.png)
ప్రస్తుతానికి సురేష్ వర్మ, కుటుంబం ఆర్దికంగా వెనకపడినప్పటికీ పేరు ప్రతిష్టల్లో మాత్రం ఆ మండలంలో నెంబర్ వన్. అతని తాత సుబ్బరాయవర్మ. అప్పట్లోనే కుబేరుడు. ఆ తర్వాత అతని కొడుకు నారాయణవర్మ స్వాతంత్ర్య సమరంలో ప్రముఖపాత్ర వహించాడు. స్వంత ఆస్థుల్ని సైతం ధారబోశాడు. ఆ తర్వాత కూడా ఆయన నీతి నియమాలకి కట్టుబడ్డాడుగానీ ఆస్థుల్ని సంపాదించడానికి కాదు.
ఆయనకి ముగ్గురు పిల్లలు. పెద్దవాళ్లు ఇద్దరూ కూతుర్లు, మూడో వాడు సురేష్. అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయడానికి చాలా ఆస్థుల్నే అమ్మాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ ఆ ఊర్లో భూస్వాములు వాళ్లే. అయితే భూములే ఆధారం కావడంవల్ల ఆదాయం పెద్దగా రాదు.
భూములున్నాయన్న మాటేగాని వాటివల్ల పొంగిపొర్లిపోయే రాబడి మాత్రం లేదు. సురేష్ వర్మకు వ్యవసాయమంటే ఇష్టం. యూనివర్శిటీలో ఎమ్. ఏ. చదివాక యింటికొచ్చి వ్యవసాయం చూసుకునేవాడు. "వాడొక్కడు. ఉద్యోగం సద్యోగం అంటూ వాడ్ని నా కళ్ల ముందునుంచి మాయంచేయకండి" అని అతని తల్లి అనసూయమ్మ కూడా వంతపాడడంతో నారాయణవర్మ కూడా మరోమాట చెప్పలేకపోయాడు.
తన అక్కయ్యల పెళ్లిళ్లు చేయడం దగ్గర్నుంచి రోజువారీ వ్యవసాయం పనుల వరకు నారాయణ వర్మకి సురేష్ చేదోడు వాదోడుగా వుండేవాడు. అయిదేళ్ళక్రితం ఆయన కాలం చేశాక మొత్తం భారమంతా సురేష్ వర్మపైనే పడింది. అతను నిజంగానే చాలా డిఫరెంట్ మనిషి. అప్పటి తన సహచరుల్లాగా బోళామనిషి కాదు. ఏదైనాసరే గాఢంగా కోరుకునే వ్యక్తి. పైపై మెరుగులు కాక లోతుల్ని తరచిచూసేవాడు. కాబట్టి ఏ విషయంలోనైనా అతని అభిప్రాయాలూ, అభిరుచులూ విభిన్నంగా వుండేవి.
తండ్రిపోయిన తరువాత అప్పులన్నిటినీ తీర్చెయ్యడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. అక్కయ్యల పెళ్ళిళ్ళ నిమిత్తం చాలనే ఖర్చయింది. 'మోసం - దగాలేని వృత్తి వ్యవసాయం ఒక్కటే అనిపించింది' అని వ్యవసాయం ప్రారంభించాడు. తండ్రి అమ్మెయ్యగా మిగిలింది అప్పటికి దాదాపు ముప్పై ఎకరాలు. అదిగాక ఐదెకరాల మామిడితోటుంది. ఆ ముప్పై ఎకరాల్లో రకానికి ఒకటిచొప్పున పంటలు వేయడం ప్రారంభించాడు.
కూరగాయల తోటలు, పూలతోటల్ని వేశాడు. మొదటి మూడు సంవత్సరాలకే అప్పులన్నీ తీర్చేశాడు. ఇక ఆ తరువాత వచ్చే రాబడినంతా భూముల అభివృద్దికి ఖర్చు పెట్టాడు. కష్టాల్లో వున్నవాళ్లకి వీలైనంతగా సహాయం చేస్తుంటాడు. అందుకే ఆ వూర్లో అతనికి మంచి పేరుంది. ఆ పల్లెటూరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఓ టౌన్ వుంది. రోజూ సాయంకాలం బాబును తీసుకుని టౌన్ కి వెళుతూంటాడు.
అతనికి ఇష్టమైనవి రెండే విషయాలు. ఒకటి చదవటం, రెండు సిగరెట్లు కాల్చడం. టౌన్ కి వెళ్ళి కొత్తగా వచ్చిన మ్యాగజైన్లు, నవలలు కొనుక్కుని తిరిగి వస్తూంటాడు. తీరిక దొరికినప్పుడు పుస్తకం పట్టుకుని చదవటం తప్ప మరొకటి చేయడు. అనసూయమ్మ కొడుకు ప్రయోజకత్వాన్ని చూసి తనలో తనే మురిసిపోతుంటుంది. ముప్పై ఏళ్లొచ్చినా అతను ఇంకా పెళ్ళి చేసుకోలేదన్న బాధ తప్ప, కొడుకు మీద ఆమెకు ఎటువంటి అసంతృప్తి లేదు.
"చేసుకుంటానులేవే - ఏ అమ్మాయిని చూసినా యింత వరకు పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన కలగలేదు. నేనేం చేయను చెప్పు" అని అతను తల్లికి సర్దిచెపుతుంటాడు. నిజంగానే అతన్ని స్పందనకు గురిచేసే అమ్మాయి ఎక్కడా ఇంతవరకు తారసపడలేదు. అయ్యవారు పూజ అంతా అయిన తర్వాత చివరగా మంగళ హారతి పట్టుకొచ్చాడు.
"టైమ్ తొమ్మిదయింది. మరి గుగ్గుళ్ళు పందారం ప్రారంభించమంటారా?"బాబు తన అయ్యవారి ముందు వినయంగా వంగి అన్నాడు.
"అప్పుడేనా.. భజన చేయనివ్వండి" సుబ్బారావు అక్కడికి వస్తూ అన్నాడు. ఆయనవైపు చూస్తూ పలకరింపుగా నవ్వి "భజనచేసే ఆ అయిదుమందీ అలిసిపోయినట్టున్నారు" అన్నాడు సురేష్ వర్మ.
"మీ ఉభయం కాబట్టి ఆ అయిదుమందయినా భజన చేస్తున్నారు. రేపట్నుంచీ చూడండి గుగ్గుళ్ళకు తప్ప ఒక్కరు రారు" అని ఆపి ఆ తరువాత తను గడిపిన పాత రోజుల్ని గుర్తుకుతెచ్చుకుంటూ "మా కాలంలో అయితే శ్రీరామనవమి ఉత్సవాలంటే పండగస్థాయిలో జరిగేవి. భజన ఏ అర్దరాత్రో ముగిసేది. ఇప్పుడు చూస్తున్నారు కదా భజనకన్నా ముఖ్యం చాలా విషయాలయిపోయాయి" అంటూ నిట్టూర్చాడు సుబ్బారావు.
"పెట్టమను - అంతా ప్రారంభమయ్యేసరికి ఎలా లేదన్నా మరో అరగంట పడుతుంది." అయ్యగారి ఆజ్ఞ కావటంతో ఆ ముక్కను గుడి ఆలనాపాలనా చూసే కాంతమ్మతో చెప్పాడు బాబు.
"అప్పుడేనా! సరేలే - ఈ ఊరు ఈ జన్మకు బాగుపడదు" అని శపించి, మరోసారి గుడిని ఊడ్చడంలో నిమగ్నమైంది.
ఆమెది వింత మనస్తత్వం. ఎప్పుడూ మడిగట్టుకుని వున్నట్టు మనుషుల్ని, ముఖ్యంగా మగవాళ్లని చూస్తే దూరం దూరంగా జరుగుతుంటుంది. ఆమెది ఏవూరో ఏవాడో తెలియదు. ఏభై యేళ్లుంటాయి. సరయిన తిండి లేకపోవడంవల్ల కాబోలు ఆ వయసుకే ముసల్దానిలా కనిపిస్తుంది.
గుగ్గుళ్లు పందారం పెట్టడానికి అనువైనవాళ్లు ఎవరున్నారా అని చూస్తున్నాడు బాబు. గుగ్గుళ్ళు పందారం పెట్టాలంటే కూడా దానికీ స్పెషలిస్టులు కావాలి. ప్రతిఏటా ప్రతిఒక్కరి ఉభయానికి ప్రసాదం పంచే పరంధామయ్య ఈమధ్యే కాలం చేశాడు. దాంతో కొత్తవాళ్లని వెతుక్కోవావల్సి వస్తోంది. నారయుడ్ని పందారం పెట్టడానికి పిలుద్దామని అటు వెళ్లాడు బాబు.
