ప్రసన్న భారతము
1
ఆనాఁడు విజయదశమి. కాకతీయాంధ్రసామ్రాజ్య రాజధానియైన యేకశిలానగరమంతయు నత్యంత మనోహరముగ నలంకరింపఁబడినది. పౌరులందరూ ప్రమోదపూర్ణములగు ముఖములతో రాజభవనము చేరవచ్చుచుండిరి.
సభాభవనము రమణీయ రత్నాలంకారములతో ధగధగ మెఱసి పోవుచుండెను. సామంతమండలేశ్వరు లొకప్రక్కను, మంత్రిపుంగవులు మరియొక ప్రక్కను, వీర సేనానాయకులు వేరొక ప్రక్కను యథోచిత స్థానములలో నుపవిష్టులైయుండిరి. పురజను లాబాలగోపాలము కుతూహలా యత్తచిత్తులై కూర్చుండి యుండిరి.
మంగళవాద్యములు మ్రోగినవి. కాకతీయ గణపతి దేవచక్రవర్తి సభ్యుల జయజయ ధ్వానములతో నాస్థాన మండపమున కరుదెంచినాఁడు. వందిమాగధుల కైవారములు భూనభోంతరములఁ బ్రతిధ్వనింనవి. ఆ మహారాజు వెంట నొక పదునారేండ్ల రాజకుమారుఁడుండెను. సభ్యులందరు సంతోషపరవశులై ప్రశాంత సుందరమగు నా రాజనందనుని వదనార విందమును అనిమిషనయనములతో నాలోకింపసాగిరి.
చక్రవర్తి రాకకు సభయంతయు గౌరవ పురస్సరముగ లేచి నిలువఁబడి కొంతవడి నిశ్శబ్దముగ నుండెను. ఇంతలో గణపతిదేవుఁడు పట్టపుటేనుగును దిగి, రాజకుమారుని చేయి గ్రహించి మహామంత్రి మార్గము చూపుచుండ వచ్చి వజ్రసింహాసనము నధిష్ఠించినాఁడు. రాజకుమారుడు రాజుగారి కెడమప్రక్కనున్న పచ్చలగద్దియపైఁ గూర్చుండినాఁడు. మహామంత్రి శివదేవయ్య రెండవవైపు బంగారు సింహాసనముపై నాసీనుఁడైనాఁడు. సభాసదులందరూ మరల తమతమ పీఠమూలా నలంకరించినారు.
గణపతిదేవ చక్రవర్తి నిజాసనమునుండి లేచి గంభీరముగా నిట్లుపన్యాసించినాఁడు.
"ఆంధ్రమహాజనులారా! మంత్రి సామంత సైన్యాధ్యక్షులారా! సర్వసమర్థులు, శక్తిసంపన్నులు, సాహసోపేతులు నగు మీయందరి సాహాయ్య సంపత్తితో నింతవరకు నీ విశాలాంధ్ర సామ్రాజ్యభారమును నా భుజస్కంధమున వహించితిని. ప్రజాభ్యుదయమును దృష్టిలో నుంచుకొని పరిపాలించితిని. విరోధి శీర్షములు వినమ్రములు కావించితిని. సాధ్యమైనంతవరకు సామ్రాజ్యమును విస్తరింపఁజేసితిని.
సోదరులారా! నేనిప్పుడు వృద్ధుఁడనైతిని. శరీరమున జవసత్త్వము లుడిగి పోయినవి. దుర్బలమైన నా భుజస్కంధ మీ సామ్రాజ్యభారము నిఁక భరింపలేదు. నేఁటి నుండి మీకీ రాజకుమారుఁడే ప్రభువు. మీయందరు సమ్మతి నందుకొని వీనినీ విశాలాంధ్ర సామ్రాజ్యమునకుఁ జక్రవర్తినిగా నభిషేకించుచున్నాను."
అని పల్కి మహారాజు రాజకుమారుని వజ్రసింహాసనముపైఁ గూర్చుండఁ బెట్టెను. మహామంత్రి శివదేవయ్య మణిమయ కిరీటమును బాలరాజు శిరముపై నలంకరించెను. కులగురువులు మంత్రపూతములగు జలములతో నభిషేకించిరి. సభయంతయు మందహాసముతో, మహానందముతో చేతులెత్తి జేజేలు సమర్పించినది. తూర్యధ్వనులు మిన్నుముట్టినవి. పుణ్యపురంధ్రీమణులు కర్పూర నీరాజనము లెత్తిరి. సభ్యులు పుష్పవృష్టి గురిపించిరి.
కాని యిరువురు పురుషులు మాత్రమే చిరాకుతో, నిరాశతో మొగములు మటమట మాడ్చుకొనుచు సభా మండపమును విడిచి చనిరి.
2
గణపతి దేవచక్రవర్తికి పుత్రసంతానము లేదు. ధర్మపత్నియగు సోమాంబయం దాయనకు రుద్రాంబ, గణపాంబయను నిరువురు పుత్రికలు మాత్రము జన్మించిరి. ప్రాజ్ఞుఁడగు గణపతిదేవ చక్రవర్తి పురుషసంతానము లేనందు కేమాత్రము చింతాక్రాంతుఁడు కాలేదు. ఆయన తన పుత్రికలనే పుత్రులనుగా భావించి వారికి వీరోచితములగు విద్యలు నేర్పించెను. రుద్రమ్మ బాల్యమునుండియ ధనుర్విద్యయందుఁ దగిన సామర్థ్యము సంపాదించినది. కత్తిసాము, గుఱ్ఱపుస్వారి మొదలగు వానియందు ప్రావీణ్యము గడించినది. కామందక కౌటిల్యాది శాస్త్రముల నభ్యసించి రాజనీతి రహస్యములనెల్ల నాకళించుకొనినది. సామ దాన భేద దందోపాయముల గ్రహించినది. తనజనకునితోఁ దానుగూడననేక యుద్ధరంగముల కేగి వ్యూహరచనలు, సైనిక విన్యాసము మొదలగు విషయములను ప్రత్యక్ష ప్రమాణములతో నేర్చుకొనినది.
రుద్రమదేవి పురుషవేషము ధరించి తన తండ్రివెంట ననుదినము నాస్థానమండపమున కరుదెంచుచుండెడిది. ఆయనతోపాటు రాజకార్యములను బరుష్కరించి తన ప్రజ్ఞా విశేషములను బ్రకటించుచుండెడిది.
ఈనాఁ డా వీరనారీమణి యాంధ్రసామ్రాజ్యపీఠ మధిష్ఠించినది. తన జనకుని యనంతరము రాజ్యభారమును వహించి ప్రజారంజకముగ పరిపాలన సాగించినది.
3
ఒక యబల యాంధ్రసామ్రాజ్యమున కధీశ్వరియగుట చూచి "హరిహర" "మురారు"లకు కన్నులు గుట్టినవి. కడుపు భగ్గుమన్నది. వారా రాజ్యప్రదాన మహోత్సవమును సందర్శింపలేకపోయిరి. వీరే నాఁడు సభ వెడలిపోయిన పెద్దమనుష్యులు.
దురభిమానపిశాచగ్రస్తులగు వీరిరువురకు రుద్రమదేవి తెలుఁగు రాణియగుట భరింపరాని పరాభవముగా దోఁచినది. ఒక యాఁడుదాని పాలనమునకు లొంగిపోవుట వారి కవమానకరముగఁ దట్టినది. ఒక మహిళ పాదపీఠమునకు మణిమయ మకుటాంచితములగు మౌళిభాగములువంచి జోహారులొనర్చుటకు వారి యంతరాత్మ లంగీకరింపలేదు. ఆంధ్రవీర నారీమణిలోఁగల మహోజ్జ్వల శక్తిసామర్థ్యములు. విశ్వవిఖ్యాత రాజనీతిజ్ఞతలు వారి తలల కెక్కలేదు. మానవతియు, మాతృమూర్తియు, మహాశక్తిస్వరూపిణియు నగు మహిళామణిలోఁగల మహత్త్వమును వారు గుర్తింపలేక పోయిరి.
ఇఁకనేమి! మురారి హరిహరులు దురాలోచనకుఁగడంగిరి. రుద్రమదేవి నెట్లయిన సింహాసనము నుండి దింపి యాంధ్రసామ్రాజ్యపీఠము నధిరోహింపవలెనని నా రాకాశసౌధములు గట్టుకొనుచుండిరి.
