Previous Page Next Page 
భవ బంధాలు పేజి 2


    "అత్తయ్య గారూ, నేను మా యింటికి వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను కోడలిగా కాక కూతురిగా చూస్తారని, చెప్పి వెడదామని వచ్చా. ఇంక మీరు నాకేం చెప్పద్దు. చెప్పినా వినను" దూకుడుగా యింట్లోకి వస్తూనే ఆవేశంగా అంది నవ్య. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి "ముందు లోపలి కెళ్ళి మంచినీళ్ళు తాగిరా" ఎర్రబడి చెమట పట్టిన మొహం చూసి అంది జానకి.
    "సరే, యిప్పుడు చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నావు" జానకి సూటిగా చూసింది. "ముందు మా యింటికి , ఆ తర్వాత మిగతాది ఆలోచిస్తా."
    "నీ యిల్లు వదిలి, పుట్టింటికి వెళ్లిపోవాలన్న నిర్ణయం తీసుకునేటంత విషయం ఏం జరిగింది?"
    "ఏం జరుగుతుంది . మీ అబ్బాయింక మారడని అర్ధమై పోయింది. అతనికీ నాకూ పడదు. నేనింక సర్దుకోను. ఓ సరదా లేదు. అచ్చటా ముచ్చటా లేదు. మౌన ముని లా మొద్దులా కూర్చునే మొగుడి ని నేను భరించ లేను. నేను లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి. మనుషులు కావాలి. సరదాలు కావాలి. షికార్లు , పార్టీలు స్నేహితుల ,మధ్య జీవితం ఆటలా పాటలా సాగాలి అని ఉంటుంది. మా స్వభావాలు కలవవు. యింక మా యిద్దరికీ కుదరదు" ఆవేశంగా అంది.
    "సరే, యిప్పుడెం చేస్తావు. విడాకులు తీసుకుంటావా. విదిపోతావా, నిర్ణయం తీసేసు కున్నావా?" కోడలిని చూస్తూ ప్రశాంతంగా అంది జానకి. అత్త మాటకి ఒక్క నిమిషం చాకితురాలై తడబడ్తూ "ఏమో యింక అదంతా ఆలోచించలేదు. తనతో మాత్రం వుండనంతే" మొండిగా చిన్నపిల్లలా అంటున్న కోడలిని చూసి , "మరి వాడితో యీ మాట చెప్పావా?' అంది.
    "లేదు. ముందు వెళ్ళిపోతే , నే లేకపోతె తెలిసి వస్తుందేమో చూస్తా. ఒక అవకాశం యిచ్చి చూస్తా మారడానికి" బింకంగా అంది.
    "ఓ, అయితే యిది ఉత్త బెదిరింపన్న మాట, వాడెం చేస్తాడో చూద్దామని."
    "అత్తయ్య గారూ, మీ అబ్బాయిని వెనకేసుకు రాకండి. నాకు ఒళ్ళు మండుతుంది."
    "నీకు తెలుసు, నేనెవరినీ వెనకేసుకు రాననీ , ఎవరి తప్పుంటే వాళ్ళకే పెద్దదానిగా ఏదన్నా చెప్పాలను కుంటాను" ప్రశాంతంగా చిరునవ్వుతో అంది.
    "అందుకే, మీకు చెప్పాలని వచ్చి, "కాస్త మెత్తబడింది. "చూడు నవ్యా, అందరి స్వభావాలూ ఒకేలా ఉండవు. యిష్టాయిష్టాలు , కోరికలు , చెల్లాలను కుంటే సంసారంలో కలతలు తప్పవు. పార్టీలు, క్లబ్బులు, అవి వాడికి అంత నచ్చవని అర్ధమయ్యాక, నీ భర్తని నీవైపు తిప్పుకునే చాకచక్యమన్నా వుండాలి. అది లేనప్పుడు కాస్త అవతలి వారి అభిప్రాయం గౌరవించి దాని కనుగుణంగా నీవు మారాలి."
    "అంటే అయన గారి కోసం నా సరదాలన్నీ చంపు కోవాలా? అయన పార్టీలకి నేను వెళ్ళడం లేదా?" నిలదీసింది నవ్య.
    "అవును . ఆడవాళ్ళం అందరితో తొందరగా కలిసిపోగలం , గలగల మాట్లాడుకో గలం. మన పరిచయాలు, స్నేహాలు ఎక్కువ. నీలా వాడూ వుండాలంటే ప్రేమతో లొంగ దీసుకోవాలి. మేం చదువుకున్నాం -- సంపాదిస్తున్నాం . ఎప్పటికీ వాళ్ళ మాటే ఎందుకు చెల్లాలి అనుకుంటే కాపురం లో గొడవలు తప్పవు. తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గాలి. వినాల్సి వచ్చినప్పుడు వినాలి. చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి. అంతేగాని సాధించితే సాధించేది వుండదు."
    "అవును . మీఅబ్బాయి గదా , యిలాగే మాట్లాడతారు. ఎన్నాళ్ళయినా ఆడవాళ్ళ నే సర్దుకో మంటారు మీలాంటి చదువుకున్న వారు" కోపంగా అంది.
    "ఏం అబ్బాయిలు ఎంత మారారు? మా కాలంలో మొగుళ్ళలా వున్నారా మీ మొగుళ్ళు-- వాళ్ళలో మార్పు ఎంత వచ్చిందో మాకు తెలుసు" సూటిగా చూస్తూ కాస్త గట్టిగానే అడిగింది జానకి.
    ఇబ్బందిగా చూసి "అంటే మీ అబ్బాయిలో ఏ తప్పు లేదు  అంటారు" అంది.
    "వుంటాయి. తప్పులేందుకు ఉండవు. అందరిలో వుంటాయి. ఫర్ ఫెక్ట్ పర్సన్ ఎవరూ వుండరు. ఎటొచ్చి మనం చూసే ధోరణి బట్టి వుంటాయి. చూడు యీ కాలం అమ్మాయిలు మొగుడనగానే సర్వగుణ సంపన్నుడు . తమని పువ్వుల్లో పెట్టి పూజించేవాడు. మాట జవదాటని వాడు కావాలను కుంటారు. డానికి వ్యతిరేకంగా ఏదన్నా అటూ ఇటూ అయితే తమ కలలు కరిగి పోయినట్లు బాధపడిపోతూ , మొగుడన్నా వాడినీ బాధపెడతారు. పెళ్ళికి ముందు ఏడాది తిరిగారు. స్నేహం, ప్రేమ, పెళ్లి, అన్నీ మీరు కోరుకునే చేసుకున్నారు. అప్పుడు మరి చూసుకోలేదా" గొంతు పెంచింది జానకి.
    "అపుడు బాగానే తిరిగాడు నా వెనకాతల" హేళనగా అంది నవ్య.
    'అవును బాయ్ ఫ్రెండ్ గా అమ్మాయి లని ఇంప్రెస్ చెయ్యాలని అబ్బాయిలు అబ్బాయిని మెప్పించాలని అమ్మాయిలు షోకులు చేసుకుని మురిపిస్తూ వెంట తిప్పు కుంటారు. బాయ్ ఫ్రెండ్ మొగుడయ్యాక అలాగే వుండాలని కోరుకుంటే అది మీ అమాయకత్వం . నవ్యా యిచ్చి పుచ్చుకుంటేనే అభిమానాలు, పెరుగుతాయన్నది గుర్తుంచుకో. నా జోక్యం వుండకూడదని ఇన్నాళ్ళు నేనేం అనలేదు. ఇంకా పెళ్లి కాని అమ్మాయిలా సరదాలు, తిరగడాలు, తగ్గించుకుని యిల్లు, సంసారం, మొగుణ్ణి కాస్త పట్టించుకుంటే " అన్నీ అవే సర్దు కుంటాయి" అత్తగారి మాటల్లో మందలింపు ధోరణి కి ఉక్రోషం వచ్చేసి విసవిసా వెళ్ళిపోయింది నవ్య.

                              *    *    *
    "నేను చెప్పాల్సినవి కాస్త గట్టిగానే చెప్పాను. అంత చెప్పాక , అలా అలిగి వెళుతుందను కోలేదు. సరే, ప్రతి ఆదివారం ఆవిడకి అలవాటే గదా రేపు ఆఫీసుంది గదా, వస్తుందిలే" సర్ది చెపుతూ అంది జానకి.
    "అమ్మా, యింక నీవేం ఫోన్లు చెయ్యకు. ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది. రాకపోయినా నేనేం అడగను" చిరాగ్గా అన్నాడు కొడుకు కోపం అర్ధమయింది.
    "వరుణ్ ఒక మాట చెప్పనా, మీ పెళ్ళయి రెండేళ్ళు నిండిపోయింది. జీవితంలో ప్రతి దశలో మార్పు వుండాలి. పెళ్ళయిన కొత్తలో కొత్త భార్య-- ప్రేమ, మోజు మోహం అనుబంధంతో ఒక ఏడాది తొందరగానే గడిచి పోతుంది. తరువాత భ్ర్యభార్తల అనుబంధం గట్టి పడాలంటే పిల్లలు పుట్టుకు వస్తే వారిద్దరి జీవితంలో మార్పు వస్తుంది. పిల్లల పెంపకం లో, ముద్దు ముచ్చట్ల తో అనుబంధాలు పెనవేసుకుని ఆప్యాయతలు పెరుగుతాయి. పిల్లల కోసం అలవాట్లు, అభిరుచులు, మార్చుకుని సర్దుబాటు ధోరణి అలవడుతుంది. యిప్పుడు బాయ్ ఫ్రెండ్స్ , ప్రేమలు, మోజులు ముచ్చట్లు, ఆకర్షణ లు పెళ్ళికి ముందే జరిగిపోతున్నాయి.
    ఏ కొత్తదనం , ఏ మార్పు కనపడక, పెళ్ళంటే యింతేనా అనిపించడం, కాపురంలో బాధ్యతలు, ఉద్యోగాలు, సర్దుబాట్లు, పైన పడి ఏ ద్రిల్లు కనపడదు. ఉద్యోగాల్లో అలిసి సోలిసి దాంపత్యం లో , శృంగారానికి తావు కనిపించనంతగా అలిసి పోతున్నారు. ఒకరిపట్ల ఒకరికి నిరాసక్తత, ఆకర్షణ పోయి, అనుబంధం తగ్గి చిరాకులు, కోపాలు, విసుగులు, పంతాలు, కీచులాటలు పెరుగుతున్నాయి."
    "అయితే ఎమిటం టావు . అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ అందరూ ఇలాగే, ఇళ్ళు, సంసారం ఏది పట్టించుకోకుండా వున్నారా?"
    "అమ్మాయి ఒక్కర్తి అవడం, ఇంట్లో అతి గారాభం, పనీ పాటా చెప్పకపోవడం పెంపకం లోపం అనిపిస్తుంది. పెళ్లి తరవాత అమ్మాయిలు నేర్చుకుంటారు. కానీ నవ్యకి యింకా బాధ్యత రాలేదు. ఏదో తన ఇంటికి తను వెడితే సంసార బధ్యత వస్తుందను కున్నా. అందుకే నీకు కోపం వచ్చినా, బాధపడ్డా ఇల్లు వదిలి నీ దగ్గరికి రాలేదు. నేనుంటే అసలు పట్టించుకోదు..... పని పాట నేర్చుకోదని."
    "అవునమ్మా, మొదట కోపం వచ్చినా, నీవు ఎందుకు రానన్నావో, ఒక్కర్తీవీ ఎందుకు ఇక్కడ వుంటానన్నావో తరవాత అర్ధమైంది. అమ్మా, నీవు నవ్యకి ఏం ఫోన్ చెయ్యకు, చెప్తున్నాను" అంటూ విసురుగా వెళ్ళిపోయాడు.
    
                               *    *    *
    
    "రావోయ్ , వరుణ్ , రా, రా" మామగారు ఆప్యాయంగా ఆహ్వానించారు. అత్తగారు లేచి నిలబడి "రా....ఇలా కూర్చో" చాలా సంతోషంగా ఇద్దరూ ఆహ్వానిస్తుంటే కాస్త ఆశ్చర్య పోయాడు వరుణ్. తనూహించిన ఆ ప్రసన్న వాతావరణం, గంబీరత కనపడక పోవడంతో ఒక విధంగా రిలీఫ్ గా పీలయ్యాడు వారం రోజులు తరవాత.
    "వరుణ్ ఒకసారి నీవు అర్జంటు గా రావాలి" మామగారినించి ఫోన్ రాగానే, నవ్య ఏం చెప్పిందో, ఈయన పిలిచి ఏం నీతులు చెపుతాడో, క్రాస్ ఎగ్జాం చేసి, అల్టిమేటమేమిస్తాడో ...సరే ,ఒకసారి వాళ్ళతో నూ మాట్లాడి నవ్య గొడవ తేల్చుకుందాం అన్నట్టు వెళ్ళిన వరుణ్ అక్కడ ఎదురైన అభిమాన ఆహ్వానం ,ప్రసన్న వాతావరణం చూసి, "ఏమిటి అర్జంటుగా రమ్మన్నారు" అన్నాడు కూర్చోకుండానే.
    "అర్జంటుగా కాక మాములుగా చెప్పే కబురా ఇది. మనవడు వస్తున్నాడోయ్ మరి మాకు. యిదిగో చూడు యింక మీరిద్దరూ చిన్నపిల్లల తగవులు మానేసి, డాడీ, మమ్మీల రోలుకి ప్రిపెరవడం మొదలు పెట్టండి" సంబరంగా, ఆనందంగా అన్నాడు.
    వరుణ్ ఒక్కక్షణం అర్ధం కానట్టు చూసి, తరువాత "ఏమిటి , నిజమా!" సంభ్రమంగా అన్నాడు, నవ్య చెప్పలేదు నాకు."
    "దాని మొహం, డానికి తెలిస్తే కదా, వికారం, వాంతులు అంటూ తిండి తినకపోతే వాళ్ళమ్మ డాక్టరు దగ్గరికి తీసి కెళ్ళింది. వెళ్ళు, వెళ్ళు గదిలో కి వెళ్ళు" అంటూ తరిమాడు అయన.

                         *    *    *
    "ఏదో పాపం, నా బాబుకి తండ్రి ప్రేమ ఉండాలి గదా అని వస్తున్నాను తెలుసా" దబాయింపు గా అంది నవ్య కారులో బుంగమూతి పెట్టి.
    "అబ్బే, ఫరవాలేదు. పుట్టని బాబు మీద అంత ప్రేమ పుట్టు కొచ్చేసి, నన్ను ఉద్దరించడానికి వస్తున్నావు. వెల్ కమ్ హోమ్...' వ్యంగ్యంగా ఎత్తి పొడిచాడు వరుణ్.
    "నాకుంది , నీకే లేదు నా మీద ప్రేమ" భుజం మీద తలవాల్చి ముద్దులు గునిసింది.
    "నీ తిక్కవేషాలు ఆపి కాలేజ్ గర్ల్ అవతారం నించి అమ్మ అవతారానికి ప్రిపెరవు. పిచ్చి పార్టీలంటే కాళ్ళు విరగ్గోడతా. డ్రింక్ ముట్టుకుంటే చేతులు విరగ్గోడతా. నోరు మూసుకుని చెప్పినట్లు విను" బెదిరించాడు నవ్వుతూ.
    "అబ్బో.....మొనగాడు బయలుదేరాడు కాళ్ళు విరగ్గొట్టడానికి . నాకేం హాయిగా ఉద్యోగం మానేసి యింట్లో తింటూ కూర్చుంటా - మరీ మంచిది."
    "అదేం కుదరదు. తొమ్మిదో నెల వరకు ఉద్యోగం చేస్తావు. లేకపోతె నీలాంటి బద్దకస్తులు పుట్టుకొస్తారు తిని పడుకుంటే. చలాకీగా వుండాలి ఆరోగ్యం సరిగా వుండాలంటే డ్రింక్ అది......."
    "తెల్సులేవోయ్-- డాక్టరు చెప్పిందిలే నాకు . నీతులు చెప్పకు నాకు. కడుపునపడగానే కంట్రోల్ చేస్తున్నాడు-- ఇది,అది చేయకూడదంటూ, పుట్టాక ఎలాగో నా ఫ్రీడం అంతా పోతుంది గాబోలు" విచారం నటించింది నవ్య.
    'అంతే , రంకెలు వేసే గిత్తకి ముక్కుతాడు వేస్తారు పొగరు దించడానికి . నీలాంటి డానికి పిల్లలు వేస్తారు" ఉడికించాడు వరుణ్.
    బాల్కనీ లోంచి ఆరాటంగా ఎదురు చూస్తున్న జానకి, కారు దిగి వస్తున్నాం అని చెప్పిన దగ్గర నించి ఆవిడకి సంతోషంతో గాలిలో తెలిపోయినట్టుంది. ఇంట్లోకి వచ్చాక కొడుకు కబుర్లూ వింటూ "అవున్నాయనా , పెళ్ళికి పలుపు తాడు నడుం కి కట్టి మొగుడు పెళ్ళాన్ని కట్టడి చేస్తాడు. పిల్లలు పుట్టుకొచ్చి సంసార బంధాన్ని బిగిస్తారు."
    "అమ్మా ఎంతయినా ఆడవాళ్ళ కే సపోర్ట్ చేస్తావు" అన్నాడు వరుణ్.
    "అదేం కాదు కాని, నిజం చెప్పనా మన దేశంలో సంసారాలు సగం పిల్లలు వల్లే నిలుస్తాయి. పిల్లలే భార్యాభర్తలని బంధించే బంధాలు" అంది ఇద్దరినీ మురిపంగా చూస్తూ జానకి.

                              *    *    *


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS