Previous Page Next Page 
పగలే వెన్నెల - 2 పేజి 2

కృష్ణారెడ్డి పరమ భక్తుడు. అంత దరిద్రంలో కూడా పూజలకీ, పునస్కారాలకీ లోటు రానివ్వడు. దేవుడు వున్నాడని చెబితే చాలదు. ఆ దేవుడు మెచ్చుకునే విధంగా ప్రవర్తించాలని కందుకూరి వీరేశలింగం కాబోలు అన్నాడు. ఇప్పుడవన్నీ తిరగబడిపోతున్నాయి. కొంతమంది సుఖం కోసం కోట్లమంది కష్టాలు పడుతున్నారు.

వోల్టేర్ నుంచి మహా మేధావులంతా చెప్పింది అదేకదా. కృష్ణారెడ్డి పక్కనున్నది ఎవరూ? వసంత - దామోదరరెడ్డి భార్య. రాత్రయినా పగలయినా ఎప్పుడూ బంగారాన్ని ఒంటి్నిండా దిగేసుకుని కనపడుతుంది. నగల పిచ్చేమో - మెడనుంచి పాదాలవరకు బంగారునగలే. అవన్నీ విప్పేలోపే దామోదర్ రెడ్డి చల్లబడిపోతాడేమో.

అంతేకదా - శరీరాన్ని తాకుతూ నగలని విప్పడం అంటే తమాషానా? ఉద్రేకం వేళ్లకొసల్లో చిట్లి చల్లబడిపోదూ - దామోదర్ రెడ్డి ఎలా భరిస్తున్నాడో ఏమోగాని తనకైతే నగలన్నీ వేసుకున్న స్త్రీలు నచ్చరుగాక నచ్చరు. తనకి స్త్రీ ఎంత సింపుల్ గా వుంటే తనకు అంత ఇష్టం కలుగుతుంది. తను శాలీనుడు కాబోలు - మరి సుగాత్రి ఎవరు?

కళాపూర్ణోదయంలో శాలీనుడికి స్త్రీలలో అలంకారాలు, ఆడంబరాలు, డంబాలు నచ్చవు. అతడి భార్య సుగాత్రి. ఆమెకి అలంకారాలమీద ఓ వీసమెత్తు మోజు. అందుకనే అతనికి భార్యంటే ఇష్టం వుండదు. సహజసిద్దంగా వున్నదానిని ప్రేమిస్తాడతను. ఓ రోజు సుగాత్రి తోటలో వుంటుంది. వర్షానికి తడవడంవల్ల అలంకారాలంతా మాసిపోయి సహజ సౌందర్యంతో మెరిసిపోతూ వుంటుంది. ఆ క్షణంలో ఆమెను చూసిన శాలీనుడు మరులుకొంటాడు. భార్యను కౌగిలించుకుంటాడు - ఎంత మంచి కథ.

మిఠాయికొట్టులో అన్నీ తీపిపదార్దాలే వుంటాయి. వాటిలో వెరైటీ లుంటాయిగానీ అన్నీ స్వీట్లే. అట్లానే ప్రబంధాలు కూడా మిఠాయికొట్లు లాంటివి. కామన్ అయినది శృంగారం. కథలు వేరైనా శృంగారం ఒకటే. వరూధినీ ప్రవరాఖ్యం నుంచి అన్నీ శృంగారప్రధానమే. ఎవరో తన దగ్గరికి వస్తున్నట్టు అన్పించడంతో సురేష్ కళ్లు మరింత సాగదీశాడు. వస్తోంది అతని దగ్గిర పనిచేసే బాబు.

"ఏమిట్రా? నా కోసమేనా?" "ఆఁ అయ్యోరొచ్చాడు - మీకోసం చూస్తున్నాడు."

"నాకోసం ఎందుకురా - మామూలుగా చేసే తతంగం అంతా పూర్తి చేసేయమని చెప్పు."

"మీరు రావాల్సిందేనంట." బాబు ముందుకు వెళుతుంటే అతనూ వెనకే అడుగులేశాడు. అప్పటి వరకు గోలగోలగా వున్న ఆ ప్రాంతం అతన్ని చూడగానే కాస్తంత సద్దుమణిగింది. "పూజ ప్రారంభిస్తాను" అయ్యవారు వినయవిధేయతలతో అడిగాడు. "ఆఁ ఒక్కమాట" అంటూ వెళుతున్న ఆయన్ని పిలిచాడు సురేష్ వర్మ.

"చెప్పండి."

"పూజ పూర్తికావాలంటే ఎంతసేపు పడుతుంది?"

"సుమారు గంట"

"అంత సేపొద్దు - పూజ మొత్తం ఓ అరగంటలో ముగించెయ్ - దక్షిణ రెట్టింపు ఇస్తాను" అన్నాడు.

అయ్యవారి ముఖంలో ఆనందం చిమ్మింది. "అలాగే - మీరు కోరినట్టే." అయ్యవారు గదిలోపలికి వెళ్లాడు.

అంతలో సురేష్ కూర్చోవడానికి ఎదురింట్లోంచి ఓ ప్లాస్టిక్ కుర్చీ తెచ్చి వేశాడు బాబు. పందిట్లో ఓ మూలకు దాన్ని జరిపించి, కూర్చున్నాడు సురేష్ వర్మ. ఆ రోజు శ్రీరామనవమి. దేవుళ్లూ, దెయ్యాల మీద నమ్మకం లేకపోయినా అతను గత ఐదేళ్ళనుంచి ఈ వేడుకను జరిపిస్తున్నాడు.

వేసవికాలం ఊరుఊరంతా నవమిరోజున గుడి దగ్గరికి రావడం - వెన్నెల్లో అందరూ కలిసి ఆనందంగా గడపడం, చివరికి గుగ్గుళ్లు పెట్టించుకుని తింటూ యింటికెళ్లడం, యివన్నీ బావుంటాయి గనుకే అతనూ తాత ముత్తాతల నుంచి వస్తున్న నవమి ఉత్సవాలను జరిపిస్తున్నాడు. మొదటిరోజు ఉభయదాత అతనే. ఆ రోజు దేవుడి అలంకరణ మొదలుకొని గుగ్గుళ్లు, పందారం వరకు ఖర్చంతా అతని కుటుంబానిదే.

మొత్తం పద్నాలుగు రోజులు నవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. చివరి రోజు దేవుడి ఊరేగింపు. రోజుకొకరు ఉభయదాత. తొలిరోజు ఉత్సవం తనది కాబట్టి సురేష్ వర్మ దేవాలయ పరిసరాలన్నిట్నీ శుభ్రంచేయించాడు. గుడికి వెల్ల చేయించాడు. పోయిన బల్బుల స్థానే కొత్తవి ఏర్పాటు చేశాడు. టేప్ రికార్డర్, స్పీకర్లనూ రిపేరు చేయించాడు. కొత్తకొత్తగా కన్పిస్తున్న ఆ దేవాలయం వెన్నెల్లో దంతంతో చేసిన రథంలా వుంది.

అందులోని శ్రీరాముడు రథంలో ఊరేగుతున్న రాజకుమారుడిలా వున్నాడు. తొలిరోజు కాబట్టి ఊర్లోని జనం బాగానే వస్తున్నారు. పోగాపోగా గుగ్గుళ్ల పందారానికి తప్ప ముందు జరిగే భజనలకి ఒక్కరు కూడా రారు. ప్రసాదం పెడుతున్నారని తెలిసినప్పుడే పరుగు పరుగున దూకుతారు. అందులోనూ తొలి ఉభయం సురేష్ వర్మది. కాబట్టి, వెళ్లకుంటే బావుండదన్న ఉద్దేశ్యంతో కూడా అందరూ విధిగా దేవాలయం దగ్గరికి వస్తున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS