"మురారీ! నీవు నూఱు చెప్పుము వేయిచెప్పుము. నే నాఁడుదాని యాధిపథ్యము నంగీకరింపను."
"హరిహరా! ఆవేశమునకు లోనుగాకుము. ఆఁడుదాని యడుగులకు మడుగులొత్తుటకు నేను మాత్రమంతయభిమాన హీనుఁడ ననుకొంటివా? కాని మనము తొందరపడిన కొంపలంటుకొనును. ఆ శివదేవయ్య యావులించిన ప్రేవులు లెక్కపెట్టఁగల కాలాంతకుఁడు."
"ముసలిరాజు బ్రతికియున్నంతవరకును మన యాటలు సాగినవి కావు. ఇఁకచూడు మీ హరిహరుని బుద్ధివైభవము! ఆంధ్రసామ్రాజ్యము నల్లకల్లోలము చేసివైతును. రుద్రమదేవి యధికారమును రూపుమాపెదను. శివదేవయ్య మంత్రాంగమును చించిచెండాడెదను."
"సోదరా! బలవద్విరోధము ప్రాణాంతకమని పెద్దలందురు. ఉపాయముతో మన కార్యములు సాధించుకొందము. ఆంధ్రదేశములో నలుమూలల విప్లవము రేపుదము. ప్రభుత్వముపై వ్యతిరేక ప్రచారము గావింతము. సమయము చూచి చతురంగబలములతో దుర్గమును ముట్టడింతము."
"ఇప్పుడే మన బలములతో దుర్గమును స్వాధీనము చేసికొనినచో నెట్లుండును?"
"దుర్గమును ముట్టడించుత సామాన్యమగు పనికాదు. ఉక్కుతునుకల వంటి దుర్గరక్షకులను జయించుట నోటిమాటలుగాదు."
"మురారీ! పిరికిమందు పోయకుము. నేను చెప్పినట్లు వినుము. ఆఁడుదానిని జయించుటకుఁగూడ నిన్ని యాలోచనలెందుకయ్యా! ఈనాఁటి నుండియే కాకతీయ సామ్రాజ్యమునకుఁ గప్పముగట్టుట మానివేయుదము. ఈమె మనలను తలగొట్టి మొలవేయునదేమో చూతము."
"మన మండలములపై దండెత్తినచో-"
"ఆఁడుదాని కంతధైర్యమెక్కడనుండి వచ్చునోయీ పిచ్చివాఁడా! ఒక ప్రక్క పాండ్యులు కత్తిదూయుచున్నారు. ఇంకొకప్రక్క చోళరాజులు విజృంభించుచున్నారు. మరియొక ప్రక్క కటకాధిపతి కప్పముగట్టుట మానివైచి కదనమునకుఁగాలు దువ్వుచున్నాఁడు. ఎప్పుడు సమయము చిక్కునా ఎప్పుడు త్రిలింగ సామ్రాజ్యమును గుటుక్కున మ్రింగుదునాయని దేవగిరిరాజు కాచుకొని యున్నాఁడు. ఇంతమందికి సమాధానము చెప్పికదా రుద్రమ్మ మనపై దండెత్తుట!"
"ఎట్లయినను మనము జాగరూకులమై సంచరింపవలెను. గణపతిదేవుని యనంతరము కాకతీయ సింహాసనము నాక్రమింపవచ్చునని గంపెడాశతో నున్నాను. తొందరపడి నా యాశ నిరాశచేయకుము."
"నీవేనా! నాకుమాత్ర మట్టియాశ లేదనుకొంటివా? నేనుమాత్రము కలలు గనుట లేదనుకొంటివా? కడచిన రాత్రియే నేను వజ్రసింహాసనముపైఁ గొల్వుదీరి కూర్చుండి యుండినట్లును, రుద్రమదేవి నాముందు బందీకృతురాలై యున్నట్లును చక్కని స్వప్నము వచ్చినది. అర్ధరాత్రి వచ్చిన స్వప్న మసత్యము కాదందురు."
"హరిహరా! మనలోమనకు విరోధములు పనికిరావు. రాజ్యము చేజిక్కవలయునేగాని నేనైననేమి నీ వయిన నేమి!"
"నా యభిప్రాయము సైత మదియే సోదరా!"
ఇట్లు మురారి హరిహరులు కాకతీయ సామ్రాజ్యమును గూలఁద్రోయుటకై కుటిలబుద్ధులై కుట్రలు సాగించుచుండిరి.
4
గణపతిదేవచక్రవర్తి మరణానంతరము రుద్రమదేవి "వీరరుద్రమదేవుఁ"డను నామముతో విశాలాంధ్ర సామ్రాజ్యమున కధీశ్వరియై శత్రుభయంకరముగను, సమస్త జన రంజకముగను రాజ్యచక్రము నడపసాగినది. సకల సామంత మండలేశ్వరులును గణపతిదేవ చక్రవర్తియే రాజ్యమేలుచున్నట్లు తెలుఁగురాణియందు భక్తివిశ్వాసములు కలిగి ప్రవర్తించుచుండిరి.
దక్షిణాపథమందు మాత్ర మచ్చటచ్చట సామంతులు కొందఱు శాంతిభద్రతల కొకింత భంగము గలిగించుచుండిరి. కాంచీపురాధీశ్వరుఁడగు విజయగోపాలుఁడు కప్పము గట్టక తిరుగఁబడెను, మనుమలి దేవుఁడు, సిద్ధయదేవుఁడు మొదలగు చోళరాజులు దురాక్రమణమునకు నడుములు గట్టిరి. పల్లవరాజగు కొప్పెరుంజంగ దేవుఁడు కాకతీయ సామ్రాజ్యమునకు వ్యతిరేకముగ నల్లరులు సాగించెను. పాండ్యరాజులు సైతమీ విద్రోహముల యందుఁ బాల్గొనిరి. మురారి హరిహర దేవులు కుట్రదారులతోఁ జేతులు కలిపిరి.
రుద్రమదేవి వీరనారీ శిరోమణి. ఆచంచల దీక్షాసమన్విత. అనుపమాన తేజోవిరాజిత. ఆ మహారాజ్ఞి దక్షిణమునం దేర్పడిన యీయల్లరుల కేమాత్రమును సంచలింపలేదు. తమ ప్రాణము లర్పించియైన సామ్రాజ్య విజయ ధ్వజమును సుస్థిరము చేయగల మహాశౌర్య సంపన్నులైన చమూపతు లెందఱోయామె చెంతనున్నారు.
వీరాగ్రేసరులగు నాగదేవమహారాజు, జన్నిగదేవ మహారాజు, త్రిపురారిదేవ మహారాజు మొదలగు మహాసేనానులు తెలుఁగురాణి యనుజ్ఞనంది విద్రోహుల గర్వమడంచి యాంధ్రసామ్రాజ్యము నలుమూలల శాంతి నెలకొల్పిరి. కుట్రదారు లాక్రమించిన భూభాగములను మరల జయించి యాంధ్రసామ్రాజ్యములోఁ గలిపిరి.
ఇదే సమయమున కాకతీయ గణపతిదేవ చక్రవర్తి కాలమునం దాంధ్ర సామ్రాజ్యమునకు సామంతుఁడైయున్న కటకేశ్వరుఁడు చక్రవర్తి మరణానంతరము స్వాతంత్ర్యమును బ్రకటించి కప్పముగట్టుట మానివైచెను. రుద్రమదేవి యసమానశౌర్య సాహసోపేతులైన పోతయనాయఁడు, మారయ నాయఁడు నను సేనానాయకులఁ బంపి కటకాధిపతి గర్వభంగము గావించి యెప్పటియట్లు ఆంద్ర సామ్రాజ్యమునకు సామంతునిగ నొనర్చెను.
ఈ విధముగ రుద్రాంబ భద్రకాళివలె విద్రోహుల గర్వనిర్మూలనము సేయుచుండ కుటిలస్వభావులును, దురాశా దుర్విదగ్ధులును అగు మురారి హరిహరులు తమయాట లిచుట సాగిరావని గ్రహించి మెల్లగా దేవగిరిరాజగు మహాదేవరాజు మఱుగుజొచ్చిరి. ఏకశిలానగరముపై దండెత్తి రావలసినదని యాయనను ప్రోత్సహించిరి. తెలుఁగురాణిని సింహాసనము నుండి దింపి తమ్ము గద్దెనెక్కించినచో బ్రదికినంత కాలము దేవగిరిరాజ్యమునకు సామంతులమై దేవరవారి యడుగులకు మడుగులొత్తుచుఁగప్పములు గట్టుచుందుమని ప్రార్థించిరి.
దేవగిరిరాజునకు మొదటినుండియుఁ గాకతీయసామ్రాజ్యముపైఁ గన్నెఱ్ఱగానుండెను. ఎట్లయినను నాంధ్రసామ్రాజ్యమును ఛిన్నభిన్న మొనర్చి దక్షిణాపథమునం దేకచ్చత్రాధిపత్యమును స్థాపింపవలెనని యతఁ డువ్విళ్లూరుచుండెను. వానికోరికకుఁ దగినట్లిప్పుడు రాజ్యముగుట్టుమట్టు లెఱింగిన రాజబంధువులే మిత్రులైనారు. ఇంకఁ గావలసిన దేమున్నది! మహాదేవరాజు కాకతీయ సామ్రాజ్య వినాశనమునకు మురారి హరిహరులతోఁగూడి కలలు గనుచుండెను. అసంఖ్యాకములగు సేనలను సిద్ధపరచుకొని తగిన సమయమునకై వేచియుండెను.
5
క్రమక్రమముగా కాకతీయ సామ్రాజ్యమునఁ దలయెత్తిన కల్లోలములు శాంతించినవి. కళాపోషణమునకును కవితా గోష్ఠులకును వినోద విహారములకును విద్యాప్రదర్శనములకును కవిపండిత సన్మానములకును సుందరశిల్పనిర్మాణమునకును రుద్రమదేవి తన రాజ్యమున తగినంత దోహదమిచ్చినది. అద్వితీయశివభక్తురాలగు నామె యనేకశివాలయములు నిర్మించినది. అసంఖ్యాకములగు నుద్యానవనముల పెంపొందించినది. బ్రహ్మచారులకు వివాహములు చేయించినది. వేలకొలది తటాకములు త్రవ్వించినది. అన్నసత్రములు పెట్టించినది. తనపేర వేయి రుద్రావరములను గ్రామముల నిర్మింపఁజేసినది. బీదసాదలను ప్రేమపూర్వకముగ నాదరించినది. ప్రజలను కన్నతల్లివలె పరిపాలించినది. ఆమె శ్వేతచ్చత్రముక్రింద నాంధ్రసామ్రాజ్యము వైభవోపేతమై, మహోజ్జ్వలమై విరాజిల్లినది.
రాజనీతి విశారదయగు రుద్రమదేవి ప్రజారంజకములగు నిట్టి కార్యములలో నిమగ్నురాలైయున్నను దుర్గరక్షణమునం దేమాత్ర మేమరుపాటునందలేదు. శిథిలములగు కోట గోడలు దృఢతరముగ పునర్నిర్మించినది. ఏకశిలానగరమునకుఁ జుట్టును కంపకోట గట్టించినది. దీనికి లోతట్టున మట్టికోట గట్టించినది. దీనిచుట్టును గొప్పయగడ్త ద్రవ్వించినది. రాతికోటకు లోతట్టున శిలాసోపానముల నిర్మింపఁ జేసినది. దుర్గము సురక్షితముగా నుండు కట్టుదిట్టములన్నియు నొనర్చినది. భూమి కోటకు గవను లెనిమిది. దిడ్లు పదునెనిమిది. పుట్టకోటకు గవనులు నాలుగు. దిడ్లెనిమిది. రాతి కోటకు గవనులు నాలుగు. దిడ్లెనిమిది.
కొమ్మకిరువురు, బురుజు కేబదిమంది, దిడ్డికి నూర్వురు, గవనున కైదువందల మంది ముక్కాకలదీరిన వీరభటులు నిరంతరము కాపుండునట్లు తెలుఁగురాణి యేర్పాటుచేసినది. వీరాధివీరులైన కమ్మసేనానులు రెడ్డిసేనానులు వెలమసేనానులు రెప్పవేయక యహోరాత్రములు దుర్గరక్షణకై నియమింపఁబడిరి.
