జూరిచ్ నుంచి ఇండియా దాదాపు ఎనిమిది గంటలు ప్రయాణం. న్యూయార్క్ నుంచి బయల్దేరి, జూరిచ్ వెళ్ళి స్వీస్ బ్యాంక్ లో తన పని చూసుకుని స్వదేశం వస్తున్నాడు అతను. న్యూయార్క్ కోర్టులో సాధించిన విజయం అతడిని మంచి మూడ్ లో వుంచింది. అందువల్ల, ఆరుగంటలుగా అతడి సెక్రెటరి ఉక్కిరి బిక్కిరి అయింది. నిద్రలేదు.
అతడి ప్రైవేట్ గెస్ట్ హౌస్ నమూనాలోనే ఆ విమానపు అంతర్భాగం అలంకరణ చేయబడింది. చిన్న బెడ్ రూం, ముందు లాంజ్ , వెనక భోజనం ఏర్పాట్లు, అతడి తాలూకు మనుషులు కూర్చోవటానికి పక్కన మరో గది.
అక్కడి వాతావరణం , ఒక్కసారి లోపలికి ప్రవేశించాక, అది విమానం అన్న విషయాన్ని మరిపించేలా వుంటుంది. చాలా సమస్యల్ని అప్పటికప్పుడు మార్చిపోయేలా చేసుకోవడం అతడికి అలవాటు. అతడికి ఒక కూతురు. పుట్టగానే భార్య చచ్చిపోయింది. ఆ విషాదాన్ని మర్చిపోయేలా (ఎప్పటికప్పుడు మారే) అతడి కూతురు వయసున్న కొత్త కొత్త సెక్రటరీలు ఇప్పటివరకూ చేస్తూ వచ్చారు. అతడి లాయర్లు, అతడి డాక్టర్లు, అతడి అకౌంటెంట్లు, అందరూ అతడి సమస్యల్ని పంచుకుంటారు. అతడి సెక్రెటరీ జీతం రాష్ట్ర గవర్నర్ జీతంకన్నా రెండు రెట్లు ఎక్కువన్న నిజం ఈ విషయాన్ని నిరూపిస్తుంది.
విమానం నెలకు తగిలి, చిన్న కుదుపుతో ఆగటానికి ఆయత్తమవుతూంది.
అతడు లేస్తూంటే, దృష్టి మరోసారి 'న్యూయార్స్ టైమ్స్' పేపర్ కిందవైపు ఎడమ భాగంలోవున్న వార్తా మీద పడింది.
"భారతీయ మందుల ఉత్పత్తిదారు
సర్పభూషణరావు పై న్యూయార్క్
ఫెడరల్ కోర్టు కేసు కొట్టివేత."
అని వుంది హెడ్డింగ్. అతడి పెదవుల మీద చిరునవ్వు అలాగే వుంది ఈ లోపులో విమానం ఆగిఅద్మి. "నో స్మోకింగ్' అన్న లైటు ఆరింది. అతడు అగ్గిపుల్ల వెలిగించాడు. అయితే సిగరెట్ అంటించుకోవటానికి కాదు.
న్యూయార్క్ నుంచి భారతదేశం వస్తున్నప్పుడు, మధ్యలో జూరిచ్ లో ఆగిన సందర్భంలో భారతదేశానికి పొరుగునవున్న ఒక విదేశం నుంచి వచ్చిన ఒక అభినందన టెలిగ్రామ్ ని కాల్చెయ్యటానికి.
ఆ టెలిగ్రాంలో...... 'మీరు సాధించిన విజయానికి అభినందనలు. ఏజెంట్ క్యూ' అని వుంది.
ఆ కాగితం పూర్తిగా మసి అయిపోయేవరకూ ఆగి, తరువాత తన ప్రైవేట్ విమానం నుంచి క్రిందికి దిగాడు సర్పభూషణరావు. భారతదేశానికి శత్రువైన ఆ దేశపు ఏజెంటు పంపిన టెలిగ్రాం తన దగ్గిర వుండటం క్షేమకరంకాదు. ఏ కోణంలోనూ చట్టానికి దొరక్కుండా వుండటం అతనికి వెన్నతో పెట్టిన విద్య.
* * *
ఆగిన విమానం వరకూ వచ్చి పక్కనే నిలబడ్డ రోల్స్ రాయిస్ కారు ఎక్కకుండా, ఎయిర్ పోర్ట్ లాంజివరకూ నడుస్తూన్న అతడిని ఆశ్చర్యంగా చూచింది సెక్రెటరీ.
కారణం రెండు నిమిషాలవరకూ అర్థంకాలేదు. తరువాత తెలిసింది......
విమానాశ్రయపు లాంజిలో విలేకరులు వున్నారు. అతడు తన విజయాన్ని భారతదేశపు ప్రతి పత్రికా ప్రచురించాలని కోరుకుంటున్నాడు. అందుకే స్వయంగా వారి దగ్గరకు వెళ్తున్నాడు.
సర్పభూషణరావుకి పత్రికలతో చాలా సత్సంబంధాలున్నాయి. ఎవర్ని ఎలా మంచి చేసుకోవాలో అతడికి బాగా తెలుసు. చిరునవ్వుతో చెయ్యి ఎత్తాడు. కెమెరాలు క్లిక్ మన్నాయి. ఆఖరి కెమెరా క్లిక్ మనేవరకూ వుంచి, చెయ్యి దించాడు.
"మీ మీద కేసు కొట్టివేయడం వల్ల మీరే విధంగా ఫీలవుతున్నారు.....? ప్రశ్నలు మొదలయ్యాయి.
"అంతిమ విజయం ధర్మానిదే" నవ్వుతూ సమాధానం చెప్పాడు.
"కేవలం వ్యక్తిగత కక్షల వల్లే మీ మీద అమెరికాలో నేరం మోపబడిందని మీరు భావిస్తున్నారా?"
"ఎదుగుతున్న మనిషి మీద కళ్ళుండడం మామూలే కదా....."
"అమెరికాన్ హాస్పిటల్స్ కి మీరు ఎగుమతి చేసిన మందుల్లో కల్తీ వుందన్న విషయం పట్ల మీ అబిప్రాయం ఏమిటి.....?"
"ఆ కల్తీ మా ఫ్యాక్టరీలోగాని, ఇండియాలో గాని జరగలేదు. చాలా ప్రతిష్టాత్మకమైన ఎగుమతి అది. అది నచ్చని విదేశీ కంపెనీల హస్తం ఇందులో వుందని భావిస్తున్నాను."
సర్పభూషణరావు నవ్వుతూ చెబుతున్నాడు. ఇవన్నీ రేపు ప్రముఖంగా ప్రచురింపబడతాయని అతనికి తెలుసు. ఈ విలేకర్లందరికీ క్రితం సాయంత్రమే స్కాచ్ పార్టీ ఇవ్వబడింది. "సర్పభూషణరావు లాంటి పారిశ్రామికవేత్త భారతదేశానికి గర్వకారణం. అతడిని అప్రదిష్టపాలు చేయడానికి కొందరి ప్రయత్నం. అందులో ప్రభుత్వంకూడా వుండే వుండవచ్చు. ఎన్ని అన్యాయపు కేసులు బనాయించినా ఆయన చెక్కుచెదరలేదు. విమానాశ్రయంలో విలేకరులు ఈ విషయం ప్రత్యక్షంగా గమనించారు....." వగైరా వగైరా వార్తలు మరుసటిరోజు పేపర్లో పడడానికి సిద్ధమవుతున్నాయని అతనికి తెలుసు.
"ఈ భారతదేశం నాది. దీని అభివృద్ధికోసం, పారిశ్రామికీకరణ కోసం, నా ప్రాణాలున్నంతవరకూ పాటుపడతానని విన్నవించుకుంటున్నాను" అన్నాడు చేతులు జోడించి, 'ఇక వెళ్ళొస్తాను- పనైపోయింది' అన్నట్టు.
"కల్తీ మీ కంపెనీలో జరగలేదన్నారు. విదేశపు గోడౌన్ లో జరిగిందా.....?" ఎవరో విలేకరి చివరగా ప్రశ్నించాడు.
"అవును..... ముందే చెప్పాను కదా. మేము ఇక్కడి నుంచి పింపించాక విదేశంలో జరిగింది."
"గుంటూరు జిల్లాలో పత్తి, పొగాకు పంటల కోసం మీ కంపెనీ తయారుచేసిన మందుల కల్తీ కూడా విదేశాల్లోనే జరిగిందా.....?"
ఉలిక్కిపడి అరక్షణంలో సర్దుకున్నాడు సర్పభూషణరావు. ఓరగా ఆ విలేకరి వైపు చూశాడు, కుర్రవాడు అతడు. పాతికేళ్ళుంటాయి. ఉత్సాహమే తప్ప అనుభవం కనపడలేదు.
"పొగాకు మందు కల్తీ ఏమిటి?"
"మీకు చాలా మందుల ఉత్పత్తి వుండడంలో బహుశా మర్చిపోయి వుంటారు. ఇంటాజిన్ -5, పొగాకు పురుగుల మందు గురించి నేను అడిగేది. అది మీ తయారీయే."
"ఇంటాజిన్ -5 చాలా ప్రతిష్టాకరమైన క్రిమిసంహారక మందు."
"కొన్ని వేల మంది రైతులు తమ సర్వస్వం కుదువపెట్టి వేసిన పొగాకు పైరు, ఈ పురుగులవల్ల పైసాకు పనికిరాకుండా పోయింది."
"అవును..... చాలా దురదృష్టకరమైన సంఘటన అది."
"కొన్ని కుటుంబాలు మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకున్నాయి."
వారికి నా సానుభూతి."
"కానీ మిస్టర్ భూషణ్ రావు..... వారు వాడింది మీ ఇంటాజిన్-5"
"దీనికీ దీనికీ ఏమిటి సంబంధం...........?"
