అందుకే చిరునవ్వుతో ఆహ్వానించింది "రా వేణూ..." అంటూ.
వికసించిన మొహంతో అన్నాడు వేణు. "నాకు బ్యాంక్ లో పోస్టింగ్ వచ్చింది అర్చనా..."
"ఏ బ్యాంక్ లో?" ఆశ్చర్యంగా చూసింది. "ఎప్పుడు రాశావు ఎగ్జామ్స్?"
వేణు నవ్వాడు.
"ఈ మధ్యే చక్రవర్తి రాస్తుంటే నేనూ రాశాను. మా ఇద్దరికీ పోస్టింగ్ వచ్చింది. తనకి వరంగల్ లో, నాకు హైదరాబాదులో." "ఓ గుడ్. కంగ్రాట్స్. కానీ, నీ యాంబిషన్ వేరు కదా!"
"ఓ గుడ్. కంగ్రాట్స్. కానీ, నీ యాంబిషన్ వేరు కదా!"
"అవును. కానీ, మార్చుకున్నాను."
"ఏం?"
ఇంతలో సావిత్రి కాఫీ గ్లాసుతో వచ్చింది "కులాసానా బాబూ...?" అంటూ.
కాఫీ గ్లాసు అందుకుని "థాంక్స్ అంటీ. నాకు ఉద్యోగం వచ్చింది" అన్నాడు.
"అలాగా! చాలా సంతోషం ఎక్కడ?" అంటూ ఆనందరావు కూడా వచ్చాడు.
"స్టేట్ బ్యాంక్ లో..." అంటూ వివరాలు చెప్పాడు.
"మంచిపని చేశావు బాబూ! ఏం చదువుకున్నా మంచి ఉద్యోగమేగా కావాల్సింది. బ్యాంకు ఉద్యోగం కన్నా ఏం కావాలి? చాలా మంచిపని చేశావు" అంటూ అర్చనవైపు చూస్తూ అన్నాడు ఆనందరావు. "నువ్వు కూడా ఏదన్నా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయమ్మా. మంచి ఉద్యోగం వస్తే నీ దారిన నీవు హాయిగా బతకచ్చు."
సావిత్రి కూడా అంది "ఇప్పట్లో నీకు పెళ్ళి అయే యోగం ఉందో లేదో ఆ పని చేయమ్మా. ఉద్యోగం సంపాదించుకుని బతుకు."
అర్చన పళ్ళ బిగువున కోపం అదిమిపెట్టి "లేదు నాన్నా! నేను ఉస్మానియా యూనివర్శిటీ లో పి.జి.కి అప్లై చేస్తాను. చదువుకుంటాను" అంది.
"చదివింది చాలు. అయిన రభస చాలు. మా ప్రాణాలు తీయకుండా ఉద్యోగం చేసుకో తల్లీ. అటు పెళ్ళికాక, ఇటు ఉద్యోగం లేక మా గుండెల మీద ఎన్నాళ్ళిలా ఉంటావు?" ఆవేశం, ఆవేదన కలిసిన స్వరంతో అంది సావిత్రి.
"ఏంటమ్మా! ప్రతిరోజూ ఈ గోల? నాకేం జరగలేదు అంటే నమ్మరేం? నాకిప్పుడు ఏమైంది?"
"ఏమైంది అని నువ్వదిగితే ఏం చెప్పమంటావు? ఏమైనా నీకు పెళ్ళి కావడం మాత్రం ఇప్పట్లో అసాధ్యం."
"నేనేం పెళ్ళికోసం తపించడం లేదు."
"నువ్వు తపించినా, తపించకున్నా నీకు పెళ్ళి చేయడం కర్తవ్యం. కానీ మా ఖర్మ ఇలా ఉంది. నీకు పెళ్ళి కాదు."
అప్పటిదాకా వాళ్ళ వాదన ఉగ్గాబట్టుకుని వింటున్న వేణు అర్చన కళ్ళల్లో ఉబికిన కన్నీళ్ళు చూసి తట్టుకోలేకపోయాడు. పాపం ఈ తల్లితండ్రులకి ఎంత వేదన? ఆడపిల్ల జీవితం ఎంత పల్చన? ఏం జరిగినా ప్రపంచానికి తక్షణం కనిపిస్తుంది. వీళ్ళ ఆవేదన తీరాలంటే ఎవరన్నా విశాల హృదయంతో ముందుకు వచ్చి ఆమె మెడలో తాళి కట్టాలి. ఆ పని తానే చేయాలి. అవును తానే అర్చనకి అండగా ఉండాలి. తప్పకుండా ఒప్పుకుంటుంది. ఇప్పుడింక తను తప్ప ఎవరున్నారు ఆమెకి? నిజంగానే ఎవరు పెళ్ళి చేసుకుంటారు? ఇది భగవంతుడు తనకి కల్పించిన మహదావకాశం. అర్చన తనకి దక్కాలని రాసిపెట్టి ఉంది. అందుకే ఇలా కలిపాడు భగవంతుడు, పిచ్చి అర్చన! అవును తానే అర్చనకి అండగా ఉండాలి. తప్పకుండా అర్చన ఒప్పుకుంటుంది. అవును ఇదే అవకాశం నిజంగా తనకిది మంచి అవకాశం. అర్చనని దక్కించుకోడానికి. అర్చనని తన స్వంతం చేసుకోడానికి ఇదే అవకాశం.
మనసులో ఆలోచనలు ఉవ్వెత్తున ఎగుస్తుంటే కెరటంలా లేచిన ఆనందంతో, ఆవేశంతో గబుక్కున అన్నాడు వేణు.
"మీరు బాధపడకండి. మీరొప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుంటాను. చూశారుగా నాకు ఉద్యోగం కూడా ఉంది. తనని నా ప్రాణానికి ప్రాణంలా చూసుకుంటాను" అన్నాడు ఉద్వేగంగా.
ఒక్క క్షణం అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది.
కొన్ని క్షణాల తర్వాత అర్చన కంపిస్తున్న స్వరంతో తీవ్రంగా పిలిచింది. "వేణూ...!"
వేణుతో సహా అమిగాతా ఇద్దరూ బిత్తరపోయారు అర్చన అరుపుకి.
అర్చన వేణువైపు మండిపడుతూ చూసింది. "వేణూ! ఇంతకాలం నిన్ను తక్కువగా అంచనా వేసి, ఏడిపించిన మాట నిజం. ఇప్పుడే నీలో మంచి స్నేహితుడిని చూసి, నీ స్నేహాన్ని ఆహ్వానించాలనుకుంటున్నాను. దయచేసి పరిస్థితుల్ని నీకనుకూలంగా మార్చుకోవాలన్న దుష్ట ఆలోచన రానివ్వకుండా ఉంటే బాగుంటుంది."
"లేదు అర్చనా... నువ్వంటే నాకు ఇష్టం. నీ జీవితం ఏ ఆనందానికీ, ఏ సుఖానికీ నోచుకోకుండా ఇలా మోడులా ఉండిపోవడం నేను భరించలేను. అందుకే నేను నిన్ను పెళ్ళిచేసుకుంటాను. నువ్వు కోల్పోయిన ఆనందం నేనిస్తాను."
అర్చనకి కడుపులో కాలుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏంటితని ఉద్దేశం? ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నాడు? తనకేం జరిగింది? ఏం కొంపలు అంటుకున్నాయి. వాడెవడో తనని మోసం చేసి ఎత్తుకెళ్ళి ఒక రాత్రి తన ఇంట్లో ఉంచినందుకు, ఏదో జరిగిపోయిందని, తద్వారా తన జీవితం నాశనం అయిందని ఎందుకనుకుంటున్నాడు? ఫూల్ లా ఉన్నాడే!
అర్చన కొంచెం తీవ్రమైన స్వరంతో అంది. "వేణూ. ఆడదాని కొన్ని నిస్సహాయ పరిస్థితులను అవకాశంగా వాడుకోవడం మీ మగాళ్ళకున్న ఆర్ట్ అని నాకు తెలుసు. ప్రస్తుత నా స్థితిని అడ్డం పెట్టుకుని నన్ను పెళ్ళిచేసుకుని ఉద్దరించాలన్న నీచమైన ఆలోచనలు పెట్టుకోకు. నేను పెళ్ళి చేసుకోను. నిన్ను అసలే చేసుకోను. నువ్వింక వెళ్ళిపోవచ్చు."
ఎప్పుడు వచ్చాడో కిరణ్ వెటకారంగా అన్నాడు. "అవును ఈవిడని వరించి రాజకుమారుడు వస్తాడు. నువ్వెందుకు పనికివస్తావు? అంతేలే అదృష్టం అందలం ఎక్కిస్తానంటే ఏదో జరిగిందట."
అర్చన తీవ్రంగా అరిచింది. "అన్నయ్యా, ఇది నా స్వవిషయం. నీ జోక్యం అవసరం లేదు."
"ఏం ఎందుకు అవసరం లేదు? ఇప్పటికే నీ వలన ఈ ఇంటి పరువుబజారుకెక్కింది. ఇంకా నీకు సిగ్గు రాలేదు. అతనికేం తక్కువని అతనంతట అతనుగా వలచి వస్తే నీకు చులకన అయాడా?" అంటూ అర్చన మీద విరుచుకుపడి, తల్లితో అన్నాడు "అమ్మా! మీకు నేను కావాలంటే ముందు దాన్ని ఈ ఇంటినుంచి బైటికి పంపించండి" అంటూ విసురుగా వెళ్ళిపోయాడు.
