Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 1


               అతడు ఆమె ప్రియుడు


                              -యండమూరి వీరేంద్రనాథ్



    "నీ ఆఖరి కోరికేమిటి?"

    భోజనం చేస్తున్న మహర్షి నెమ్మదిగా తలెత్తాడు. జైలర్ మొహం చిరాగ్గా వుంది. మరుసటిరోజు ఉరితీయబడే ఖైదీని ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నట్టు వుందేతప్ప ఆ కంఠంలో మహర్షిపట్ల ఏ సానుభూతీ లేదు.

    మహర్షి సమాధానం చెప్పకుండా మౌనంగా వుండి పోయాడు.

    "ఏం, మాట్లాడవేం?"

    "ఆలోచిస్తున్నాను..... ఏ ఆఖరి కోరిక కోరాలా అని" అతడి కంఠం జీరగా, నిర్లక్ష్యంగా పలికింది.

    "పిచ్చి పిచ్చివేమీ అడక్కు నీ పేరున ఏదయినా ఆస్తివుంటే వీలునామా వ్రాయటం, నువ్వేవరినయినా చూడదలుచుకుంటే వాళ్ళకోసం కబురు చేయటం అలాంటివైతేనే అనుమతిస్తాం."

    "సాధారణంగా ఉరికంబం ఎక్కేముందే ఆఖరి కోరిక అడుగుతారు. మీరేమిటి ఒకరోజు ముందే అడుగుతున్నారు?"

    "ఏంట్రా..... ఏదో పెద్ద రూల్స్ తెలిసినట్లు మాట్లాడతావ్? సినిమాలు చూసీ, పుస్తకాలు చదివీ తెలుసుకున్నావా? అలాంటిదేం లేదు. నువ్వేవరినైనా చూడాలనుకుంటే చెప్పు, పిలిపిస్తాను."

    "మహర్షి చేతిలో అన్నం ముద్దకేసి తదేకంగా చూస్తూ వుండిపోయాడు. జైలర్ కొనసాగించాడు. "అందుకే ఓ రోజు ముందడిగేది.....! ఉరికంబం మెట్లమీద నాకు ఫలానా వాళ్ళని చూడాలని వుందంటే ఉరితీయటం ఆపుచేసి వాళ్ళని  పిలిపిస్తారనుకోకు. ముందు నేను చెప్పినట్టు అదంతా యేదో కథల్లో జరిగేది."

    మహర్షి ఇంకా అన్నం ముద్దవైపే చూస్తున్నాడు.

    జైలర్ అసహనంగా "ఏరా......ఏమన్నా చెబుతావా? నేను పోయి ఉరి యేర్పట్లు చేసుకోనా?" అనడిగాడు.

    "నాకో కోరికుంది సారూ" అన్నాడు మహర్షి.

    "ఏమిటది? తొందరగా చెప్పేడువు."

    "నాకొక అమ్మాయిని చూడాలనుంది."

    జైలర్ ఉలిక్కిపడ్డాడు. మొహం చిట్లించాడు. "అమ్మాయినా? నీ కెవరూ కూతుళ్ళున్నట్లు తెలీదే? పెళ్ళయిన ఆర్నెల్లకే పెళ్ళాన్ని చంపేసేవుగా" అన్నాడు.

    "కూతురు కాదండీ, నా స్నేహితురాలు."

    "ఏంటీ? నీకో స్నేహితురాలు కూడా వుందా?"

    "అవును. చదువుకునే రోజుల్లో నా క్లాస్ మేటు. చచ్చిపోయే ముందు ఆ అమ్మాయిని ఒక్కసారి చూడాలనుంది. పిలిపిస్తారా?"

    "ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా?"

    "తెలీదు."

    "ఎక్కడుంటుంది?"

    "అదీతెలీదు"

    జైలర్ ముఖంలో చిరాకు, విసుగు మరింత ప్రస్ఫుటమయ్యాయి.

    "పేరు?" అనడిగాడు.

    "సిరిచందన"

    "ఆమె నీకేమవుతుంది? స్నేహితురాలన్నావ్ కదూ?"

    "నేను ఆ అమ్మాయిని ప్రేమించాను."

    "ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించిందా?" వస్తున్న కోపాన్ని దాచుకొంటూ అడిగాడు.

    "తెలీదు. నేను యెప్పుడూ ఆమెతో చెప్పలేదు. అసలు ఇప్పుడు యెక్కడ  వుందో కూడా తెలీదు. బహుశా పెళ్ళయిపోయిందేమో...... సుఖంగా కాపురం చేసుకుంటూ వుండి వుంటుంది. అసలు  నన్ను గుర్తుపడుతుందో లేదో."

    "నువ్వు నీ పెళ్ళాన్ని చంపిన మాట నిజమా కాదా?"

    "చంపిన మాట నిజమే."

    "మామూలుగా కాదు ...... మెడలోంచి ఊచ దింపి దారుణంగా చంపావు అవునా?..... ఇదంతా నీ పెళ్ళాన్ని అడ్డు తొలగించుకుని ప్రియురాలిని కలుసుకోవటం కోసమే కదూ?"

    "నేను నా ప్రియురాలిని కలుసుకోవటానికీ, నా భార్యని హత్యా చేయటానికి ఏ సంబంధమూ లేదు."

    అతడి వాక్యం పూర్తికాలేదు. జైలర్ అతడి కాలర్ పట్టుకొని పైకి లేవదీసి చెంపమీద ఎడాపెడా వాయించాడు. అదే ఆవేశంతో మెడ పట్టుకుని వంచి వీపుమీద బలంగా మూడు నాలుగుసార్లు కొట్టి దూరంగా  తోసేశాడు. ముందున్న కంచంలో అన్నం  చెల్లా చెదురయింది. మహర్షి విసురుగా వెళ్ళి గోడ దగ్గర పడ్డాడు. జైలర్ రొప్పుతూ అరిచాడు. "ఒరే దొంగ నా కొడకా! ఎవరో అమ్మాయిని ప్రేమించి, దాన్ని చేసుకోకుండా ఇంకొక అమాయకురాల్ని చేసుకుంటావా? చేసుకున్న తరువాత ప్రేమించినదాన్ని మరచిపోక పెళ్ళాన్ని చంపుతావా? పైగా ఇప్పుడు ఆ సుఖంగా కాపురం చేసుకుంటున్న అమ్మాయి కాపురం పాడు చేయటం కోసం నీ  ఉరి చూడటానికి రమ్మంటావా? అదా నీ ఆఖరి కోరిక....? అందుకేరా......అందుకే నీకు ఉరిశిక్ష పడింది" అంటూ మళ్ళీ ఆవేశం ఉప్పోంగిరాగా దగ్గరికి వెళ్ళి ఇంకో రెండు సార్లు మెడమీద బలంగా కొట్టాడు.


                          *    *    *

    వెంకట్రామన్ ముత్తు నిద్రనుంచి మేలుకుని బద్ధకంగా చేయిచాచి ఎడతెరిపి లేకుండా మ్రోగుతున్న గడియారం పీక నొక్కేశాడు. అలారం ఆగిపోయింది. అతడు వెంటనే పక్కమీంచి లేవకుండా కొంచెంసేపు అలాగే పడుకున్నాడు.

    అప్పుడు అర్థరాత్రి దాటి రెండు గంటలయింది.

    అతడికి అదేమీ శుభోదయం కాదు. ఇంకో రెండు గంటల్లో ఉరి యేర్పట్లన్నీ పూర్తిచేయాలి. తెల్లవారుజామున  ఆరింటికి ఉరి. అంతకుముందు దాదాపు రెండు గంటల పని వుంటుంది. ఖైదీకి దగ్గరుండి స్నానం చేయించటం, భగద్గీత పుస్తకం ఇవ్వడం, ఉరికంబం దగ్గర ఏర్పాట్లన్నీ అతనివే.

    వెంకట్రామన్ ముత్తుకి యాభై సంవత్సరాలు. కొద్దికాలంలోనే రిటైర్ అయి కేరళ వెళ్ళిపోవాలని  అతడి ఆశ. ఇటీవల కాలంలో జైల్లో ఉరిశిక్ష లేమీలేవు. చాలాకాలం తరువాత ఇది వచ్చింది.

    వెంకట్రామన్ ముత్తుకి ఉరితీయబడే ప్రతీ ఖైదీపట్ల చాలా సానుభూతి వుంది. అతడు తన చేతుల్తో దాదాపు యాభై ఉరిశిక్షలు అమలు జరిపాడు. సర్వీసు కాలం పూర్తయ్యే టైముకి మరొక అయిదారు శిక్షలు అమలు జరపవచ్చేమోకూడా. ప్రతిసారీ ఉరి తీయబోయేముందు అతడు చాలా విచారంగా ఫీలయ్యేవాడు. నేరస్థుడు ఎలాంటిడైనా కానీ, హత్య అనేది ఒక ఆవేశంలోనే చేస్తాడనేది అతడి నమ్మకం. అలా ఆవేశంలో చేసిన హత్యకు శిక్షగా, అతణ్ణి హత్య చేయటం ఎలాంటి పరిస్థితుల్లోనూ న్యాయం కాదని కూడా అతడు నమ్మేవాడు.

    కానీ ఈసారి అతడు అలా భావించటంలేదు.

    పెళ్ళయిన ఆర్నెల్లకి భార్యను చంపిన నేరస్థుడి మీద అతడికి ఏ సానుభూతీ లేదు. మృతురాలి ఫోటోలని కూడా అతను చూశాడు. ఒక ఇనుప ఊచ మెడలో వెనకనించి దిగబడి ముందుకు పూర్తిగా చొచ్చుకొని బైటకు వచ్చింది. అంత దారుణమైన హత్య అతడెప్పుడూ చూడలేదు. అసలు మనుషులు తాము చంపాలనుకున్న వాళ్ళని అంత దారుణంగా చంపుతారని అతడు ఉఉహించలేకపోయాడు. స్వంతభార్యని అలా ఎందుకు చంపాల్సోచ్చింది అనే డానికి కారణం  అతడికి  తోచలేదు. ఈ రోజు మధ్యాహ్నం ఆ విషయం జైలు అధికారుల మధ్య చర్చ వచ్చింది. జైలర్ అప్పుడు తనకు తెలిసిన కొత్త సంగతి చెప్పాడు. నేరస్థుడికి అంతకుముందే మరో స్త్రీతో పరిచయం వుందనీ- ఆమెను ప్రేమించాడనీ- ఆ కారణంగా భార్యని అడ్డు తొలగించుకున్నాడని. జైలర్ చెపుతుంటే వెంకట్రామన్  ముత్తు రక్తం సలసలా మరిగి పోయింది.

    ముత్తుకి దైవభక్తి ఎక్కువ. భార్య అంటే అపారమైన ప్రేమ. అలాంటి ముత్తు ఈ విషయం తెలిసి...... మొట్టమొదటి సారిగా ఒక వ్యక్తిని ఉరి తీస్తున్నందుకు సంతోషించాడు. భార్యను అంత దారుణమైన హత్య చేసికూడా  ఆఖరి కోరికగా తను ప్రేమించిన అమ్మాయిని చూడాలంటూ నేరస్థుడు చివరి కోరిక కోరాడని తెలిసి అతడు మరింత ఆవేశపడ్డాడు. చేతుల్లో అదికారం లేదుగానీ లేకపోతే ఆ  క్రితం రోజు మధ్యాహ్నమే ఉరి అమలు జరిపేవాడేమో కూడా.

     రెండున్నరవుతూండగా అతడు తన కాలకృత్యాలు పూర్తిచేసుకొని క్వార్టర్స్ నించి బయటికొచ్చాడు. జైలు గోడల అవతలే సిబ్బంది క్వార్టర్స్. అక్కణ్ణుంచి పది నిమిషాలు నడిచి జైల్లోకి ప్రవేశించాడు.

    మరో రెండు గంటల్లో అక్కడ  ఒక ఉరిశిక్ష అమలుజరుపబడుతోంది అన్న  విషయం తెలిసినట్టు వాతావరణం కూడా స్తబ్దంగా వుంది. డిసెంబర్ మాసం అవటంతో చలికూడా ఎక్కువగానే వుంది.

    సెంట్రీ పుస్తకంలో ముత్తు సంతకం పెట్టాడు. అక్కడి నుండి అరఫర్లాంగు దూరంలో వున్న ఉరికంబం దగ్గరికి వెళ్ళాడు. తలారికూడా ఇంకా రాలేదు. ఉరితీస్తే కట్టప్రక్కనే కూర్చుని ఒక పోలీసు కునికిపాట్లు పడుతున్నాడు. ఇసుకబస్తా, తాడు, ఉరి కొయ్య అన్నీ పరీక్షించి చూడుకున్నాడు. ఆ తరువాత వెంకట్రామన్ ముత్తు ఖైదీ సెల్ వైపు వెళ్ళాడు.

    మిగతా ఖైదీల నించి ఉరి తీయబడే ఖైదీని దూరంగా సపరెట్ సెల్ లో వుంచుతారు.

    ముత్తును చూడగానే అక్కడ నిలబడ్డ సెంట్రీ తాళంతీసి సెల్యూట్ చేశాడు. ముత్తు ఆ రెండో కాంపౌండ్ లోకి ప్రవేశించాడు.

    అక్కడ క్రోటన్ మొక్కలన్నీ వరసగా ఉన్నాయి. మధ్యలో దారి తిన్నగా  వెన్నెల్లో మెరుస్తోంది.

    ఉన్నట్టుండి అతనికేదో అనుమానం వచ్చింది. అంతా సవ్యంగా జరగటం లేదు అన్న భావనేదో అతడికి కలిగింది. డానికి కారణం కూడా అర్థమైంది. కాంపౌండ్ తలుపు తీస్తూండగా లోపలున్న సెంట్రీ అక్కడికి రావాలి.

    రాలేదు.

    ముత్తు అనుమానం నిజమైంది. అతడి అడుగులు అప్రయత్నంగా వడివడిగా పడసాగాయి. దాదాపు పరిగెడుతున్నట్టు ఆ సెల్ దగ్గరికి వెళ్ళాడు. మెట్లప్రక్క సెంట్రీ పడివున్నాడు.

    సగం తెరిచివున్న తలుపు అతన్ని వెక్కిరించింది!

    లోపల మహర్షి లేడు.

    .............

    ముత్తు జేబులోంచి విజిల్ తీసి గట్టిగా రెండుసార్లు వూదాడు.

    దూరంగా పోలీసులు అడుగుల చప్పుడు వినిపించసాగింది.

    సెంట్రీ రక్తపు మడుగులో పడివున్నాడు.

    ముత్తు ఆ సెంట్రీవైపే నిశ్చేష్టుడై చూస్తూ వుండిపోయాడు.

    ఒక మనిషిని మరో మనిషి అంత కిరాతకంగా చంపగలడని అతడు కూడా ఊహించలేదు.

    సెంట్రీ మొహం పచ్చడైపోయింది.

    అతడి ఆత్మశాంతి కోసం ఒక్కక్షణం మౌనంగా దేవుణ్ణి ప్రార్థించాడు ముత్తు.

    అతడిలో భార్యని దారుణంగా చంపినా ఖైదీమీద వున్నకసి ఇప్పుడు పదిరెట్లు అయినట్టు అనిపించింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS