మనిషి తన జీవితంలో చేసే మూడు రకాల కర్మలు ఇవే!!

కర్మ అనగానే ప్రతి మనిషికి అది జీవితంలో చేసే పనుల ఫలితమే అని తెలుసు. అయితే కర్మలు మూడు రకాలు అని చాలామందికి తెలియదు. ఆ మూడు రకాల కర్మలు ఏవో, మనుషులు చేస్తున్న కర్మలు ఏవో గీతలో కృష్ణుడు ఇలా చెబుతాడు.

కర్మణో హ్యపీ బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః। అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః||

కర్మలు మూడు విధములు. మొదటిది కర్మ అంటే ప్రతి వాడూ చేయతగిన పని దీనినే విహిత కర్మ అని కూడా అంటారు అంటే చేసే వాడికి, ఎదుటి వాడికి, హితమును, మంచిని మేలును చేకూర్చే కర్మ. రెండవది వికర్మ అంటే చేయకూడని కర్మ. అంటే నిషేధించబడిన కర్మ. చేయకూడని, నేరపూరితమైన, అవినీతి కరమైన, అసాంఘికమైన, కర్మ. మూడవది అకర్మ. చేయవలసిన పని చేయకపోవడం. ఏ పనీ చేయకుండా సోమరిగా ఉండటం. వేదాంతానికి వక్రభాష్యం చెప్పేవారు ఈ పని చేస్తుంటారు. అన్ని దేవుడే చూసుకుంటాడు, నారుపోసిన వాడు నీరు పోయకపోతాడా అని చేతులు ముడుచుకుని కూర్చుంటారు. తమ సోమరి తనానానికి వేదాంతాన్ని అడ్డం పెట్టుకుంటారు.

పరమాత్మ ఈ మూడు రకములైన కర్మలను చెప్పి, ఈ మూడు రకములైన కర్మల యొక్క తత్వమును తెలుసుకోవడం చాలా కష్టము. ఎందుకంటే ఇది చాలా లోతైన జ్ఞానము అని అన్నాడు. అందుకే పరమాత్మ కర్మలయొక్క తత్వములను గురించి, విశిష్ఠతను గురించి వివరిస్తాడు. ఏదో పుట్టాము పెరుగుతున్నాము మంచో చెడ్డ కర్మలు చేస్తున్నాము, ఇష్టమైన దేవుళ్లను ఆరాధిస్తున్నాము, ఆరాధనకు తగిన ఫలములను పొందుతున్నాము, సంసారంలో పడి ఈదుతున్నాము తుదకు మరణిస్తాము అని అనుకోకుండా, కర్మల యొక్క రహస్యములను తెలుసుకొని, ఏ కర్మలు చేస్తే ఈ సంసార బంధనముల నుండి విముక్తి పొందుతామో తెలుసుకోవాలనే అభిలాష కలవారికి పరమాత్మయొక్క ఈ వివరణ ఉపయోగపడుతుంది.

కర్మ గతి అంటే కర్మయొక్క గతి అంటే పోకడ, స్వభావము. కర్మ ప్రవర్తించే తీరు. కర్మ మనకు ఇచ్చే ఫలితము దీని గురించి తెలుసుకోవడం. గహనా అంటే అత్యంత రహస్యమైనది. అంటే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచారని కాదు. అర్థం చేసుకోవడం కష్టము. అంత సులభంగా అర్థం కాదు. కేవలం చదువుకుంటే తెలిసేది కాదు. గురువుద్వారా నేర్చుకోవలసినది

"ఎలాగంటే మనం అందరం పుట్టినప్పటి నుండి కర్మలు చేస్తూనే ఉన్నాము. చేయాల్సిన కర్మల కన్నా చేయకూడని కర్మలే ఎక్కువ చేస్తున్నాము. చేసి బాధపడుతున్నాము. పశ్చాత్తాప పడుతున్నాము. కానీ మరలా అదే చేస్తున్నాము. కాని కర్మస్వభావం ఏమిటి కర్మలు ఎలా చేయాలి అని తెలుసుకోడానికి ప్రయత్నించలేదు. తప్పుచేసి బాధపడటం తప్ప, దానిగురించి ఎప్పుడూ ఆలోచించలేదు. దృష్టిపెట్టలేదు. ఆ కర్మల యొక్క జ్ఞానం గురించి తెలుసుకున్నవాడు ఎంతో  వివేకం గలవాడు అని ఆ శ్రీకృష్ణుడు చెబుతాడు.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories