.png)
మహారాజు గురుదేవుడు చందేలు వంశపు రాజుల్లో పరాక్రమంతుడేకాదు, మంచి శీలవంతుడిగా కూడా చరిత్ర ప్రసిద్ధిగాంచాడు. కళలపట్ల ఆసక్తి, ధార్మిక సంప్రదాయాల పట్ల ఆదరణ వున్నవాడు. భారతదేశానికి గుండెలాంటి మధ్యప్రదేశంలోని చాలా భూభాగాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకొని విస్తరింప చేశాడు. యుద్ధ కుశలత బాగా తెలిసినవాడు. అన్నింటితోపాటు రసికుడు కూడా.
తన పూర్వికులు కూడా భారతదేశం గర్వించదగ్గ మందిరాలను నిర్మించి వెళ్ళిపోయారు. గురుదేవుడు సింహాసనాన్ని అధిష్టించిన తరువాత ఎన్నో చిన్న పెద్ద రాజ్యాలను జయించాడు. రాజ ప్రసాదాలలో, తాపసీ, మునుల కుటీరాల్లో సాధువుల గోష్టుల్లో, ఆశిక్షిత, అసభ్య జాతుల సముదాయాల్లో, చౌరస్తాలో, దారులకూడళ్ళలో, కోమట్ల దుకాణాల్లో సర్వత్రా గండదేవుడి ప్రశంసలే వినబడసాగాయి.
మహారాజుగారి ఆకారం కూడా చూడముచ్చటగా వుంటుంది. భీమకాయం, బలపరాక్రమవంతుడు, చక్కని విగ్రహంలా వుంటాడు.
సర్వసంపన్నము, సుభిక్షమైన, పాడిపంటలతో అలరారుతున్న ‘ఖజురహో’ నగరం. అంగడిలో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని వున్నట్లు మహారాజు గురుదేవుడికి ఓకే లోపం. ఓకే ఒక కొరత పీడిస్తోంది. అదే సంతానం లేకపోవడం. రాజుకు వారసుడు కావాలని రాజ్యమంతా ఎదురుచూస్తోంది. రాజు కోరుకుంటే రాణులకు కొరత వుండదు. కానీ గండదేవుడు ఏకపత్నీవ్రతుడు. శీలవంతుడు కావడంతో సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.
మహారాణి ఇందుమతి అంటే మహారాజుకు ఎంతో ప్రీతి. ఇందుమతి సౌందర్యవతి, పరి సేవా పరాయణురాలు. కానీ సంతానం లేకపోవడం వల్ల తన భర్త ప్రేమ, ఆదరాభిమానాలకు ఎక్కడ దూరమైపోతానోనని దిగులు పడసాగింది. విజయం సాధించి వచ్చిన రాజుకు అన్ని సపర్యలు చేసి హంసతూలికాతల్పం మీద కూర్చుని నవ్వుతున్న ఇందుమతి మదిలోని దిగులును కనిపెటిన గండదేవుడు-
“దిగులు పడకు రాణీ! దేనికైనా సమయం కలిసి రావాలి’’ అన్నాడు.
“అది సరేగాని మీ పూర్వికులు భాండవ యజ్ఞము చేసి సంతానాన్ని పొందారు. ఆ యజ్ఞాలకు బావుల్లో నేయిని నింపు చేశారట’’
“నిజమే, బావులేకాదు, సరోవరాల్లో నేతిని నింపి భాండవ యజ్ఞము జరిపించే శక్తి మనకుంది. కానీ అలాంటిదాన్ని నిర్వహించే వారు ఇప్పుడు లేరు. మన నగరానికి సమీపంలో శ్మశానవాటిక దగ్గర ఒక శక్తివంతుడైన తాంత్రికుడు నివశిస్తున్నట్టు తెలిసింది. ఆదిత్యను పంపించాను. ఈ పాటికి వివరాలు తెలుసుకుని వస్తుంటాడు. నీవు నిశ్చింతగా వుండు. ఏదో ఒక మార్గం దొరక్కపోదు. నీ మనోవాంఛితం త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను. అలసిపోయాను, కొంత విశ్రాంతి, ఏకాంతము కావాలి మహారాణీ!’’ అన్నాడు గండదేవుడు.
“చిత్తము, మీరు విశ్రమించండి. నేను మీ పాదాలు వత్తుతాను’’ అంటూ అక్కడున్న పరిచారికలను సైగచేసి పంపించివేసింది మహారాణి.
*****
ఆరోజు ఆదివారం అమావాస్య. తాంత్రికుడు భైరవానందస్వామి జరుపబోవు శవ సాధన గుర్తుపెట్టుకుని బయలుదేరారు ఆదిత్య, శీలభద్రుడు. తాంత్రికుడు ఆశించినట్టుగానే శనివారం మధ్యాహ్నం 40 సంవత్సరాలలోపు వయసున్న యువకుడు పాముకాటుతో చనిపోయాడు. శవాన్ని సాయంత్రం తీసుకెళ్ళి ఆ తాంత్రికుడికి అప్పచేప్పినట్టు సమాచారం అందింది.
తాంత్రికుడిలో మహిమలున్నాయా లేదా అన్న విషయం తెలుసుకోకుండా మహారాజు గండదేవర దగ్గరకు వెళ్ళే అవకాశమే లేదు. తాంత్రికుడితో పరిచయం పెట్టుకోవడం ఎందుకైనా మంచిది. శక్తి, యుక్తి వున్న మనిషి ఏమైనా చేయగలడు. ఇలా ఆలోచిస్తూ ఇద్దరు మిత్రులూ మళ్ళీ శ్మశానం వైపు నడిచి వెళ్ళారు.
ఇద్దరూ తాంత్రికుడి కుటీరం చేరుకునేసరికి మధ్యాహ్నం దాటింది. శనివారం పాముకాటుతో చనిపోయిన యువకుడి శవం కుటీరం దగ్గరలో పెట్టబడి వుంది. శవం తాజాగానే వుంది. ఆదిత్యకు కొంత లౌక్యం తెలుసు. ఎటువంటి వాడైనా పొగడ్తకు లొంగనివారుండరని అతని అభిమతం.
అదే ప్రశంసాస్త్రాన్ని ఆదిత్య మాంత్రికుడి మీద ప్రయోగించాడు. “మీ గురించి మా నగరంలో గొప్పగా అనుకుంటున్నారు. మా మహారాజుగారు కూడా మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని ఉబలాటపడుతున్నారు’’ అన్నాడు ఆదిత్య.
“నాకు అన్నీ తెలుసు. మీ మహారాజు సమస్య కూడా నాకు తెలుసు. నేను శక్తిమంతుడినా కాదా తెలుసుకురమ్మని మిమ్మల్ని పంపించాడు. నిజమా?’’
“అవును స్వామి. అక్షరాలా నిజం’’ వంత పలికారు ఇద్దరూ.
“రహస్యంగా చేసుకునే శవసాధన మీకు చూపిస్తానన్నది అందుకే. నా శక్తి ఏమిటో మీ రాజుకు చెప్పండి. మీకు మేలు జరుగుతుంది.’’
“చిత్తం మహాదేవా! మీ గురించి సంక్షిప్తంగా తెలిపితే, ఎవరైనా అడిగితే చెబుతాం’’ వినయాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు ఆదిత్య.
“అలాగే’’ అంటూ తాంత్రికుడు తన గురించి సంక్షిప్తంగా తెలిపాడు.
*****
