మూల చక్రం రహస్యాలు తెలుసా!


మానవ శరీరంలో ఉన్న ప్రదాన శక్తి కేంద్రాలను చక్రాలు అని పిలుస్తారు. దీన్ని యోగా శాస్త్రం ప్రధానమైనదిగా పేర్కొంటుంది.  మానవ శరీరంలో 7 ప్రధాన చక్రాలు ఉన్నాయి.  ఈ చక్రాలు మానవ శరీరం మీద, మనసు మీద, భావోద్వేగాల మీద చాలా ప్రబావం చూపిస్తాయి. ఈ ఏడు చక్రాలను ఏడు పేర్లతో పిలుస్తారు.    మూలాధార, స్వాధిష్టాన,  మణిపూర, అనాహత, విశుద్ద,  ఆజ్ఞ,  సహస్రార అనే పేర్లతో ఈ చక్రాలను పిలుస్తారు. వీటిలో మూలాధార చక్రం చాలా ప్రధానమైనది. మొదటి చక్రం కూడా ఇదే.. మూలాధార చక్రం ఎందుకు అంత ముఖ్యం? దీని రహస్యాలు ఏంటి? తెలుసుకుంటే..

 మూలాధార చక్రం..

మూలాధార చక్రం వెన్నెముక దిగువ బాగంలో ఉంటుంది.  దీనిని మానవ శరీరం మూలం లేదా ఆధారం అని భావిస్తారు. మూలాధార చక్రం మానవ జీవితానికి అవసరమైనది,  ఇది మనిషి భద్రతతో ముడి పడి ఉంటుందని చెబుతారు.

మనిషి సురక్షితంగా, భద్రంగా ఉండటానికి,  మనిషి మనుగడకు అవసరమైన ఆహారం, ఆశ్రయం,  డబ్బు వంటివి చేకూరడానికి మూలాధార చక్రం సహాయపడుతుందని చెబుతారు.

మూలాధార చక్రం ఎరుపు రంగులో ఉంటుందట. ఎరుపు మనిషికి బలాన్ని, భద్రతా భావాన్ని ఇస్తుంది.  ఇది మనిషిని స్థిరపరిచి బలపరుస్తుందని చెబుతారు.

మూలాధార చక్రం సరిగా పని చేస్తే భయం తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  మన ఆలోచన, నిర్ణయం తీసుకోవడం, కార్యాచరణ సామర్థ్యాలు బలోపేతం కావడంలో సహాయపడుతుంది.

మూలాధారం క్షీణిస్తే కనిపించే లక్షణాలు..

మూలాధార చక్రం క్షీణిస్తే వ్యక్తులలో పిరికితనం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆందోళన,  అయోమయం,  అభద్రతా భావం పెరుగుతాయి.

మూలాధార చక్రం బలహీనతకు కారణాలు..

ఎప్పుడైనా భయం లేదా ఒత్తిడికి గురైనప్పుడు, అభద్రతా భావంలో ఉన్నప్పుడు, సరిగ్గా ఆహారం తీసుకోనప్పుడు, సరైన మోతాదులో.. శరీరానికి కావలసినంత నీరు తాగనప్పుడు,  శరీరానికి అవసరమైనంత నిద్రపోనప్పుడు మూలాధార చక్రం బలహీనం అవుతుందని ఆధ్యాత్మిక, యోగ నిపుణులు చెబుతున్నారు.

మూలాధార చక్రం బలంగా ఉండాలంటే..

మూలాధార చక్రం బలంగా మారాలంటే క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం మొదటి అడుగు. ఆ తరువాత యోగ, ధ్యానం తప్పనిసరిగా చేయాలి. సమతుల ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.  ఆహారం సమతులంగా ఉంటే మూలాధార చక్రం బలంగా మారుతుంది.

                                        *రూపశ్రీ.


More Purana Patralu - Mythological Stories