Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 1


                                             చీకటి పొద్దున వెలుగురేఖ
                                                                                      --డి. కామేశ్వరి

                                                   
    
    "ఆంటీ!" కప్పు టేబిల్ మీద పెట్టి నెమ్మదిగా పిల్చింది.
    కళ్యాణి పలకలేదు. మరోసారి 'ఆంటీ' అంటూ ఆమె మీద చెయ్యివేసి లేవబోయింది సుజాత. అంతే! ఎలక్ ట్రిక్ షాక్ తగిలినట్లు చెయ్యి వెనక్కి లాగేసుకుంది. ఆమె వళ్ళు మంచులాగ తగిలింది.
    బిత్తరపోయి సుజాత గాభరాగా 'ఆంటీ, ఆంటీ' అంటూ ఆమెని కుదిపింది. ఆమె శరీరం చలన రహితంగా బిగుసుకుపోయి వుంది. సుజాత ఒక్క క్షణం వెర్రిదానిలా అలా చూస్తూ నిలబడి, తరువాత చప్పున తెలివి తెచ్చుకుని కేకలు పెడ్తూ సుడిగాలిలా బయటికి పరిగెత్తింది.
    గదిలో నిద్రపోతున్న రామకృష్ణని గబగబా కుదిపివేసి "ఏమండీ, లేవండీ, ఆంటీ, ఆంటీ" ఆమె గొంతుక ఎవరో పట్టుకున్నట్టు అంతకంటే మాట రాలేదు భయంతో.
    బద్దకంగా కళ్ళు విప్పిన రామకృష్ణ సుజాత గాభరాని చూసి "ఏమిటి, ఏమయింది!' కాస్త గాభరాగా అన్నాడు. "లేవండీ, అయ్యో, ఆంటీని చూడండి. ఆవిడ మాట్లాడడం లేదు. కదలడం లేదు...." ఏడుపు గొంతుతో అంది సుజాత.
    "ఆ..." అంటూనే రామకృష్ణ బయటికి పరిగెత్తాడు. దడదడలాడుతున్న గుండెలతో సుజాత వెనకాలే పరిగెత్తింది.
    కళ్యాణి గదిలో అడుగుపెడుతూనే ఆవిడ మొహం చూస్తూ రామ కృష్ణ 'మైగాడ్' అన్నాడు. ముందుకు వెళ్ళి ఆత్రంగా ఆమె చెయ్యిపట్టు కుని పల్సు చూశాడు. రామకృష్ణ మొహం నల్లబడిపోయింది వెంటనే.    అతని మొహం చూస్తున్న సుజాతకీ అర్ధమైపోయింది. రామకృష్ణ మరోసారి ఆశచావనట్టు చేయి పట్టుకుని పల్సు చూశాడు. కనురెప్పలు ఎత్తి చూశాడు. తరువాత లాభం లేదన్నట్టు తల పంకించి సుజాతవంక చూశాడు.
    'ఆంటీ!' అంటూ, ఘొల్లున ఏడుస్తూ ఒక్క ఉదుటున వెళ్ళి మీద పడబోయిన సుజాతని రామకృష్ణ చేతులడ్డం పెట్టి పట్టుకున్నాడు.
    "ఏడ్చి లాభంలేదు సుజా, ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు......ఇదిగో స్లీపింగ్ పిల్స్ ఖాళీ సీసా...." అంటూ ప్రక్కనవున్న సీసాతీసి చూపించాడు.
    "ఆంటీ ఎందుకింత పని చేశారు .... ఆంటీ...." అంటూ రామకృష్ణ చేతులనించి తప్పించుకుని మంచంమీద తలపెట్టి ఏడవసాగింది సుజాత.
    "వూరుకో సుజా! నీవే ఏడిస్తే ఎలా?....పిల్లలేరి, ఇంకా లేవలేదా? వాళ్ళని ఈ గదిలోకి రానీయకు....ఏడవకు లే.... ముందు జరగాల్సింది చూడాలి మనం .... పోలీసులకి రిపోర్టు యిద్దామా?" సుజాతని ఓదార్చబోయిన రామకృష్ణ గొంతు పట్టుకున్నట్టయింది. అతని కళ్ళల్లో నీరు చిమ్మింది.
    "ఆంటీ, ఎందుకిలాంటి పనిచేశారు?.....ఎందుకింత దారుణం చేశారు ..... పిల్లలని దిక్కులేనివాళ్ళలా చేసి ఎందుకిలా వెళ్ళిపోయారు.....వాళ్ళకి తండ్రి వున్నా ఎప్పుడూ లేనట్టే అయింది. మీరు వాళ్ళని అన్యాయంచేసి వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళకి దిక్కెవరు" ఏడుస్తూ అంది సుజాత.
    "నిన్న జరిగిన ఘాతుకానికి మనందరమే చలించాం. ఆవిడకి ఎలా వుంటుందో ఊహించవచ్చు. ఎలా బాధపడ్డారో చూశాం..... జరిగింది ఒక ఎత్తు, జరగబోయేది మరోఎత్తు .... ఆవిడ పరువు మర్యాద యిప్పటికే వీధి కెక్కాయి. యింకా కోర్టులు, విచారణలు, బోనులో నిలబెట్టి అడిగే ప్రశ్నలు .... అదంతా భరించే శక్తి లేదనిపించి వుంటుంది ఆవిడకి. అందుకే యీ సాహసానికి పూనుకున్నారు ..... ఆ అవమానం భరించలేక కన్న బిడ్డల్ని అనాధలుగా వదిలి వెళ్ళడానికి తయారయ్యారంటే నిన్నటి సంఘటన ఆమెని ఎంతటి అవమానానికి, బాధకి గురిచేసిందో ఊహించవచ్చు మనం ..." రామకృష్ణ బరువుగా అన్నాడు.
    రామకృష్ణ చెప్పకముందే అదే కారణం అయివుంటుందని సుజాత మనసూ చెప్పింది.
    నిన్న ఉదయం ఆ ఘాతుకం జరిగాక -కళ్యాణి రోజంతా కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఆ సంఘటన జరిగిన వెంటనే రెండుమూడు గంటలవరకు అసలు ఆ షాక్ కి నోటమాట లేకుండా అలా వుండిపోయింది. రామకృష్ణ ఇంజక్షన్స్ అవీ ఇచ్చి హడావిడి పడ్డాడు. తరువాత, సాయంత్రం అంతా గదిలో తలుపులు బిగించుకుని ఏడ్చింది. పోలీసులు ఏం అడిగినా "ఇప్పుడు నేనేం చెప్పలేను. రేపు చెపుతాను" అంది ఏడ్చి ఏడ్చి, ఏడుగంటలవేళ కారేసుకుని బయటికి వెళ్ళివచ్చింది. అట్నించి వచ్చాక పిల్లలిద్దరినీ కౌగలించుకుని కన్నీరు కార్చింది. పిల్లలు బిక్కమొహాలు వేసుకుని తెల్లపోయి చూడసాగారు. సుజాతే ఆమెని నెమ్మదిగా మందలించి పిల్లల్ని అవతలకు తీసుకెళ్ళిపోయింది. ఆ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సుజాత ఎంత బ్రతిమిలాడినా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు కళ్యాణి. ఆఖరికి సుజాత రాత్రి పదిగంటలవేళ నిద్రపోయేముందు ఇన్ని పాలన్నా త్రాగించాలని బోర్నవిటా కలిపి పట్టుకుని గదిలోకి వెళ్ళింది.
    సుజాత వెళ్ళేసరికి కళ్యాణి ఏదో రాస్తూంది. సుజాత రాగానే అలా ఒక్క క్షణం చూసి తరువాత చెయ్యి పట్టుకు ప్రక్కన కూర్చోపెట్టుకుని 'సుజాతా!' అంది ఏదో చెప్పాలని ఆరాటపడ్తూ.
    "పాలన్నా త్రాగండి.....ఉదయంనించీ ఏం తినలేదు. మీరు ఇలా బాధపడి ప్రయోజనం ఏమిటి?" అంది సుజాత.
    ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు తిరిగాయి. ఉదయంనించీ ఏడ్చిఏడ్చి ఆమె కళ్ళు వాచిపోయాయి. ముక్కు మొహం ఎర్రబడిపోయింది. "సుజా, నీ కర్ధంకాదు. నేనేం చెయ్యను? ఇంక నలుగురిలో మొహం ఎత్తుకుని ఎలా తిరగను? ఎలా బ్రతకను? ఏ ఆశతో బ్రతకాలి ఇంకా...." అంటూ మళ్ళీ ఏడుపు ఆరంభించింది. "జరిగింది మరిచిపోదామన్నా మరచిపోనిస్తారా నన్ను. రేపొద్దున్నించి కోర్టులంట తిరగాలి. బోనులో నిలబెట్టి అంతా పైకి లాగుతారు. ఆయన వున్నవీ లేనివీ కూడా చెప్పొచ్చు.....అవన్నీ పైకొచ్చాక నలుగురిలో దోషి నవుతాను. ఇంకెలా మొహం చూపించను నలుగురికీ. అసలు ఎందుకు బ్రతకను? ఎవరికోసం బ్రతకాలి" అంటూ విలపిస్తున్న ఆమెని ఏమి చెప్పి ఓదార్చలేకపోయింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS