నీ కళ్ళకు ఉన్న పొరలు విడిపోయేలా చేస్తాను చూడు. నన్ను ఇలాగేనమ్ము. బాగా నమ్ము ఇంకా బాగా నమ్ము. అంబిక మనసులో కసిగా, కోపంగా అనుకోసాగింది.
"వదినా!" అంది.
"ఏమ్మా" అంది ఎంతో శాంతంగా చిరునవ్వుతో.
"నీ మాటలకి నాకు ఎంతో ధైర్యం వచ్చింది వదినా" అంది చిన్నగా నవ్వుతూ.
"వదినా అతని పేరు ఏమిటి!" అడిగింది మెల్లగా.
"కృష్ణ" ఆడపడుచు వైపు పరీక్షగా చూస్తూ అంది.
"కృష్ణా!"
ఊ కృష్ణుడే ఈ రుక్మిణమ్మని ఎత్తుకుపోతాడు. హాస్యంగా రెండు ఆర్ధాలుతో అంది.
ఇంద్రసేన సిగ్గుతో తల వంచేసింది.
* * *
ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు.
కృష్ణ పేరు అని తెలిసింది. అతను ఎలా ఉంటాడు! చూడకుండా అతని రూపాన్ని రకరకాలుగా తన హృదయ ఫలకమీద చిత్రించసాగింది. అయినా ఊహకు అంతు చిక్కని రూపం రావటంలేదు.
ఆ రోజు అంబిక హాస్పిటల్ కి వెళ్ళిపోయింది. జయరామ్ పని ఉండి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఉదయమే గణేష్ రావు గారి దంపతులు ఇద్దరూ కలిసి ఎవరింటిలోనో పెళ్ళి ఉంటే వెళ్ళారు.
యింటిలో ఇంద్రసేన ఒక్కరితే ఉంది.
ఆమె మనసంతా ఉత్సాహంగా ఉంది.
కలల అలలపై తేలిపోతూ కాబోయే శ్రీవారిని గురించి ఆలోచిస్తూ తన గదిలో పడుకుంది.
పెళ్ళి చూపులకి అతను వస్తాడు. తనని చూచి వెంటనే యిష్టపడి పెళ్ళికి ముహూర్తం పెట్టించేయమంటాడు. పెళ్ళి అయిపోతే ఆయన.... ఆయన.... తన ముఖం చేతుల్తో కప్పేసుకుంది.
మదిలో గిలిగింతలు పెట్టినట్టు అయింది.
తియ్యని ఆలోచనలతో మనసంతా ఒక ఊపు ఊపేయసాగింది.
అప్పుడే తలుపు చప్పుడు అయింది.
కళ్ళు తెరిచి అటు చూసింది.
అంతే గుమ్మం పొడవునా నిలబడిన వ్యక్తిని చూస్తూనే కెవ్వున అరవబోయింది.
కాని శబ్దం బయటకు రాలేదు.
శరీరం బిగుసుకు పోయింది. గొంతుక పొడారిపోయింది.
భయంతో గుండెలు దడదడ లాగిపోసాగాయి. మంచంమీదనుండి లేవడానికి శక్తి లేకపోతుంది లేకపోతుంది.
కళ్ళు అప్పగించి అలాగే చూడసాగింది భయంతో.
53
కృష్ణమౌళి నవ్వాడు.
ఆ నవ్వు ఎంతో అందంగా పున్నమినాటి చంద్రుడు వెన్నెలలు వెదజల్లినంత హాయిగా అంత చల్లగా అనిపిస్తుంది. ఎవ్వరికి అయినా ఏ కన్నె మనసుకి అయినా.
కాని ఇంద్రసేనకు ఆ నవ్వు కంపరంగా ఏమిటోగా అనిపించసాగింది.
"మీరా? మీరు" అంది తడబడుతూ.
"నేనే" హుందాగా నడుంమీద రెండు చేతులు ఆనించుకుంటూ అన్నాడు.
"మీరు.... మీరు.... ఇక్కడికి ఎలా వచ్చారు!" ఆమె కంఠస్వరం అదోలా పలికింది.
యింట్లో ఎవరూలేరు తను ఒక్కర్తె ఉంది.
ఒంటరిగా ఉందని అతను ఏమైనా చేస్తే!
ఆమె మనసులో భయపడసాగింది.
గుండెలు దడదడ లాడసాగాయి.
అతన్నిప్పుడు తప్పించుకోవటం ఎలా!
ఆమె మనసు గడుసు ఉపాయాలకోసం ఆలోచిస్తుంది ఇంద్రసేన ప్రశ్నకు అతను నవ్వాడు.
"ఎలా వచ్చానా, ఎగిరి వచ్చాను" అన్నాడు.
అతని కంఠస్వరంలో వెటకారం రవ్వంత ఉన్నా కళ్ళల్లో మాత్రం కొంటెతనం దోబూచులాడింది.
ఆమెకు ఒళ్ళు మండిపోయింది.
మరోటైములో అయితే నాగుపాము కాటువేసినట్టుగా ఎగిరి అతని చెంప ఛెల్ళు మనిపించేది. కాని ... ఒక్కర్తె ఉన్నానన్న భయం లేకపోతే ఒక్కక్షణం అలానే రెప్ప వాల్చకుండా అతనివైపే చూడసాగింది.
అతను అలాగే చూశాడు క్షణంసేపు.
"నువ్వు అంటే నాకు ఎంత అసహ్యమో తెలుసా!" అన్నట్టున్నాయి ఆమె చూపుల్లో అర్ధం.
"నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా!" అన్నట్టున్నాయి అతని చూపులు.
"నిన్ను ఈ చెంపా ఆ చెంపా వాయించేయాలన్నంత కోపం, కక్ష ముంచుకు వస్తున్నాయి తెలుసా!" అన్నట్టు చూసింది.
"నువ్వు అంటే నాకు ఎంత ముద్దో తెలుసా! నిన్ను దగ్గరకు లాక్కుని గుండెలకు అదుముకుని నిన్ను ముద్దులతో ముంచేయాలనిపిస్తుంది తెలుసా?" అన్నట్టుగా ఉన్నాయి అతని చూపులు.
"అందుకే నువ్వు అంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆ సంగతి నీకు తెలుసా!" అన్నట్లు చూసి ముఖం తిప్పుకుంది.
