.png)
సురేష్ వర్మకు నిద్రరావడం లేదు.
మామూలుగా అయితే ఓ పుస్తకం చదువుతూ అలా నిద్రలోకి జారిపోయేవాడు. కానీ ఎందుకనో ఆరోజు పుస్తకం మీదకి దృష్టిపోవడంలేదు. కళ్ల ముందునుంచి శశిరేఖ రూపం చెదిరిపోవడంలేదు. శ్రీశ్రీ గేయం గుర్తుకొస్తోంది. వేళకాని వేళలలో, లేనిపోని వాంఛలలో, దారికాని దారులలో, కానరాని కాంక్షలలో దేనికొరకు, దేనికొరకు దేవులాడుతావ్? ఏం కావాలి తనకు? ఆమె నుంచి ఏం కోరుకుంటున్నాడతను?
కానీ విషాదమేమిటంటే, మనం ఎదుటివ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నామో తెలియకపోవడమే. తనకూ అంతే. ఏమిటో దానికి తన దగ్గరా జవాబులేదు. ఆమెతో ఎప్పుడూ మాట్లాడాలని వుంది. తనతో గడపాలని వుంది. ఎండ, వానా, పగలూ, రాత్రీ, చలీ, ఇలా ప్రకృతి మార్పులన్నీ తనతో పంచుకోవాలనుంది. గ్రీష్మం నుంచి వసంతం వరకు ప్రతి ఋతువునూ తనతో అనుభవించాలనుంది.
తనతో నవ్వాలనుంది. తనతో కలిసి ఏడ్వాలనుంది. తనతో కవిత్వం చెప్పించుకోవాలనుంది. కవిత్వం చెప్పాలనుంది. తనతో ప్రపంచమంతా రివ్వుమని చుట్టి రావాలనుంది. అదేసమయంలో తనతో ఏ అడవిలోనో చిన్న కుటీరంలో జీవితాంతం ఉండిపోవాలనుంది. ఇలా అనిపించడాన్ని ఏమంటారు? ప్రేమా? ఆకర్షణా, మోహమా, శృంగారమా? ఏమని పిలవాలీ దీన్ని. మొత్తానికి తనకి ఆమె ధ్యాస తప్ప మరొకటి లేకుండా బతకాలనుంది. కానీ అదెలాసాధ్యం? ఆమెకు పెళ్లయింది. మరి పిల్లలున్నారో లేదో తెలియడంలేదు.
ఆమెమీద తన అధికారం ఏమిటి? అతనికా సమయంలో ఏమీ తెలియడం లేదు. తనమీద తనకే జాలి లాంటిది కలుగుతోంది. అతనికి ఎప్పుడో చిన్నప్పుడు విన్న కథ గుర్తొచ్చింది. నాలుగో తరగతి, అయిదో తరగతి చదివేరోజుల్లో ఎవరైనా కథలు చెబుతుంటే అవి నిజంగా జరుగుతున్నాయని భావించి వాటికి కలిగిన కష్టం గురించి ఏడ్చేశాడు. పులీ ఆవు కథ విన్నప్పుడైతే అతని బాధ వర్ణనాతీతం. ...
ఎలాగైనా ఆవుతోపాటు అడవికివెళ్ళి ఆవును వదిలెయ్యమని, దానికో చిన్నదూడ వుందని చెప్పాలని తెగ తాపత్రయపడిపోయేవాడు. అది కథ అని, అలాంటి ఆవుకానీ, పులీకానీ లేవనీ తల్లి ఎంత చెప్పినా వినలేదు. కొంచెం పెద్దయ్యాక అంత అమాయకత్వంలేదు గానీ, ఆ పాత్రలు నిజమని నమ్మినంత గాఢంగా ఫీలయ్యేవాడు. కథ విన్న చాలా రోజులవరకు ఆ పాత్రలే కళ్లముంది మెదిలేవి. ఇప్పుడు తన స్థితిలాంటిదే గతంలో ఓ తిప్పడు ఎదుర్కొన్నాడు. ఆ కథ ఇప్పుడు గుర్తొస్తోంది.
ఓ రాజ్యాన్ని రాజు పాలిస్తుంటాడు. ఆయనకి పద్దెనిమిదిమంది భార్యలు. చిన్న భార్య చాలా సౌందర్యరాశి. రాజు అంతఃపురంలో బట్టలు ఉతికేందుకు తిప్పడు అనే వాడొకడుంటాడు. వాడు అనుకోకుండా ఓరోజు చిన్నరాణీని చూస్తాడు. ఆమె అందానికి దాసుడయి పోతాడు. అయినా ఇద్దరికీ ఎంత భేదం? మొహానికి అదంతా ఏం తెలుసు? ఇక తిప్పడు ఆమె మీది కోరికతో సన్నగా అయిపోతాడు.
ఆ తరువాత కథ చాలానే వుంది. ప్రస్తుతం తను కూడా వాడిలాగా అయిపోయాడు. లేకుంటే ఇంతమంది అమ్మాయిలుండగా, తనకు ఆమెమీద కోరిక కలగడమేమిటి? పాపం మానస - తనకోసమే యవ్వనాన్నంతా అలా దాచి పెట్టుకుని కూర్చుంది. కానీ అదేమిటో ఈ మనసు? ఆమెమీదకి పోవడంలేదు. తను ఇప్పుడంటే ఇప్పుడు శ్రీనివాసరావు, మానసతో ఘనంగా పెళ్లి జరిపించేస్తాడు.
కానీ మానసను చూస్తే తనకెందుకో ఏ ఫీలింగూ కలగదు. పోనీ మానసకు ఏం తక్కువంటే తన దగ్గర సమాధానమేమీలేదు. ఈ రేఖను చూస్తూనే స్పందించినంత హృదయం మానస దగ్గర అలా ముడుచుకుపోతుందేమిటి? యాడ్లర్ గానీ, యూంగ్ గానీ ఎవరూ జవాబు చెప్పలేదు. తన మనస్సు గురించి తనకే తెలియనప్పుడు వాళ్లకెలా తెలుస్తుంది?
శశిరేఖ ఆలోచనల నుంచి తప్పించుకోవడానికన్నట్లు డాబామీద కొచ్చాడు. పిండారబోసినట్లు వెన్నెల. నూర్పిళ్లు అయిపోవడంతో పొలాలన్నీ బీడుగా వెన్నెల్లో ముగ్గుపిండి గాలికి రేగుతున్నట్లు కన్పిస్తున్నాయి. ఈ వెన్నెల్లో దూరంగా పొలాలమధ్య శశిరేఖతో వెన్నెల కుప్పలాట లాడితే ఎలా వుంటుంది? మళ్లీ శశిరేఖ కిందనుంచి పైకొచ్చినా వీడని తలుపులు. ఎలా భరించడం?
