సూర్యుడు చెప్పిన ప్రణవార్థం!!

మంత్రాలకు ప్రాణం వంటిది ప్రణవం. "ఓం" అని అందరూ పిలుచుకునే ఈ ప్రణవంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నిలయమై ఉంటాడు. ఆ శివుడి కృప కలగాలన్నా, ఆయన్ను ప్రసన్నం చేసుకోవలన్నా, ఆయన పంచాక్షరీ మంత్రాన్ని మరింత శక్తివంతం చేయాలన్నా ప్రణవమే మొదటి మార్గం. అటువంటి ప్రణవం అర్థం చెప్పడం ఎవరివల్లా కాదు. అంతటి శక్తివంతమైన ప్రణవానికి అర్థాన్ని వివరిస్తూ సాక్షాత్తూ ఆ సూర్య భగవానుడు చెప్పిన విశ్లేషణ...

ప్రణవానికీ ప్రపంచానికి  తేడా యేమీలేదు. ప్రపంచం ముడుచు కుంటే ప్రణవం, ప్రణవం పరుచుకుంటే ప్రపంచం. ప్రణవార్థాన్ని తెలుసుకోవడమే జ్ఞానంగా చెప్పబడుతోంది. సమస్తమైన విద్యలకూ మూలమైన బీజమే ప్రణవం. పరముడు 'ఓం' అనే యేకాక్షరమందే నివసిస్తాడు. గుణత్రయ సంబంధంచేత పదార్ధమంతా కూడా ప్రణచార్థమే అవుతుంది. ఇంతెందుకు? శివుడే ప్రణవం, ప్రణవమే శివుడు. ప్రణవం వాచకమయితే, శివుడు వాచ్యం అవుతాడు. వాచ్య వాచకాలకు భేదంలేదు. బ్రహ్మజ్ఞానులు ప్రణవాన్నే శివుడుగానో, లేదంటే శివుణ్ణి ప్రణవంగానో భావించి ధ్యానిస్తుంటారు.

కాశీలో అవసానదశలో వున్నవారి చెవులలో ఆ శివుడు  యీ ప్రణవాన్నే చెబుతాడట. తృణం మొదలు బ్రహ్మ పర్యంతమూ గల జీవకోటి సమస్తానికీ కూడా ప్రాణమువంటిది కావడంచేత యిది ప్రణవం అనబడుతోంది. పంచాక్షర సమన్వితమై జాపకులకు మోక్షమును ప్రసాదిస్తోంది. అకార, ఉకార, మకారములూ - చివరిలో నాదము వుంటాయి. అ,ఉ,మ-లు మూడు మాత్రలూ, బిందు నాదములు అర్థమాత్రయొక్క ప్రభావాన్ని చెప్పడం యెవరివల్లా అయ్యేపనికాదు.

అకారం రజోగుణాశ్రితం, అధిష్ఠాత చతుర్ముఖుడు. ఉకారం పురుషరూపం. తమోగుణాశ్రితం. అధిష్టాత విష్ణువు, మకారం బీజ సంపన్న పురుషరూపం. తమోగుణాశ్రితం. అధిష్టాత మహాదేవుడు. ఇక, బిందువు మహేశ్వరుణ్ణి, నాదం పరముణ్ణి ఆశ్రయించుకుని వుంటాయి. అదేవిధంగా - అకారంలో సద్యోజాతుణ్ణి, ఉకారంలో వామదేవుణ్ణి, మకారంలో అఘోరుణ్ణి, బిందువులో తత్పురుషుణ్ణి, నాదంలో ఈశానుణ్ణి తెలుసుకోవాలి. వామదేవ జనితాలైన 13 కళలు ఉకారంలోనూ అఘోరమూర్తి కృత కళాష్టకం మకారంలోనూ వున్నాయి. తత్పురుష సంజాతాలైన కళలు 4 బిందువులోనూ, ఈశాన కళలు 5 నాదంలోనూ ఉన్నాయి.

మంత్రం, యంత్రం, దేవత, ప్రపంచం, గురుడు, శిష్యుడు అనే యీ ఆరూ'షట్పదార్ధా' అనబడతాయి. అయిదక్షరాల కలయిక గల మంత్రమే యంత్రం అవుతుంది. యంత్రమే దేవతారూపం, ఆ దేవతయే ప్రపంచం - ప్రపంచ స్వరూపుడు గురువు, గురువుకు శరీరం శిష్యుడు.

మానవ శరీరంలోని-లేదా-సాధకుల శరీరంలోని ఆధారచక్రములో 'అ' కారము, మణిపూరంలో 'ఉ' కారము, హృదయంలో 'మ' కారము, విశుద్ధచక్రంలో బిందువు, అజ్ఞానచక్రంలో నాదమూ విరాజిల్లుతుంటాయి. ఈ అయిదింటినీ మించిన శక్తి విశిష్ఠుడైన శివుడు సహస్రారంలో భాసిస్తుంటాడు. ఎటువంటి మినహాయింపులూ లేని (అనగా ప్రాణంపట్లకూడా) వైరాగ్యం చెందినవాడే ప్రణవ స్వీకారానికి అధికారి అవుతాడు.

అటువంటివాడు బ్రహ్మచర్యం, అహింస, భూతదయ, సత్యం, అస్తేయం, పరిశుభ్రత, సదాచారం - యిత్యాది నియమాలు పాటిస్తూ భస్మరుద్రాక్ష ధారణ వ్రతాన్ని పాటించేవాడై వుండాలి. 

ఇలా ప్రణవంను  పఠించేవాడు, దాన్ని తన జీవితంలో భాగంగా చేసుకుని, దానికి తగ్గట్టు తన జీవితాన్ని మార్చుకుని ప్రణవానికి విధేయుడై ఉంటే, ఆ ప్రణవమే ఆ మనిషిని ఎంతో గొప్ప మోక్ష మార్గం వైపు తీసుకెళ్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories