పార్వతి దేవి అన్నపూర్ణగా ఎలా మారింది...

 

ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఆహారం అవసరం.  అది అన్నమే కాదు.. ప్రతి జీవి ఏదో ఒక రూపంలో ఆహారం తీసుకుంటుంది. ఇక మనుషులు అయితే ఆహారం అంటే అన్నం అనే అంటారు.  అలాంటి అన్నాన్ని సకల జీవరాశులకు అందించే దేవత అన్నపూర్ణ దేవి.  పార్వతి దేవినే అన్నపూర్ణ దేవి.   అన్నపూర్ణ దేవి కృప ఉంటే ఎప్పుడూ ఆహారానికి లోటు ఉండదని చెబుతారు. మార్గశిర మాస పౌర్ణమి రోజున అన్నపూర్ణ దేవి ఆవిర్భవించిందని అంటారు.  డిసెంబర్ నెల 4వ తేదీన మార్గశిర పౌర్ణమి వచ్చింది.  ఈ సందర్బంగా అన్నపూర్ణ దేవి ఆవిర్భావం గురించి,  దీని వెనుక ఉన్న పురాణ కథనం గురించి తెలుసుకుంటే..

శివపార్వతుల కథ..

పురాణ కథనం ప్రకారం శివుడు ఒకసారి పార్వతి దేవితో ఈ ప్రపంచంలో ప్రతీది ఒక భ్రమ అని,  ఆహారం ఇందుకు మినహాయింపు కాదని చెబుతాడు.  ఆహారానికి ప్రాధాన్యత లేదని అంటాడు. ప్రపంచంలో సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే ఆ అమ్మవారు ఆహారాన్ని అవమానించారని భావించి అలిగి తన స్థానం నుండి తప్పుకుని కాశీ నగరానికి వచ్చేస్తుంది.  

అమ్మవారు కాశీని చేరగానే సకల ప్రాణులకు ఆహారం కరువవుతుంది.  ప్రాణులన్నీ ఆకలితో అలమటించిపోతాయి. అది చూసి పరమేశ్వరుడు తన అభిప్రాయం తప్పని తెలుసుకుని కాశీ నగరానికి వచ్చి అమ్మవారినే ఆహారాన్ని బిక్షగా అడుగుతాడు.  అప్పుడు అమ్మవారు పరమేశ్వరుడి బిక్ష పాత్రలో ఆహారాన్ని బిక్షగా వేసింది.  ఈ సంఘటన తర్వాత తిరిగి ప్రాణులకు ఆహారం లభించిందని చెబుతారు.  

మనిషి శరీరం ఉనికిలో  ఉండాలంటే ఆహారం చాలా కీలకమైనది. ఈ విషయాన్ని శివుడు అనుభవం ద్వారా అర్థం చేసుకున్నాడు.  అమ్మవారు శివుడికి అన్నాన్ని దానం చేయడం వల్ల అన్నపూర్ణ దేవిగా పిలవబడింది.  అంతేకాదు.. కాశీ క్షేత్రంలో పరమేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడిగా పిలవబడితే.. అమ్మవారు అన్నపూర్ణ దేవిగా పూజలు అందుకుంటోంది.  పార్వతీ దేవి అన్నపూర్ణ దేవిగా మారిన రోజు మార్గశిర పూర్ణిమ రోజు.  అందుకే ప్రతి ఏడాది మార్గశిర పూర్ణిమ రోజున అన్నపూర్ణ జయంతిగా జరుపుకుంటారు.  

అన్నపూర్ణ జయంతి రోజు పేదలకు, ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని దానం చేయడం వల్ల  అన్నపూర్ణ దేవి సంతోషిస్తుంది.  అలాగే పశువులకు,  పక్షులకు, మూగ జీవులకు ఆహారం పెట్టడం వల్ల కూడా అమ్మవారు సంతృప్తి చెందుతుంది.  అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఉంటే ఎంతటి కష్టకాలంలో అయినా ఆహారానికి లోటు ఉండదు.  

                                 *రూపశ్రీ.
 


More Purana Patralu - Mythological Stories