Next Page 
ఫస్ట్ క్రష్ పేజి 1

ఫస్ట్ క్రష్

హైదారాబాద్ సుందరనగరంలో అదో విశాలమైన గార్డెన్ హోటల్.
దాని పేరు ఈట్ స్ట్రీట్.
హుస్సేన్ సాగర్ తీరం ఆనుకుని నెక్లెస్ రోడ్ లో ఉంటుంది.
ఎంతో అందంగా నెక్లెస్ తీరం వెంబడి అలా పరుచుకుని ఉంటుంది.
పొరపాటున సాగర్ జలాల్లోకి పడిపోకుండా ఆ హోటల్ అంచుల్లో రైలింగ్స్ ఎత్తుగా ఉంటాయి.
అటువైపు హుస్సేన్ సాగర్ నీళ్లు, ఇటువైపు అందంగా టేబుల్స్ కుర్చీలు వేసి మంచి వ్యూతో నయనానందకరంగానూ, ఆహ్లాదకరంగానూ ఉంటుంది.   
సాగర్ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని తనివితీరా చూస్తూ ఎంచక్కా కబుర్లతో ఫుడింగ్  ఎంజాయ్ చెయ్యొచ్చు. 
కొద్ది దూరంలో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ జెండా రెప రెపలాడుతూ చూపరులకు కనువిందు చేస్తుంటుంది. మనసంతా దేశభక్తి భావంతో నిండిపోతుంది. 
ఆ  ఈట్ స్ట్రీట్ హోటల్ లో రకరకాల తినుబండారాల ఫుడ్ స్టాల్ల్స్,  చిన్న పిల్లలకు గేమ్స్, ఓ పెద్ద స్క్రీన్ పెట్టి అందులో క్రికెట్ లైవ్, అది ఒక వినోదాల ప్రపంచంగా అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షిస్తూ ఉంటుంది.
సగటు హైదెరాబాదీయులు ప్రొద్దుటినుంచి రాత్రి పదకొండువరకు సేదతీరేందుకు తరచూ అక్కడికి వెళుతుంటారు.
శని, ఆది వారాల్లో క్రిక్కిరిసి ఉంటుంది ఆ ప్రాంతమంతా.
సాయంత్రాలైతే మరీను పిల్లలు, పెద్దలు ఓ ఆటవిడుపుగా హుషారుగా తిరుగుతుంటారు. 
నవంబర్ మాసం కావడంతో ఆ రోజు సాయంత్రం బాగా చల్లగాలులు వీస్తున్నాయి.
వాతావరణం మహాఅద్భుతంగా ఉంది. 
వారం మధ్య రోజు కావడంతో జనం అక్కడక్కడా పల్చగా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అల్పాహారం తింటూ కూల్ డ్రింక్స్, టీ, కాఫీ సేవిస్తున్నారు.
టేబుల్స్ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి జనం కోసం ఎదురు చూస్తూ.
వినీల్ శర్మ బ్రహ్మచారి కావడంతో రోజూ ఆఫీస్ నుంచి వెళుతూ దారిలోనే కాబట్టి ఆ హోటల్ లో కాసేపు కూర్చుని లైట్ గా టిఫిన్ చేసి టీ తాగుతూ రిలాక్స్ అవుతుంటాడు. 
అతను పుట్టి పెరిగిన ఊరు భీమవరం అయినా ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లో పెద్ద పోసిషన్ లో ఉన్నాడు.
అమెరికా లో ఉన్నత చదువులు చదివి, అక్కడ కొంత కాలం ఉద్యోగం చేసి ఆర్నెల్ల క్రితం అదే కంపెనీ బ్రాంచ్ ఐన హైదరాబాద్ కి డెప్యూటేషన్ కింద వచ్చాడు.
సాంప్రదాయపు బ్రాహ్మణ కుటుంబంలో మూడో సంతానం అతను.
అన్నయ్య, అక్కయ్య లిద్దరికి పెళ్ళిళ్ళయి పిల్లలతో ఒకరు బెంగళూరు, ఇంకొకరు ముంబై లో ఉన్నారు.
వినీల్ నాలుగు రోజులక్రితమే ఇరవై ఆరవ సంవత్సరంలో అడుగుపెట్టాడు.
వినీల్ తండ్రి ఇన్సూరెన్స్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్ గా చేసి రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు.
ప్రస్తుతం వినీల్ కి పెళ్లి చెయ్యడమే ధ్యేయంగా పెట్టుకుని మాట్రిమొనీలో రిజిస్టర్ చేసి సంబంధాలు చూస్తున్నాడు.
కాకుంటే ఆయనకు జాతకాల పట్టింపు ఎక్కువ.
జాతకాలు కుదరనిదే పెళ్లి చెయ్యనని ముందే చెప్పాడు ఇంట్లో వాళ్లందరికీ.
మరీ అంత చాదస్తం లేదు కానీ పెళ్ళికి ముందు జాతకాలు కలిస్తే వరుడు, వధువు చక్కగా అరమరికలు లేకుండా పిల్లా పాపలతో కాపురం చేసుకుంటారు అని ఆయన నమ్మకం. 
ఇప్పటికో డజను సంబంధాలు చూసారు. అంటే పెళ్లి చూపులు వరకు వెళ్ళలేదు సుమా!  జాతకాలు కుదరలేదు కాబట్టి ఇంకా అంత దూరం రాలేదు.
వినీల్ ఆరడుగుల అందగాడు. తెల్లని మేని ఛాయ, ఒత్తైన రింగుల జుత్తు, కోర మీసం, వెరసి ఓ సినీ హీరో లా ఉంటాడు. రోజూ జిమ్ కి వెళతాడు కాబట్టి అథ్లెటిక్ లా కనిపిస్తాడు.
మొదటి నుంచి చదువుల్లో ఫస్ట్ అవడంతో అలవోకగా రెండంకెల ర్యాంకులో ఐ ఐ టి సీటు సంపాదించి అందులోనూ ఫస్ట్ రాంక్ తెచ్చుకున్నాడు. చెన్నై ఐ ఐ టి లో తనకిష్టమైన సాఫ్ట్వేర్ బ్రాంచ్ లో డిగ్రీ చేసాడు. అందులోనూ క్యాంపస్ ఫస్ట్ వచ్చాడు. 
అమెరికాలోని మంచి యూనివర్సిటీ లో సాఫ్ట్వేర్ లో ఎం ఎస్ చేసాడు.   
కాకుంటే వినీల్ కి అమ్మాయిల  వైపు నుంచి ఆకర్షణ ఎక్కువ ఉన్నా పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ఎవ్వరినీ నొప్పించక మేనేజ్ చేస్తుంటాడు.
ఎందుకంటే పొరపాటున ఎవరితో నైనా ప్రేమలో పడితే ఇంట్లో తండ్రి కి జవాబు చెప్పాలి  అనుకుని జాగ్రత్త గా ఉంటాడు. తన పెళ్లి బాధ్యత అంతా తండ్రికి వదిలేసాడు. సాఫ్ట్వేర్ కోడింగ్ లో ఎక్స్పర్ట్ అవడం, అది అతని ఆరో ప్రాణం అవడంతో అందులోనే ఎక్కువ శాతం కాలం గడుపుతుంటాడు. కంపెనీ మేనేజిమెంట్ కి కూడా వినీల్ పై బాగా నమ్మకం ఎక్కువ. ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా ఎటువంటి పొరపాట్లు లేకుండా అద్భుతంగా చేసి కస్టమర్ చేతిలో పెడతాడు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి  ఉన్న చాలా మంది కస్టమర్స్ కి అతనంటే చాలా ఇష్టం.
ఆఫీస్ లో కూడా తన పనేమో తనేమో అన్నట్లు అంటీముట్టనట్లు ఉంటాడు.


 

 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS