భగవద్గీత తత్వాన్ని ప్రతిబింబించే శ్లోకం!!

భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు ఉన్నా వాటన్నిటిని అర్థం చేసుకోవడం చాలా మంది వల్ల కాదు. అర్థం కత దేవుడెరుగు కనీసం గీతను చదవాలనే ఆసక్తి కూడా చాలా కొద్ది మందికే ఉంటుంది. అయితే గీతలో ఉన్న ఒకే ఒక్క శ్లోకం అవగాహన చేసుకుంటే గీత తత్వం ఏమిటో అర్థమవుతుంది. అదే ఈ శ్లోకం.

【శ్లోకం:-న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః|

న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ||

ఓ అర్జునా! నేను కానీ, నువ్వు కానీ, ఈ రాజులు కానీ, సైనికులు కానీ, నువ్వు అంటున్నావే నా తాతలు, తండ్రులు, సోదరులు, కుమారులు, మనుమలు, మేనమామలు అని, వీళ్లందరూ కూడా ఇప్పటి వరకు లేకుండా ఉండని కాలము లేదు. భవిష్యత్ కాలములో ఉండబోరు అనే మాట కూడా లేదు. అంటే మనం అందరం గతంలో ఉన్నాము, ఇప్పుడూ ఉంటున్నాము. భవిష్యత్తులో కూడా ఉంటాము. కాబట్టి ఈ రోజు ఉన్నాము రేపు ఉండము అన్న ప్రసక్తి లేదు.】

 ఇది కృష్ణుడు మొట్టమొదటి పాఠము. ఈ ఒక్కపాఠం చక్కగా అర్ధం చేసుకుంటే గీత అంతా అర్థం అయినట్టే. గీత పూర్తిగా ఇదే సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది.

ఈ శ్లోకంలో ఒక పదం వాడాడు వ్యాసుడు. "వయం సర్వమ్" అంటే మనం అందరం. అంటే కృష్ణుడు కూడా మనలాంటి వాడే. కాకపోతే ఆయనకు ఆత్మజ్ఞానము ఉంది. మనకు లేదు. ఇక్కడ మనం అందరం అంటే కృష్ణుని శరీరము, నా శరీరము, నీ శరీరము అని కాదు. శరీరములో ఉండే ఆత్మస్వరూపము, అది ఒకటే, శరీరాలు వేరు. అందరిలో ఉన్న ఆత్మ ఒకటే, ఒకే ముద్దగా ఉన్న బంగారంలో నుండి ఎన్నో ఆభరణాలు తయారవుతాయి. మరలా ఆ ఆభరణాలు అన్నీ కరిగిస్తే, వాటిలోని మకిల పోయి స్వచ్ఛమైన బంగారం ముద్ద అవుతుంది. పరమాత్మ అన్ని జీవరాసులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ ఆత్మ ప్రాపంచిక విషయములలో తగులుకొని జీవ భావం పొంది, జీవాత్మగా మారుతుంది. వాసనలు మూటగట్టుకుంటుంది. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఆ వాసనలు పోగానే, అంటే బంగారములో ఉన్న మకిల పోగానే స్వచ్ఛమైన బంగారంగా మారి ముద్ద అవుతుంది. బంగారము అగ్నిలో వేస్తే శుద్ధి అవుతుంది. జీవాత్మ ఆత్మజ్ఞానము అనే అగ్నిలో కాలిస్తే పరిశుద్ధ ఆత్మ అవుతుంది. పరమాత్మలో లీనం అవుతుంది. కాబట్టి బంగారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆభరణాలు మారుతూ ఉంటాయి. మట్టి ఒక్కటే, రకరకాల కుండలు తయారవుతుంటాయి. అలాగే పరమాత్మ ఒక్కడే. శరీరాలు మారుతూ ఉంటాయి.

1. ఆత్మ నిత్యము 

2. ఆత్మ అందరిలో ఉంది..

3. ఆత్మ కు నాశనము లేదు. 

4. ఆత్మ దేహము కాదు.

5. దేహము నశిస్తుంది కానీ ఆత్మ కాదు. 

ఈ ముఖ్యసూత్రాలు మొట్ట మొదటగా వివరించాడు పరమాత్మ. ఈ సూత్రాలను అవగాహన చేసుకుంటే జీవుడికి దుఃఖము అనేది ఉండదు. తన మరణము గురించి గానీ, ఎదుటి వారి మరణము గురించి గానీ బాధపడడు. శోకించదు. ప్రస్తుతము అర్జునుడు చేస్తున్న పని అదే. ఈ సూత్రము తనకే కాదు అర్జునుడికేకాదు అందరికీ వర్తిస్తుంది అని చెప్పాడు కృష్ణుడు. ఈ మొదటి పాఠంలోనే మనకు ఆత్మజ్ఞానము గురించి అవగాహన కల్పించాడు పరమాత్మ.

ఆత్మ సత్యం, సత్యం అంటే ఎప్పటికీ మూడుకాలములలో మార్పులేకుండా ఉండేది. మార్పుకు లోనయ్యేదికాదు. నేను, నీవు, అందరూ, లేను అనే స్తితి లో ఎప్పుడూ లేము. అందరం ఇదివరకు ఉన్నాము. ఇప్పుడు ఉంటున్నాము. ఇక ముందూ ఉంటాము. కేవలం ఈ శరీరాలు మాత్రమే మారుతుంటాయి. నీచేత చంపబడతారు అని నీవు అనుకుంటున్న ఈ రాజులందరూ ఇదివరకూ ఉన్నారు. ఇంక ముందూ ఉంటారు. ఆ మాటకొస్తే ఎల్లప్పుడూ ఉన్నారు, ఉంటారు. భవిష్యత్తులో కూడా ఉంటారు. కాకపోతే ఆత్మస్వరూపంలో ఉంటారు. శరీరాలను దుస్తులు మార్చినట్టు మారుస్తుంటారు. అర్జునా! ఈ దేహం లేకుండా పోయినా నీవు నేను అందరం ఉంటాము. ఈ పేర్లు, రూపములు అన్నీ నిజం కాదు. కాబట్టి ఈ రోజు ఉండి రేపు ఉండని శరీరాల గురించి చింతించడం అవివేకము.

పై విధంగా కృష్ణుడు బోధిస్తే అందులో ఉన్న అంతర్థాన్ని ఎవరైతే గ్రహించి, ఎవరైతే ఇక ఈ శరీరాన్ని అదేపనిగా ప్రేమిస్తూ దాని కోసం తహతహలాడుతూ ఉండటం ఎంతో మూర్ఖమైన పని అని తెలుసుకుంటారో అప్పుడు ఆ మనిషి తన జన్మను సార్థకం చేసుకున్నట్టే. తన జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన దాన్ని తెలుసుకున్నట్టే. అప్పటి నుండి ఇక ఎలాంటి భౌతిక, అంతర దుఃఖాలు ఆ మనిషిని బాధించవు, ఎలాంటి సంతోషాలు కోసం పాకులాటలు ఆ మనిషిలో కనిపించవు. ఆ మనిషి కేవలం కాలంతో పాటు ప్రయాణిస్తూ తన పనిని తాను నిర్వహిస్తూ పోతాడు. గడియారంలో ముల్లులగా తిరగడం, ఋతువులో  మార్పు లాగా మారడం ఇవన్నీ సహజం.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories